ఆఫ్రికా అంటే భయం వట్టి ప్రచారమే!

ప్రపంచ  వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల మీద, దేశాల మీద ఒక  బలమైన అభిప్రాయం ఉంటుంది. ఉదాహరణకు మధ్య ప్రాచ్య దేశాలనగానే మతఛాందసవాదులని, అమెరికా నిండా వున్నవారు ధవనంతులని, థాయిలాండ్ వాసులంతా కామ కలాపాలలో మునిగితేలుతారని, ఆఫ్రికా వెళ్ళితే ప్రాణాలతో తిరిగిరామని  లాంటి అభిప్రాయాలు వున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాలలో రాయలసీమ వాసులంటే ఫ్యాక్టనిస్ట్స్ లని, ఆవేశపరులని , మద్రాసీలంటే మోసం చేస్తారని ఇలా ఎన్నోవున్నాయి . చాలా సంవత్సరాల క్రితం యూరోప్ నుంచి మన దేశం లోని ఒక మెట్రోపోలిటిన్ నగరానికి వచ్చిన ఒక వ్యక్తి  కిలోల కొద్దీ మెడిసిన్ తన వెంబడి తెచ్చుకొన్నాడు కారణమడిగితే భారత దేశం వచ్చిన వాళ్ళకందరికి మలేరియా, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలు చాలా ఖచ్చితంగా వస్తాయని అలాగే ప్రజలకు తగినంత గా వైద్యం అందుబాటులో లేదని మా దేశాలలో అనుకొంటుంటాము కాబట్టి వెంబడి తెచుకొన్నానని చెప్పాడు. ఇది మన దేశాన్ని  యూరోపియన్స్ ఎలా వూహించుకొంటారో తెలుపుతుంది.

ఆ తరువాత రెండు సంవత్సరాలకు  అదే యూరోపియన్ ను కలసినప్పుడు నెల రోజుల పాటు ఇండియా లో వున్నా తనకు మెడిసిన్ వాడే అవసరం  రాలేదని తాను తీసుక రావడానికి కారణం తమ దేశం లో భారత్ మీద ప్రబలంగా వున్న ఇలాంటి అభిప్రాయాలు కారణమని చెప్పాడు.  హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన “ఇండియానా జోన్స్ అండ్ టెంపుల్ అఫ్ డూమ్”సినిమా లో కూడా ఇండియాను మాంత్రికుల దేశం గా చూపిస్తారు. ఇలా ఎన్నో ఉదాహరణలు. ఇప్పుడు  నేను కూడా అలా భయపడివుంటే ఎంతో మంచి ప్రాంతాన్ని చూడలేక పోయేవాణ్ణి. ప్రాంతీయంగా వున్నా కొందరు ఇచ్చిన ధైర్యం ఈ ప్రయాణాన్ని చేసేలా చేసింది. నిరంతరం అంతర్యుద్ధంతో సతమతమయ్యే చాలా దేశాల జాబితా లో నేను చూసిన ఈ దేశాలు వున్నాయి. దానికి తోడు ఈ మూడు దేశాలు  ప్రపంచం లోని అత్యంత పేద ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. నేను రెండు దేశాల సరిహద్దులను మాత్రమే చూశాను ఒక దేశ ప్రాంతాన్ని క్షుణ్ణంగా చూశాను. అయితే సాంస్కృతికంగా మూడు దేశాల ప్రాంతాలు ఒకేలా ఉన్నాయని చెప్పవచ్చు.

గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యంత పేద ప్రాంతం ఆఫ్రికా లోని సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ (Central Africa Republic), సుడాన్ (sudan), కాంగో (congo ) ల సరిహద్దు ప్రాంతాలలో పర్యటించాను.  ఆ ప్రాంతాలను చూడాలనుకొన్నప్పుడు కొంతమంది మొదట భయం తో కూడిన జాగ్రత్తలు చెప్పారు. ఎందుకంటే, మూడు దేశాలు అంతర్యుద్ధం తో సతమతవుతున్నాయి. దానికి తోడు అత్యంత పేద ప్రాంతాలు, కనికరం లేని పోలీస్ మరియు మిలిటరీ వ్యవస్థ . దారిలో మీకు ఎక్కడైనా తిరుగుబాటుదారులు (రెబెల్స్) తగలవచ్చని సలహా ఇచ్చారు. కానీ  ఆ ప్రాంతవాసుడైన మా డ్రైవర్, మరో పరిచయస్తుడు ప్రతాప్ మాత్రం అక్కడి ప్రజలు మంచోళ్ళని చెప్పాడు, బయట ప్రపంచానికున్న భయాలు చాలామటుకు కొన్ని సంఘటనల ఆధారంగా వచ్చినవే నని చెప్పారు . వాళ్లిద్దరూ ఇచ్చిన ధైర్యమే నన్ను ప్రయాణానికి సిద్ధం చేసింది. దాదాపు మా ప్రయాణం నాలుగు వందల కిలోమీటర్లు సాగింది మొత్తం మట్టి దారి, అడవి ప్రాంతం. నాలుగు వందల కిలోమీటర్ల లో దాదాపు  తొంభయి తొమ్మిది శాతం సెల్ ఫోన్ సౌకర్యం లేదు, వంద శాతం కరెంటు లేదు . అందరి అభిప్రాయాలకు భిన్నంగా మా ప్రయాణం ఆసాంతం ఏ సమస్య లేకుండా సాగింది. ఒక చోట మాత్రం ఓ పెద్దాయన మేము ఫోటోలు తీసుకోవడాన్ని వ్యతిరేకించాడు ,దానికి అయన చెప్పిన కారణం మేము వాళ్ళ పేదరికాన్ని ప్రపంచానికి చూపించి స్వచ్చంద సంస్థల (N G O ) నుంచి డబ్బులు తెచ్చు కుంటున్నామని.

నేను రాయలసీమ లో ఓ చిన్న పల్లె నుంచి రావడం వలన పేదరికాన్ని దగ్గరగానే చూసాను గాని, మా పేదరికం ఇంత దారుణంగా ఉండేదికాదు. కనీసం వేసుకోడానికి సంవత్సరానికో రెండేళ్లకో ఒక జత బట్టలయినా దొరికేవి. ఇక్కడ మెజారిటీ ప్రజలు వేసుకొనే చెప్పులైనా, బట్టలైనా థర్డ్ హ్యాండ్ లేదా  ఫోర్త్ హ్యాండ్ (మొదట యూరోప్, అమెరికా, కెనడాలలో వాడిన బట్టలొస్తాయి. వాటిని ఆఫ్రికా నగరాలలో వుండేవాళ్ళు కొంత కాలం వేసుకొని తిరిగి వెళ్లి వూరి ప్రజలకు అమ్ముతారు.

మెజారిటీ ప్రజలు అడవులలో దొరికే దుంపలను ఎండ బెట్టి, ఆ తరువాత పొడిచేసి ఆ పొడిని మొక్కజొన్న పిండి తో కలిపి ముద్దలా చేసుకొని అడవులనుండి కోసుకొచ్చిన ఆకు కూరలను ఉడికించి కొంచం ఉప్పు  కలిపి (కారం వీరి కూరలలో ఉండదు ) కూర లా చేసుకొని ముద్దతో తింటారు. అదృష్టవశాత్తు అరటిపండ్లు , అనాస పండ్లు వాళ్లకు అడవిలో చాలినన్ని దొరుకుతాయి అవే వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. వ్యవసాయం చాలా తక్కువ ప్రాంతం లో మాత్రమే వుంది మెజారిటీ  ప్రజలు అడవి మీద ఆధారపడతారు. కొంత మంది వర్షాధార భూమిలో వరి, వేరుశెనగ పంటలు పండిస్తారు. వరి ఎంత తక్కువగా పండుతుందంటే వారికి అవసరమైంతమేర కంకులను కోసుకొచ్చి దంచి బియ్యం చేసుకొని ఒక పూట సరిపడా వండు కోవడం, మళ్లి కావలిస్తే మళ్లి కంకులు తెచ్చుకోవడం, అదొక దినసరి కార్యక్రమం .

