బానిస బ్రతుకుల వ్యధార్థ చిత్రం “అమిస్టాడ్”

స్వేచ్ఛ ఒకరిచ్చేది కాదు, వేరొకరు తీసుకునేది కాదు, కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని బలవంతంగా గుంజుకోవలసివస్తుంది.”అమిస్టాడ్” చిత్రం పోస్టర్లోని కాప్షనది. ఈ చిత్రానికి దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. స్పిల్ బర్గ్ పేరెత్తగానే జురాసిక్ పార్క్‘, ‘ఇ.టివంటి ఖరీదైన సైన్స్ ఫిక్షన్ సినిమాలూ, చిన్నపిల్లలను అలరించే సినిమాలు గుర్తొస్తాయి. కానీ స్పిల్బర్గ్ చిత్రాల లిస్టులో సిండ్లర్స్ లిస్ట్అనే మరుపురాని కళాఖండం కూడా ఒకటి ఉందన్న సంగతి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ నాజీలు యూదులపై సాగించిన అమానుష కృత్యాల్ని సూక్ష్మ వివరాలతో గుండె జలదరించేటట్టు చిత్రించిన నిరుపమాన చిత్రం సిండ్లలర్స్ లిస్ట్‘. ఆ కోవకు చెందిన ఇటీవలి చిత్రం అమిస్టాడ్‘. ఒక్క సాధారణ యాక్సిడెంటు గురించి తీసిన చిత్రాన్ని (టైటానిక్‘) 11 ఆస్కారులతో సన్మానించిన అకాడమీ అవార్డుల న్యాయనిర్ణేతలు మనిషి ద్వారా, ‘మనిషి పైసాగిన అత్యాచారాన్ని చిత్రించిన చిత్రం ‘ ‘అమిస్టాడ్‘ కు ఒక్క అవార్డును ఇవ్వలేదంటే, అందుకు కారణం బహుశా నేటికీ ఆ చిత్ర ఇతివృత్తం సదరు కమిటీ వారికి ఒకింత ఇబ్బందికరంగా కనిపించడమే ఆనిపిస్తోంది.
చారిత్రకంగా ప్రపథమమైన  దోపిడి రూపం బానిస వ్యవస్థ. భూములూ, యంత్రాలతో పాటు ఆనాటి ధనాడ్యులకు  ఆఫ్రికన్ (నీగ్రో) బానిసలు కూడా సొంతాస్తి కిందే లెక్క. యూరోప్ శ్వేత వర్ణాల ఆర్థిక సమృద్ధి అంతా బానిసల రక్తాశ్రువుల నుండే తయారయ్యేది. పొలాల్లోనూ, గనుల్లోనూ, ఇళ్లవద్దా- ప్రతిచోటా వొళ్ళంతా  సంకెళ్ళతో బంధింపబడిన బానిసలు గొడ్డుచాకిరీ చేసేవారు. బానిసకు శరీరం తప్పమనసుండకూడదు. యజమాని ఇష్టమే బానిస ఇష్టం. బానిస తన బొందిలో ప్రాణం నిలుపుకొని యజమానికోసం అహోరాత్రులు పరిశ్రమించాలంటే- పశువులకింత పచ్చగడ్డి పడేసినట్టే- వారికి ఏదో కొంత, ఏదో ఒకటి పడేయ్యాలి. దీన్ని ఆహారంఅని అనలేం. రోగంతో ఉండే బానిసకు అది కూడా దొరకదు. చచ్ఛేగొడ్డుకు తిండెందుకూ. యంత్రాలకే గనుక మనసుంటే అవికూడా కళ్లనీళ్లు పెట్టుకుంటాయి బానిసల చాకిరీ చూసి! బానిసఅనేవాడు ఆలోచించగల జంతువుకాబట్టి, వాణ్ని అదుపులో పెట్టేందుకు క్రూరమైన అమానవీయ హింసను ప్రయోగిస్తారు. ఈ వర్ణనంతా ఈనాడు ఊహాతీత మనిపిస్తున్సా, ఆనాడు ఇదే పరిస్థితి అక్షరం పొల్లుపోనంత సహజంగా ఉండేది. కుక్క చచ్చినా కన్నీరు కార్చే శ్వేత జాతివాడికి బానిసమరణం చీమకుట్టినట్టయినా ఉండేది కాదు.
