ఎగురుతూనే వుండు

గర్వంగా గౌరవంగా
కిందకు చూడకుండా
నీలి మేఘాల్లోకే చూస్తూ

ఆడీ కార్లమీదా
కలలకందని ఫ్లై ఓవర్లమీదా
అధికారుల బంగ్లాల మీదా
గోడలు పట్టకుండా మెరిసే
యల్ ఈడీ తెరల మీదా
యఫ్ యమ్ రేడియోలమీదా
జనావాసాల్లో నిలిచిన
మద్యందుకాణాలపైనా
గుండెలుప్పొంగేలా కురిసే
భక్తిని కలబోసుకుంటూ ఎగురు
ఎగురుతూనే వుండు

సిగ్నల్ లైట్ల కూడలిలో
వర్షాన తడుస్తూ
మెతుకులుగా మార్చే
పైసలను కూడకట్టుకుంటున్న
పసి చేతుల్లోనూ ఎగురు

రెండు బిస్కత్తులకై
ఫొటోలకై తరుముకొచ్చిన గుంపుల్లోని
అమాయిక ముఖాల్లోనూ ఎగురు

అమ్మ వీపున మూటలో
ఎండై వానై తిరిగే
ఆ చిగురాశ కళ్ళలోనూ ఎగురు

‘నన్ను దాటుకొస్తే ఇక కాలవే’
అని అవధిలేని నీటనిలబడ్డ
కరంటు స్తంభంపైనా ఎగురు

సంవత్సరాలుగా నిర్మితమయే
యీ రహదారుల మడుగుల్లో
ప్రతిఫలిస్తూ కొత్త దారికి వూపిరి పోస్తూ ఎగురు

నగరాలచివర
మనుషులుగా గుర్తింపబడని
జీవులుతిరుగాడే
వసతులెరుగని చివుకు కప్పుల ఆవాసాలపైనా ఎగురు

దాస్య శృంఖలాల్ని
తెంచాల్సిన అవసరం గురించి పాడుతూ ఎగురు
పోరాట యోధుల్ని స్మరించాల్సిన అవసరం గురించి పాడుతూ ఎగురు
కుహనాల్ని దహించాల్సిన రహస్యాల్ని విప్పి చెబుతూ ఎగురు
ఎవరి బతుకులు వాళ్ళు బాగుచేసుకునే సందేశాన్నిస్తూ ఎగురు
దేశాలకతీతంగా స్వతంత్రాన్ని సంబరంగా జరుపుకుంటూ
ఎగురు ఎగురుతూనే వుండు

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.