వ్యవసాయం పెద్దగా అభివృద్ధి చెందకపోవడంతో తమ  అవసరాలను తీర్చుకోడానికి వారు వృక్షసంపదను, దట్టమైన అడవిని ధ్వసం చేసుకోవడం మినహా వేరే దారి లేదు . ఆఫ్రికన్ నగరాలలో   LPG సౌకర్యం లేకపోవడంతో, వంట వండటం కోసం విపరీతంగా విద్యుత్ మీద లేక పొతే బొగ్గుల మీద ఆధారపడతారు. విద్యుత్ సమస్య కూడా విపరీతంగా ఉండటంతో బొగ్గులు ప్రతి ఇంట్లో  ఖచ్చితంగా వుండే వంట చెరకు. వంట చెరుకు కోసం నగరాలు పల్లెల మీద ఆధారపడటం వలన బొగ్గులకు మంచి ధరే లభిస్తుంది. మంచి ధరంటే వారికి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయాలు దొరకడం. దాని కోసం వారు కనీసం వారం పాటు అడవి లోపలి పోయి కట్టెలు కొట్టి బొగ్గులు వేసుకొని రావాల్సివుంటుంది. (మొదటి గ్రూప్ ఫోటో లలో 1/3 లో నా  మూట బొగ్గులదే). మా ప్రయాణ దారి లో ఇరవై కిలోమీటర్ల మేర ప్రభుత్వ వ్యతిరేక దళాల (rebels) చేతిలో వుంది కానీ మాకు వారు ఎవ్వరు ఎదురు కాలేదు. ఒక చోట మాత్రం కొండచిలువను ముక్కలుగా కోసి నిప్పుల మీద కాల్చి పుల్లకు గుచ్చి అమ్ముతున్నారు. ఎన్నో అడవి మృగాలు వున్నాయట కానీ మాకు కనిపించలేదు. భుజాన తుపాకీ తో వందలాది మంది మిలిటరీ వారు, నది ప్రక్కనే ఖనిజాల తవ్వకంలో వున్న చైనా దేశస్తులు మాత్రం  కనిపించారు. మూడు చోట్ల మా పాస్స్పోర్ట్స్ (passports ) చెక్ చేశారు.

ఇలా ఆఫ్రికా గురించి  చెప్పుకుంటూ పొతే దాదాపుగా కొన్ని వందల పేజీలే అవుతాయి , నాకున్న స్థలాభావం వలన ఫోటోలను ఆ ఫోటో ల వెనుకున్న చరిత్రను క్లుప్తంగా చెపుతాను.

మేము బయలు దేరిన కాంగో ప్రావిన్స్  ‘కిసంగాని’ నుండి ఈ మూడు దేశాల సరిహద్దులను చేరుకోవాలంటే నాలుగు వందల కిలో మీటర్ల రోడ్ ప్రయాణం తో పాటు ఒక గంట  పాటు ఆరుఇమి (ARUIMI ) నది మీద పడవ లో పోవాల్సివుంటుంది. ఆ తరువాతే “బూతా” అనే చిన్న నగరం వస్తుంది. చివరకు పెద్ద పెద్ద వాహనాలైన పడవలోనే  ఇటువైపు నుంచి అటువైపు కు అటునుంచి ఇటువైపు కు పోవాల్సివుంటుంది. పడవలో నా ప్రయాణం , నాతో పాటు అటువైపు పోవాల్సిన సరకులు.

 

తమ అవసరాల కోసం తమ చుట్టూ వున్న అడవిలో వుండే పామ్ ఆయిల్ చెట్ల నుంచి నూనె  తీసి వాడతారు. తయారు చేసే విధానం లో శుభ్రత పాటించకపోవడం వలన (ఆ గుంత లో వున్నది వారు వంటకు వాడే నూనె ) ఆరోగ్యానికి హానికరమని చాలామంది చెబుతూవుంటారు కానీ ఆ ప్రాంత వాసులు మాత్రం అది మంచిదని నమ్ముతారు. వంటలో వారు వాడే నూనె చాలా ఎక్కువ మోతాదు లో ఉండటం వలనయితేనేమి లేదా నూనె తయారుచేసే విధానం చాలా మురికితో కూడు కున్నందువలన కావచ్చు వారిలో వృద్యాప్యం వరకు జీవించే వారి సంఖ్య  చాలా తక్కువని చెప్పవచ్చు.

