రెపెల్ చేయకుండా షాక్ చేసే ‘ఆమె’ కవిత్వం!

బతుకు మరీ పుచ్చిపోయినప్పుడు, ప్రజా క్షేమం ఎవడికీ పట్టనప్పుడు.. అప్పుడు కూడా కవులూ కథకులూ ఊహా ప్రేయసి బుగ్గ సొట్టల  గురించో, తమ మానాన తాము ఎక్కడికో పోతున్న పిట్టల గురించో కొంగ్రొత్త వూహలకై ప్రయాస పడుతున్నప్పుడు… ఆ నిద్దర నుంచి లేపడానికి జనాల్ని కాస్త షాక్ చేయాల్సి వుంటుంది. అప్పటి వరకు మొహమాటానికి పోయి బహిరంగంగా మాట్లాడని మాటలెన్నో మాట్లాడాల్సి వుంటుంది. వాళ్ళు నిద్దర వొదిలి వినేలా చేయడానికి అది అవసరం.  అలాంటి అవసర సమయాల్లో పుట్టుకొస్తాడు ఒక దిగంబర కవి లేదా ఇపుడు నేను మాట్లాడబోతున్న అన్వీక్ష నీలం వంటి నిర్మొహమాటి.

ఈ కవి నాకు తెలీదు. పేరును బట్టి అమ్మాయి అనుకుంటున్నా. ఫొటో గట్రా లేదు. బయో కూడా ఇవ్వడం లేదు. అమ్మాయో అబ్బాయో నాకు తెలీదు. నా వరకు తన కవిత్వమే తన బయో అనుకోడం బాగుంది. నేను వ్యాఖ్యానిస్తున్న మూడు కవితలూ ఫేస్ బుక్ లో కవి పేజీలో వున్నాయి.

***  

అశ్లీలం లేదా బూతు కవిత్వమా కాదా అనేది ఒక ఆత్యాధునిక అతి పురాతన చర్చ. ఒక వాక్యం మనసు మీద వేసే ప్రభావమే దానికి  కొలమానం. దిగంబర కవులు తమ కాలంలోని కుళ్ళును మనకు తిట్టి, కొట్టి చెప్పడానికి అశ్లీల పదాల్ని విరివిగా వుపయోగించి ‘షాక్’ చేశారు. స్త్రీలను, నపుంసకులను, మాచకమ్మలను, కుష్టురోగులను, సెక్స్ యాక్ట్ ని… నీచ పరిచే రూపకాలు నిర్విచక్షణగా వాడుతున్నామనే స్పృహ లేకుండా రాశారు. నిజానికి దిగంబర కవిత్వంలో గొప్ప ఎక్స్ప్రెషన్స్ వున్నాయి, ఎవరినీ అవమానించనివి. కాని, అశ్లీలం, బూతు మాటలకే దిగంబర కవిత్వం ప్రసిద్ధమయిపోయింది. ‘షాక్’ కు వున్న శక్తి అది. మనల్ని షాక్ చేసిన దాన్ని సాధారణంగా మరిచిపోం.

షాక్ చేయడం ద్వారా పాఠకులను ఆకట్టుకోడం సాహిత్యం ఎప్పటి నుంచో చేస్తున్నదే. ఆ ప్రయత్నం… షాక్ సంగతేమో గాని, పఠితను రెపెల్ చేస్తుందొక్కో సారి. మొదటికి మోసం తెస్తుంది. అది కాసేపు మన లోని లంపెన్ ఆసక్తుల్ని, సో కాల్డ్ బేసిక్ ఇన్స్టింక్స్  ని మేల్కొల్ప వచ్చు. ఆ చక్కిలిగింతలు బాగున్నాయని అనిపించొచ్చు. ఆ రకం మాటలు కవినీ, కవితనీ తేలిక చేస్తాయి. పాఠకుడు కాసేపు వినోదించి ఒక మెచ్చుకోలు పావలా పారేసి వెళ్తాడు కవి గారి బొచ్చెలో.

పలుచన కాకుండా, షాక్ చేస్తుంది అన్వీక్ష నీలం కవిత్వ్వం.

ఆ పని ఒకప్పుడు వేమన చేశాడు.

