మా బీరప్ప కథ

పది వీధులతో దాదాపు రెండువందల గడపలున్న పల్లె మాది. వీధికో కులం వారు తమ చేతి వృత్తుల నైపుణ్యంతో రాష్ట్రంలోనే పేరును సంపాదించారు!!

వారిని గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని, వారిలాగే అందరూ తమ వృత్తుల్లో తరించడానికి మా గ్రామంలోని ఒక్కో పనివారి పనితనము, దీక్షలను వివరించాలని నా తలంపు. అందులో భాగంగా మొదట ఒక దాన్ని గురించి……….

నేను మా పల్లెటూళ్లో ఉన్నది నా ఏడవ తరగతి చదువుదాకే. అక్కడ ఎక్కువ భాగం మేము సాగు చేసే  భూములే. అయితే మా ఊరికి అన్ని వైపులా విశాల మైన మైదానం, చిన్న గుట్టలు వాటి మీద విస్తారంగా గడ్డి పెరిగేది. ఆ గడ్డి పాయల్లోకి తొంగి చూస్తే వేల కొద్దీ గొర్రెలు నిశ్శబ్దంగా మేస్తూ అటు ఇటు తిరిగే సజీవ చిత్రాల్లా ముచ్చట గొలిపేవి. వాటిని పెంచే వారిని మేము “కురబ వాళ్లు” అంటాం.

ఆ కురబల ప్రతి ఇంటి ముందూ ఒకటి రెండు మగ్గాలుండేవి. ఉదయం లేస్తూనే ఇంత తిని చిక్కం నిండా సద్దిని, సొరకార బుర్రలో నీటిని చంకకు తగిలించుకొని కొందరు గొర్రెలు మేపడానికి వెళితే మరి కొందరు నేత పనిలో మునిగి పోయేవారు.

ఎండాకాలం వస్తే చాలు ఊరవతల పెద్ద దిగుడుబావి. దాని అంచుల దాకా గొర్రెల్ని తోలుకొని పోయి ఒక్కొక్కటి అందులో తోసేవారు. అలా చేయడం నాకు బలే సరదా. నాకు కురువ బీరప్ప బాల్యమిత్రుడు. నేను గొర్రెల్ని తోస్తుంటే బీరప్ప నీటిలో ఈదుతూ వాటి బొచ్చు తడిసేలా ఒళ్లంతా రుద్దేవాడు. మెట్ల గుండా బయటికొచ్చినవి ఒక పక్క ఆరుతూంటే, మరో పక్క వాటిని ఒడిసి పట్టుకొని కొందరు పనిమంతులు బొచ్చు కత్తిరించేవారు. ఆ కత్తెర్లు వెడల్పాటి రేకు మడతతో విచిత్రంగా ఉండేవి.

ప్రతి కురుబవారి ఇంటి ముందూ వరండాలో వెదురు దబ్బను అర్ద చంద్రాకారంగా వంచి, మేక నరంతో బిగించిన ధనుస్సు వంటిది దంతెలకు వేలాడుతూ వుండేది. దాన్ని ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో నరాన్ని లాగి వదుల్తూ గొర్రెబొచ్చు మీద కదిలించే వారు.

నరం దెబ్బలకు పిడుచలుగా ఉన్న బొచ్చు దూది పోగులుగా ఇంజుకు పోయేది. దాన్నో మూలకు గిరవాటేసి ఏకులుగా తీసుకొని, రాట్నంతో దారంగా వడికేవారు.

తకిలీలకు చుట్టుకొన్న దారాన్ని పొడుగాటి వెదురు బర్రకు అల్లికగా అమర్చేవారు (చీడు  పోయడం). దాన్ని సర్రి తో తడిపేవారు. (చింత గింజల్ని నానబెట్టి పెద్ద రాతి గుండుకింద వేసి నున్నగా రుబ్బి తగినంత నీరు పోసి పొంకంగా కాగబెట్టినది).

