విమర్శ – ఆత్మవిమర్శ

 

మనుషులం.

మాట్లాడుకోకుండా వుండలేం.

మూగవాళ్ళు కూడా మాట్లాడుతారు. సైగలతో, చిరు శబ్దాలతో. మాట పతనమైతే మనమూ పతనమవుతాం.

గమనించారా?! ఇద్దరు వ్యక్తులు ఒకే అభిప్రాయంతో వున్నట్లయితే; ఆ సంగతి తెలిసే కొద్దీ… ఆ యిద్దరు మాట్లాడుకోడం మానేస్తారు. ఏముంటుందిక వాళ్ళు మాట్లాడుకోడానికి? ఎంత సేపు చెప్పుకుంటారు కంకర్ కంకర్?

పూర్తి ఏకీభావం వల్ల ఏ ఇద్దరూ దగ్గర కారు. దూరమవుతారు. విభేదమే జీవన సారం. ‘Contradiction is the essence of things’ (Lenin). కాంట్రడిక్షన్ అంటే విరుద్ధాంశాల ఐక్యత. యూనిటీ అఫ్ ఆపోజిట్స్.

మన మధ్య మిగిలి పోయిన విభేదం ఒకటి వుండడం వల్లనే మనం మాట్లాడుకుంటాం. సంబంధంలో వుంటాం. అదే లేకుంటే, ఏముంటుందిక మాట్లాడుకోడానికి?

పొద్దున టిఫిన్ కి లక్డీకా పూల్ ద్వారకా కి వెళ్దామా నారాయణ్ గూడా తాజ్ కి వెళ్దామా అనే  విభేదమయినా లేకపోతే, ఇక ఏముంటుంది మీకూ నాకూ మధ్య మాట్లాడుకోడానికి?

ఉప్పు ఉప్పగా వుంటుందని, బెల్లం తియ్యగా వుంటుందని, పదును కత్తి కోస్తుందని, మల్లెపువ్వు మెత్తగా వుంటుందని మీకూ తెలుసు, నాకూ తెలుసు. ఏముంటుంది అందులో మాట్లాడుకోడానికి?

స్నానం చేశాక అండర్ వేర్ వుతికే పనిని భార్యకు వొదిలెయ్యాలని ఎవరేనా ఒకరు అనుకుంటున్నట్టయితే, ఆ మాట పరమ నీచమని ఇంకొకరు అనుకుంటున్నట్టయితే… వాళ్లిద్దరి మధ్య ఒక అగాధమైన సముద్రం వుంటుంది. మాటల స్టీమర్లెక్కి దాన్ని తరిస్తే గాని ఒకరి దగ్గరికి ఒకరు చేరలేని సముద్రం.

మాటలే లేకపోతే ఇక కుత్తుకలుత్తరించుకోడమే మిగులు. అది వెంటనే తెలియక పోవచ్చు. చాల కత్తుల కోలాటాలు సంభాషణా రాహిత్యాల అంతిమ పర్యవసానాలే. 

పొద్దున లేచినది మొదలు రాత్రి పక్క మీద సోలిపోయే వరకు… మరీ పైన చెప్పినంత పెద్దవి కాకపోయినా…  చిన్న చిన్న సముద్రాలో, కనీసం లోతైన చెరువులో వుంటున్నాయి మనుషుల మధ్య. ఒకసారి స్వచ్చ జలాశయాలు, మరో సారి వైతరణులు.

దేన్నైనా దాటవలసిందే ఒకరినొకరు చేరుకోడానికి. దాటడానికి వంతెనలు వుండాల్సిందే.

మాటలే వంతెనలు.

అందుకని మనుషులు మాట్లాడుకోవాలి. మనుషుల మధ్య ఇంకే వంతెన పడిపోయినా ఫరవాలేదు, మాటల వంతెన పడిపోతే ఎవరిని ఎవరూ చేరలేరు. ప్రతి ఒక్కరూ ఒక ఒంటరి దీవి.

‘అహం బ్రహ్మాస్మి’.  బాగుంది గాని, ‘అహా’ల మధ్య సమరంలో బాంబుల వానకు వంతెనలు కూలి పోతాయి, కాలిపోతాయి. 

‘All the bridges that you burn come back one day to haunt you…. ’ (Tracy Chapman). 

ఎందుకంటే… మాటలే నువ్వు. నీ మాటలే కాదు, ఇతర్ల మాటలు కూడా కలిసి నువ్వు. ఇతరులు లేకపోతే, నీతో నువ్వే మాట్లాడుకుంటావిక, పిచ్చెక్కి.  

ప్రొఫెసర్ గారూ, ‘డైలెక్టిక్స్’ అంటే ఏంటని అడిగారు కదూ. ఇదిగో ఇదే…  సముద్రాల మీది ఈ స్టీమర్లే, జలాశయాల మీది ఈ వంతెనలే… గతితర్కం పునాది.

