నిర్మలానంద కవితాత్మ

without translation,
we would be living in provinces bordering on silence
– George Steiner
ప్రజావిముక్తి సమరంలో చేరగ వేగమె రండోయని శివసాగర్‌ తొలిగంటలు మ్రోగిస్తున్న కాలంలో, సాహితీపిపాసి అయిన పల్లెటూరి యువకుడికి ‘సృజన’ చిరునామా కంటబడితే, కిళ్ళీకొట్టు తోరణంలోంచి ‘ప్రజాసాహితి’ చేతికందితే, లైబ్రరీ టేబల్‌ మీద ‘విమోచన’ పుటలు  రెపరెపలాడితే అతనిలో ఏమి సంభవిస్తుంది?  రచయిత-నిబద్ధత-నిమగ్నతల గురించిన మధనంలోంచి ఉద్యమంలో మమేకమవ్వాలని ఉవ్విళ్ళూరుతున్నవానికి ‘నేను నేలకొరిగితే’ అన్న పాలస్తీనా పోరాట సాహిత్యం దొరికితే ఎంత సంబరంగా ఉంటుంది? అంతటి ఆతృతతో, మహత్తర ఆశాభావంతో నేను అనేకులలో ఒకడిగా కార్యాచరణలోకి అడుగులు వేశాను. తెలుగునేల మీద అందుకు పురికొల్పిన సాహిత్యపరుల పరంపరలో నిర్మలానందగారు (20.10.1935-24.07.2018) సర్వదా నిలిచిపోతారు.
                                            . . .
ఉత్తరాంధ్రలోని అనకాపల్లిలో నిర్మలానంద పుట్టి పెరిగారు. అసలు పేరు ముప్పన మల్లేశ్వరరావు. తండ్రి సలహాతో చిన్నతనంలోనే హిందీ నేర్చుకున్నారు. అక్కడి  గ్రంథాలయంలో సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. స్వీయరచనలు చేస్తే తనలో స్వార్థం బయల్దేరుతుందనే భావన అనువాద రచనకి ప్రేరేపించింది. అప్పట్లో అను వాదకులు తక్కువగా ఉండటం వల్ల ఆ రంగంలో కృషి అనివార్యమయింది. 1957లో ఆయనకి రైల్వే ఉద్యోగం రావడంతో స్వస్థలం వదిలి ఒరిస్సాలోని ఝార్సుగూడాకి మకాం మార్చారు. ఈ మార్పు తన రచనా వ్యాసంగానికి కలిసివచ్చింది. అక్కడి సహోద్యోగి, రచయిత కామతాప్రసాద్‌ ఓఝా దివ్యతో స్నేహం కుదిరింది. ఆయన ప్రోత్సాహంతో ఒకవైపు హిందీనుంచి తెలుగులోకి అనుసృజన చేస్తూనే, తెలుగునుంచి హిందీలోకి కూడ తర్జుమా మొదలుపెట్టారు. 1952లో ఆరంభించిన అనువాద రచనావ్యాసంగం ఆయన జీవితపర్యంతం కొనసాగింది.
తొలిదశలో కిషన్‌చందర్‌ కథల్ని తెలుగు చేసేటప్పుడు సంస్కృతీ అంశాల పరంగా సమస్యల్ని ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో విభిన్న భాషాసంస్కృతుల పట్ల తనకి తగినంత ఎరుక లేకపోవడమే అందుకొక కారణంగా గుర్తించారు. తెలుగు-హిందీ నిఘంటువుల లోటువల్ల అవస్థపడ్డారు. కాలక్రమంలో ఆ పరిస్థితిని అధిగమించారు. ఒరియా, బెంగాలీ, ఆంగ్లభాషల్లోనూ పరిజ్ఞానం సంపాదించారు. అలా పలు కథలు, కవితల్ని వివిధ ప్రాంతాల హిందీ పత్రికల్లో ప్రకటించేవారు. ప్రేమ్‌చంద్‌ హిందీ నవల ‘గోదాన్‌’, దానికి అట్లూరి పిచ్చేశ్వర్రావ్‌గారి తెలుగు అనువాదం (1954)ని ఏడాది పాటు అధ్యయనం చేశారు. ఆ విధంగా ప్రత్యేకమైన అభిరుచితో తెలుగు, హిందీ అనువాదాల కోసం శ్రద్ధ వహించారు.
చలం, కొ.కు, రా.వి.శాస్త్రి, శ్రీపతి, డి.వెంకటరామయ్య, వి.రాజారామ్మోహనరావు కథలు, దిగంబర కవులు, ‘మార్చ్‌’ సంకలనం, శ్రీశ్రీ, కుందుర్తి, శీలా వీర్రాజు, శీలా సుభద్రాదేవి కవిత్వం హిందీ పాఠకులకు పరిచయం చేశారు. శ్రీశ్రీ శతజయంతికి ‘మహాప్రస్థానం’ హిందీలోకి అనువదించారు. దీనిని 2011లో తరిమెల నాగిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. ఒక రచనని అనువాదం చేసిన పిమ్మట దానినాయన పలుమార్లు చిత్రిక పట్టేవారు. ఆయా భాషల మిత్రులతో చదివించేవారు. ఆ తర్వాతనే పత్రికలకి పంపించేవారు. అనువాద కళ గురించి తన అభిప్రాయమొక చోట ఇలా పేర్కొన్నారు: ‘మరొక భాషలోంచి తన మాతృభాషలోకి గాని, అదే విధంగా తన మాతృభాషనుంచి ఇతర భాషలలోకి గాని అనువాదం చేసేవారు, తన భాష నుడికారం, సంస్కృతిని గురించి విడిగా తెలిసి ఉండడం ఎంత అవసరమో ఇతర భాష నుడికారం, సంస్కృతి గురించి కూడ వీలయినంతవరకు అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే అనువాదానికి న్యాయం జరుగుతుంది.’
