నవ్విన ఖండిత శిరస్సు

సుడిలో ఉన్నాను, ఉరవడిలో ఉన్నాను, జడిలో, అలజడిలో ఉన్నాను. అజంతానంత దు:ఖ వాక్య మృత్యు సందడిలో ఉన్నాను. ఇది నా సుషుప్తి. కానీ నేను నా పక్కనే కుదురుగా కూర్చుని మొలకెత్తి ఉన్మత్త మరణగీతమొకటి రాస్తున్నాను. రా, వచ్చి కూర్చోరాదూ? తోడు కావాలి. లేదంటే నాకు భయం భయం గా ఉన్నది. అవున్నిజమే, నువ్వొక్కడివీ చిక్కటి చీకటి రాత్రి ఒంటరిగా అగమ్యంగా సంచరిస్తున్నప్పుడు, నిన్ను నువ్వే వెతుక్కుంటూ మోసుకు వెళ్తున్నప్పుడు, నెత్తురు గడ్డకట్టిన శరీరాన్ని క్షణాల చిన్న ముల్లు లాంటి వాహనం మీద కూర్చోబెట్టుకున్నప్పుడు, నోరు తెరుచుకుంటున్న భీభత్సంలోకి, నీలోంచి నువ్వే మెట్లు దిగి, తలుపులు తోసుకుని వస్తావు. అది అతని కవిత్వ ఊహని మాత్రము ఊరుకోగలమా ?

కవిత్వమే ప్రక్రియో గానీ అజంతా కవిత్వ పఠనం మాత్రం ఒక అతీత, విపరీత, విలక్షణ , విసృంఖల నిమగ్న స్థితి లో అగ్ని సర్పస్పర్శానుభవం. పదాలు వాక్యాలవడం సహజమే కదా. కానీ పదాల పదాల మధ్య కొత్త వాక్యాలనేకం పలికే భాష ఒకటి పొడుగాటి వాక్యం లా అవతారమెత్తుతుంది. అది ” గదిలో అక్కడక్కడ ఏవో పత్రికలు, పుస్తకాలు, వస్త్రకాళితం చేసిన గన్ పౌడర్ పద్యాలు మరేం లేవు. గది మధ్య ఖాళీగా ఉన్న కుర్చీలో ఎవరో కూర్చుని నా వైపు తీక్షణంగా చూస్తున్నట్టు భ్రమ– అక్షరం బలి కోరుతున్నదా ? ” అనేస్తుంది. సుదీర్ఘమైన అజంతా వాక్యాలు మనకు ఊపిరాడనివ్వవు. పలకడానికే అనుకుంటే పొరబాటు, హృదయం వాటి తాకిడికి తట్టుకుని నిలబడ్డం కూడా సులువేం కాదు. అంతటి నిర్మాణ కుశలత, పద ప్రయోగం విస్తు పోయేట్టు చేస్తాయి. సమ్యమనం తో కూడిన నేరగాడు ఒక చేత్తో రివాల్వర్, మరో చేత్తో పూలదండ పట్టుకుని మనవైపు మౌనంగా చూస్తుంటాడు. ఎందుకు చూస్తుంటాడు ? ఎలా చూస్తుంటాడు ? నెత్తురు చూడలేని కాళ్ళూ, చేతుల్ని కళ్ళు చేసుకుని చూస్తుంటాడు. ” మనిషి ఆకలితో చస్తున్నా మోక్షప్రాప్తి ముఖ్యం కదా ! దేశ భక్తులు వర్ధిల్లు గాక, రాజకీయ వ్యాఘ్రవాహనాధిరూఢులు వర్ధిల్లు గాక, శాంతి, శాంతి శాంతి సర్వత్రా శాంతి” అంటాడు. ఈ కవిత్వం నిన్ననే ఆవుల్తో రాజకీయం చేస్తున్న ఫాసిస్టు ప్రభుత్వం మీద నేడే పత్రికలో వచ్చిన కవిత లా లేదూ ? ఈ రోజు న్యూస్ పేపరు తెరిచి ప్రపంచాన్ని భయంకరంగా శపిస్తున్న శిలావిగ్రహాల్లా రెండు చేతుల్తో పట్టుకోవడం ఎంత ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుందో కదా ? పాతికేళ్ళ క్రితం వ్రాసిన పోయం ఇప్పుడే రాసినంత మోహనంగా ఎలా ఉంది ? ఎందుకుంది ? ఆయన కవిత్వం నిండా దట్టించినట్టుండే అధిరూపాలూ, సూపర్ సర్రియలిస్టిక్ ఎక్స్ప్రెషనా ? సహజంగా కవిత్వంలోని కల్పనకీ, వాస్తవికతకీ మధ్యనేదో ఒక పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడే కొత్త మన: స్థితిని చిత్రించడం వలనా ? ఏ సిద్దాంతం ఏం చెప్ప జూసినా, కవిత్వ ప్రేమికుడి అంతరంగంలోంచి మోరెత్తి చూసినప్పుడు, అజంతా కవిత్వమంతా సామాన్యుడి భయంలానే కనిపిస్తుంది. ఆ భయం లోంచి కలలు కనడం కనిపిస్తుంది. కలల భాష లో భయవిహ్వలమైన మెలకువ కనిపిస్తుంది. అందుకే 1948 లో రాసినా, 1992 లో రాసినా, అది 2018 కీ శిరోధార్యమే అన్నట్టుంటుంది. పరిణామక్రమానికి కట్టుబడకపోవడం గొప్ప లక్షణమే కావొచ్చు. కవిత్వానికి కాలంతో పనిలేదని అతగాడు చెప్పుకోనూవచ్చు. ఒక అరవై ఏళ్ళ జల ప్రవాహం లాంటి జీవిత నిర్విచారాన్ని క్యూలో నిలబడి ఓపిగ్గ నేర్చుకున్న విద్య స్పష్టంగా కవిత్వమంతా కనిపిస్తుంది. చేతిలో కత్తి పట్టుకుని జీవన పర్యంతమూ శృంఖలుడైన మనిషి నిర్భంధాన్ని విన్యాసం చేసిన కవిత్వం అజంతాది.