నరజాతి చరిత్ర సమస్తం, పరపీడన పరాయణత్వంఅన్నారు మహాకవి. కేవలం కొన్ని దేశాల్లో నాగరికతముందుగా తొంగి చూచి, మరికొన్ని దేశాలు మరింత ఎక్కువ కాలం అనాగరికంగాఉండడం కారణంగా… కొందరు బానిస యజమానులు అయ్యారు, మరికొందరు మానవులను పోలిన జంతువులయ్యారు. కొందరు సగౌరవంగా బ్రతికే పౌరులయ్యారు, మరికొందరు పౌరహక్కులంటేనే ఏంటో తెలియని నికృష్ట బానిసలయ్యారు. మచ్చుకి రెండు చిన్న చిన్న దేశాల పూర్వ చరిత్రనం తిరగేద్దాం.
ఒకటి క్యూబా‘ ( ఇటీవల పోవ్ సందర్శన, అమెరికా ఆర్థిక ఆక్షల సడలింపుకారణంగా ప్రస్తుతం వార్తల్లో ఉన్న దేశమిది). ఉత్తర అమెరికాకు దిగువున అట్లాంటిక్ మహాసముద్రంలో  ఉన్న ఈ ద్వీపాన్ని 1492లో కొలంబస్ కనుగొన్న తర్వాత, 1511 నుండే  స్పెయిన్ వారు క్యూబాలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోనారంభించారు. వీరంతా అంతవరకు క్యూబాలో ఉంటున్న ఆదిమ వాసులను దాదాపుగా నిర్మూలించేశారు. ఆ తరువాత చెరకు పంట ప్రవేశపెట్టి, పంట పనికోసం ఆఫ్రికన్ నీగ్రోలను దిగుమతి చేసుకోవలసి వచ్చింది. మన ఉదాహరణలోని రెండో దేశం సియెర్రా లియోన్‘ (జుంటా విద్రోహం, కొద్ది నెలల్లోనే దాని కుతంత్ర అణచివేతల కారణంగా ఇటీవల వార్తల్లో కెక్కింది). ఆఫ్రికా ఖండంలోని చిన్న దేశమిది. 1462 లో పోర్చుగీసువారు ఈ దేశాన్ని దర్శించిన కొన్ని సంవత్సరాల తరువాత బ్రిటిష్ బానిస వ్యాపారులు ఇక్కడ నివాసాలు ఏర్పరుచుకున్నారు. ఈ దేశంలో  ఎన్నో నీగ్రో తెగలుండేవి. వాటిలో మెండే, టెమ్నె ప్రధానమైనవి. బ్రిటీషువారు తమ ఆయుధబలంతో, మరికొన్ని మోసపుటెత్తులతో ఇక్కడి నీగ్రో జీవరాశిని బానిసలుగా లొంగదీసుకొనివారిని వివిధ యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తూ అపారమైన ధన మార్జించారు. 1808లో బ్రిటీషువారు ఈ దేశాన్ని తమ వలసగా ప్రకటించుకున్నారు కూడా! ఆ రోజుల్లో బానిసలను బంధించి ఉంచే గోడౌన్మాదిరి దృఢమైన బానిస కోట ఒకటి సియర్రాలియెన్లో ఉండేది.
ఈ రకంగా సాగేది ఆ రోజుల్లో బానిస వ్యాపారం. ఈ లాభసాటి వ్యాపారంలో భాగంగా 16వ శతాబ్దం నుండి 19వ శతాబ్దారంభం వరకు కనీసం రెండు కోట్ల మంది నీగ్రోలు అమ్మకం అయ్యారని చరిత్ర చెబుతోంది. బానిసగా మారిన వ్యక్తి చీకటి ఖండంగా చెప్పబడే ఏ ఆఫ్రికా దేశవాసి అయినా, ఒకటి మాత్రం నిజం. నాగరికదేశంలో నికృష్ట జీవనం సాగించిన ప్రతి బానిసా, తన మునుపటి నేలపై ప్రకృతి ఒడిలో విహంగంలా విహరించిన స్వేచ్చాజీవి! ఆ ప్రకృతి సహజమైన స్వేచ్ఛనూ, సమస్త మానవ విలువల్నీ కాలరాచిన తరువాతే ఇవతలివాడు బానిసగా మిగిలిపోగా, అవతలివాడు బానిస వ్యాపారి లేదా బానిస యజమాని అయ్యాడు.