మూడడుగుల ఎత్తు Y ఆకారం గల రెండు నిలువు కట్టెల మీద అడ్డంగా రెండు దబ్బలుంచి రెండు వైపులా తాళ్లతో గూటాలకు లాగి కట్టి, దారం పోగులను వాటికి దాదాపు పది అడుగుల పొడవు, రెండడుగుల వెడల్పుతో “పొడుగు” తయారు చేసేవారు. ఆ పొడుగుకు విడుతలు విడుతలుగా సర్రిని పూసి, వట్టి వేళ్లతో తయారు చేసిన (దువ్వెన వంటి పరికరం) కుంచెతో తిగిచే వారు.

తిగిచిన దారం బాగా ఎండిన తరువాత పొడుగును దోణి మానుకు బిగించి జంత్రంతో అనుసంధానం చేసేవారు. పైనా కిందా రెండు వరుసలున్న పోగుల్ని పైకీ, కిందికీ జరుపుతూ ముఖ్య భూమిక వహించేది జంత్రం. ఇది పొడుగుల మధ్యలో నేతగాని చేతికి అందే విధంగా మూడు నాలుగు రకాల దబ్బలకు గట్టి దారంతో అల్లబడి ఉంటుంది.

మరొక పక్క విడి దరాన్ని సర్రితో తడిపి అర్దడుగు పొడవుండే వెదురు గొట్టం (ఒక వైపు మూసి, మరోపక్క దబ్బతో దారం కూరడానికి అనువుగా వుండేది) దాన్ని పేక బుర్ర అంటారు. దారం నిండిన కొన్ని బుర్రలు తయారుగా వుంచుతారు.

మగ్గం గుంత రెండడుగుల లోతు ఉంటుంది. కాళ్లు దిగవిడిచి కూర్చొని నేతగాడు రెండు పొడుగుల మధ్య పేకబుర్రను కుడి వైపు నుంచి ఎడమకు, ఎడమ వైపునుంచి కుడికి విసరుతూ జంత్రాన్ని అంగుళం మేర ముందుకు వెనక్కు కదిలిస్తాడు. అప్పుడు పొడుగు దారాలు పైకీ, కిందికీ జరిగి వాటి మధ్యలో పేకలోని దారం అల్లుకుపోతుంది.

అడ్డంగా చేరిన పోగుని పలుచని పోక దబ్బతో రెండు చేతులతోనూ దగ్గరికి లాగుతూ నేతగాడు పనితనం ప్రదర్శించేవాడు. ఆ విధంగా ఒక కంబళి నేయడానికి రెండు రోజులు పట్టేది.

మా ఇంట్లో నుంచి బయటికొస్తే చాలు ఉదయం నుంచీ చీకటి పడేదాకా ప్రతి కురుబల ఇంటిముందూ నేతకు సంబంధించిన ఏదో ఒక పని జరుగుతూనే ఉండేది. ఊళ్లోని ప్రతి ఇంట్లో పరుపులుగా కంబళ్ళే. చలికాలంలో వాటి వెచ్చదనం అమ్మకడుపులో ఉన్నంత హాయిగా ఉండేది.

పశువులు ఈనితే చాలు కురుబదారం తెచ్చి, దిష్టి తగలకుండా దూడకూ, తల్లి పశువుకూ–   అక్షింతల మధ్య రూపాయి దక్షిణ ఉంచి పసుపు బట్టతో ముడుపులా చుట్టి– మెడకు వేలాడ దీసేవారు.

జూన్, జులై మాసాలు మాకు గాలికాలం. అది కళ్ల కలకను మోసుకొచ్చే కాలం. ఉదయం లేస్తూనే చాలా మంది పిల్లలకు రెప్పలన్నీ పిసరుతో  బంక పూసి అతికించినట్లు మెత్తుకు పోయేవి. అప్పుడు వారిని రప్పాలు(గొర్రెలు ఉంచే చోటు) దగ్గరికి తెచ్చి రెండు ధారలు గొర్రెపాలు పిండితే చాలు!! వెచ్చగా తడిసిన రెప్పలు వెలుగుపూవుల్లా విచ్చుకొనేవి. రెండు దినాలకే కలక నయమయ్యేది.