ఇంతకీ శరీరంలోంచి అశరీరతని, కవిత్వమంతా ప్రసరించిన ప్రతిబింబాల్లాంటి ప్రపంచాల్ని, తదేకంగానో, అప్పుడప్పుడోనో,ఉత్సాహంగానో,నీరసంగానో..ఇంకేంగానో,నో, నో…ఎలా చదివి ఏడ్చినా , ఏడ్చి చదివినా ,ఆల్మోస్టాల్ కాగితాలనిండా ఒక అనాహత ఏడుపు వినిపిస్తుంటుంది. దేనికసలీ స్వప్నాశ్రు చిత్రవధ ? నువ్వెన్నిసార్లు తిరగేసి చదివినా ,చదివి తిరగేసినా, నిద్రపట్టక పొవడం జరగకపొవచ్చు. కలలు రాకుండానూ ఆపలేకపొవచ్చు. సమస్యల్లా, నువ్వు స్వప్న దారులంట తిరుగుబోతు కావటం మాత్రం నిన్నెవడూ ఆపలెడు. నిన్నొకటి కాకపోతే మరొకటి. అదొక “ఆత్మఘోషో ” “చీకటి చిత్రశాలో ” ఒకదాని వెంట మరొకటి తరుముకుంటూ నిన్ను భయపెడ్తాయి . అతని మాటల్లో భయం కనిపిస్తుందా? ఇందాకనుకున్న జీవన బీభత్స చీకటి దు:ఖం ,ఆకుల్లా రాలిన పద్యం కూడా పెద్ద శబ్దం చేస్తూ స్వాగతం పలుకుతుందా ? నిశ్చయంగా ఒక మాట అనుకోవాలి .అజంతా కవిత్వం నిండా మనిషి భయాల్ని వెంటాడుతున్న కలలు దృశ్యం తర్వాత దృశ్యం గా మారిపొతుంటాయ్ .ఇలా నువ్వూహించెలోగా కొత్త నేత్రాలు ధరించిన అజంతా కవిత్వం ఎందుకిన్ని రహస్యాలు దాచుకున్న మేథమెటికల్ సముద్రంగా గోచరిస్తుంది? అతను ఎంచుకున్న సబ్జక్ట్ వలనా ? అతను చెప్పిన ఫామ్, ఫార్మాట్ వలనా ? లేక ఇంకేదైనా వలనా? ఒక ముందుచూపును, అందులోంచి ఇంకా ముందుకుపోయిన వాస్తవీన ఊహని కవి పుట్టుకతో పట్టుకున్న ఒక కొత్త పరికరంతో అక్షర ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాడు. కవిత్వానికి భాష ప్రాణవాయువే. కానీ కేవలం అతని భాషే ఈ కవిత్వాన్ని గొప్ప సాహిత్యం చేశాయనుకోలేము. కాకపోతే ఆ పదాలు అన్ని వంకర్లు తిరిగి అన్ని దారుల్ని అపరిచితం చేసి మనల్ని వికసిస్తున్న అస్థికల్లో శిధిలం చెయ్యవు. బహుశా అతని అన్వేషణ కొనసాగిన అందమైన చావులాంటి కవిత్వం నిండా చిన్న సైజు నరకం సృష్టించబడి కులాసాగానే వెళ్ళిపొయింది. ఎంత భరించి వుంటాడీ వాక్యాల్ని రాసేందుకు? ఎంత మెలితిరిగిన గీతలున్నాయతని సంతకంలో? నువ్వొక్కడివీ తిరిగే కలల దారుల్లొ సారవంతమయిన శ్మశానాల్ని, రాత్రంతా లైట్లు వెలిగే స్వప్న కన్యకల్ని, లేదంటె క్షుద్రదేవతల్ని, భయం భయంగా భ్రాంతిని సమర్థిస్తున్నట్టు రాస్తాడు. అజంతా అర్ధమయ్యాడనుకొవడం బావుంటుందా? అర్ధం కాకుండా ఉండిపోవడంలోనే కన్వీనియంట్ గా వుందా? లెట్స్ లీవిట్, అర్ధమైనది అర్ధంకానట్టు, కానిది ఐనట్టు, ఏది ఏమైనా ఏదో ఒకటి ఐనట్టు అనిపించడాన్ని ఒప్పుకోవడం బెటరేమో? ఎందుకంటావేమో? లేకపోతే ఏమిటోయ్! ఈ పుస్తకం నిండా శబ్దకళేబరాలూ, అగ్ని చక్షువులు, నగ్న దేవత రక్తపు వక్షోజాలపై సూదులు గుచ్చటాలూ రాశాడు తప్ప, మానవుడి ప్రగతిశీలత గురించి, సమాజంలో అతడి దైన్యత గురించి, ఇవ్వాల్సిన బలం టానిక్ గురించి, అయ్యయ్యో కొంపలు మునిగిపోయినట్టు సోషలిజం గురించైనా రాశాడా? పరిత్యాగి పరివేదనలూ గట్రా పక్కనపెట్టు, శ్రీ శ్రీ ని, రావిశాస్త్రినీ పొగిడింది తీసిపారేయ్, వీధి మహర్షి నా కావ్య నాయకుడన్న మాటా లైట్ గా తీస్కో, కాస్తంత జాస్మిన్ చల్లి, మెత్తగా హాయిగా రెండు రొమాంటిక్ లైన్లేమన్నా చెప్పాడా? చెప్పలేదా? చెప్పలేదా? ఏం చెప్తాడూ? జననానంతర, మరణానంతర కిటికీలు తగిలించుకుని గాలాడని గుహలాంటి శబ్దశవపేటికల్లో ఒక పెద్ద బండరాయిని పట్టుకుని చెక్కుతూ కూర్చున్నాడు. పైగా అదంతా “చిత్కళని” బోర్డు తగిలించి “ట్రెస్పాసర్స్ విల్ బీ ప్రాసెక్యూటెడ్” అని హెచ్చరించాడు కూడా.