ఊహకే వళ్ళు గగుర్పొడిచే ఈ హేయమైన విధానం చరిత్రలో చాలాకాలమే కొనసాగింది. కాలక్రమేణా వ్యతిరేక వెల్లువలు కనిపించసాగాయి. ఒక్క అమెరికాలోనే బానిస వ్యవస్థ నిర్మూలనకు  ఎంతో కాలం పట్టింది. బానిస వ్యవస్థ గాఢంగా పాతుకుపోయిన వ్యవసాయ ప్రధానమైన దక్షిణ అమెరికాకూ, పరిశ్రమల ఆగమనంతో నూతన మానవ విలువలు విప్పారుతున్న ఉత్తర అమెరికాకూ మధ్య ఎంతోకాలం సంఘర్షణ సాగుతూ, అంతర్యుద్ధానికి కూడా దారితీసింది. సరిగ్గా ఈ స్థితిలో ఉన్న అమెరికా సమాజపు కథ అమిస్టాడ్. 1863లో అమెరికాలో బానిస వ్యవస్థ చట్టబద్ధంగా అంతమవడానికి దాదాపు 35 ఏళ్ల క్రితం, 1839లో లా అమిస్టాడ్అనే స్పానిష్ దేశపు బానిసల ఓడ‘ (స్లేవ్ షిప్) లో జరిగిన బానిసల తిరుగుబాటు కథ ఇది. ( చిత్ర నేపథ్యాన్ని
వివరించేందుకు ఇంత సుదీర్ఘంగా రాయవలసి వచ్చింది).
చిత్ర ఇతివృత్తం స్థూలంగా:
అది 1839నాటి వేసవికాలం. క్యూబా నుండి బయలుదేరిన ఆ స్పానిష్ బానిసల ఓడ అమెరికా వైపు దూసుకుపోతోంది. ఆ ఓడ దిగువ భాగంలో నిలువెల్లా సంకెళ్ళతో బంధింపబడిన 53 మంది ఆఫ్రికన్ బానిసలున్నారు. క్యూబాలోని ఓ స్పానిష్ వ్యక్తి ఓ అమెరికన్ కు ఈ నీగ్రోల్ని బానిసలుగా అమ్మేశాడు. అందుకని ఆ ఓడ వీరిని తీసుకుని అమెరికా వెళ్తోంది. మార్గమధ్యంలో ఓ తుఫాను నాటి రాత్రి ఆ బానిసల్లోని ముఖ్యుడు సింక్‘ (ఒజిమోన్ హన్ సవ్) తన సంకెళ్ళను త్రెంచుకొని మిగతావాళ్లను కూడా విముక్తుడల్ని చేస్తాడు. వారంతా ఆ రాత్రి పూట ఆ ఓడలో తిరుగుబాటు చేసి చేతికి దొరికిన స్పానిష్ వ్యక్తులందరిని కసిగా చంపేస్తారు. వారిదిపుడు ఒకటే లక్ష్యం- ఎలానైనా ఆఫ్రికా ఖండంలోని తమ స్వస్థలాలకు చేరుకోవడం. కానీ వారికి ఆ ఓడను నడిపే నావిక దక్షతలేదు. వేరే గతిలేక ఆ ఓడలో మిగిలిన ఇద్దరు స్పానిష్ నాయకులపై ఆధారపడతారు. వారిని ఆయుధాలతో భయపెట్టి, ఓడను ఆఫ్రికా వైపు తీసుకు పొమ్మంటారు. కానీ ఆ నావికులు మోసపుటెత్తుగడతో వారిని అమెరికావైపు తీసుకుపోతారు. చివరికి కనెక్టికట్ రేవు సమీపంలో ఓ అమెరికన్ నావికాదళం బానిసలు అందరిని అరెస్టు చేస్తుంది.