మీకూ నాకూ మధ్య మాట పడి పోయిందా, మీరు నేనూ గోవిందా. మన మధ్య సంబంధం గోవిందా. మన మధ్యనున్న సంబంధమే మనం.

మాట్లాడుకోడం లేక పోతే మీ దీవి మీది, నా దీవి నాది. పేచీ లేదు. పేచీతో పాటు ప్రేమా లేదు.   

దూరంగా. బాగా దూరంగా ఒక దీవి నుంచి చూస్తే మరో దీవిలో మరొకరు ‘కనిపిస్తారు’.

అంతే, అంతకు మించి ఏమీ ‘అనిపించదు’. ఏ సంబంధం వుండదు. ఎవరి దీవిలో వాళ్ళం. బహుశా ఎవరి గొర్రెలు కాసుకుంటూ వాళ్ళం. ఎవరి మాంసం తింటూ వాళ్ళం.

ఒంటరితనం. దానికదే నరకం. అంపశయ్య. ఎదురు చూపు, ఏదో అయనం వరకు.

అంతే కాదు.

మాటల్లేకపోతే… పుట్టిన ప్రతి వాడూ సరి కొత్తగా నిప్పును కనిపెట్టాల్సి వుంటుంది. ప్రతి వాడూ ప్రతి సారీ కొత్తగా చక్రం కనిపెట్టాల్సి వుంటుంది. మనం వేరే కనిపెట్టక్కర్లేకుండా, ఎవరి నుంచో నిశ్శ్రమగా నిప్పు, చక్రం టెక్నాలజీలు దొరికి పోతే, వాటి మీద మరేదో కొత్తది కనిపెట్టొచ్చు మన శ్రమతో. నిప్పుతో వేడెక్కి నీళ్ళు ఆవిరై తిరిగే చక్రాన్నో అంత కన్న గొప్ప దాన్నో.

మనిషి నుంచి మనిషి కాగడా తీసుకుని, తరానికి ఒక మెట్టు ఎక్కుతూ రోదసిని స్పృశించవచ్చు. మనం వుంటున్న ఈ మిస్టీరియస్ మంత్ర నగరి సరిహద్దులను తాకవచ్చు ఎప్పటికైనా.  

మనుషులం మాట్లాడుకోకుండా వుండలేం. మాట్లాడుకోక పోతే ‘మనుషుల’మే కాము. పుట్టిన వాళ్ళం పుట్టినట్లే వుంటాం, వుట్ఠినే శరీరాలు పెరిగి. ఏదీ తెలుసుకోలేం.

తెలుసుకోడమంటే ఏమిటి? నిప్పులు, చక్రాలు, రైలింజన్లు మాత్రమే కాదు.

నేను చేస్తున్నది తప్పో ఒప్పో తెలుసుకోడం కూడా ఒక తెలుసుకోడమే. నిజాకిది మరింత ముఖ్యమేమో నిప్పు కన్నా చక్రం కన్నా.

మొదటిది విజ్ఞానమైతే, రెండోది వివేకం.

రెండో దెలా తెలుసుకోడం ఎవరి గదిలో వాళ్ళం లోపల్నించి తాళం వేసుక్కూర్చుంటే?

నాకు తెలుసు, మీకు మంచి మనిషిగా వుండాలని వుంది. మీకే కాదు. ఎవరికైనా అలాగే వుంటుంది.

దొంగ కూడా ‘భలే దొంగ’గా వుండాలనుకుంటాడు.

వూర్నే మీకు మీరు మంచిగా ‘వుంటే’ చాలా? చాలదు.

మీరు మంచి మనిషని ‘అనిపించుకోవాల’ని వుంటుంది.

‘అలా’ అనిపించుకుంటేనే ‘అలా’ వున్నట్టు.

ఎలా అనిపించుకుంటామో అలా వున్నట్టు.

అంతకు మించి రుజువు లేదు.

మీకు మీరే మంచివాడినని అనుకోడం రసం పిండేసిన చెరకు పిప్పి.

వొట్టి మాస్టర్బేషన్.

ఏం బాగోదు.

ఇతర్లతో ‘అలా’ అనిపించుకోవడమే మీరు ‘అలా’ వుండటానికి సార్థక్యం.

సారీ దుర్వార్త చెప్పకతప్పదు. ప్రతి మనిషీ ఒక డిపెండెంట్.

జిడ్దు కృష్ణ మూర్తి అనుకుంటా ఎక్కడో అన్నారు. దుఃఖం చాల వరకు ‘డిపెండెన్సీ’ వల్లనే అని. నిజమే. ఔనంతే. ఏం చేయలేం. అదే మనం. అందరం ‘డిపెండెంట్స్’మే.

