అప్పులకుప్ప

ఆకు చాటు పిందె,  అత్త చాటు పిల్ల చాలా సేఫ్ అన్నారు పెద్దలు. అన్నీ అత్తమ్మ చూసుకుంటున్నా అప్పుడప్పుడు అంత వీజీ కాదనిపిస్తుంది..అలా చాలా క(వె) తలున్నాయి కానీ మొదట ఇది చూడండి.

పెద్దోడు ఇంట్లో మొదటి పసి బిడ్డ. గారాల పట్టి, మాటలొచ్చినప్పటి నించే అందరు పిల్లల్లా అమ్మా అని ఏడవకుండా నానమ్మా, నాన్నా అని ఏడిచి నాన్న తిరిగి పుట్టేశారన్న ఇంట్లో వాళ్ళ సెంటిమెంట్ ని బలపరిచేవాడు. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఏ పిల్లలయినా ఆకలేస్తే అమ్మా అని ఏడవడం విన్నాము కానీ ఇలా ఎప్పుడూ వినలేదని నానమ్మకి,  నాన్నకి బోలెడు గర్వం పెంచేవారు. ముత్తమ్మ ముత్తాత పిల్లాడిని నా ఒళ్ళో వెయ్యమ్మా అని సరదా పడిపోయి చాన్స్ రాలేదని అలిగే వారు. బాబాయిలు అత్త అయితే సరే సరి..ఒళ్ళోంచి, భుజాల మీంచీ దింపేవారు కాదు. అందరికీ గారామే. అత్తమ్మ ప్రతి సారీ మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి పొయ్యి ఆ వయసు పిల్లలందరూ పాకేస్తున్నారనొకసారీ, నడిచేస్తున్నారనొకసారీ చెప్పి, మీరే ఏవో సరిగా మందులూ అవీ ఇవ్వట్లేదు మీకసలు తెలుసా లేక పిల్లల డాక్టరు దగ్గరికెళ్ళమంటారా అని ఆవిడతో తగాదా వేసుకునేది. మీరసలు దింపితే కదా వాడు పాకేదీ , నడిచేదీ అని డాక్టర్ మందలించింది కూడా..  

ఇలాంటి పిల్లోడిని రెండవ సంవత్సరం పుట్టినరోజు దసరాల్లో వచ్చిందని అక్షరాభ్యాసం చేసేశాక పై జూన్ లో ఇంటి ముందర ఉన్న పిల్ల పని చేసే బడికి తీసుకుపోతానక్కా అని బతిమాలేది.  అక్కరలేదు ఇప్పుడేం స్కూల్ అనేశారు అందరూ…అందరినీ బతిమాలి కాస్త ఎడ పిల్లలని చూసుకునే టయిం ఉంటుందని సర్దిచెప్పి సరే అనిపించా కానీ మొదట వాడు బడికెళ్ళిన రోజే ఎవరో పిల్లకి పంతులమ్మ బడితె పూజ చెయ్యడం చూసి స్కూల్ ఫోబియా తెచ్చుకున్నాడు. బడి పేరు చెపితే చాలు జ్వరమొచ్చేది. వాడేమన్నా కలెక్టేరు చదువులు చదువుతున్నాడా ఏంటమ్మా వెధవ స్కూల్ పోతే పోయింది అనే ముత్తమ్మ దగ్గరి నించీ పోనీలే అక్కా వచ్చే ఏడాది చూద్దం లే వదిలెయ్ అనే పనమ్మాయి దాకా అందరూ వెనకేసుకురావడమే. చాలా రోజులు స్కూల్ ఊసెత్తలేదెవరూ…..

