సాహిత్యం సమాజ సమస్యల్ని ప్రతిబింబించినప్పుడే ఎక్కువగా ప్రజలకు చేరుతుంది. కథారచన, నవల, నాటకం ఈ మూడు ప్రక్రియలు సాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువచేస్తాయి. నాటక రచన నవలా రచనకన్న సంక్లిష్టమైనది. నవలారచయితకు పరిథి చాలా ఎక్కువ. నాటక రచయిత తక్కువ సమయంలో అదేజీవితాన్ని, సంఘర్షణాత్మకమైన పాత్రలను ప్రేక్షకుల కనులముందు ఆవిష్కరింప చేస్తాడు.
ప్రపంచవ్యాప్తంగా అనేకమంది నాటకరచయితలు జన్మించారు. పాశ్చాత్య సాహిత్యంలో నాటకరచన అనగానే షేక్స్పియర్ గుర్తొస్తాడు. మానవ జీవితంలోని ఆనందాన్ని, బాధని,ఆవేదనని, అసూయని, అంతర్జ్వలనాన్ని అద్భుతంగా తన పాత్రలలో ప్రతిష్టించాడు. అంత గొప్పగా నాటకాల్ని ఆవిష్కరించిన మహా రచయితలు మనకు వేరే ఎవరూ కనిపించరు.
షేక్స్పియర్ తర్వాత అంతటి ఖ్యాతి పొందిన వాడు నాటక రచనలో ఆధునికతను తీసుకొచ్చిన వాడు, నార్వే నాటక రచయిత, కవి హెన్రిక్ ఇబ్సెన్ . యురోపియన్ నాటకరంగం అతి కఠినమైన నైతిక విలువలను సమాజ పరంగా నిర్మిస్తున్న కాలంలో ఆ విలువల ముసుగుల వెనక దాగిన రహస్యాలను బయట పెట్టే ప్రయత్నం చేశాడు. వాస్తవికవాద పితామహుడిగా గొప్ప పేరు గడించి తన రచనలతో సంచలనం సృష్టించడమే కాకుండా జార్జ్ బెర్నార్డ్ షా, ఆస్కార్ వైల్డ్ , డీ హెచ్ లారెన్స్, యుజీన్ ఓ నీల్, జేమ్స్ జాయిస్ వంటి రచయితలనుకూడా ప్రభావితం చేశాడు. ‘బ్రాండ్స్’ , ‘ఏన్ ఎనిమీ ఆఫ్ ద పీపుల్’, ‘ఎ డాల్స్ హౌస్’ , ‘హెడాగాబ్లర్’ , ‘గోస్ట్స్’ , ‘పిల్లర్స్ ఆఫ్ సొసైటీ’ వంటి నాటక రచనలను చేసిన మహా రచయిత. నాటక రచనను కేవలం వినోదప్రధానమైనదిగా కాక ఒక కళగా ఆవిష్కరింపచేసిన ఘనత ఇబ్సెన్ కే దక్కుతుంది.
ఇబ్సెన్ చాలా సంపన్న కుటుంబంలో పుట్టినా తండ్రి ఆస్తిని కోల్పోవడంతో దుర్భరమైన పేదరికాన్ని అనుభవించాడు. ప్రారంభ కాలంలో అంత విజయవంతం కాకపోయినప్పటికీ నార్వే నాటక సమాజంలో ఆయన రచయితగా నిర్మాతగా దర్శకుడిగా పొందిన అనుభవం ఆయనని గొప్ప నాటక రచయితను చేసింది. తన వర్తమాన సమాజంలో చాలావిమర్శలకు గురి అయినా తరువాతి కాలంలో చాలా ఖ్యాతిని ఆర్జించాడు.