బుద్ధుడు చెప్పాడు కోరికలే దుఃఖ మూలమని. ఏం చేయలేం. కోరికలు వొద్దనుకోవడం కూడా కోరికే. కోరికల్లేకుండా మనం లేం.

వాటిని ఆర్గనైజ్ చేసుకునే ఎకనామిక్స్ నుంచి దూరం పోలేం.

ఉదాహరణకి.. మీరు మంచి అని ‘అనిపించుకోవడం’అంటే ఏమిటి? ఒకరు, ఇద్దరు, చాల మంది మీ గురించి అలా అనడమే అనిపించుకోడం. ‘అనడం’ అంటే మాటలు. ప్రకటనలు.

మీ ఇమేజ్ అని మీరు అనుకుంటున్నదంతా చాల మందో కొద్ది మందో మీ గురించి చేసిన ప్రకటనలే. అంటే మాటలే.

సోదరా, మీరు మాటలతో నిర్మించబడ్డవారు. ఇతర్ల మాటలే మీ వ్యక్తిత్వపు సారం.

ఇదంతా స్పష్టంగానో అస్పష్టంగానో అందరికీ తెలుసు.

అందుకే, ‘మాట పడగూడద’ని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.

‘మాట పడగూడద’ని అంటే మన గురించి చెడ్డ మాట అనిపించుకోగూడదని.

మనం పని చేసే చోట కొరడాలెత్తి కొట్టే వారెవరూ లేనప్పటికీ, పని మానేసి కబుర్లలో పడం. ఎందుకు? సహ పనివాళ్ళ నుంచి మాట పడడం ఇష్టం లేక. (సహ పని వాళ్ళూ మెచ్చుకుంటారనుకుంటే పని మానడం ఏమిటి, సమ్మేలే చేస్తాం. పస్తులతో మరణమైనా వెనుదీయక 🙂 )

పేద వాళ్ళం కావడం వల్ల ఇంట్లో అమ్మకు పని నుంచి తీరిక లేక మనకు ఏ సంస్కారం ఇవ్వకపోయినా… ఆమె ఒక సంస్కారాన్ని మాత్రం నేర్పిస్తుంది. పదే పదే చెబుతుంది. ప్రతి పనిలో ‘ఎవురన్న ఏమన్న అనుకుంటారేమో సూస్కో రా’ అనే మెలకువ. టాయిలెట్ ట్రెయినింగ్ లాగా తప్పక దొరికే ట్రెయినింగ్ ఇది.

జీవితాంతం వొదలదు ఈ మెలకువ.

బట్టలు సరిగ్గా వేసుకోకుండా బజారులో తిరగం. మనకేదో ఇబ్బందయ్యి కాదు. ‘ఎవురన్నా ఏమన్న అనుకుంటారేమో’ అని. ఊళ్లో భార్య పక్కన బజారులో నడుస్తూ గాలికెగిరే ఆమె ముంగురులను సవరించాలని ప్రేమ పుట్టినా చెయ్యిని ఎత్తి ఆమె తల మీదికి తీసుకెళ్లి కురులు సవరించం, పల్లెటూళ్లో ‘’ఎవురన్నా ఏమన్న అనుకుంటారేమో’’ అని.

‘ఇతరుడు’ మనకేం లెక్కలేదని ప్రగల్భాలు. సర్సరే లెండి. ఇతరుల మాట మనకు చాల ముఖ్యం. మన మాట ఇతరులకు చాల ముఖ్యం.

చివర్లో ఏవో వెర్రి తలలు వేసిందని అంటారు గాని, చైనా లో సాంస్కృతిక విప్లవం (‘కల్చరల్ రెవొల్యూషన్) అనేది చాల ముఖ్యమైన చారిత్రక ఘటన. దాని ఇనీషియేటర్ మావో జెడాంగ్ చేసిన గొప్ప వూహ ఇది. మరి దేని కన్న ఎక్కువగా ఈ ఘటన కోసమే… మావోను, ఆ కమ్యూనిస్ట్ పార్టీని ప్రేమించాలి.

పీర్ విమర్శ, మొహమాటం లేని సమానిక బహిరంగ…. విమర్శ- ఆత్మవిమర్శ అనేది ఒక గొప్ప ప్రక్రియ. అద్భుతమైన పనిముట్టు.

దానిలో వున్నది కేవలం మాటలే. ఆ మాటలు కత్తులు కటార్ల కన్న పదునైనవి. యుద్ధాల కన్న ఎక్కువ ఎపెక్టివ్. 

మంచిగా వుండు, ఇది మంచి; చెడుగా వుండకు, ఇది చెడ్డది… అని వీధులకెక్కి.. వర్చువల్ వీధులకెక్కి కూడా… చెప్పడం ఒక భౌతిక పోరాటమే.