నేనూ బీరప్పా వీలు చిక్కినప్పుడల్లా గొర్రెపిల్లల్తో ఆడుకొనేవాళ్లం. వాళ్ల నాన్న లింగప్ప ఉదయం పొలాలకు వెళ్లి అగిశ, ఆముదం, పుండి వంటి ఆకులు లేత గడ్డిని తెచ్చి రప్పాల్లో వేసి గొర్రెల వెంట వెళ్లేవాడు. మేము వాటిని చిన్న కుచ్చులుగా చేసి పైకప్పు వాసాలకు– పిల్ల నోటికి అందే విధంగా– నులక దారంతో వేలాడదీసేవారం. కుండతో బావినుంచి నీరు  చేది రాతి తొట్టెలో నించే వారం. సాయంత్రం అవుతూనే పిల్లలు అమ్మ గుర్తుకు వచ్చో, ఆకలి వల్లనో!! లయబద్దంగా అరుపులు మొదలు పెట్టేవి. రప్పానికి అడ్డుపెట్టిన వెదురు తడక సందుల్లో తలను బయటికి పెట్టి తొంగి చూసేవి.

మేము అప్పుడప్పుడు వాటికి పరీక్షలుకూడా పెట్టేవాళ్లం. ఒకే చోట వరుసగా ఉన్న రప్పాల్లోని పిల్లల్ని, అక్కిడి విక్కడ ఇక్కడివక్కడా రకరకాలుగా మార్చెసేవాళ్లం!! తల్లీ  పిల్లలు యెలా గుర్తుపట్టి కలుసుకొంటావో చూద్దామని? అయినా తమవికాని పిల్లలకు పాలివ్వడం కానీ, పరాయి గొర్రె పొదుగుపాలు పిల్లలు తాగడం కానీ చేసేవి కాదు. అరుపుల శబ్దాల తోనే తల్లీ పిల్లలు కలుసుకొనేవి!!

ఎండా కాల మైతే గొర్రెల్ని రప్పాలకు తెచ్చేవారు కాదు. చెరకు, మిరప పంటల కోసం దుక్కులలో రాత్రిపూట మందలు పెట్టేవారు.

ఆ కాలంలో దొంగలు రాత్రి పూట ఇళ్లలో దూరడం కన్నా గొర్రెల కోసమే ఎక్కువగా వచ్చేవారు. ఐదారు కాపలా కుక్కలతో కాపర్లు రాత్రంతా సరతలు (వంతులు) వేసుకొని పహారా కాస్తున్నా ఎప్పుడూ ఏదో రకంగా తస్కరించే వారు.

ఒక సారి మందల దగ్గరకు దొంగలొచ్చారు. బెల్లంలో మత్తుమందు కలిపి కుక్కలకు వేశారు. వొళ్లంతా మసి పూసుకొని కాపలాదార్ల కళ్లుగప్పి, గొర్రెల్ని భుజాలమీద వేసుకొన్నారు. చీకట్లో ఒక దొంగ పొరపాటుగా గొర్రె బదులు మేకను ఎత్తుకొన్నాడు. అది గట్టిగా చెవి కోసిన పందిలా అరవసాగింది. అప్రమత్త మైన కాపరు కేకలు వేశారు. కర్రలు, వడిశెళ్లు తీసుకొని ఊళ్లోని చాలా మంది అక్కడికి చేరారు. చెరకు తోటలు, చెట్ల చాటు బారి గుంతలు అన్ని చోట్లా గాలించారు. ఎక్కడా అలికిడి లేక పోవడంతో ఇంటిదారి పట్టారు.

గొర్రెల వాళ్లంతా వెతుకులాటలు చాలించి బీడీలు కాల్చి నడుం వాల్చడానికి తమ విడిది దగ్గరకొచ్చారు. అక్కడ నల్లటి గొంగళ్లు కప్పుకొని నిద్ర నటిస్తూ దొంగలు!! ఉన్న ఫళంగా లేచి రెండు గొర్రెల్ని ఎత్తుకొని పరుగో పరుగు!! ఇటువంటివి లెక్కకు మించినవి.