ఇబ్సెన్ నాటక రచన చాలా కవితాత్మకంగా సాగుతుంది. ఇబ్సెన్ నాటకాలలోని పాత్రలు తన తల్లిదండ్రులను పోలివుంటాయి. ఆర్థిక ఇబ్బందులు, సమాజంలోని చీకటి రహస్యాలు పాత్రలతో పెనవేసుకుపోయి వాస్తవికమైన నాటకాన్ని ప్రదర్శింప చేస్తాయి. ఇబ్సన్ నాటకాలలో స్త్రీల సంఘర్షణని ఆసక్తికరంగా ఆవిష్కరిస్తాడు. స్త్రీల బాధల పట్ల సానుభూతిని ప్రదర్శిస్తాడు. అతని చేతిలో వ్యంగ్యం ఒక కొరడాలా సమాజాన్ని వణికిస్తుంది.
ఈయన నాటక రచనా ప్రక్రియని తిరగరాశాడు. ఊహ పోహలకు సంబంధించిన విషయాలను పక్కనపెట్టి తార్కికంగా వాస్తవ వాదంతో సమస్యలను, విషయాలను చర్చించాడు. చెహోవ్ , జేమ్స్ జాయ్స్ వంటి రచయితలకు మార్గదర్శకుడయ్యాడు
నిజానికి ‘స్త్రీ పురుషులు ఎలా ఉండాలి’ అనేది అవసరం లేని ప్రశ్న కానీ ‘స్త్రీలలా ఉండాలి’,
‘ఇలా మాట్లాడాలి’, ‘ఇలా ఉండకూడదు’, ‘ఇలా ప్రవర్తించాలి’, ‘ఇలా ప్రవర్తించకూడదు’ అనేవి పురుషాహంకార సమాజం స్త్రీని ఒక చట్రంలో ఇరికించేందుకు చేసిన కుట్ర . ఇలాంటి చట్రంలో ఇమడని వ్యక్తిత్వం గల స్త్రీలను అరాచక శక్తులుగా విచ్చలవిడితనం గలవారిగా సమాజం ముద్ర వేస్తుంది. అలా నిస్సహాయంగా ఇమిడే వారిని దేవతలుగా ఇమడని వారిని దెయ్యాలుగా చిత్రీకరిస్తుంది. ఇలాంటి భావజాలాన్ని ఖండిస్తూ స్త్రీ స్వేచ్ఛను సమర్థిస్తూ ఇబ్సెన్ కుటుంబపరంగా, సంఘ పరంగా, ఆర్థికంగా, సంస్కృతిపరంగా, మానసికంగా, భౌతికంగా ఎదుర్కొనే అశాంతిని చిత్రీకరిస్తాడు.
ఆయన నాటకాలలో స్త్రీ పాత్రలు ఎంత శక్తివంతమైన మంటే పురుష పాత్రలను చిన్న బుచ్చి స్వతంత్రంగా, మేధోవంతంగా బ్రతికే, నడిచే శక్తి కలిగి ఉంటాయి. ఒకోసారి సమాజం అభ్యంతరకరమని భావించే మానసిక శారీరక ఉద్వేగాలను, శారీరక వాంఛలను సైతం ధైర్యంగా తెలియజేస్తాయి.
‘డాల్స్ హౌస్’ నాటకంలోని నోరా, ‘గోస్ట్స్’ నాటకంలోని మిసెస్ ఆల్వింగ్, ‘హెడా గాబ్లర్’ నాటకంలోని హెడా వారి నిర్ణయాలతో మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తారు. అలాగని సాధారణ సమాజంలో మామూలు స్త్రీలు ఇబ్సెన్ నాటకాలలో లేకపోలేదు.