‘పుత్తడి గలవాని పుష్ట్రంబు పుండైన
వసుధలోన చాల వార్త కెక్కు
పేదవాని ఇంట పెండ్లైన నెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ’

ఇందులో పుష్ట్రము అంటే ముడ్డి. ఆ మాటతో గుర్తొచ్చేది యాస్ కి అచ్చ తెలుగు పదమే. ఆ అచ్చతెనుగు పదం గుర్తుకు రావాలన్నదే వేమన కవి హృదయం, ఆ స్ఫురణ లోని షాక్ వుద్దేశ్యపూర్వకం.

ఫక్ అనే ఇంగ్లీషులో మాటను చదివి  ఏ ఇంగ్లీషు  వాడూ షాక్ కాడు, మనమూ కాము. ఫకాఫ్ వంటి మాటకు అసలే షాక్ కాము. దాన్ని తెలుగు చేసి, ‘దెం..’ అంటే దాని చిరునామాదారులే కాదు ఇతరులు కూడా ముందు షాక్ అయ్యి తరువాత  రెపెల్ అవుతారు. ఇంగ్లోషోళ్లు వాళ్ళ భాషలో అన్నారు కదా అని అదే మాట మనం తెలుగులో అంటే… …అది మంచి కల్చరల్ ట్రాన్స్లేషన్ అవదు. తెలుగు వాళ్ళకు ‘వినబుద్ధి’ కాదు.

మొహమాటం లేకుండా మాట్లాడి, తగినంతగా షాక్ చేసి…… ఇది తప్పు అది ఒప్పు అని బలంగా చెప్పడం వేరు. రెపెల్ చేసి పఠితను దూరం చేసుకోడం వేరు.

అన్వీక్ష నీలం… ఇటీవల తమ ఫేస్ బుక్  పేజీలో… మొహమాటం లేని ఎక్స్ ప్రెషన్స్ తో షాక్ చేస్తున్నారు. రెపెల్ చేయకుండా పాఠకులను తమతో తీసుకెళ్తున్నారు. దానికి అనుసరిస్తున్న పద్ధతికి నేను పెడుతున్న పేరు ‘రెపెల్ చేయని షాక్’. తీవ్ర మానసిక జబ్బులకు షాక్ ట్రీట్మెంటిస్తారు, సంయమనంతో. షాక్ అంతిమ ధ్యేయం రెపెల్ చేయడం కాదు.

ఈ రచయిత ఇంగ్లీషు, సంస్కృత పదాలతో… వజైనా, బూబ్స్ వంటి శరీరావయాలకు.. నిత్య జీవితంలో బహిరంగ సంభాషణకు అందరం వుపయోగించే పదాలను వుపయోగించి… మంచి ఎఫెక్ట్ సాధిస్తున్నారు. ఫీల్ అయ్యేట్తు, ఆలోచించేట్టు చేస్తున్నారు.  వాటికి తెలుగు మాటలు వాడితే, మనలోని లంపెన్ బేసిక్ ఇన్స్టింక్ట్స్ ‘మేల్కొని’ మనసు కవితాంశం నుంచి పక్కదారి పట్టడం వినా ప్రయోజనం వుండదు.

తను చేపట్టిన వస్తువు మీద పూర్తి అవగాహన వుండడం + కొత్తగా/విచిత్రంగా చెప్పడం + నిర్మొహమాటం.. ఈ రచయిత క్రోధానికి కవితాగ్నిని సమకూర్చుతున్నాయి.

రచయిత తమ కోసం తాము ఒక గొంతు తయారు చేసుకోడానికి అనుసరించిన ఈ మిశ్రమ పద్ధతి నేడు రాస్తున్న కవులు గమనించదగినదనిపించి… ఈ సారి  ‘భళా భళి’ అని మెచ్చుకోడానికి  అన్వీక్ష నీలం కవిత్వాన్ని ఎంచుకున్నాను. .  

నేను ఎట్ ర్యాండమ్ ఎంపిక చేసిన మూడింటిలో మొదటి కవితనే చూడండి: స్త్రీలపై అత్యాచారాలకు మగవాడి లోని బయొలాజికల్ మృగం కారణమే గాని, మృగం ఒక్కటే కారణం కాదు. వాడి చుట్టూ, వాడిలోనూ వున్న సమాజం మరింత ఎక్కువ కారణం. వాడిలోని మృగత్వం అమ్మ పొట్టలో వున్నప్పుడే వుండదు, పుట్టిన తరువాత వాడి చుట్టు వున్న సంస్కృతి (కల్చర్) వాడిని వాడుగా తయారు చేస్తోంది.