అప్పుడప్పుడు పొరుగూరి నుంచి గొరవయ్యలు గుర్రాల మీద మా ఊరికి వచ్చేవారు. గుర్రాల్ని ఊరవతల మంటపం దగ్గర వదిలేసి తలకు ఎలుగుబంటి చర్మంతో టోపీని, ఒంటికి పులి చర్మాన్నీ చుట్టుకొని ఎడమ చేత్తో ఢమరుకం వాయిస్తూ, కుడి చేత్తో పిల్లనగోవి ఊదుతూ వీధుల్లో నాట్యం చేసేవారు. వారిని మేము “బడబడ్డప్ప” అనే వారం.

వారు శివుని అంశతో పుట్టినారని అబద్ధాలు చెప్పేవారినీ, మనస్సులో చెడు ఆలోచనలు ఉన్నవారినీ పసిగట్టి చెవులు కొరికేస్తారని ప్రచారంలో ఉండేది. అందుకే వారు వచ్చినప్పుడల్లా ముసలీ ముతకలు తప్ప మాబోటి పిల్లలంతా గదుల్లో దూరి తలుపులు బిడాయించుకొనే వారం.

వారి మహిమలను గురించి రకరకాల కథలూ, పాటలూ ఉన్నప్పటికీ మిత్రుడు బీరప్ప తాత నంజప్ప మరో రకంగా చెప్పేవాడు.

“కురి” అంటే కన్నడం భాషలో గొర్రె అని అర్థమట. వాటిని పెంచే వారు కురబరు.. కురుబ వాండ్లట. వారి జీవనాధారమైన గొర్రెల్ని రక్షించుకోవడం పూర్వకాలంలో చాలా కష్టంతో కూడుకొన్నదట!! పులులు,  చిరుతలు, నక్కలు, తోడేళ్లు, అడవి కుక్కలు(చీడు కుక్కలు) వంటివి మంద మీదపడి ఎప్పుడూ నాశనం చేసేవట. వాటిని తరమడానికి ఎలుగుబంటీ పులి చర్మాలతో భయంకరమైన వేషం వేసి ఢమరుకంతో గట్టిగా శబ్దం చేస్తూ బెదిరించే వారట!!

ఇక పిల్లనగోవి పురాతన కాలం నుంచీ పశువులు మేపే వారికి కాలహరణం కోసం ఉపయోగించే సంగీత వాయిధ్యమట. దానికి దృష్టాంతంగా గోవుల పాలకుడైన శ్రీకృష్ణుని  చేతిలో పిల్లనగోవి వుండడం చెప్పేవాడు.

ఈ గతమంతా నాకు బెంగళూరు విమాశ్రమంలో దిగి టాక్సీలో మా పల్లెవైపు ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచీ కళ్ళ ముందు సినిమా రీలుగా తిరగ సాగింది.

ఎందుకంటే   ఊర్లో నా ఏడో తరగతి చదువు ముగుస్తూనే మా కుటుంబం బెంగళూరుకు చేరింది. వ్యవసాయం చేయడం దండగని, కాలానికి తగినట్లు బతకాలని భూములనంతా ఏవో విత్తనాల కంపెనీకి అమ్మివేశాడు నాన్న. బెంగళూరు లోనే  చదువు, ఇంకా పై చదువుల కోసం అమెరికాకు వెళ్లడం అక్కడే ఉద్యోగం, పెళ్లి …పిల్లలు సగం జీవితం గడిచి పోయింది.

ఇప్పుడు మిత్రుడు బీరప్ప ఎలాగున్నాడో ఏమో!! చిన్నప్పుడు ప్రతి క్షణం ఏదో ఒక పని చేస్తూ ఒళ్లంతా సర్రి, గొర్రెబొచ్చుతో కూడిన పరిమళంతో గుభాళించేవాడు. ఆ విధంగానే అందరూ కులవృత్తులతో సహజంగా బతకాలని నా కోరిక!!