ఈయన కీర్క్ గార్డ్ ని పూర్తిగా చదవకపోయినా ఈయన నాటకాలపై అతని ప్రభావం ఉంటుంది. ‘బ్రాండ్స్’ నాటకం విజయవంతం అయిన తర్వాత ఇబ్సన్ మరింత ధైర్యంగా నాటకరచన కొనసాగించాడు. తన స్వీయ అనుభవాల నుంచి వచ్చిన ఆలోచనలను ప్రాతిపదికగా ఆలోచనాత్మకమైన నాటకాలను రచించాడు. సమాజంలోని కుహనా విలువల మీద, వైవాహిక బంధాల లోని ముసుగుల మీద చాలా విమర్శనాత్మక రచనలు చేశాడు. ‘ద పిల్లర్స్ ఆఫ్ సొసైటీ’, ‘గోస్ట్స్’ వంటి నాటకాలు ఈయన ఆలోచనా విధానాన్ని, రచనా శైలికి అద్దం పడతాయి. ‘యాన్ ఎనిమీ ఆఫ్ ద పీపుల్’ అనే నాటకంలో సమాజానికి మంచి చేయాలన్న ఒక వైద్యుడి తపనను సమాజం ఎలా అపార్థం చేసు కుంటుందనే విషయాన్ని చూపిస్తాడు. ‘గోస్ట్స్’ అనే నాటకంలో అనైతిక ప్రవర్తన సిఫిలిస్ లాంటి సుఖ వ్యాధిలా ఎలా వ్యాపిస్తుంది అనేదాన్ని గురించి చర్చిస్తాడు. సమాజం లోని సమస్యలను అద్దంపట్టేలా ‘ప్రాబ్లం ప్లే’ అనే నాటక ప్రక్రియను రూపకల్పన చేశాడు.
అలాంటి సమస్యాత్మక ఇతివృత్తంతో నడిచే ఒక నాటకం ‘ఎ డాల్స్ హౌస్’. తన కుటుంబం కోసం భర్త కోసం కష్టపడి జీవితాన్ని త్యాగం చేసే మహిళ కథ ఇది. ఎంతో ప్రాణాధికంగా ప్రేమించిన భర్త తనను అర్ధంచేసుకోలేకపోవదాన్ని నిరసిస్తూ పురుషాధిక్య సమాజంలో తన అస్తిత్వాన్ని కోల్పోయిన ఒక గృహిణి ఎలాంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకుంటుందో తెలియజేస్తుంది ఈ నాటకం.
‘డాల్స్ హౌస్’ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ప్రదర్శింపబడింది. మూడు ముఖ్య పాత్రల చుట్టూ తిరిగే ఈ నాటకం చాలా ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. కొత్తగా బ్యాంక్ మేనేజర్ గా బదిలీ అయిన టోర్ వాల్డ్ హెల్మర్ తన భార్య నోరా ఉత్త అమాయకురాలని ఏమీ చాతకానిదని నమ్ముతాడు. నోరా కూడా అలాగే ఒక చిన్న పిల్ల లాగా ఒక బొమ్మల కొలువులో బొమ్మలాగా ఆడుతూ పాడుతూ ఉంటుంది. అయితే అకస్మాత్తుగా టోర్ వాల్డ్ జబ్బుపడి డబ్బు కావలసినప్పుడు నోరా తన భర్తకు తెలియకుండా అతని బ్యాంక్ నుంచి డబ్బు తెచ్చి కాపాడుతుంది. ఆ డబ్బు గురించి ఆరా తీసినప్పుడు తన తండ్రి నుంచి ఆ డబ్బు అందిందని చెబుతుంది.
అయితే తన ఇంటికి ఖర్చులు తగ్గించుచుకుని తిరిగి చెల్లించాలని ప్రయత్నం చేస్తుంది. అయితే తన జబ్బు తగ్గాక తన బ్యాంకు ఉద్యోగి క్రోగ్ స్టాగ్ మోసం చేసి తీసుకున్నాడని అతని శిక్షించడానికి పూనుకుంటాడు టోర్వాల్డ్. అయితే నోరా తన తండ్రి దొంగ సంతకంతో డబ్బు తెచ్చిన విషయాన్ని క్రోగ్ స్టాగ్ బయటపెడతాడు.
