ఎవరి సొతంత్రం?

భలే సమయం,

భారతీయులం సగర్వంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోడానికి ఇంతకన్న గొప్ప సమయం వుండదు.

స్వాతంత్ర్యం కావాలంటే నువ్వొక మనిషివైతే చాలదు. ఒక దేశంలో పౌరుడివై వుండాలి. పౌరుడిగా వుంటానికి నీకొక దేశం వుండాలి.

వీసా వొచ్చి, ఆపై గ్రీన్ కార్డు, సిటిజెన్షిప్ వొచ్చే వరకు భారత మాతృ భక్తి. అదొచ్చాక అమెరికా పితృ భక్తి.. అయినా ఫరవాలేదు. ఏదో ఒక కాగితం మీద దేశభక్తి నమోదు కావాలి

మీకు తెలుసా? ఇండియాలో.. ఒక్క అస్సోం రాష్ట్రంలోనే నలభై లక్షల పై చిలుకు మందికి దేశం లేదు. వీళ్ళు ఇల్లు లేని వారో, భూమి లేని వారో కాదు. దేశం లేని వారు. భూమి హీన్ కాదు. దేశ్ హీన్.

ఇల్లుంటే చలికి వానకు నిన్ను కాపాడుతుంది. భూమి వుంటే దున్నుకుని తిండి గింజలు పండించుకోవచ్చు. దేశం తినడానికి పనికి రాదు, చలిలో, వానలో వుంటానికి పనికి రాదు.

మరెందుకది?

పంద్రాగస్టు నాడు పప్పులు బెల్లం పంచుకోడానికి. జెండా ఎత్తుకుని రాగాలు తీయడానికి. అప్పుడెవరేనా లేచి నుంచోకపోతే తన్నడానికి.

అందుక్కూడా కాదు. అందుకు మాత్రమే కాదు. నువ్వు అక్రమ చొరబాటు దారునిగా ‘నేరా’రోపణ కింద శిక్షలకు గురి కాకుండా వుంటానికి, టెర్రరిస్టువని అనిపించు కోకుండా వుంటానికి కూడా నీకొక దేశం వుండాలి.

ఒక్క అస్సోం రాష్ట్రంలోనే అలాంటి వాళ్ళు సుమారు అరకోటి అని నిర్ధారించింది ‘పౌరుల జాతీయ రెజిస్టర్’ (ఎన్నార్సీ) అనబడే జనగణన పుస్తకం.

అదింకా తనకు తాను ‘విశ్రామ్’ చెప్పుకోలేదు..

ఇంకా బెంగాల్లో, మిగిలిన అన్ని రాష్త్రాల్లో.. ఔను, తెలుగు రాష్ట్రాల్లో కూడా… ఈ లెక్కలు చేస్తారు. రెండు తెలుగులలో ఒకటైన తెలంగాణాలో ఓ బిజేపీ ఎమ్మెల్యే ఆ దేశ్ హీన్ మనుషుల మీద పాంచజన్యం పూరించాడు కూడా. అలాంటి వాళ్ళు వెంటనే దేశం విడిచి వెళ్ళాలి. లేకుంటే వాళ్ళను కాల్చివెయ్యాలి. ఇక చూడండి రేపు ఎన్నికల్లో ఆ ‘స్థానికుడికి’ ఓట్లే ఓట్లు.

అన్ని రాష్ట్రాల్ని కలిపితే, ఒక్క ఇండియాలోనే ‘దేశ హీనులు’ ఎన్ని కోట్లు అవుతారో ఇప్పుడిప్పుడే చెప్పలేం. ఈ ప్రజల-మీది-మహా-సమరం ఇక బెంగాల్ లో మొదలవుతుందని దేశభక్త సేనాని అమిత్ షా నినద భీషణ శంఖం పూరించేశారు.

ఇండియాలో రానున్నవి ఎన్నికలేనా? దేశం పేరిట అమానుషానికి నాందీ వాచకాలా?

దేశం లేనోళ్ళు ఒక్క అసోమ్ రాష్ట్రంలోనే కాదు. భారత దేశం అంతటా వున్నారు. ఒక్క భారత దేశంలోనే కాదు అమెరికాలో… అన్ని చోట్లా వున్నారు. దేశ హీనులు లేని దేశం వున్నదా ఈ భూమ్మీద?