అతనెక్కువగా మాట్లాడ్డని చెప్తారు. సాహిత్య సమావేశాల్లోనైనా, సభల్లోనైనా, ఎక్కడైనా కవిత్వంలో లాగానే కొంతే మనమీదకిసిరేసి, మరికొంత మనల్ని కింద పడి దొర్లి దొర్లి ఏరుకోమంటాడు. అసలీ ఏరుకునే ప్రక్రియతోనే చావు ప్రారంభమౌతుంది మనకి. కొంత సుళువూ, మరికొంత కాదు. రోడ్లూ, కంప్యూటర్లూ, కూలే చెట్లు ప్రతీకలు. కన్నీళ్ళు, వాటి గణిత శాస్త్రాలు, ఇంకా ఇండియా, శ్రీ శ్రీ, రావిశాస్త్రీ..,ఇవీ కవితా వస్తు సామాగ్రి.. వాక్సుద్ది సంగతి సరే సరి. చావు కళలో ఆరితేరిపోయిన పెన్ను పాళీలు, వెన్నెముకలు విరగ్గొట్టే సుత్తీ, కత్తుల విడి విడి భాగాలు– అన్నీ ఒక సంచీ లో వేసుకుని భాషలోంచి భాషలోకి ఒక స్లంక్లియరెన్స్ యాక్టివిటీలో నిమగ్నుడై, అజంతా నిర్ముఖుడిగా, నిశ్శరీరుడిగా జనం ఎందుకేడుస్తున్నారో రహస్యం విప్పేసినట్టే విప్పి గుప్పిట దాచేస్తాడు. అంతా దాగుడుమూతల దాష్టీకమే. కాలంతో పనిలేదని చెప్పుకున్నా, సర్వకాలాలకూ, కవిత్వం కోరుకున్న అర్కిటెక్చర్ తయారు చేసిన కవి అజంతా. చదువుతున్నంత మేరా పాతబడని కొత్త వాస్తవ జీవన దృక్పధాన్ని ఫరెవర్ ఆక్సిజన్ చేసి వూదిన వేణుగాన భ్రమే అజంతా కవిత్వమంతా. అసలెప్పుడైనా 67-68 పేజీలున్న ఒక కవితా సంకలనంలో 28-29 కవితలుండటం వింతకాదేమో గానీ, కవితలన్నింటిదీ ఒకే కధచేసి స్వేచ్చా గీతంలా ఏకోనారాయణుడిలా గర గర పాడటం మాత్రం, నిషానే ! పోనీ టైటిల్స్ లేకుండా, ఒక సుదీర్ఘ కవితాలా కూడా కాకుండా ఒక సంకలనం తయారుచేయవచ్చా? కష్టాతి కష్టమే. భయ విభ్రమాల మధ్య విషాద వాక్యం వలె సాగే జీవితంలోని నిజమైన మృత్యువన్న నిజాన్ని సెంటర్ పాయింట్ చేసుకుని ఇంత కవిత్వం రాశేయటం సాహసం కాక మరింకేమవుతుంది? అందుకతనికేదో అగ్ని వృక్షం కింద ఆధునిక మానవుడు ప్రత్యక్షమై ఏదో ప్రాణదాన రహస్యాన్ని చెవుల్లో ఘీంకరించి ఉంటాడు. వీ కాంట్ హెల్ప్ హిం. అతను కవితాక్షరాల నిండా కేవలం కలల్ని అలంకరించేశాడుకుంటే ఎంత పొరబాటౌతుందో కదా? అదంతా కేవలం వాస్తవ రాహిత్యంలోని హా హా కారమే. అతడు శిక్షార్హుడు. మరణ వృత్తాంతాల్లోని మారని అంతిమతని సత్య వ్యాఖ్యానం లా కవిత్వం చేసి మనందరినీ భయపెట్టాడు. అసలదేంటో తేల్చుకోనివ్వనితనంలోకి నెట్టాడు. పోనిద్దూ…రూపం లేని మనిషి కదా అజంతా. తన గీతమే రూపమన్నాడు. నిస్సహాయుడైన భగవంతుడికి క్షమాపణలు చెప్పుకుందాం. సునాయాస మరణ దండన విధించమని మోకాళ్ళబడి ప్రార్ధన చేద్దాం. సాక్ష్యాలు తెద్దాం. ధృవీకరణ పత్రాలు సమర్పిద్దాం. యెధాశక్తి “టెస్ట్యూబ్” భాషలో కీర్తిగానం చేద్దాం.