ఆ తయారీ ఎలా జరుగుతుందో అందరికి తెలిసేలా తేటగా, ఆవిష్కరణ స్థాయిలో కొత్తగా చెప్పింది ‘బీప్ బీప్..’ కవిత. కొలతలు… అవయవాలకు కొలతలు. ఒకప్పుడు చైనాలో ఆడపిల్లల పాదాలు ఎక్కువగా పెరగకుండా, చిన్న వయసులో ఎంత వున్నాయో అంతే వుండేలా, గట్టి పాదరక్షలతో బంధించి వుంచే వారు. ఇప్పుడు ‘వజైనా’ చిన్నదిగా వుండేలా, ‘బూబ్స్’ ఒక పరిమాణంలో వుండేలా, ఇంకా ‘హిప్స్’ తదితర అవయవాలకు కూడా స్టాండర్డ్ కొలతలు, అందుకోసం అలోపతీ ఆయుర్వేద ‘వైద్యా’లు. అవి ఆరోగ్యం కోసం, ఆయువు పెరుగుదల కోసమైతే.. అది ఎప్పుడూ జరిగేదే.. ఎవరూ ఏమీ అనరు. ఈ కొలతలెందుకంటే, మగ భోగానికి, ఆడపిల్ల తనను తాను భోగ్య వస్తువుగా చేసుకోడానికి. అందుకోసం ఆమె కొత్త కొత్త వస్తువుల ‘కొనాలి’. ఆదర్శ కన్సూమర్ అయిపోవాలి.

ఇందులో వున్నది కేవలం ఫ్యూడల్ మగ దురహంకారామే కాదు, క్యాపిటలిస్ట్ లాభం, కన్సూమరిజం కూడా. ఈమాటను రచయిత కొద్దికొద్దిగా.. ఏవో ‘డిజైన్లు’, ‘గ్రాఫుల’ వంటి… హాస్య స్ఫోరక పదాలతో మొదలెట్టి.. ఈ సంస్కృతి కారణంగానే….  సీత అయితేనేం, ఫాతిమా అయితేనే, పసివాళ్ళయితేనేం, ముసలాళ్ళయితేనేం ఏ స్త్రీకి రక్షణ లేకుండ పోయిందంటూ పాఠక మనస్సును జాగర్తగా ముందుకు తీసుకెళ్లి…

ఆడ పిల్లలకే కాదు
ఆడ పిండాలకీ రక్షణ లేదు’

అనే మాటతో షాక్ చేసి, ఇక అక్కడ వొదిలేసి వెళ్తారు. ఎలా మరిచిపోతారు మీరిక, అసిఫా పాప వంటి పసిపాపలను బలి తీసుకుంటున్న ఫ్యూడల్, క్యాపిటలిస్ట్ మిశ్రమ  ‘సంస్కృతి’ని, ఇందులో పాత్రధారులైన పుండాకోర్లను, వాళ్ళ లజ్జారహిత క్యాన్నిబాల్ వూరేగింపులను.

రేపులు, రేపుల్లా కననిపించని లైంగిక దోపిడీలే కాదు స్త్రీలను పీడించేవి. సాంప్రదాయిక సంసారాల్లో బహిరంగంగా, కొత్త ‘ప్రజాస్వాముల’ ఇళ్ళల్లో కనిపించకుండా జరిగే శ్రమ దోపిడీ.. నిజానికదే… అత్యాచారాల వంటి హింసల వెనుక ప్రోద్బలం.

‘ఆమె’ కొందరు కవులకు కేవలం ఒక అందగత్తె, లేదా మగ యవ్వన కాంక్షా గురి. అంతే. కాని ‘ఆమె’ పని చేస్తుంది. తన గురించి తన ఆకాంక్షల గురించి ఆలోచించుకోలేనంతగా పని చేస్తూ వుంటుంది. గిన్నెలు తోముతుంది. అన్నం వొండుతుంటుంది. ఇల్లు కసవులూడ్చుతూ వుంటుంది. పిల్లల్ని కంటూ వుంటుంది. పాలిచ్చి పెంచుతూ వుంటుంది.

ఆకాశంలో పిట్టల మనస్సు నీకు తెలిసిపోయినట్టు ఏదేదో రొమాంటిక్ వూహలు చేస్తావే, అలాగే ‘ఆమె’ గురించి కూడా చేస్తావు వూహలు. అవి చదివే తీరికే కాదు, అసలు కవిత్వాలు చదివే తీరికే ఆమెకు లేదు. ఇదే ఆవేదనను అన్వీక్ష నీలం చాల కొత్తగా హృద్యంగా చెప్పారు. ఆమె కోసం రాసిన పద్య శ్రోతలలో ‘ఆమె లేని’ స్థితిని మనసుకు తాకేలా చెప్పారు.