దేశం లేకపోతే దేశభక్తి లేదు. సింపుల్ తర్కం.

వాళ్లిక ఎక్కడున్నా విదేశీయులే. పొటెన్షియల్ ‘దేశ ద్రోహులే’.

వారెవ్వా, అమిత్ షా జీ, టెర్రరిజం మీద పోరు ఇక ఎంత సులభం?

ఇప్పుడిక ప్రభుత్వాలకు చేతి నిండా పని. ప్రభుత్వాల దేశభక్తికి అడుగడుగునా కితాబులు. సులభంగా దొరికే కితాబులు.

అదేంటో సముద్రంలో ఒక చోట తుపాను కనిపిస్తే, ఇక అన్ని చోట్లా తుపానే. జనాలు తలదాచుకోను స్థలమే వుండదు.

సామాన్యుని నెత్తి మీద కత్తి వంటి ‘జాతీయవాద’మే ఇవాల్టి ప్రపంచ రాజకీయం.

అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ (ఐ మీన్ నేను ఎక్కడ కూర్చుని ఇదంతా టైపుతున్నానో అక్కడ) డొనాల్డ్ ట్రంపు.

భాషలు వేరు. భావం ఒక్కటే.

గోడలు వేరు. గోడల మీద తుపాకులు ఒక్కటే. దయ లేని తుపాకులు.

తుపాకులు చిన్న పెద్ద దొంగల మీద కాదు. ఆడవాళ్ళను, పిల్లలను అక్రమ రవాణా చేసే ట్రాఫికర్ల మీద కాదు. పిల్లల మీదే, ఆడా మగ అసహాయుల మీదే.   

ఇళ్లు లేని వాళ్ళ మీద, రిక్షా పుల్లర్ల మీద, కాగితాలేరుకునే వాళ్ళ మీద, ఇళ్ళల్లో పాచి పనులు చేసే వాళ్ళ మీద, ‘చీప్ లేబర్’ మీదే ఈ తుపాకుల గురి.  

వావ్, ఎంత సులభం దేశభక్తి.

ఎవరికీ అన్నం పెట్టక్కర్లేదు. గూడు ఇవ్వక్కర్లేదు.

కొందరి నోటి కాడి కూడు తీసేస్తే సరి. కొందర్ని వాళ్ళున్న ప్లాస్టిక్ డేరాల లోంచి కూడా లాగేస్తే సరి.

అప్పుడిక భరతమాత తన మీద పుత్రుల భక్తికి పులకించి పోతుంది. జాతీయ భావం పూలు పూచి కాయ కాచి తీపి ఫలాలు అందిస్తుంది.

‘నాన్నా మన సంస్కృతి చాల గొప్పది.’

‘తండ్రీ ఆకలేస్తోంది.’

‘బాబూ మన సంస్కృతి మీద బయటినుంచి దాడి.’

‘అయ్యా, ఇల్లు లేని నేను చలికి గడ్డకట్టుకుపోతున్నాను.’

‘చిన్నోడా, మన మట్టిని మనం కళ్ళకద్దుకోవద్దూ, దాన్ని కాపాడుకోవద్దూ?!.’

‘ఎవరి మట్టిని? ఎవరు కాపాడాలి? ఎందుకు కాపాడాలి?’

‘మన స్వాతంత్ర్యం కోసం? మన ఝాన్సీ లక్ష్మి, మన అల్లూరి…. కోసం?’

‘మన’లో అప్పుడే మన పక్కన వున్న ఒక అరకోటి మంది లేరు. ఆ అరకోటి మందికి, దేశమే లేదు. ఇవాళ పంద్రాగస్టు పండుగలో వాళ్ళుండరు. అసలీ పండుగే వాళ్ళకు విరుద్ధం. ప్రాణాంతకం. ఔను. ఈ జెండా  వాళ్ళ వునికికే ప్రమాదం. నాకూ నీకూ దీని వల్ల ఒరిగిందేమిటో గాని, మన పక్కనున్న మన వంటి వాళ్ళ బతుకులు ప్రశ్నార్థకం. ఎలా వుంచను ఝెండా వూంఛా, హమారా?