ఎక్కిందో దిగిందో వాదులాట ఇంకెంత సేపు ?

రెండు విరుద్దాంశాల్ని అవధారణ చేస్తే చేసేద్దాం గానీ, ప్రజ్వరిల్లుతున్న అడవుల్లో ఎవరిదో ఒక పదఘట్టన మాత్రం మళ్ళీ ఎప్పటికోగానీ వినలేనని తెలుస్తోంది – కమాన్ మీట నొక్కు. అగ్నితో ఒకసారి మాట్లాడు. మృత్యువు శిరస్సు తెగి నిన్ను కౌగిలించుకోనీ — ఆఫ్ట్రాల్ ఇట్స్ పోయెట్రీ, గుడ్డలుంటే ఎంత. లేకపోతే ఎంత. నిగూఢమైనా, అగాధమైనా– తొందరగా నరబలి జరక్క ముందే – భవిష్యత్ నగ్నత్వానికి భయపడే గతమూ, వర్తమానమూ నందు గౄహ నిర్భంధమైపోయినా ఫర్వాలేదు. భస్మ రాశుల తైలం తాగే దీపం కింద క్షణ క్షణమూ పెద్దదౌతున్న నీడనొకదాన్ని తల రెండు సగాలుగా తెగిన స్వప్న హస్తాలతో తాకి వచ్చాను. అదింకా నవ్వుతూనే ఉంది. నా నిద్రమంచం మీదంతా పునర్జ్వలనం. రక్తపు అగ్ని మడుగు.

