మోహన్ రుషి- Urban Saint

ఇవాళ మనకున్న చాల మంచి కవులలో మోహన్ రుషి ఒకరు. తన కవిత్వంలో అచ్చమైన అర్బేనిటీ మనల్ని తనతో కట్టేసుకుంటుంది. దీపశిల, బొమ్మల బాయి సిద్ధార్థ సంగతి చెప్పేదేముంది. తను మోహన్ రుషి తాజా పుస్తకం ‘స్క్వేర్ వన్’ మన కోసం ఇలా చదువుతున్నాడు. తనతో పాటు మీరూ చదవండి. టెక్స్టు కాస్త ఆలస్యంగా అందడం వల్ల,, కొన్ని గంటల తేడాతో, ఈ చక్కని సమీక్షను అందిస్తున్నాం. – ‘రస్తా’ ఎడిటర్స్.

ఇదంతా ఒక urban saint monologue . ఇందులోని తనతో… తానే దూరం జరిగిపోయి… బయట ఉండలేక… మళ్ళీ తనలోపలికి రావాలనుకొని / వీసాలేక / దొడ్డిదారిలో శరణార్థిలానైనా ప్రవేశించాలనుకుంటాడు. అక్కడ కొంతకాలం వున్న తరువాత… ఉండనియ్యక మళ్ళీ అనుమతి పత్రాలు లేవని అవతలికి విసిరి పారేస్తారేమోననని భయం కూడా వుంటుంది. త లోపల తానే వొక ఏకాంత దీక్షా శిబిరం వేసుకొని పడుకోవాలనుకుంటాడు. వొక కుక్కపిల్లగానైనా ఉండిపోయి దీక్షను కొనసాగించాలనుకుంటాడు. సరిగ్గా ఏ అర్థరారాత్రి పూటనో ఎవరో లాఠీలు వూపుకుంటూ వస్తారు. పడుకున్నోన్ని పడుకున్నట్టుగానే బయటికి ఈడ్చి తన్నుకుంటూ తీసుకుపోతారు. లోపల ఎక్కువసేపు ఎవరినయినా వుండనిస్తే సమస్యలు తీవ్రమయిపోతాయి కదా. counter culture లోని monologues key ఇక్కడే వుంది. ఇప్పుడు కవిత్వంలోని key కూడా ఇదే.   
మనలోపల మనని ఉండనియ్యని శక్తులు… అనేక రకాలుగా, అనేక forms లో, అనేక black mails తో మానసిక, మార్కెట్ అత్యాచారాలతో… మనల్ని మనతో వుండనియ్యకుండా, మన తనంలోంచి ఎలాగైనా బయటికి లాగాలనే ప్రయత్నాలను చూస్తూ… ఆ శక్తులతో fist fight చేస్తూ ముష్ఠిఘాతాలు తింటూ, కనబడని దెబ్బలకు లోనవుతూ… రాసిన కవిత్వం ఇది. ఇతర అనుభవాలతో… తనవైన స్వీయానుభవాల సంఘర్షణ, రాపిడి… వాదన ఈ కవిత్వం. ఇటువంటి కవిత్వం మనకు ఎందుకు దగ్గరగా వస్తుంది? ఎందుకు లోపలికి చల్లని బాయి నీరుగా గుండెలోకి జారిపోతుంది? అనుకుంటే… ఈ కవిత్వంలోనిఅనుభవంలోని truthfulness, తీవ్రత. James Joyse గురించి రాస్తూ Borges… తన కవితలో- “what now belongs to me between dawn and dark lies the history of the world” అని సరిగ్గా ఈ కవి చెప్పుకుంటూ వస్తున్న ఇతని- లోపలి రాత్రులూ, వొంటరితనమూ, ఆరోపణలూ అన్నీ కూడా వర్తమాన చరిత్రలోని… విడదీయలేని అంశాలే. Robotic 2k, 3k రన్సే. ఏ యితర సాంస్కృతిక సృజనాత్మక వ్యవహారాలు మనిషి పక్కన మనిషి నిలబడి దోస్తానాతో, చేతిని స్పృశించినప్పుడు కలిగే ఆనందాన్ని ఇవ్వకపోవడం తెలిసివచ్చినపుడు… “మనిషి” ఎంత అత్యవసరమైన అవసరమో అనే ఎరుక వస్తుంది. ఈ కవితల్లో చేజారిపోతున్న “మన’ తన “నా” నీ గురించి omnijective పొరల్లో కుములుతూ దుఃఖ పడుతున్నాడు చాలా కవితల్లో…
ఈ “మనం” లేని, మనలోని తన్మయత్వం లేని, నగరతనం కోల్పోయిన పూర్వాధునిక గ్రామీణతను తలపోస్తున్నాడు. రోజు రోజుకీ కొత్త సంకెళ్ళు కొత్త Aps రూపాల్లో… మన మెదడు పొరలకు వచ్చి పడుతున్నాయి. ఎక్కడా ఎవరూ లేరు. తాను ఉన్నాడనుకున్న స్థలంలో తను లేడు. ఇంకేదో, ఏమో వుంది. Cultural calamity లో Technological holocaust ఒక్కడే వెతుక్కుంటున్నాడు. తనదైన తన మృత్యువుని. తనదైన తన జీవితాన్ని.
ఒక్కసారి “బతుకు మీనార్” అనే ఈ కవితని తాకితే…