కవులను చాల సందర్భాల్లో బాధ పెట్టే ప్రశ్న. తాము ఎవరి గురించి రాస్తున్నామో,  అది వాళ్ళకు చేరదు కదా అని. ఈ ప్రెడికమెంటుని అన్వీక్ష నీలం వాడుకున్న తీరు అద్భుతం.

నేను ఎంపిక చేసుకున్న మూడో పద్యం ‘ఆమె’ విశ్వరూపం. మనకు తెలిసిన విశ్వరూపాలన్నీ మగపురుషులవి. ‘అధికారానికి’ (అథారిటీకి) ప్రతీకలు. ఇవి ‘నా’ నుంచే అంతా అని వువాచిస్తాయి. అబద్ధం. ఆ ‘మయా సృష్టం’ సారు నుంచి ఏదీ రాదు. కనీసం పాపల్ని కనలేడాయన. జగత్తు ఆమె నుంచే వస్తుంది. అతడి భాగం వుంది. శ్రమంతా ‘ఆమె’దే. సృష్టి అనేది ఒక పని అయితే ఆ పని మనిషి ‘ఆమె’. రిప్రొడక్షన్ (సంతానోత్పత్తి) కూడా ప్రొడక్షన్ (ఉత్పత్తి) లో భాగం. కాకపోతే ఇందులో శ్రమంతా ‘ఆమె’దే. అదే ఆమె విశ్వరూపం. ‘ఆమె జీవకణ’మే మొదట నేనైనా మీరైనా.

‘నగ్నంగా
ఆకాశానికి భూమికి మధ్య
వదిలేసిన జుట్టుతో
ఆమె కూర్చున్నప్పుడు చూడు’

అని ఆమెను ఊహించుకోడానికి రచయిత ఇచ్చిన క్లూ మనల్ని మన గదుల్లోంచి భూమ్యాకాశాల మధ్యకు తీసుకెళ్తుంది. సమస్తం అమె నుంచే వచ్చేశాయని… అసాధ్యం, అసంభవం అనిపించే ఒక మాట అనేసి. మరి కాసేపట్లో ‘ఔన్నిజమే కదా’ అన్పించడంలో వుంది కవి చేసే గారడీ (కన్సీట్).

చివరగా, మనం ఈ రైటప్ మొదట్లో అనుకున్న మాటొకటి మళ్లీ అనుకోవాలి. నిర్మొహమాటపు మాటలతో షాక్ చేయడానికి మరో ఉదాహరణ. ఈ సారి కూడా ఇది తెలుగు మాట కాదు. సంస్కృతం. కవి ఏమంటారో గాని, ఇది షాక్ చేయడం ద్వారా పాఠకులను ఆకట్టుకోడానికి కావాలని తెచ్చిన పదమని చెప్పక తప్పదు.

‘ఆమె యోని లోపలి
ఉదరంలో జనించే
భూగోళాలు
పాలపుంతలు
సముద్రాల్ని అడగాలి’

ఉదరంలో జనించే అని నేరుగానే చెప్పొచ్చు. పోగా, ఉదరం యోనిలో వుండదు. ఈ రెండో పదం షాక్ కోసం చేర్చబడినదే, కవిత్వపు ‘సంక్షిప్తత’ (బ్రివిటీ) అవసరాన్ని తోసి రాజని, వెర్బోస్ అనిపించుకోడానికి సిద్ధపడి.

ఈ సారి ‘భళా భళి…’లో ఇలా భవిష్యత్తు నుంచి కవిత్వాన్ని తోడుకున్నందుకు భలే సంతోషంగా వుంది. 🙂

మూడు పద్యాలూ ఒకే సారి ఈ కింద:

 

బీప్.. బీప్..