Death be not proud, though some have called thee mighty and dreadful- for thou art not so;

 

— John Donne

 

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

47 comments

 • ఈ కాలపు కిటికిలోంచి అజంతాని చూడడం ఒకింత సాహసమనే చెప్పాలి . నేటికి కొత్తత్రం కవుల్లో అజంతాని ముట్టుకొవాలి అంటే అమ్మో అనే రోజుల్లో మీ వ్యాసం ఒకింత ఊరట, నిజానికి అంత సుళువుగా అంతు బట్టని కవుల్లో ముందు వరసలో అజంతా ఉంటారు భాషనుంచి భావం దాకా ఒక అలజడి రగుల్తున్నభావన రోడ్లకి నమస్కారం అన్నా క్షుద్ర సంధ్య అన్నా , చెట్లు కూలుతున్న దృస్యం చూపించినా అజంతా గారి కవిత్వం ఒక చిత్కళ , ఇలాంటిదే ఒక వ్యాసం నేనూ బకాయి పడ్డాను రస్తాకి అందుకు ఎడిటర్ గారికి క్షమాపనలు చెబుతూ వీలైనంత త్వరలో నేనూ ఇక్కడ ఒక వ్యాసమై కనబడతానని మాట ఇస్తూమీకు అభినందనలు శ్రీరాం గారు

  • అనిల్, గతంలో పుస్తక ప్రతి కోసం నేను పడ్డ యాతన నీకు చెప్పలేను. అలాగని, నువ్విచ్చిన పీడీఎఫ్ తో పొందిన ఆనందమూ చెప్పలేను. మనం చదవాల్సిన సాహిత్య దారుల్లో మిత్రులు తోడుండాలి. నీలా. థ్యాంక్యూ

 • శ్రీ రాం గొప్ప పరిణతి తో రాసాడు.

  • నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా. ధన్యోస్మి.

 • అజంతా ఆత్మ నిన్నావేశించిందా
  శ్రీరాం లో ఇంత జ్వలనమ్ ఎలా సాధ్యం..

  • ఏదో ఆవేశించిన మాట మాత్రం వాస్తవాతీత సత్యం. భయం కూడాను. థ్యాంక్యూ

 • ఈ వ్యాసానికి మొదటి పాఠకుణ్ణి నేను,శ్రీరామ్ గారు మీ వ్యాసం కొత్త చూపుతో ఉంది.విమర్శ రంగం లోకి సాదరస్వాగతం.అజంతా మీలోకి ఇంకి పోయారు.మిమ్మలను ఆవహించారు.మీరు ఇలాగే కొనసాగించండి.మర్రిన్ని వ్యాసాలు రాయండి.

  • నిజం గోపాల్, నా ఈ రెఫ్లెక్షన్స్ దగ్గరుండి హింసపడింది మీరే ! 🤣. ట్రయిన్ లో, కూడ చావు డిస్కషన్ చేస్తే పక్కనవాడు మనవంక వింతగా చూడ్డం. సూపర్బ్.

 • అజంతా గారి అంతరంగాన్ని చిక్కని పద బంధాలతో ఆవిష్కరించారు సర్. అభినందనలు.

  • థ్యాంక్యూ వర్మా. నేనేది రాసినా ప్రేమతో మీరు వెన్ను తట్టడం మర్చిపోరు. మీ మెత్తదనానికి సర్వదా కృతజ్ఞతలు.