పైన వీడియోలో కనిపిస్తున్న ఆవులు తినడానికి పెంచినవి. ఇవి పాలివ్వడానికి పనికిరావాని చెప్పారు. ఈ ఆవుల మందను  కాంగో లోని ఓక వ్యాపారస్తుడు దక్షిణ సుడాన్ వెళ్లి కొనుగోలు చేసాడు. గత నెల రోజులుగా వాటిని అడవి గుండా తోలుకొని కొనుగోలు దారునికి అప్పచెప్పడానికి వస్తున్నారు. వీళ్ళు అమ్మిన వ్యక్తి మనుషులు.   ఇది ఇక్కడ తరచూ జరిగేదే. రాత్రి వేళ కొన్ని పల్లెలలో ఆగి మళ్లీ ప్రయాణం కొనసాగిస్తారు. చాలా పల్లెలకు చిన్న చిన్న పట్నాలకు వాహనాలు వెళ్ళడానికి దారి లేక పోవడం వల్ల వారు ఇలా నెలల తరబడి ప్రయాణం చేయడం తప్పనిసరి.

ఇది పల్లె ప్రాంతం లోని ఒక సగటు కుటుంబం  నివసించే ఇంటి లోపలి భాగం. ఇంటి గోడలను వెదురుతో అల్లి మట్టితో మూయడం వలన వర్షానికి ఒకటి రెండు సంవత్సరాలలో మట్టి కరిగిపోవడం తిరిగి  కట్టుకోవడం సర్వసాధారణం. ప్రతి ఇంటికి వంట వండుకొనే ప్రాంతం ఇంటి బయట వేరుగా ఉంటుంది. మేము చూసిన ఇంటి వీడియో ఇది. ఇంటి లోపల బట్టలు స్వచ్చంద సంస్థ వాళ్ళు ఇచ్చిన దోమతెర వున్నాయి. ఇటీవల కాలంలో ఆ ప్రాంతం  లో చాలా కుటుంబాలకు స్వచ్చంద సంస్థలు దోమతెరలను, సోలార్ లైట్స్ ను ఉచితంగా పంపిణి చేస్తున్నాయి.

సంతలు మనదేశం లో లాగే, వారి దగ్గరా  వున్నాయి. మేము పోతున్న దారిలో ఒక చోట చూసిన సంత ఇది. నేను విన్న కథనం ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇక్కడి ప్రజలను చెప్పులను… ఒక చెప్పయితే ఒక ధర అని జత కొంటే ఒక ధర అని మోసం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని విన్నాను.

నాలుగు వందల కిలో మీటర్ల దూరం లో వున్న పల్లె నుంచి వారికి దగ్గరలో వున్న ఓ మోస్తరు నగరానికి చేరాలంటే పట్టే సమయం మూడు లేదా నాలుగు రోజులు (గంటలు కాదు). పాత కాలం బస్సులు వర్షం పడితే కదలడానికి వీలు కాని రోడ్స్. ఈ దేశాలలో వాహనాల తయారీ పరిశ్రమలు లేనందున యూరోప్. దుబాయ్ లలో వాడిన వాహనాలను ఇక్కడ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ (private transport ) వాళ్ళు చాలమంది వాడుతుంటారు. పల్లెల నుండి పట్నాలకు అటవీ ఉత్పత్తులు (ఫోటోలోవున్నవి అరటిపళ్ళు , ముద్దకు వాడే పెండెలాలు).

 

జియెల్ నర్సింహా రెడ్డి

తన గురించి తానే  జియెల్ నర్సింహా రెడ్డి: ఆరేళ్ల క్రితం మేము ( నేను, నా భార్య లక్ష్మి ) తక్కువలో తక్కువ గా ప్రపంచం మొత్తంగా చూడటానికి ఎంత ఖర్చువుతుందో బేరీజు వేశాం. ఐదు లక్షలయితే అమెరికా ఖండం తో సహా  యాభయ్ దేశాలను చూడవచ్చని భావించాం. మొదట సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ లతో మొదలైంది మా ప్రయాణం. ఖర్చు మేమనుకున్నంత కన్న చాలా తక్కువే అయ్యింది. ఇప్పటికి మేము ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలో ఇరవై పైగా దేశాలు చూశాం. ఇంకా చూస్తాం. ఈ ప్రయాణాల కథ అందరూ వింటానికి బాగుంటుందని ... మా యాత్రానందాన్ని మీతో పంచుకుంటున్నాం.

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.