అదృష్టం కొద్దీ మరుసటి సంవత్సరం ఇంటికి ఫర్లాంగ్ దూరం లో ఒక కొత్త స్కూలొచ్చింది. ఆడుతూ పాడుతూ నేర్పిస్తారని,  పిల్లలని కొట్టడం తిట్టడం చెయ్యరని చెప్పగానే హమ్మయ్య అని అడ్మిషన్ తీసుకున్నా. కానీ ప్రతి పూట స్కూల్ లో దింపడం నాగలోకానికో,  త్రిశంకు స్వర్గానికో వెళ్ళినట్టుండేది నాకు. స్కూల్ లోపలే ఒక మడిగె ఉంది.. ఒక ఆవిడ అందులో పిప్పరమెంట్లు, బిస్కట్లు, పుస్తకాలు, పెన్నులు అమ్మడం మొదలెట్టింది. స్కూల్ కి వెళ్ళనని ఏడుస్తున్న బాబుని ఎత్తుకుని మరిపిస్తూ తీసుకొచ్చి దుకాణం దగ్గర ఆగి.. అదిగో చూడు అని చూపించా. అదృష్టం కొద్దీ బాబు కి ఇష్టమైన బొమ్మ ఏదో రబ్బర్ రూపం లో కనిపించిందో సారి,  దాన్ని వాడు తదేకం గా చూశాడు. కావాలా అంటే తలూపాడు. మా బాబు కోసం చిన్న చిన్న బొమ్మలు తెమ్మన్నాను ఆవిడని. కొనకపోయినా అలా వేలాడుతున్న బొమ్మలు చూడడం నచ్చింది వాడికి. నెమ్మదిగా స్కూల్ కి బయలుదేరుతున్న 10 నిమిషాలు తప్ప బానే వెళుతున్నాడు ఈ బొమ్మల వల్ల. ఆ దుకాణం ఆవిడతో చిన్నా చితకా పరిచయం ఏర్పడింది. బాగా లేని వాళ్ళం మేడం ఒక్క 2 వేలు ఉంటే ఇంకొన్ని వస్తువులు తెచ్చుకుంటే పూట గడుస్తుంది అని చెప్పేది. నాకు ఆర్థిక స్వాతంత్రం లేదు కానీ పిల్లాడి స్కూల్ విషయం వచ్చినప్పుడు ఇంట్లో అన్నాను. మా సీతయ్య అయ్యో పాపం మనం ఇద్దాం లే అన్నారు.. నేను అసలు ఆలస్యం చెయ్యకుండా ఆవిడకి చెప్పేశా.. బోల్డు సంతోష పడిపోయింది..

అన్నీ అంత చులాగ్గా అయిపోతాయేంటీ.. సీతయ్యకి అనుకోకుండా టెలిగ్రాం వచ్చింది. ఇంకో ఊరిలో ఉన్న సంస్థ కి ఏదో ప్రాబ్లం వచ్చిందిట అర్జెంట్ గా రమ్మని. అప్పుడెళ్ళిన వారు సంవత్సరం అక్కడే ఉండిపోయారు. ఉత్తరాలు తప్ప వేరే మాధ్యమం లేదు.. ఆ ఉత్తరాలు కూడా అత్తయ్య పేరున వస్తాయి కాబట్టి నేనేమీ అడగలేదు , కానీ ఈ లోపు ఈ దుకాణం ఆవిడ ప్రతి రోజూ అడుగుతుంటే తెగ మొహమాటం గా ఉండేది. మా శశి తో చెప్పా ఈ విషయం. దానిదేముందీ నేను ఇస్తాలే ఆవిడని నాకే తిరిగి ఇమ్మను ఎవరైతే ఏముంది అన్నాడు. బోలెడు సంతోష పడిపోయా. అప్పట్లో శశి నా దగ్గర చదువు చెప్పించుకునేవాడు. తమ్ముడి కంటే ఎక్కువ నాకు. చదువుకుంటూ అక్కడే ఒక గుడిలో పని చేస్తున్నాడు తండ్రి గారి బలవంతం మీద. పరిచయం చేశా. డబ్బు తెచ్చి ఇచ్చాడు. దుకాణం పెద్దదయింది. వడ్డీ గిడ్డీ లేకుండా ఇస్తా అన్నా కాబట్టి ఆ మాట మీదే ఇచ్చాడు. రెండు నెలల్లో ఇచ్చేస్తా అన్నది ఆవిడ. సరే అన్నాడు శశి.

రెండో నెల దగ్గర పడుతుండగా వరలక్ష్మి పూజ రాఖీ పండుగ సెలవులయ్యాక పొద్దున్నే స్కూల్ కి వెళ్ళేటప్పటికి దుకాణం ఖాళీగా ఉంది.. వాళ్ళు చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయారుట. గుండె ఆగిపోయింది. ఇప్పుడెలా అని చాలా ఖంగారు పడ్డా.. శశి ఇంటికొచ్చేదాకా మనసు మనసులో లేదు.

విషయం విన్న శశి నాకో కథ చెప్పాడు.