 • చాలా బావుంది సర్…కొత్తగా వ్యాసం అల్లారు…
  అజంతాగార్ని చక్కగా ప్రెసెంట్ చేశారు….
  చాలా వాక్యాలు చాలా చోట్ల నన్ను నిలబడి చదివించాయి….
  #మరణ వృత్తాంతాల్లోని మారని అంతిమతని సత్య వ్యాఖ్యానం లా కవిత్వం చేసి మనందరినీ భయపెట్టాడు.#
  #పదాల పదాల మధ్య కొత్త వాక్యాలనేకం పలికే భాష ఒకటి పొడుగాటి వాక్యం లా అవతారమెత్తుతుంది.#
  ఎంత గొప్పగా చెప్పారో….
  శుభాకాంక్షలు సర్….నమస్సులు💐💐💐

  • నాగరాజూ, మనలాంటివాళ్ళం ఇలాంటి ఎన్నో సంపుటుల్ని అర్జంటుగా చదవాలి. కాలాతీతమయిపోతోంది. నీ అభిమానానికి థ్యాంక్స్ తమ్ముడూ.

 • అజంతాకవిత్వాన్ని అజంతా తరహాలోనే అనుభవించి పలికించిన వైనం.

  • మీ వ్యాసం కావాలన్నప్పుడు ప్రేమతో ఇచ్చారు. అజంతా గురించి ఔదార్యంగా మాట్లాడారు. చాలా ఇన్సైట్స్ కలిగించిన పుస్తకం సహృదయుని ప్రేమ లేఖ కోసం అల్లాడాను సార్. ఆఖరుకి దొరికింది. మీ మాటలకి ధన్యవాదాలు సార్.

 • కవి అజంతా అంతరంగాన్ని వెదికి పట్టుకోవడమంటే.. కూలిపోతున్న చెట్ల దృశ్యంతోపాటు.. జీవితంలో కొత్త నడక నేర్చుకోవడమే!ఈ పద గాంభీర్య శబ్దాన్ని కవిత్వ అంతరంగంతో అందిపుచ్చుకోవడమంటే.. శ్రీరాం లాంటివాళ్ళకి కత్తిమీద సామే.ఐనా లోలోతుల నుంచి అన్వేషిస్తూనే ఉన్నాడు కవి.ఈ పదఘట్టణ సమూహంలో పాఠకులంతా.. నూకలేరుకుంటున్న పావురాళ్ళే!

  • థ్యాంక్యూ చంద్రశేఖర్ గారు. కవిత్వాన్వేషణ పూలపానుపే కాదు, మరణశయ్య కూడా అన్న అనుభవాన్నిచ్చిన కవిత్వమిది.

 • ‘కృష్ణా,నీ విశ్వ రూపాన్ని చూడజాలకున్నాను.ఉపశమించు’-అన్న అర్జునుని రోదనలా వుంది.నా పరిస్థితి.ఏమిటా భాషా బీభత్స సంచలనం.వాక్యరసోన్మాద ఝరి.అజంతా నాటికి ఆయన్ని పట్టించుకోలేని శక్తి నాది.ఆ తరవాత సాంసారిక పదఘట్టనలో మరుపుసీమలో మరుగునపడిన ఆ తలపు క్షమార్హం కానట్టు గా అనిపిస్తోంది మీ పుస్తక పరిచయం.కాదు గన్ తుడిచి చేతిలో పెట్టి కవిత్వం కోసం చచ్చిపోవడం ఒక దేశం కోసం చచ్చిపోవడం కంటే గొప్ప ది అనే అనిర్వచనోక్తి తొందరపెడుతోంది వేగిరం పేల్చేసుకో అని.మెరుస్తున్న వాక్యాల్లో స్వప్న లిపిలో మళ్ళా కవితలెగరేసుకుందాం!