వాళ్ల చేతుల్లో కొలబద్దలుంటాయ్
“కొలతల్లో నిన్ను ఇరికించటం కోసం
గ్రాఫ్ కాగితాల్ని
ఎక్సెల్ షీట్లనీ
సొంతంగా డిజైన్ చేయగలరు వాళ్లు
నీ వజైనా చిన్నదైనా
నీ బూబ్స్ పరిమాణం అటూ ఇటైనా
నీ హిప్స్ లెక్కలతో సహా
అన్నీ కలతలే వాళ్లకు
తృప్తికోసం

సెంటీమీటర్ల కొలతలు పెంచుకునేందుకు
మూలికలమ్మే టెంటులనీ వదలని వాళ్లకు
సీత అయితే ఏంది
మరియ అయితే ఏందీ
ఫాతిమా అయితే ఏంది
కామం ఒళ్లంతా కళ్లు చేసుకున్నాక
పసి వాళ్లైతే ఏంది
వృద్దులైతే ఏంది
వయసుతో పనేంది
వాళ్లకి కొలబద్ధలే జీవితం
కొలతల చేతులతో ప్రపంచాన్ని ముక్కలు ముక్కలుగా
లింగవివక్ష చేయటమే ముఖ్యం

ఇక్కడ
ఆడపిల్లలకే కాదు
ఆడ పిండాలకీ రక్షణలేదు

20.7.18

 

ఆమె లేని

 

ఆమె ఇంట్లో
అంట్లు తోముతోంది
ఆమె అంట్లు తోముతుంది
ఆమె అంట్లుతోముతుండటం వల్ల
వినలేదు

2.

ఈ కవిత ఆమె కోసమే
ఆమె ఇల్లు తుడుస్తుంది
ఆమె వంగి తుడవటం వల్ల
పైకి తలెత్తి చూడలేదు
ఆమె ఇళ్లంతా తుడిచే వరకు వినదు
శబ్దం చేయకు ఆమె తుడుస్తుంది
ఇటూ అటూ తిరగకు

3.

ఈ కవిత ఆమె కోసమే
ఆమె పిల్లల్ని ఆడిస్తుంది
మె పిల్లలకి స్తన్యమిచ్చేప్పుడు
రక్తాన్ని పాలచుక్కలు చేస్తుంది
ష్…
ఆమె ఇప్పడు పిల్లలని కాపుకాస్తుంది
గోలచేయకు

4.

ఈ కవిత ఆమె కోసమే
>ఇక్కడ పెడుతున్నాను
ఆమె పనులైపోగానే
ఆమెకి అందించండీ
ఆమె ఈ కవితకు వస్తువు
ఎవరూ పట్టించుకోని ప్రతీక

 

14.6.2018

 

ఆమె జీవకణం

 

ఆమెనీ
ఆమె నిర్మాణాన్ని
ప్రేమించనిదెవరు?
ఆమె
ఇటుకలతోనా ?
మట్టీ ఇంకా రాళ్లతోనా?
గ్రానైట్ లేదూ ఇసుక సిమెంటుతోనా ?
ఎలా కట్టబడింది?

నగ్నంగా
ఆకాశానికి భూమికి మధ్య
వదిలేసిన జుట్టుతో
ఆమె కూర్చున్నప్పుడు చూడు
ఆమె కురులనుంచి ఎగురుతున్న
వేవేల పక్షులు
వాటి కువకువలు
నదులూ నదీ చరాలు
ఆమెలోనుంచి
జనిస్తున్న శక్తి
అనంతం , అపారం
అనన్యం
ఆమె దేహంపై రాయబడే
భాష
వాక్యం
వ్యాకరణం
ఆమె లోపల ప్రవహించే
చరిత్ర దాని తాలూకు నెత్తురు
వర్తమానం
దాని మరకలని నిర్వచించలేని భవిష్యం
ఆమె ఎలా నిర్మాణమైందో
ఆమె యోని లోపలి
ఉదరంలో జనించే
భూగోళాలు
పాలపుంతలు
సముద్రాల్ని అడగాలి
ఆమెనలా చూస్తూ ఉండటమే
మీరు చేయలిగింది

 

12.6.2018

 

కె సంజీవి

కె. సంజీవి: పెన్ నేమ్. అసలు పేరు వొద్దని రచయిత కోరిక.

4 comments

  • బాగుంది. ఇలాంటి పరిచయాలు అవసరం కూడా ..

  • నేను చాలా ఇష్టంగా ఆశ్చర్యంగా చదువుతున్నాను వారి కవితలు చదివి నిద్రకు దూరమయ్యాను. పాత మూసపేర్ల కలవరింతలు కాక ఇటువంటి పరిచయాలు కావాలి

  • మీ విశ్లేషణ షాక్ ని అర్ధం చేసుకునేలా సాగింది. నిజంగా భళాభళి! మాకివ్వడానికి మీకింకో షాక్ దొరకాలని నా ఈష!👏👏👏

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.