*********

కారు ఆగి కిందకు దిగుతూనే అది నేను ఊహించిన మా ఊరుగా అనిపించలేదు. నేను మనస్సులో ముద్రించుకొన్న ఫ్రేములో ఒక్క ఇల్లుకానీ, వీధి కానీ, చేతి వృత్తుల మనుషుల హడావుడి కానీ…. చివరికి పల్లె వాతావరణం కానీ కలికానిక్కూడా అతకడం లేదు.

ఊరికి తూరుపు వైపున్న విశాల మైన మైదానం మాయమయ్యింది. దాన్ని కోళ్ల ఫారాలూ, పాల డైరీలూ, నీళ్లు తోడి నిలువ చేసి నగరాలకు సరఫరా చేసే ట్యాంకులూ, బ్యూటీ పార్లర్లూ, కాన్సెప్టు స్కూళ్లూ, రియల్ ఎష్టేటు వ్యాపారాల ఆఫీసులూ… ముళ్ల తీగల కంచెలూ ఆక్రమించేశాయి.

ఆశ్చర్యం నుంచి తేరుకొని మిత్రుడు బీరప్ప కొసం వాకబు చేశాను. అతని వివరాలు తెలుసుకొనే తప్పటికి తల ప్రాణం తోక కొచ్చింది.

అత నిప్పుడు గ్రానెట్ కర్మాగాగారంలో మేనేజరుగా పని చేస్తున్నాడట. ఎవరో దారి చూపగా  ఇల్లు చేరుకొన్నాను. ఆ రోజు ఆదివారం కావడంతో ఖాళీగానే ఉన్నాడు. మొదట నేను అతన్ని కానీ, అతను నన్ను కానీ గుర్తుపట్టడానికి  కొంత సమయం పట్టింది. తర్వాత అతను ఒక్క అంగలో దగ్గరికొచ్చి గట్టిగా ఆలింగనం చేసుకొని నా పై అతనికున్న మిత్రత్వాన్ని, ప్రేమనీ  వ్యక్తం చేశాడు.

అతని ఇల్లు పల్లెల్లో నేను అనుకొన్నట్లుగా లేదు. విశాల మైన హాలు. పెద్ద సోఫా సెట్టు. ఆధునిక సౌకర్యాలతో అటాచ్డ్ బాత్ రూములున్న రెండు మూడు గదులు. హాల్లోని ఆ ఇంటీరియర్ డెకోరేషను దాదాపు అమెరికాలోని మా ఇంట్లో లాగే ఉంది. నా కళ్లు బైర్లు కమ్మాయి.

భార్యను పరిచయం చేశాడు. ఆమే అదే ఊళ్లోని కాన్వెంట్లో టీచరుగా పని చేస్తూ ఉన్నదట! వాళ్ల ఇద్దరు పిల్లలూ ఊటీలోని రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారట… ఏవేవో చెప్పుకు పోతున్నాడు. అంతలో పని మనిషి కోకా కోలా సీసాలు తెచ్చి మూతలు తీసి టీపాయ్ మీద పెట్టింది.

చిన్నప్పుడు వారు తాగే మజ్జిగనో, సుగంధపు వేళ్లను దంచి బెల్లం కలిపి, నీళ్లలో ఉడికించి చల్లార్చిన పానీయాన్నో ఊహించిన నాకు తల తిరిగి పోయింది.

నన్ను నేను సంభాళించుకోలేక పోయాను!!

“ఒరే బీరప్పా! మీ గొర్రెల పెంపకము, మగ్గం బతుకులు, గొరవయ్యల నృత్యాలూ ఎంత సహజంగా ఉండేవిరా!! అవి అన్నీ ధ్వంసం చేసి ఈ కృత్రిమ జీవితాల్ని ఎందుకు ఆహ్వానించావు? నేను దీన్ని జీర్ణం చేసుకోలేక పోతున్నాను…” అని అన్నాను.

