(మొదటి అంకము)
(సాయం వేళ, ఆంధ్రా విలాస్ కాఫీ క్లబ్బు)
(అయ్యరుకి నిండా పని. తసిబిసి అయిపోతోంది.
ఓ పక్క కాఫీలు పుచ్చుకుంటూ, వాదులాడుకుంటున్న చిలకమర్తి వారు, జయంతి రామయ్య పంతులు, మానవల్లి రామకృష్ణ కవి, గిడుగు, కాశీనాధుని.
అక్కడే మరో బల్ల మీద సాహితీచర్చల్లో సోలిపోతోన్న పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, మొక్కపాటి- )
(శ్రీపాద పెద్ద అంగలతో లోనికి ప్రవేశించుచూ)
నా వడ్లగింజలు చూశారూ?
అయ్యరు: వడ్ల గింజల బస్తా పోయిందా ఏమి? అయ్యయ్యో! చెన్న పట్నంలో నిండా బయటి దేశపు దొంగలే. మన జాగ్రత్తలో మనం ఉండవలె సామీ.
(ఆ వెనకే గరిమెళ్ళ రొప్పుతూ వచ్చి)
మాకొద్దీ తెల్లదొరతనము
బాబూ,
మాకొద్దీ తెల్లదొరతనము
(అంటూ కేకలు వేసుకుంటూ క్లబ్బులోకి దూసుకొని వచ్చెను. ఓ మూలన ఒంటి చేత్తో ఇడ్డెన్ల పని పడుతున్న జరుక్ శాస్త్రి )
మాకొద్దీ చద్ది ఇడ్డెనలు!
బాబూ,
మాకొద్దీ చద్ది ఇడ్డెనలూ!
అయ్యరు: అయ్యో,అయ్యో మీ పేరడీ కొరకు మా ఇడ్డెనలను తిట్టెదరేల సామీ ?
గుండు మల్లెపువ్వుల వంటి ఇడ్డెనలు, ఏ పూటకు ఆ పూట తాజాగా వేయుదుము.
క్లబ్బు సదస్యులు:
రండి,రండి!
ఆంధ్రా సుబ్రహ్మణ్య భారతి!
ఆంధ్రా సుబ్రహ్మణ్య భారతి!
అయ్యరు: అవునా! ఏమి గౌరవము! ఏమి గౌరవము! మా క్లబ్బు అదృష్టము!
రాండి!రాండి సారు వాడు.
( అక్కడే మధురవాణితో కూచున్న గురజాడ పోటీగా )
దేశమంటే మట్టి కాదోయ్!
దేశమంటే మనుషులోయ్!
అయ్యరు: మనుష్యులంటే క్లబ్బులోకి వచ్చి ఆర్డరు ఇచ్చువారే మాకు మనుష్యులు.
తక్కిన వారితో పని ఏమి.
(అవధాని గారొకరు శిష్యులతో ప్రవేశించును.)
అవధాని: బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్..
అయ్యరు: రసమే కదా సారు వాడూ నిండా పోయిస్తును.
జులపాల శిష్యకవులు: రసం కాదయ్యా స్వామీ, అవధాని గారు పద్యం పాడుతున్నారు.
అయ్యరు: అట్లానా? ఈ కవి గార్ల బాష ఏమో ఈశ్వరునికి తెలియవలె.
శ్రీపాద: అవధాని వేరు.కవి వేరున్నూ.
అయ్యరు: అట్లనా. ఇద్దురూ ఒకటే అనుకొనుచుంటినే?
జులపాల శిష్యులు: ఆ గొడవ నీకెందుకయ్యా? మూడు స్ట్రాంగు కాఫీ పట్రా.
( శ్రీశ్రీ జరుక్ ని వెతుక్కుంటూ లోపలి వచ్చును)
మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది!
అయ్యరు: ఈ ప్రపంచంలో క్లబ్బుకి వంద రూపాయలు బాకీ ఉంటిరి. ఆరు నెలలాయె.
జరుక్: నేను సైతం ఆంధ్రా క్లబ్బుకి పాత బాకీ లెగరగొట్టాను!
( కృష్ణ శాస్త్రి భావావేశంతో తనలో తాను ఏవో కూనిరాగాలు తీస్తూ లోనికి వచ్చి బల్ల మీద ఆశీనులై)
ఎటులైనా ఇచటనే ఆగిపోనా!..
…..
అయ్యరు: రాత్రి ఎనిమిదింటికి క్లబ్బు మూసివేయుదుము. నిలిచి పోవుట కుదరదు.
తిరగా ఉదయము ఆరింటికి మరల తలుపులు తెరువుదుము. అప్పుడు మరల రావచ్చును.
(ఆదిభట్ల విలాసంగా వచ్చును. వేడి వేడి పలహారములు, ఘుమఘుమలాడే కాఫీ తెమ్మని అయ్యరును పురమాయించును.)
(అల్లంత దూరంలో గురజాడతో కూర్చున్న మధురవాణి, ఆదిభట్లనుద్దేశించి )
పంతులు గారూ, ఏమి తేజము! ఏమి విలాసము! మా రామప్పంతులు గారితో ఒప్పందం అయిపోయింది గానీ, ఈ క్షణమే మీ వెనుక వద్దును. నేను ఇచ్చిన మాట తప్పే మనిషిని కాదు కదా!
జరుక్: నమస్కారం! నారాయణ డోసు గారు.
( ఇంతలో గీరీశం భేషజంగా లోనికి వచ్చును )
అయ్యరు (తనలో తాను) : ఆ! వీడు వచ్చినాడా! ఈవేళ ఈ వెధవని వదలరాదు.