. . .
ఓపిడిఆర్‌ (ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ) కార్యకలాపాలలో పాల్గొనే క్రమంలో నిర్మలానందకి ప్రగతిశీల రాజకీయదృక్పథం అలవడింది. 1979లో ‘జనసాహితి’ సభ్యుడు కావడం వల్ల ప్రజా సాహిత్యోద్యమంలో తన అక్షరయానం కొనసాగింది. ఆయన సంపాదకత్వంలో మొదటి పుస్తకంగా ‘లూషన్‌ వ్యక్తిత్వం-సాహిత్యం’ (1982) వెలువడింది. దీనిలోని అధికభాగం అనువాదాలు తనే చేశారు. సర్వేశ్వర్‌ దయాళ్‌ సక్సేనా ‘లూషన్‌-అడవి పక్షులూ’ (1982) అనే ఆసక్తికరమైన కథని ఇందులో చేర్చారు. లూషన్‌ని చైనా ఆధునిక కథకి ఆద్యుడిగా; వచన కవితకి ప్రథముడిగా; యువ రచయితల వెన్నుతట్టినవాడిగా; చిన్నదైన, శక్తివంతమైన, వ్యంగ్య వ్యాసాన్ని తొలిసారి అందించినవాడిగా ముందుమాటలో కొనియాడారు.
‘నేను కథలు రాయడం ఎలా ప్రారంభించాను?’ (1933) వ్యాసంలో లూషన్‌ అంటాడు: ‘భారత, ఈజిప్టు దేశాల కథల కోసం నేను వెదికాను. కాని ప్రయోజనం లేకపోయింది.’ ఈ వ్యాఖ్యకి నిర్మలానంద ఇలా వివరణ ఇచ్చారు: ‘అప్పటికే మనదేశంలో ప్రేమ్‌చంద్‌వంటి రచయిత కథలు రాశాడు, కాని అవి అనువాదం కాకపోవడం వల్లనే లూషన్‌కి చదవడం సాధ్యపడలేదు. అంతేతప్ప భారతదేశంలో ఆనాటికి పోరాటకథలు రాసేవారు లేరనడం సరికాదు.’ పురిపండా అప్పలస్వామిగారు ‘విశ్వకథావీధి’ (1955) రెండో సంపుటంలో అనువదించిన ‘మందు’ కథతో మొదలుకొని లూషన్‌ సృజన, అరుణతార ఇత్యాది పత్రికల ద్వారా పరిచయమే. నిర్మలానంద పట్టుదల వహించడం వల్ల తెలుగు పాఠకులకు మరింత దగ్గరయ్యాడు.
పాలస్తీనా జాతీయ దినోత్సవం సందర్భంలో, నిర్మలానంద సంకలనకర్తగా ‘నేను నేలకొరిగితే’ (1984) పాలస్తీనా పోరాట సాహిత్యం ‘జనసాహితి’ ప్రచురించింది. ఈ పుస్తకం మా తరంలో ఉత్తేజం కలిగించింది. దీనికి మోహన్‌ వేసిన విరోచిత ముఖచిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన సమకూర్చిన మరొక విశిష్టమైన సంకలనం భగత్‌సింగ్‌ రచనలు ‘నా నెత్తురు వృధాకాదు’ (1986). భగత్‌సింగ్‌ తమ్ముని కూతురు వీరేంద్రసింధు ఏర్చికూర్చిన హిందీగ్రంథాల్లోని కోర్టువాంగ్మూలాలు, సందేశాలు, వ్యాసాలు, లేఖలు, పలువురి స్పందనల సమాహారంగా వెలువడింది. భగత్‌సింగ్‌ జైలుజీవితంలో హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, పంజాబీల్లో చేసిన రచనలివి. లాహోరు చెరసాలలోంచి తండ్రికి, మిత్రుడికి రాసిన ఉత్తరాల్లో తనకి పుస్తకాలు పంపించమనే వాక్యం చదువుతున్నప్పుడు కళ్ళల్లో నీరు తిరుగుతుంది. 1930,40లలో భగత్‌సింగ్‌ గురించిన సాహిత్యం నిషేధించబడిన జాబితాని చూస్తే ఆశ్చర్యం, ఆగ్రహమూ కలుగుతుంది. అతని వారసత్వాన్ని అందిపుచ్చుకున్న యువతరానికి ఈ బృహత్‌గ్రంథం అంకితం చెయ్యబడింది. భగత్‌సింగ్‌ని తెలుసుకోదలచిన వారికి తెలుగులో ఇది ఒక్కటే సమగ్ర సంకలనంగా తోడ్పడుతుంది.
. . .