దానికి బీరప్ప క్షణం కూడా ఆలస్యం చేయకుండా ” ఔను రెడ్డి గారూ!! మీవంటి వారు మాత్రమే అన్నీ కాలితో తన్నేసి అమెరికాకో, మరీ చేత నైతే ఏ చంద్ర మండలానికో ఎగిరిపోయి కోరిక తీరా బతుక్కోవచ్చు!!

మేము మాత్రమే ఒళ్లు నొప్పులొచ్చినా మగ్గం గుంతలో సగం శరీరం పాతిపెట్టినట్లు మోడులా కూలబడి నేత పని చేస్తూనే ఉండాలి! భార్యా పిల్లల్ని ఇళ్లలో వదిలేసి రాత్రీ పగలూ గొర్రెల్ని కాపలా కాస్తూ జంతువులకన్నా హీనంగా బతుకుతూనే ఉండాలి! పొట్టకూటి కోసం మా వాళ్లు చేసే గొరవయ్య నృత్యాలకు మీరు కళారూపాలని కితాబులిస్తే మురిసి ఆ అడుక్కుతినే ఊబిలోనే కూరుకు పోతూ ఉండాలి!!

ఎంత ఎదిగినా గొర్రెతోక బెత్తెడన్నట్లు మేమలాగే ఉండాలని కోరుకొనే మీ అనిర్వచనీయ ఆశయాలకూ  శతకోటి నమస్కారాలు” అని రెండు చేతులెత్తి మొక్కాడు.

అతనికి బదులు చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు! మీ దగ్గరేవైనా ఉంటే చెప్పండి దయ చేసి!!

***   

 

సడ్లపల్లె చిదంబర రెడ్డి

సడ్లపల్లె చిదంబర రెడ్డి ఎమ్మే బియిడి చేసి, తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైరయ్యారు. రెండు కథల పుస్తకాలు, రెండు కవిత్వం పుస్తకాలు ప్రచురించారు. మరి మూడు పుస్తకాలు త్వరలో వెలువడనున్నాయి. 4 కథలకు, 10 కవితలకు రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్నారు. వందకు పైగా కథలు, 200 పైగా కవితలు రాశారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన చిదంబర రెడ్డి ప్రధానంగా సీమ ప్రాంతం మాండలికంలో అక్కడి జీవితం నేపధ్యంగా రాస్తారు. ఆయన కాంటాక్టు నంబరు 9440073636.

5 comments

    • సోదరా ఈ విషయాన్ని కథగా ఎలా చెప్పాలని దాదాపు పది సంవత్సరాలుగా మదనపడి రాస్తే ఆకాశవాణి వారు ప్రసారం చేశారు కానీ సోకాల్డ్ సాహిత్య పత్రికలేవీ ముట్టుకోలేదు .ప్రచురించిన రాస్తాను స్పందించిన మీకు ధన్యవాదాలు

  • కులవ్రుత్తులు నాశనమై పోయి పల్లె బోసిపోయిందని బాధ పడుతూ వ్రాసిన పాటని మెచ్చుకుంటున్న ఒకరికి నేను బీరప్ప చెప్పిన సమాధానం చెపితే నామీద విరుచుకు పడ్ఢాడు . కులవ్రుత్తులు చేసేవాళ్ళు ఇంకా వాటినే నమ్ముకుని , అభివ్రుధ్ధికి దూరంగా వుండాలనుకునే వారికి బీరప్ప చెప్పిన సమాధానం ఒక చెంప పెట్టులాటిది .

  • ప్రకృతిలో భాగంగా జీవించాలంటే మానవులకు సాధ్యం కానంతగా క్షణ క్షణమూ సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందుతూ ఉంది. పల్లె జనాలు అభివృద్ధి చెందడం హర్ష దాయకమే.
    ఇప్పుడు కావలసింది కపటం లేని మనస్తత్వాలు. అవి పల్లెల్లో కరువౌతున్నాయి. అదే బాధించే విషయం.
    ఆదినారాయణరెడ్డి.
    E mail.. adhinarayana.reddy@gmail.com

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.