యెప్, ఇది కూడా ఒక వర్గ పోరాటమే.

అసలు ఏది వర్గ పోరాటమో ఏది కాదో, ఏది ఆ పేరుతో సాగుతున్న పనికి మాలిన హింసయో, రాముడు దేవుడో కేవలం వర్ణాశ్రమ ధర్మం ఆదిమ గూండాయో, ఏసు క్రీస్తు ఎక్కిన శిలువకు వాటికన్ వైభోగాలకు ఎందుకు సంబంధం లేదో, సౌదీలో వుండే మత సౌకర్యాలు ఆ విశ్వాసులకు ఇండియాలో వుండాలనడం అక్కడి ఇక్కడి స్త్రీలకూ, పేదలకెలా హింసాత్మకమో…

ఇవి తేలడం ఎలా?

అవి తేలాల్సింది కూడా మాటలతోనే. బహిరంగ విమర్శ-ఆత్మవిమర్శ తోనే.

మాట్లాడ్డానికి భయపడొద్దు. సందేహించొద్దు. ప్రలోభించ వొద్దు, అనగా తగిన బేరం కోసం ఎదురు చూడొద్దు.

మీ మాటలతో దొరగాళ్ళ పాద పీఠాల్ని తుడవొద్దు.

పాదపీఠాల స్వీపర్లు కూడా మనుషులే. వాళ్ళతో కూడా మాట్లాడవలిసిందే.

మాటను మాత్రం మానెయ్యొద్దు ఎవరితోనూ, ఎప్పుడూ.

ఈ పలకా బలపాలూ; ఈ కాగితం కలాలూ; ఈ అచ్చు యంత్రాలు; తంత్రీ నిస్తంత్రీ సాధనాలు; ఇ మెయిళ్లూ బ్లాగులూ; ఫేస్బుక్కులూ ట్విట్టర్లూ; కథలూ కవిత్వాలూ; సుస్వనాలూ గావుకేకలూ; వ్యంగ్యాలూ ఏడుపులూ; వార్తలూ వదంతులూ… అన్నీ…

ఎక్కడా లేని వాగ్దేవి, ఆరకల్, మ్యూజ్, బాబెల్ గోపురం పడిపోతే వరమై వొచ్చిన నిఘంటువు…

మాటకు మరణం లేదు గాని, ‘మన’ మధ్య వంతెనలు కూలిపోయినప్పుడంతా వున్న చేతులన్నిటితో, మనకున్న టెక్నాలజీ అంతటినీ ఖర్చు పెట్టి కొత్త బ్రిడ్జీలు కడదాం.

మాటల వంతెనలకు అడ్డం వొచ్చే ఏ గోడలనైనా, గొడవలనైనా తొలగిద్దాం.

ఒకరేమైనా తప్పు చేస్తున్నారా, అయితే నిర్మొహమాటంగా చెప్పండి. మీరేమైనా తప్పు చేస్తున్నారా, వాళ్ళను భయపడకుండా చెప్పనివ్వండి.

విమర్శ- ఆత్మవిమర్శ నిరంతరాయంగా కొనసాగాలి, అందులో భాగంగా మాత్రమే ప్రొఫెసర్లు పేడతట్టలెత్తడం, పేడతట్టలెత్తే రైతులు కాలజ్ఞానం చెప్పడం మంచిగనిపిస్తాయి. ఈ అత్యవసర పరిణామాన్ని అడ్డుకునే…. ….

 

రాజ్యం రూపంలో వున్న ఫాసిజం నశించాలి.

సమాజధర్మం రూపంలో వున్న ఫాసిజం నశించాలి.

వాణిజ్యవంచన రూపంలో వున్న ఫాసిజం నశించాలి.

వివా లా డైలాగ్. వర్ధిల్లాలి డైలెక్టిక్స్.   

 

28-7-2018

హెచ్చార్కె

6 comments

  • మాటల తూటాలకు అనవసరంగా అడ్డుపెట్టకూడదు. అదీ సారాంశం. అంతేనా?

  • Lenin said, “Dialectics in the proper sense is the study of contradiction in the very essence of objects.”
    ‘Contradiction is the essence of things’ (Lenin) HRK Quoted

  • మన దేశంలో మాట్లాడే హక్కు ను ప్రోత్సహించడం చాలా తక్కువే అయినా 2014 నుంచి మరీ కొట్టోచ్చినట్టు కనబడుతుంది

  • నిజానికి మాటలాడడం ఎంత అవసరమో , సరైన సందర్భంలో మాట్లాడకపోవడము కూడా అవసరమేనా , ఏది ఏమైనా మాట చాలా విలువైనది , మీ ఈ ఆర్టికల్ లాగా

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.