నిర్మలానంద హిందీ సాహిత్యపత్రికలని రప్పించుకొనేవారు. హిందీ రచనలు; ఇతర భారతీయ భాషలు, కొన్ని ప్రపంచ భాషల రచనలు కూడ వాటిలో అచ్చవుతుండేవి. ఇంతకాలంగా ‘ప్రజాసాహితి’ అవసరార్థం నిరాలా, నాగార్జున్‌, ముక్తిబోధ్‌, కైఫీఆజ్మీ, సాహిర్‌ లూధియానవీ, సర్వేశ్వర్‌ దయాళ్‌ సక్సేనా, అవతార్‌సింగ్‌ పాష్‌, అమృతాప్రీతమ్‌, కె.అయ్యప్పపణికర్‌ వంటి ఉదాత్త కవుల కవితలనేకం అనువదించుకొచ్చారు. అందులోంచి ఎంచిన కవితలతో ‘కలాల కవాతు’ (2009) సంపుటం ప్రచురించారు. విభిన్న ప్రాంతాలు, వేర్వేరు జీవితానుభవాలకు చెందిన ఈ కవుల ముక్తకంఠంలోంచి అంతస్సూత్రంగా కఠోర సత్యం, సమున్నత జీవితేచ్ఛ, మామూలు మనుషుల పట్ల ప్రేమ వినవస్తుంది.