జుట్టు పట్టి పాత బాకీ వసూలు చెయ్యవలెను.
గిరీశం: సాయంకాలమైంది. క్లబ్బుకు సామాను సరఫరా చేస్తానని నెల రోజుల కిందట యాభై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగు గార్ల్స్ కింద ఖర్చు పెట్టాను. ఇది వరకు ఎన్నిసార్లు ఇలా చేస్తే ఊరుకున్నాడు కాదూ ఈ అయ్యరు. ఇప్పుడేదో కొంచెం డాన్సింగు గర్లు మాట ఆచోకీ కట్టినట్టు కనబడుతోంది. ఓర్చలేని వెధవ ఎవడైనా చెప్పి ఉంటాడు.
(కిటికీ వంక తల తిప్పి చూచును. పూటకూళ్ళమ్మ పరిగెత్తుకు రావడం చూచి కంగారు పడి ఓ బల్ల కిందకు దూరును.)
పూటకూళ్ళమ్మ: వెధవ కనబడితే సిగపాయి దీసి తందును. ఇదిగో అయ్యరూ, ఎక్కడ దాచావేమిటి ఆ వెధవని?
అయ్యరు: దాచిపెట్టవలసిన ఖర్మము నాకేమిటి తల్లీ. అదిగో ఆ బల్ల కింద దాగున్నాడు.
గిరీశం: ముండాకొడుకు, చెప్పి వేశాడు. వీడి సంగతి తరువాత చూద్దును.
(గిరీశం రెండో వైపుగా బయటకు వచ్చి పారిపోబోవును. పూటకూళ్ళమ్మ చీపురుతో కొట్టుటకు వంగును. ఈ గొడవలో సర్వరు శారద చేతిలోని టిపిను ప్లేట్లు నేలపాలవును)
అయ్యరు: అయ్యో,అయ్యో,ఏమి గోల. అంతయునూ నేలపాలాయెను. మీకో నమస్కారం. మీ గొడవ క్లబ్బు బయట చూచుకోండి తల్లీ.
మధురవాణి: గిరీశం గారితో తెగతెంపులు జేసుకొని వచ్చెదను. రామప్పంతులు గారితోనూ ఒప్పందం రద్దు చేసుకుందును. దుర్గబాయమ్మ గారి ఆంధ్ర మహిళా సభలో చేరి మనశ్శాంతితో బతుకుదును.
ముళ్ళపూడి: అక్కడికి రా మధురవాణీ,నీకు బోల్డన్ని కథలు చెప్తా. బాపుని కూడా తీసుకొస్తా. నీ బొమ్మ గీయిస్తా.
ఎన్ కేసరి: ముందు టిఫిను తినరా అబ్బాయి. గృహ లక్ష్మి ఆఫీసుకు పోవలెను. సమయము లేదు.
గురజాడ: నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదమ్మాయి. నేను రాసినట్టు మాటాడవలెను.
(తనలో తాను) ఈ గిరీశం ఏల వచ్చెనో? ఇదంతా నేను రాసిన నాటకంలో లేదే?
(గిరీశం పూటకూళ్ళమ్మని తప్పించుకు పోవడంలో బల్లలను, అడ్డం వచ్చిన మనుషులను గుద్దును. ఇడ్డెనలు,దోసెలు ఎగిరిపడును. కాఫీ గ్లాసులు డింకీలు కొట్టును. )
అయ్యరు: అయ్యో,అయ్యో, ఈ గిరీశం గాడు క్లబ్బునంతా నాశనం చేయుచున్నాడే.
(గిరీశం అయ్యరు నెత్తి మీద ఒక్క దెబ్బ వేసి కన్నెమెరా లైబ్రరీ వైపుకు పరుగెత్తును. ఆ వెనుకే పూటకూళ్ళమ్మ ఆగుమని అరచుచూ సివంగిలా పరిగెత్తును)
అయ్యరు: అయ్యో,అయ్యో ! చస్తిని. ఏమి దెబ్బ కొట్టినాడు. శారదా, వెళ్ళి పట్టుకో వాడిని.
శారద: అయ్యరు గారు, నా సీరియలు పత్రికాఫీసుకు పోస్టు చేయుటకు పోవలెను. ఇంకెవరినైనా పంపండి.
అయ్యరు: సరే నాయనా. ఇంతకీ ఇవ్వాళ నాకు దుర్దినము. ఏమి చేయుదుము. వంట ఇంటి గూటిలో అమృతాంజనం డిబ్బీ ఉండును. అది తెచ్చి ఇచ్చి పొమ్ము. అయ్యో! అయ్యో! నొప్పి తగ్గకున్నది.
అవధాని: అయ్యరు గారూ, ఈ సందర్భంలో ఓ మాంచి పద్యం పాడి వినిపించెదను.
అయ్యరు: అయ్యో, వద్దు వద్దు సామీ. ఆ బాధ కన్ననూ ఈ నొప్పి వెయ్యి రెట్లు నయం. నిజం సెబుతుంటి.
(అయ్యరు మాటలకు మధురవాణి విరగబడి నవ్వును. గురజాడ వారించి బయటకు తీసుకొని పోవును. )
(తెర)
బావుంది. శ్రీరమణ గారి పేరడీలు గుర్తొచ్చాయి
అయ్యరుకి, ఇంకొంచెం తమిళ యాస తగిలించి ఉంటే సాంబారు వాసన ఘమ, ఘుమ లాడేది!
లాలాజలము ఉరేది!
ప్రజలందరూ ఆంధ్ర విలాస్ కాఫీ క్లబ్బుకి పూడ్చేవారు!
చి న
చాలా బాగుంది. అభినందనలు