ప్రాణం పోవడమే చావు కాదు, శ్వాస వుండటమే బతుకూ కాదు.
ఏది కాదో, ఏది అవునో తెల్సుకోవడానికి కాల
పరిమితి లేదు. జీవితం అంతకన్నా వుండదు.

చీకటి మాత్రమే శాశ్వతమని అనుభవం లోకి వచ్చాక
వెలుగును వెతకడంలోని సంతోషం దరిదాపులకు
చేరదు.

మిత్రులంతా సంసార సాగరాల్లో మునిగి వున్నారు.
అర్ధరాత్రి బతికేవాళ్ళకి జనాభా లెక్కల్లో
స్థానం లేదు.

నిద్ర రాకపోయినా పడుకోవాలి. లేవలేమనిపించినా
మేల్కోవాలి.
ఇవాళ్టిలాంటి అనేకానేక రేపుల్ని మొయ్యాలి.

యాలీ రెహం ఆలీ… యా ఆలీ…

ఈ కవితలో… తాను ఎరుక పరిచిన మృత్యువూ, జీవితం…తనది కానప్పుడు… మిగిలేది ఏమిటి? ఇదిగో… ఇక్కడ ఈ “Square one” కవిత్వం సారమంతా నిలిచి ఉందనిపిస్తుంది.
జీవితం మనది ఎట్లాగూ మనది కాకుండా పోతుంది. మృత్యువు కూడా కాకుండా పోతున్న దారుణ సన్నివేశంలో మనమున్నాం. ఇటువంటి మారకాన్నే Nietzsche “Failed death” అంటాడు. దీనికి meaning లేదు. అర్థ రహితమైంది కూడా ఏదీ లేదు. ఇదేదో Idealisation of suicide అనుకుంటే తప్పే. మనది కాని, మన చేతుల్లో, మన ఎన్నికలో లేని చావుని… మనం ఏ మాత్రం గౌరవించనవసరం లేదని కవిత గుర్తు చేస్తుంది.
రాత్రితనాల్లో, నిశీధి నీడల్లో సంచరించే, తన ఇచ్ఛలో తాను చావు బతుకుల్ని మోయాలనుకునే Real cultural beings కి… ఈ సమాజంలో “జమ” లేదూ… Savings account లేదూ, ఆధార్ కార్డు లేదూ… గణాంకాల గణింపు లేదూ అంటున్నాడు కవి. ఆత్మగౌరవం లేని చావును మోస్తున్న జీవితం గురించే ఈ Square one కవిత్వం. చెప్పిందే చెప్పి… చెప్పిందాన్నే… అదే పనిగా చెరిపేస్తూ తిరిగి చెబుతుంది. ఇప్పుడు నిరర్ధకంగా బతకడం ప్రశ్న కాదు. అది ఆధునిక కవిత్వంలో దూకి, మునిగీ తేలి… నానిపోయిన ప్రశ్న. ఈ ఆధునిక అనంతర హైపర్ టెక్నికల్ సమాజంలో నిరర్ధకమైన మరణమే అతి పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్ననే Square one కవిత్వం పాఠకుని ముందుకు తీసుకు వస్తుంది.