మహాప్రస్థానం, హిందీ
ఈ సమయంలోనేే  రా.రా గారి ‘అనువాద సమస్యలు’ గ్రంథంలోని విశ్లేషణ నాకు స్ఫురణకొస్తుంది: ‘ఐచ్ఛికంగా అనువాదం చేసేవాళ్ళు యేదంటే అది అనువాదం చేయరు. తమకు నచ్చినవే చేస్తారు. చలం టాగూరు కవిత్వాన్ని అనువదించినా, దువ్వూరి రామిరెడ్డి ఉమర్‌ ఖయాం రుబాయీలను అనువదించినా, శ్రీశ్రీ కార్ల్‌ చాపెక్‌ ‘అమ్మా’ నాటకం అనువదించినా, క్రొవ్విడి లింగరాజు గోర్కీ ‘అమ్మ’ నవల అనువదించినా అవి వాళ్ళకు నచ్చినందువల్లనే అనువదించారని సులభంగానే గ్రహించవచ్చు.’ ఆయన ఇంకా ఇలా అంటారు: ‘ఆధునిక అనువాదకునికి ఒక కవితాత్మ వుంటుంది. స్వయం వ్యక్తీకరణ కొరకు అది తహతహలాడుతుంటుంది.  తన కవితాత్మకు అనుగుణమైన మూలగ్రంథం కనిపించినప్పుడు అతనికి ఆ మార్గం దొరుకుతుంది. ఆ మూలగ్రంథాన్ని అనువదించడం ద్వారా అతను తన కవితాత్మను వ్యక్తం చేస్తాడు.’ అచ్చంగా ఈ రీతిలోనే నిర్మలానంద అనుసృజన జరిగిందంటాను.
ఆయన ఉద్యోగరీత్యా ఎక్కువ కాలం ఒరిస్సాలోనే ఉన్నారు. ఉద్యోగవిరమణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి చేరారు. ‘ప్రజాసాహితి’ పత్రికకి రెండు దశాబ్దాల పాటు సంపాదక బాధ్యతలు నిర్వర్తించారు. 1991 నుంచి క్రమం తప్పక 177 సంచికల వరకు వెలువరించారు. అలవోకగా ప్రత్యేక సంచికలు తీసుకొచ్చేవారు. ‘తెలుగులో సాహిత్యపత్రిక మనగలగకపోవడానికి ఆర్థికం ఒక కారణమైతే, మరో లోపం మన సాహిత్య పాఠకులది’ అని ఆయనొక చోట అన్నారు. ‘విప్లవనారి దుర్గాబాబి’ పేరిట దుర్గావతిదేవి రచనల సంకలనం; జాఘవా శతజయంతికొక పుస్తకం తెచ్చారు. అల్లూరి సీతారామరాజుపై వ్యాస సంకలనం ‘మన్యం వీరుని పోరుదారి’ని ఆదివాసీ గ్రామం దుగ్గేరు (విజయనగరం జిల్లా)లో మహాశ్వేతాదేవి చేత ఆవిష్కరింపజేశారు. తరిమెల నాగిరెడ్డి ఇంటర్వ్యూలు, నివాళి రచనలను గ్రంథస్థం చేయడమే గాక ఆయనకి సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌మీద రాతిప్రతిని ఎన్నడో సిద్ధం చేశారు.
. . .
హైదరాబాద్‌లో ఓసారి గుడిపాటి, ఒమ్మి రమేష్‌బాబు, నేనూ కలిసి ఆయనతో మాట్లాడాము. సాహిత్యమంటే తనకెంతో ప్రాణమని, మేలైన సాహిత్యాన్ని నలుగురికీ అందించాలన్న తపనతో అవిశ్రాంతంగా పనిచేసేవాడినని చెప్పారు. అనువాద పద్ధతులు; విప్లవ, దళిత, స్త్రీవాద సాహిత్యోద్యమాలు; పునర్‌ మూల్యాంకనం తీరుతెన్నులు; ఆనాటి కథలలో శిల్పపరమైన లోపాలు మొదలైన ప్రశ్నలకి బదులిచ్చారు. ఆ ఇంటర్వ్యూని ‘వార్త’ సాహిత్యా నుబంధం ‘సృష్టి’ (29.06.1996)లో ప్రచురించాము. కథలో శిల్ప ప్రాముఖ్యతని ప్రస్తావిస్తూ: ‘కథని చెప్పే పద్ధతి కన్నా విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వైవిధ్యం లోపిస్తుంది. వస్తువు ఎంత గొప్పదైనా దానికి చది వించే గుణం లేకపోతే ప్రయోజనం ఉండదు.’ అన్నారు. సామాజిక సందర్భమనే పేరిట రచయితలు, కవులు ఏమి రాయాలో శాసించే ధోరణిపై తన అవగాహనని ఖరాకండిగా చెప్పారు: ‘ఫలానా ధోరణిలో రాయాలనడం పద్ధతి కాదు. రచయితలతో అలా రాయించలేరు. తెలిసిన జీవితం గురించి, అనుభూతి చెందిన విషయం గురించి మాత్రమే బాగా రాయగలుగుతారు.’ ప్రపంచ సాహిత్యంలో విస్తృత ప్రవేశం వల్లనే సాంప్రదాయక ఉద్యమ సాహిత్యకారులకి భిన్నంగా ఆయన ఈ సారవంతమైన అభిప్రాయం వెలిబుచ్చారు.
. . .
ఈ నివాళి వ్యాసం రాస్తున్నప్పుడు, నిర్మలానందగారి చిన్నకొడుకు జయసూర్యని ఫోన్‌లో పలకరించాను. తండ్రి స్మృతులకంటే భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ సంగతులే ఆ గొంతమ్మట ఎక్కువగా విన్నాను. నిర్మలానంద విద్యావేత్త కాదని; కేవలం భాషా, సాహిత్యాభిమాని మాత్రమేనని; సమకాలిక అనువాదకుల మల్లే సముచితమైన గుర్తింపు రాలేదన్న విచారమెన్నడూ ఆయనకి లేదన్నాడు. ఓ శోధకుడిమల్లే 84 సంవత్సరాల ఆయన జీవితకాలంలో, అరవయ్యేళ్ళకి పైబడిన అనువాద రచనావ్యాసంగంలో నిర్మలానంద, తెలుగుదాసు, విపుల్‌ అనే కలం పేర్లతో ఆరు వందల కథల్ని తెలుగులోకి తెచ్చారు. అందులోంచి ఎంపిక చేసిన పాతిక కథలతోనైనా ఈ సాహిత్యలోకం ఒక పుస్తకం ప్రచురించలేకపోయింది. అయితే ఆయన మన ‘లేమి’ని అర్థం చేసుకునే ఉంటారు. అనువాదకుడంటే, ఒక భాషా పంజరంలో బంధించిన అక్షరాల పక్షుల్ని విముక్తం చేసే పునరుజ్జీవన ప్రదాత కదా! మనకున్న అటు వంటి బహు కొద్దిమంది సంరక్షకుల్లోంచి నిర్మలానంద ‘అనువాదానందం’తోనే నిష్క్రమించారు.
( నిర్మలానంద రేఖాచిత్రం: శంకర్‌ పామర్తి )