టోర్ వాల్డ్ భార్య ఎంత చెబుతున్నా సరే వినకుండా వెళ్ళగొడతాడు. తన ఇంట్లో విలువలు లేని మనుషులు ఉండకూడదని కేకలు వేస్తాడు. పాపం అమాయకురాలైన నోరా ఆత్మ హత్య చేసుకోవాలా లేక తన భర్త క్షమిస్తాడా అని వేచి చూస్తూఉంటుంది. తరువాత తన తప్పు తెలుసుకుని టోర్ వల్డ్ క్షమించానన్నప్పటికీ తాను ఏ పాటకైనా ఆడే బొమ్మను కాదని చెప్పి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. ఒక భార్యగా, తల్లిగా ఎంతో ప్రేమను పంచినా విలువ లేదని గ్రహించి అప్పటి సాంప్రదాయ ప్రమాణాలకు విరుద్ధంగా తనను తాను అన్వేషణలో నిలుపుకునేందుకు నోరా ఇల్లు విడిచి వెళ్లి పోవడం ఒక పెద్ద సంచలనమే అయింది. ఇబ్సెన్ నోరాకు సమాజం నిరాకరించిన అన్ని హక్కులను ఇస్తాడు. స్త్రీని పురుషుని సేవకురాలిగా,బానిసగా కాక ఒక స్వతంత్ర శక్తిగా చూస్తాడు. స్కాండినేవియన్ సమాజాన్ని ఈ నాటకం ఎంతో ప్రభావితం చేసింది.
జేమ్స్ జాయిస్ ఇబ్సెన్ స్త్రీ పాత్రల గురించి ప్రస్తావిస్తూ ‘ఇతని స్త్రీ పాత్రల ద్వారా ఈయనకు మానవత్వమంటే ఎంత తెలుసో అర్ధంచేసుకోవచ్చు. వారి పాత్రల గురించి వారికంటే ఇబ్సెన్ కే ఎక్కువ తెలుసు. చాలా బాధాకరమైన ఆయన ఆత్మ సంశోధన ఈ పాత్రల ద్వారా బహిర్గతమౌతుంది.’ అంటాడు.
‘డాల్స్ హౌస్’ నాటకం లో చివర వ్యాఖ్యలలో వ్రాస్తూ, ‘స్త్రీని కేవలం ఒక మాతృత్వాన్ని పొందే వ్యక్తిలాగా, జాతిని పెంచి పోషించే జీవి’ లాగా చూడకూడదంటాడు ఇబ్సెన్. స్త్రీల మనోభావాల నర్ధంచేసి కోవలసిన అవసరాన్ని తెలియచేస్తాడు. హెడా గాబ్లర్ కూడా ఇలాటి భావననే తెలియచేస్తుంది. కేవలము మాతృత్వం ద్వారానే కాక ఒక స్త్రీ సహజంగా పంచగల ప్రేమను లాలిత్యాన్ని గుర్తించాలని కోరుకుంటుంది. ‘వెన్ వుయ్ డేడ్ ఎవేకెన్’ నాటకంలో నిస్సంతు అయిన వనితా కళా సృజన ద్వారా మాతృత్వపు ఆనందాన్ని ఎలా పొందుతుందో చెప్తాడు.
ఇబ్సెన్ ప్రజలు చాలా గాఢంగా నమ్మిన భావాల్ని సవాలు చేస్తూ వచ్చాడు. ఈనాటికీ ఇబ్సెన్ నాటకాలు, పాత్రలు నిలబడడానికి కారణం శక్తివంతమైన, మానసికంగా దృఢమైన స్త్రీ పాత్రలను చిత్రీకరించడమే. స్త్రీలు పురుషుల కన్నా తక్కువ కాదని పితృస్వామ్య సమాజం వారిని అలా అణగ తొక్కిందని చెప్తాడు. ‘స్త్రీల హక్కులను ఉల్లంఘించడం అంటే మానవతావాద హక్కులను ఉల్లంఘించడమేన’ని చెబుతాడు. స్కాండినేవియన్ బూర్జువా సమాజంలో స్త్రీల పక్షాన నిలచి సమాజాన్ని సవాలు చేసే స్వతంత్ర స్త్రీ పాత్రల ద్వారా ఇబ్సెన్ నాటక సాహిత్యంలో ఒక చరిత్ర సృష్టించాడు.
వ్యాసం చాలా బాగుంది. గురజాడ మీద ఇబ్సన్ నాటకాల ప్రభావం ఉంది. కన్యాశుల్కం నాటకం నాంది-ప్రస్తావన(సంస్కృతం)లో ఇబ్సన్ ను గురజాడ చదివినట్టు చెప్పేరు.
ధన్యవాదాలు సర్