అక్కా మొన్నొక రోజు గుడికెవరో వచ్చి ఒక బంగారు ఉంగరం పూజలో పెట్టమని ఇచ్చారు. దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేలోపు ప్రదక్షిణలు చేసొస్తా అన్నాడు. పూజ అయ్యేసరికి అందరూ వరుసలో నించున్నారు. నేను అతనికి పూజలో పెట్టిన ఉంగరం ఇచ్చాను. అతను దణ్ణం పెట్టి వెళ్ళిపొయ్యాడు. 10 నిముషాల తరువాత ఒకతను ఉంగరం ఇస్తవా పంతులూ అని అడిగాడు.. అదేంటీ ఇందాకే ఇచ్చాను కదా అన్నాను. నేను పక్కనున్న హనుమంతుడి గుళ్ళో 51 ప్రదక్షిణలు మొక్కుకున్నా అవి పూర్తి చేసి ఇప్పుడే వస్తున్నా అన్నాడు.. అంత మందిలో ఒకరిని చూసి ఒకరనుకున్నానన్నమాట. అక్కడే ఉన్న భక్తులు నొచ్చుకుని, మేము చూస్తుండగానే ఒకతని చేతిలో పెట్టాడు పంతులు, ఆయన మహా ప్రసాదం అని మొక్కి పొయ్యాడు. మనది కాని దాన్ని గుడిలో ఎట్ల తీసుకున్నాడో అనీ, దేవుడిచ్చాడు వద్దనడమెందుకు వేళ బాగుందనుకున్న్నాడేమో అనీ,, ఏదన్నా కష్టం ఉండి వచ్చాడేమో దేవుడే ఇచ్చాడనుకున్నాడనీ అనేకరకాలుగా మాట్లాడుకున్నారు. నేను చాలా భయపడిపొయ్యా.. ఆ ఉంగరం ఖరీదు చెప్పండి, రేపు పొద్దున్నే తెచ్చి ఇచ్చేస్తా ఈ విషయం  గుడి అధికారులకీ మా నాన్న గారికీ తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని వణికి పోయా అని చెప్పాడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న శశి. గుళ్ళో ప్రొబేషన్ అయ్యాక జీతం ఒకే సారి ఇచ్చారక్కా నాన్న చేతికి ఇస్తే కాలేజీ ఫీసు కట్టి మిగిలినవి బట్టలు, గడియారం కొనుక్కోమని అన్నారు. లక్కీ గా అవి నా దగ్గరే ఉన్నాయి. అవి ఇచ్చేద్దామనుకున్నా. కానీ ఆ పెద్దాయన నా దగ్గరికొచ్చి.. పోనీలే పంతులూ దేవుడు అది ఎవరి అవసరానికో ఇచ్చి ఉంటాడు. నేను ఎవరికో ఋణం ఉండి ఉంటాను.. ఏం ఫికర్ జెయ్యకు అన్నాడు. అంత మంచి మనసుతో ఆయన మాఫీ చేశాడు కదా.. అలానే నేనూ ఈమెకి ఋణం ఉన్నానేమొ పోనీలే వదిలెయ్యి అన్నాడు. ఆ విషయం ఇంట్లో చెప్పలేక ఎంత మనాది పడిపోయానో చెప్పలేను. శశి అప్పు ఎప్పటికైనా తీర్చెయ్యాలి..

.. ఒక సారి మోసపొతే మోసం చేసిన వాళ్ళు మూర్ఖులు, కానీ ప్రతి సారీ మోసపోతే…. అది ఎన్నెలమ్మ… !!

అబ్బ ఆశ!!.. ఇప్పుడు బాగా రాటుదేలానండీ.. మీ పప్పులుడకవు.. !!     

ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం
కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

2 comments

  • భలే ఉంది.. ఇలాంటి వారు చాలామంది.. రాటుదేలక పోతే కుదరదు.. కానీ.. ఓ నాలుగంకెలు ఇలా ఇచ్చేయండి..

    కామెడీ కథనం లో మీ నైపుణ్యం మరోసారి ఋజువయింది.

    • అబ్బే! మీ పప్పులుడకవని చెప్పేసా కదా.. స్నేహితులు కాబట్టి మొహమాటానికి ఇద్దామని అనిపించినా.. ముందు లాయర్ గారి దగ్గరికి పోయి మీ ఆస్తి మొత్తం పత్రం మీద రాసి తీసుకున్నాక 4 అంకెలేంఖర్మ, 5 6 అంకెలు అయినా ఇచ్చేస్తా..హహహహ్
      ధన్యవాదాలు విమల గారూ

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.