నామాడి శ్రీధర్

నామాడి శ్రీధర్‌, కోనసీమలో పుట్టి పెరిగారు. రాజమండ్రి ఆర్ట్స్‌ కాలేజీలో బి.ఎస్‌.సి (భూగర్భశాస్త్రం) చదివారు. తూర్పుగోదావరి ప్రాంతంలో పౌరహక్కుల సంఘంలో, క్వారీ కార్మికోద్యమంలో పనిచేశారు. రాజమండ్రి నుంచి కవిమిత్రులు ఒమ్మి రమేష్‌బాబు, తల్లావజ్జల శశిశేఖర్‌ సహసంపాదకులుగా 'కంజిర' (1990-1995) కవిత్వపత్రిక తీసుకొచ్చారు. వీటిలో గాలి నాసరరెడ్డి అనువదించిన 'జపనీయ హైకూ', '6 డిసెంబర్‌ 1992' ప్రత్యేక సంచికలుగా వెలువరించారు. హైదరాబాద్‌లో పాత్రికేయుడిగా, 'వార్త' సాహిత్యం, కళల పేజీల బాధ్యుడిగా కొంతకాలం విధులు నిర్వర్తించారు. కోనసీమ నుంచి ఒక సామాజిక, రాజకీయ పత్రికని నడిపారు. 'ఆకుపచ్చలోయ' (1996); 'బంధనఛాయ' (2008) స్వీయకవిత్వ సంపుటాలను ప్రచురించారు. అఫ్సర్‌, ఒమ్మి రమేష్‌బాబు, ఎం.ఎస్‌.నాయుడు, పెద్ది రామారావులతో కలిసి 'అతడు, ఆమె, మేమూ' (1996) అనే దీర్ఘరాత్రి కవిత రాశారు. ఇస్మాయిల్‌ స్వీయ, అనువాద కవితల సంపుటం 'పల్లెలో మా పాత ఇల్లు' (2006), శివలెంక రాజేశ్వరీదేవి కవిత్వం 'సత్యం వద్దు స్వప్నమే కావాలి' (2016)లకు సంపాదకత్వం వహించారు. ప్రస్తుతం 'ప్రేమలేఖ ప్రచురణ' సంపాదకుడిగా, మానవహక్కుల కార్యకర్తగా కొనసాగుతున్నారు.