అమెరికాలో ఈ బానిసలపై హత్యానేరం, ఓడలో దాడినేరం (పైరసీ) మోపి విచారణ ప్రారంభిస్తారు. ఆనాటి అమెరికా బానిసత్వ సమర్థులకూ, వ్యతిరేకులకూ మధ్య వివాదం అట్టుడికి పోతోంది. బానిసలపై నేరారోపణ జరిగిన నాటికి అక్కడ బానిసత్వాన్ని సమర్ధించే మార్టిన్ వాన్ బరెన్అనే ఆయన ( నైగెల్ హాథార్న్) అధ్యక్షునిగా ఉన్నాడు. హంతకబానిసల్ని శిక్షించేందుకు అటు స్పెయిన్ దేశం (ఆ రోజుల్లో స్పెయిన్ రెండవ ఈసాబెల్లీ రాణి పాలనలో ఉంది), ఇటు అమెరికన్ కొనుగోలుదారుడు ఆత్రుతగా వున్నారు. పైగా అధ్యక్షునిగా ఉన్న వ్యక్తి రెండోసారి కూడా గెలవాలనుకుంటున్నాడు. అందుకని బానిసత్వాన్ని గట్టిగా సమర్ధించే దక్షిణ అమెరికా మద్దతు సంపాదించేందుకు, హంతకబానిసల్ని బలిపెట్టేందుకు నిశ్చయించుకుంటాడు. అమిస్టాడ్బానిసల విచారణను చూస్తున్న వ్యక్తి (మోర్గాన్ ఫ్రీమ్యాన్) స్వయంగా ఓ పూర్వబానిస, బానిసత్వ వ్యతిరేకి అవ్వడం కారణంగా ఆయనను తొలగించేసి అతడి స్థానంలో ఓ యుక్త వయస్కుడైన రియల్ ఎస్టేట్లాయర్ని(మేథ్యూ మైక్ కనాఝే) నియమిస్తుంది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వం మొహం మీదే బెడిసి కొడుతుంది. ఆదర్శవంతుడైన ఈ యువ లాయరు సింక్ద్వారా వారి పూర్వ చరిత్రనూ, వారు బానిసలుగా చేయబడ్డ వైనాన్నీ విని, చలించి, వారి విముక్తికోసమే కంకణం కట్టుకుంటాడు.
స్పెయిన్ రాణి దావానూ, అమెరికన్ కొనుగోలుదారుని దావానూ తిరస్కరిస్తూ దిగువ కోర్టులో కేసు గెలుస్తాడు కూడా. కానీ అమెరికన్ అధ్యక్షుడు స్పెయిన్ రాణి రెండవ ఈసాబెల్లీ వత్తిడి కారణంగా, ఈ కేసును సుప్రీంకోర్టుకు తీసుకువెళ్తాడు. ప్రస్తుత  అధ్యక్షుడి ఈ సంకల్పాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తాడు వృద్ధుడైన పూర్వపు అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ (ఏంటనీ హాప్కిన్స్). ఆయన బానిసత్వ వ్యతిరేకి. కోర్టు హాలంతా స్తబ్ధమై వినేలా, అమెరికా స్వాతంత్ర ప్రకటనలోని మౌలిక విషయాల్ని వుల్లేఖిస్తూ, కనీస మానవ విలువల్ని వక్కాణిస్తూ ఈ కేసును బానిసల పక్షంలో నెగ్గిస్తాడాయన. ఈ కేసు నిర్ణయం “అమెరికన్ విప్లవంలోని ఆఖరు మెట్టుగా నిలిచిపోవుగాక” అని గంభీరంగా ప్రకటిస్తా డాయన. జడ్జిమెంటు ప్రకారం బానిసల్ని వారివారి స్వస్థలాలకు చేరుస్తారు. మెండె భాంగీయుడైన సింక్‘ ‘సియర్రా లియాన్లోని తన స్వగ్రామం చేరికూడా తన కుటుంబంతో కలుసుకోలేకపోతాడు – కారణం, వారంతా అంతర్యుద్ధం కారణంగా ఎక్కడికో వెళ్లిపోయి ఉండడమే!
చిత్రం ఆఖర్లో అమెరికన్ సేనలు సియర్రాలియోన్లోని బానిసల కోటను కూల్చివేయడం, క్యూబాలో దశ వర్ష పోరాటం (1868-78), 1901లో క్యూబా నుండి స్పెయిన్ వారిని అమెరికా పారద్రోలడం వగైరా చారిత్రక సంఘటనల్ని చూపి బానిసత్వ నిర్మూలనలో ఆనాటి అమెరికా గొప్పతనాన్ని కొంతమేరకు కొనియాడారు దర్శకులు.