 • శ్రీరాం గారూ.. మీరూ చాలా వేదన పడినట్టున్నారు అజంతా కవిత్వాన్ని సమీక్షించడానికి.. చదవడమే ఒక వేదన.. చదివాక సమీక్షించడం ఓ సంవేదన… మీ పరిణతితో కూడిన అక్షర వాక్యం వల్ల ఇది సుసాధ్యమైందనేది నా భావన. సూపర్బ్ గా విశ్లేషించారని చెప్పలేం.. ఎందుకంటే అది అజంతా కావ్యం.. అంత తేలిగ్గా అవపోశన చేయడం అసాధ్యం. కానీ మీరు విజయవంతం అయ్యారని అనిపించింది.. చాలా బాగా విశ్లేషించారు. ఈ మొత్తం సమీక్షలో అజంతాను చూసిన శ్రీరాం సుస్పష్టంగా కనిపించారు.. అది కదా కవి విజయం… ఈ కింది వాక్యాలు మొత్తం సమీక్షకు పట్టునిచ్చాయి.. ప్రస్ఫుటంగా అజంతాను పట్టి చూపాయి…
  ఒక ముందుచూపును, అందులోంచి ఇంకా ముందుకుపోయిన వాస్తవీన ఊహని కవి పుట్టుకతో పట్టుకున్న ఒక కొత్త పరికరంతో అక్షర ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాడు.
  భయ విభ్రమాల మధ్య విషాద వాక్యం వలె సాగే జీవితంలోని నిజమైన మృత్యువన్న నిజాన్ని సెంటర్ పాయింట్ చేసుకుని ఇంత కవిత్వం రాశేయటం సాహసం కాక మరింకేమవుతుంది? అందుకతనికేదో అగ్ని వృక్షం కింద ఆధునిక మానవుడు ప్రత్యక్షమై ఏదో ప్రాణదాన రహస్యాన్ని చెవుల్లో ఘీంకరించి ఉంటాడు. వీ కాంట్ హెల్ప్ హిం. అతను కవితాక్షరాల నిండా కేవలం కలల్ని అలంకరించేశాడుకుంటే ఎంత పొరబాటౌతుందో కదా? అదంతా కేవలం వాస్తవ రాహిత్యంలోని హా హా కారమే. అతడు శిక్షార్హుడు. మరణ వృత్తాంతాల్లోని మారని అంతిమతని సత్య వ్యాఖ్యానం లా కవిత్వం చేసి మనందరినీ భయపెట్టాడు. అసలదేంటో తేల్చుకోనివ్వనితనంలోకి నెట్టాడు. పోనిద్దూ…రూపం లేని మనిషి కదా అజంతా. తన గీతమే రూపమన్నాడు.

  • నేను వేదన పడిన తనాన్ని కనుగొన్నందుకు థ్యాంక్స్ చిన్న మాటే. అసలు అజంతా ఎందుకింత నలిపేస్తాడు మనల్ని. కాదు కాదు. అతనెంత నలిగిపోయి ఉంటాడు.

 • శ్రీరామ్…ఒక గన్ లా దూసుకొస్తున్నాడు….అంతా తప్పుకోండి…తప్పుకోమంటారా మీ ఇష్టం ఆ జడిలో మీరూ కొట్టుకుపోతారు…..అదీ నచ్చితే ఆయన స్నేహాన్ని పొందండి…. ఆయనే మనల్ని మనకి బహూకరిస్తాడు….అజంతా తో తాదాత్మ్యం చెందిన అత్యాధునిక కవి…..రేపు ఎలా ప్రత్యక్షమౌతాడో భయంగా ఉంది

  • చాల్చాల్లే నీ ప్రేమాతిశయం. ఇంకో వ్యాసం గురించి చర్చించాలి తొందరగా ముగించుకుని ఇంటికొస్తే మంచిది మిత్రమా. సభ్య సమాజం ఏమనుకుంటుందన్న స్పృహ లేదోయ్ మిత్రమా నీకు. 🤣🤣🤣🙏🙏

  • అల్టిమేట్ రిప్లయ్ మురళి …ఈయన రేపు ఎలా ప్రత్యక్షమౌతాడో భయంగా ఉంది

 • బాగుంది. కవిని ఆసాంతం చదివితే తప్ప ఇలాంటి వ్యాసం రాదేమో ! కవిత్వం వ్రాయడం కన్నా కఠినమైన వ్యాసంగమిది. అభినందనలు శ్రీరామ్ .

  • నిజం మేడం. అజంతా తన చేతిలో ఎన్ని బాకులు పట్టుకుని తనే ఎంత ఖంఢించబడ్డాడో కదా ? థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

 • విమర్శనాత్మక వ్యాసాన్ని కూడా కవితాత్మకంగా తీర్చి దిద్దిన శ్రీరామ్ కు అభినందనలు. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు సాహిత్య విమర్శ రాసిన నోట్ లో పునర్మూల్యాంకనానికి నిలబడేదే గొప్ప రచన అని రాశారు. అజంతా కవిత్వాన్ని సమకాలీనం చేశారు.
  👏👏👏

  • థ్యాంక్యూ మేడం. అక్చువల్లీ, కవిత్వాన్ని తప్పించుకోలేని తనం ఇది.