5 comments

 • నిర్మలానందగారిని గురించిన
  అనువాదానికి సంబంధించిన
  అనేక విషయాలను మాకు పరిచయం చేసారు.
  ఆయన కాక పోతే”నా నెత్తురు వృధాకాదు”మనకు అపరిచితంగా నిలిచిపోయేదేమో..
  ఆయన కృషి అజరామరం
  అనువాదరంగంలలో అనన్యసామాన్యుడు నిర్మలానందగారు ఆయనకు సలాం
  అటువంటి మహోన్నత వ్యక్తిని వ్యక్తిత్త్వాన్ని కృషిని అత్యద్భుతంగా అక్షరాలలోనికి అనువదించిన
  మీకు నమస్కారం.

 • దివ్యమైన మనిషికి భవ్యమైన నివాళి శ్రీధర్ గారూ నమస్తే

 • నామాడి శ్రీధర్‌ గార్కి, నాన్నగారి గురించి మీరు రాసిన వ్యాసం అర్ధవంతంగా ఉంది.. ఆయన 1950లో SSLC చదివారు. టైప్ హయ్యర్, షార్ట్ హ్యాండ్, హిందీలో అన్ని శాఖలు పాసయ్యారు. అయితే నిర్మలానంద 16 ఏళ్లకే తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో కుటుంబ భాద్యతల కారణంగా పై చదువులు చదివే పరిస్థితి లేదు.. తల్లి, ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లి.. బాధ్యత తనపై ఉండటం.. 1952 లో అనకాపల్లి మున్సిపాల్టీలో టైపిస్ట్ గా ఉద్యోగానికి చేరిపోయారు .. ఆ తర్వాత 1957 లో రైల్వే ఉద్యోగానికి వెళ్లిపోవడంతో సాధ్యపడ లేదు.. ఈనాటి కాలానికి తగినట్లు డిగ్రీలు , పిహెచ్ డీ లు లేకపోవచ్చు కానీ హందీ, ఇంగ్లీషు, బెంగాలీ భాష మీద మంచి పట్టు ఉండేది.. కొసమెరుపు ఏమిటంటే తను అత్యంత ద్వేషించే హిందీ నే తర్వాత కాలంలో కార్యరంగం అయ్యింది.. అనువాదాన్ని సామాజిక భాద్యతగా తీసుకున్న నిర్మలానంద .. తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్లాలంటే హిందీ సరైన వేదిక అని నమ్మి.. తర్వాత కాలంలో పూర్తిగా సాహిత్య జీవితాన్ని కొనసాగించారు..

 • నిర్మలానంద గారి జీవితం నిరాడంబరం ,ఆదర్శప్రాయం ..వారికీ జోహార్లు …

 • నిర్మలమైన మనస్సుతో నిష్కల్మష హృదయంతో ‌ నిరంతరం కాలికి బలపం కట్టుకుని తిరిగి ప్రజాసాహితి పత్రిక కోసం, ప్రజాసాహిత్యం కోసం రాత్రి పగలు శ్రమపడి న వ్యక్తి నిర్మలానంద అతని ఉత్సాహం ,గలగలమని నువ్వే నువ్వు అనితరసాధ్యం.
  అతను దగ్గరుంటే ఆనందం
  అతడొక మాటలు చెరువు
  అతడొక గంధపు తరువు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.