కృష్ణపక్షంలో… కృష్ణశాస్త్రి గారు “ఏను మరణించుచున్నాను”… అన్న కవితలో

ఏను మరణించుచున్నాను: ఇటు నశించు
నాకొరకు చెమ్మగిలు నయనమ్ము లేదు
పసిడి వేకువ పెండ్లిండ్ల పడిన యెవరు
కరుగ నేర్తురు జరఠాంధకార మృతికి?

నా మరణశయ్య పరచుకొన్నాను నేనె!
నేనె నాకు వీడ్కోలుపు విన్పించినాను
నేనె నాపయి వాలినా, నేనే జాలి
నెద నెద గణించినాను, రోదించినాను.

బతికియున్న మృత్యువునై ప్రవాస తిమిర
నీరవ సమాధి క్రుళ్ళి క్రుంగినపుడేని
నిను పిలిచినాన, నా మూల్గు నీడ ముసిరి
కుములునేమొ నీ గానోత్సవముల ననుచు.

ఇక్కడ వొక తలమానిక మనదగిన… పంక్తి…
బతికి ఉన్న మృత్యువు” అన్నది…

ఇటువంటి స్థితినే… Link చేస్తూ, తిరిగి సంభావిస్తూ చాలా కవితల్లో రుషి చెప్పుకొస్తున్నాడు,Square one లో. ఈ కవిత్వం… మన చుట్టూ పరుచుకొని… మనల్ని ఏం మిగలకుండా చేస్తున్న కార్పొరేట్ సమాజ కాఠిన్యాన్ని, దాని Holocaust ను Scan చేస్తుంది.
ఎంతో మామూలుగా అనిపిస్తూనే ఒక్కసారిగా అద్భుతమైన కవిత్వ పంక్తితో… మనల్ని ఆశ్చర్య పరచడం… మోహన్ కవిత్వ- గమక లక్షణం. ఇది ఎవరికి వారు అనుభవించి చదివి వింటూ తమ తమ అనుభవ పరిధులని చెరిపేసుకుంటూ ముందుకు పోవల్సిందే.
గీతాంజలి intro లో చలం గారంటారు: “కవిత్వం వినోదం కాదు. అనుభవం. మానవుడి హృదయానికి విశాలత్వాన్నిచ్చి, ఉన్నతమైన పరివర్తన కలగజెయ్యాలని ప్రయత్నిస్తుంది. ఈ విషయం అర్థం కావాలంటే… కవిత్వ రసాన్ని హృదయానుభవంగా తీసుకోగల సంస్కారం ఉండాలి అని అన్నాడు.
కవిత్వ రసం తక్కువైపోతున్న కవుల సమూహం… ముందు ఆ అనుభవంలోని జీవరసాన్ని తాగుతూ రాస్తేనే కవులుగా బతికుంటారు. లేకపోతే నీచ్షే/ రిల్కే… చలం గార్లు అన్నట్లు False death కి గురవుతూనే వుంటారు, మోహన రహితంగా-   ..
“స్క్వేర్ వన్”, ఆంథాలజీ ఆఫ్ పోయెమ్స్, వెల; 120 రూ.లు, ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, ఆర్య సమాజ్ ఎదురుగా, కాచిగూడ, హైడరాబాద్. www.telugubooks.in)

సిద్ధార్థ

ప్రముఖ కవి. హైదరాబాదులో వుంటారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.