 • అజంతాకవిత్వ పఠనం ఒక అతీత,విపరీత,విలక్షణ,,విశృంఖల,నిమగ్నస్థితి లో అగ్నిసర్పస్పర్శానుభవం.ఆయనకవిత్వానికిఅద్భుతమైన నిర్వచనం.నిజమే ఆయనకవిత్వం కాలాతీతమైనది.ఆయన వ్యక్తిగా కూడాచాలా భయస్థుడని వీర్రాజుగారు అనేవారు.ఈ రోజుల్లో భయాలు ఇంకాపెరిగిపొయాయి కదా.మీ వ్యాసం బాగావచ్చింది.హార్దికాభినందనలు.

  • అమ్మా! థ్యాంక్యూ వెరీ మచ్. మీరిచ్చే ప్రోత్సాహాన్ని మరువలేను.

 • శ్రీరాం గారు..
  తొలుత మీకు అభివందనాలు. అజంత గారిని చాల దగ్గర నుండి చూసినట్లు చేసారు. ఆ పద ప్రవాహం. ఆ ప్రవాహ శబ్దం, ఆ అలికిడి, ఆ భీకర ఘోష, ఆ ఘోష మాటున మొలకెత్తే కలలు, పరిచయ వాక్యాల్లో చెపుతూనే, మీరు అంత స్థాయి లో సాగిన మీ విశ్లేషణ లో వారి నుండి అందిపుచ్చుకొన్న ఆ పదవిన్యాసం కనిపించింది. అజంత గారిని మీరు విశ్లేషించిన తీరు లో ఎంతో జాగ్రత్త, ఆచి తూచి రాసిన విదానం స్పష్టం. సాహితీ ప్రియులు, ముఖ్యంగా అజంతా గారి అభిమానులు, దాచి పెట్టుకోవాల్సిన వ్యాసం. గొప్ప విజయం. ఈ వ్యాసం. అభినందనలు శ్రీరాం గారు..

 • ఒక్క ఉదుటున చదవగానే నా మెదడుకు అగ్నిస్పర్శ తగిలినట్టయ్యింది…superb review sir

  • వేణూ, ఎక్కడున్నావ్ ? హేపీ టూ సీ యువర్ కామెంట్.

 • Congratulations sriram it is not so easy to estimate ajanta meeru touch cheyyatam SAHASAM you have good poetic talent poetic smell flows in prose continue my ఫ్రెండ్.

 • దాదాపు అయిదేళ్ళ కింద పిచ్చి పట్టినట్టు వెతుక్కున్నాం అనీల్ డానీ, నేనూ బెజవాడ పుస్తకాల షాపులన్నీ తిరిగితిరిగి అలసిపోయాక . ఒక ఆరునెలల వెతుకులాట తర్వాత ఒ సాయంత్రం తీసుకొచ్చాడు ఈ “స్వప్నలిపి”ని. అజంతా అట్లా పరిచయం అయ్యాడు. కానీ పూర్తిగా అర్థం కాలేదు. ఇదిగో ఇవాళ ఇన్నాళ్ళకి అజంతా ఏం చేయడల్చుకున్నాడో అర్థం అయ్యింది. పాఠకున్ని ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంతటి భావోద్వేగానికి గురిచేయగల అజంతా ఇవాళ మరింతగా నచ్చారు. థాంక్ యు శ్రీరామ్ సాబ్ అద్భుతమైన వ్యాసం ఇది దాచుకోదగ్గది కూడా….

 • చేతిలో కత్తిపట్టకున్న మనిషి శృంఖలుడై జీవనర్యంతమూ నిర్బంధం లో ఉండి విన్యాసం చెయ్యడం తో అజంతా కవిత్వాన్ని పోల్చుకుండా మరోలా చెప్పడం కష్టం. ఇదికూడా అంత తేలిక కాదు. శ్రీరామ్ గారి సాహితీ భవిత కు శుభాకాంక్షలు

  • రాజమండ్రిలో ఆరోజు సాయంత్రం అజంతా గురించి మీరిచ్చిన ఇన్ పుట్స్ చాలా వుపయోగపడ్డాయ్. మీ సాహిత్యవ్యాసాలు కూడా. ధన్యోస్మి.

 • అజంతాగారి కవిత్వం సర్వకాలీనమైనది. అంత ప్రత్యేకమైంది కావటం చేతనే యిప్పటికీ ఆ కవిత్వం విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. మీరు కూడా అంతే పట్టుతో, గొప్పగా శ్లేషించారు ఆయన కవిత్వాన్ని.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.