కానీ బానిసత్వ నిర్మూలనలో అమెరికా ఎంత ముందు వరుసలో ఉన్నా, నేటికీ అమెరికాలో నలుపు తెలుపు తేడాలున్నాయి. నేటికీ శ్వేతజాతివారు, నల్లవారిని ఒకింత తక్కువస్థాయి జీవరాశి‘ (‘లైవ్ స్టాక్‘)గా గుర్తిస్తారు. (నేటి అమెరికా సామ్రాజ్యవాదాన్ని గురించి ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదేమో!) అయితే అమిస్టాడ్చిత్రం స్వేచ్ఛ‘ను మౌలిక మానవహక్కులను ఉద్భోదించడం ద్వారా, సమకాలీనతనూ, సార్వకాలీనతనూ సంతరించుకుందని చెప్పాలి.
ఈ చిత్రం మొత్తం సదా గుర్తుండేదిగా వున్నా, ఇందులోని కొన్ని ప్రత్యేక దృశ్యాలు ప్రత్యేకంగా గుర్తుంటాయి. ఉదాహరణకు సింక్కూ, యువ లాయర్ కూ మధ్య జరిగిన మూడో సంవాదం, ఓడలోని హత్యాస్థలాన్ని సోదా చేయడానికి వెళ్లినప్పుడు అక్కడి గొలుసుల్ని చూసి నడివయస్కుడైన లాయర్ కు తన పూర్వపు బానిస జీవితం గుర్తుకురావడం, పురవీధుల్లో నడిచి వెళ్తున్న బానిసలను చిన్నపిల్లలు పరుగున వెళ్లి తాకిరావడం, అమ్మకానికి పెట్టే బానిసలను స్నానం చేయించి నిగనిగలాడించడం, పాత అధ్యక్షుని ఇంటిలోని ఆఫ్రికా ఖండపు పుష్పాన్ని చూసినప్పుడు సింక్మాతృ భూమి జ్ఞాపకాలతో ట్రాన్స్ లోకి వెళ్లిపోవడం – ఇలా ఎన్నో మరుపురాని దృశ్యాలు చిత్రం పొడుగునా ఉన్నాయి.
నటీనటుల మాటకొస్తే, నూతన పరిచయంగా వచ్చిన డిజిమోన్ హన్ సవ్బానిస నాయకుడు సింక్రూపంలో సమస్త మానవతకు ప్రతీకగా నిలిచినట్టు నటించాడు. యువ లాయరుగా మేథ్యూమైక్ కనాఝే, నడివయస్కుడైన లాయరుగా మోర్గాన్ ఫ్రీమ్యాన్ లు కూడా అద్భుతంగా నటించారు. ప్రతిభావంతుడైన నటుడు ఏంటోనీ హాప్కిన్స్పూర్వాధ్యక్షుని పాత్రలో  నిరుపమాన నటన చూపారు. ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం కథా గమనానికి సహకారిగా, అద్భుతంగా ఉన్నాయి.
ఈ చిత్రంలోని సింక్అనే పాత్ర అసలు ఉదంతంతో లేనే లేదనే వార్త ఆ మధ్యన వచ్చింది. అమిస్టాడ్ కేసు చరిత్రకు సంబంధించిన అంశాల్ని స్పీల్బర్గ్ తన నవల నుంచి కాపీ కొట్టినట్టు ఆరోపించారు రచయిత్రి బర్బారా ఛేజ్ రిబాడ్. ఈ గొడవల సంగతి ఎలావున్నా, హాలీవుడ్ నుండి అరుదుగా లభించే ఉత్తమ చిత్రాల జాబితాలో అమిస్టాడ్సదా నిలుస్తుందన్నది నిర్వివాదం.

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

Add comment

  • అబ్బ ఎంత మంచి రివ్యూ. నా వరకు నాకు ఈ సినిమా స్పీల్బర్గ్ సినిమాలన్నింటిలో తలమానికమైంది. చాలా సార్లు చూశాను. ముఖ్యంగా కోర్టు సీను అధ్బుతం.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.