జాతీయత ఎప్పుడూ పాజిటివ్ కాదు. ఎవరో ఒక ఇతరుడి నుంచి ‘మనం’ కాపాడుకోవాల్సిన ‘మన’ జాతీయత. దాని కోసం. కొట్లాడు.

ఎవరో ఒక ఇతరుడికి వ్యతిరేకంగా జాతీయత. ‘మన’ సరిహద్దులకు అవతల వున్నవాళ్ళందరికి వ్యతిరేకంగా ‘మన’ జాతీయత. అందుకే అంత సైన్యం. ‘ఇతరుల’పై నెత్తురోడే వ్యతిరేకత లేకుండా ఎక్కడా జాతీయత అనే భావన లేదు.

భారత దేశంలో ఎవరుండాలో ఎవరుండకూడదో నిర్ణయించే పని ఇంకా కొనసాగుతోంది.

యజ్ఞం అస్సోంలో అయిపోయింది. అర కోటి ఔట్. మంత్ర వాక్యమిప్పుడు బెంగాల్లో వినిపిస్తోంది. ‘అమితో’త్సాహంగా.

దేశద్రోహి కాకుండా వుండాలంటే ఒక కాగితం వుండాలి. ఏరుకుని గోనె సంచిలో వేసుకున్న కాగితాల్లో ఏదో ఒకటి కాదు. 1971 కి ముందు నుంచీ ఇండియాలో వున్నామని రుజువు చేసే కాగితం. సాధారణంగగా కాగితాలేరుకునే  వాళ్ళ వద్ద వుంటానికి వీల్లేని కాగితం. ఓటరు కార్డో, బ్యాంకు పుస్తకమో.    

వాళ్ళో వాళ్ళ తాత తండ్రులో… ఎప్పుడు ఏ యుద్ధంలో ప్రాణాలరచేత పెట్టుకుని అటునించిటు పారి పోయి వచ్చారో… గంగా నది వలె, సింధూ జలాల వలె కొన్ని తరాల కింద ఏ సహజ గతిని ప్రవహించారో. ఇప్పుడు ఆ మనుషులు ఈ మట్టికి ఎన్నో తరం వారో. ఆ పేదల వద్ద… కాగితం అనే పదానికి అర్థం తెలీని కాగితాలేరుకునే వాళ్ళ వద్ద… ఏదేనా వుత్తరం వొస్తే ఎవరితోనో చదివించుకోవలసిన రిక్షా పుల్లర్ల వద్ద… వుంటానికి స్థలమే లేక ఏ పడిపోయిన గోడకో మురికి గోనెపట్టా కట్టుకుని బతికే వాళ్ల వద్ద పనికొచ్చే కాగితాలెలా వుంటాయి? ఏ బ్యాంకుల్లో వాళ్ళకు డిపాజిట్లుంటాయి, వాళ్ళ  వద్ద బ్యాంకుల పాస్ పుస్తకాలుంటానికి?

ఉండవు కనుక దేశీయుడివి కావు అంటుంది రెజిస్టరు.

వున్న చోట వుండలేక వుంటానికి చోటు వెదుక్కుంటూ వొచ్చిన వాళ్ళకు, ఆ సంగతి కూడా మరిచిపోయి ఇక్కడ బతుకుతున్న వాళ్ళ బిడ్డలకు ఇన్నాళ్ళు తమ దేశమిదే అనుకున్న వాళ్ళకు ఇప్పుడిది విదేశం. వాళ్లు మనకు విదేశీయులు.

వాళ్ళు ఇక్కడ వుండకూడదు. ఎక్కడికి పోతారు మరి? కొన్ని తరాల కింద వొదిలొచ్చిన దేశమూ రానివ్వదు. ఆ దేశమూ అలాంటి కాగితమే ఆడుగుతుంది. ఎక్కడికి పోతారు వాళ్ళు ఈ విశాల భువిని? సీతమ్మలా భూమిని తొలుచుకుని భూమి లోపలికి పోలేరు కదా?

ఇన్నిన్ని నియమాలు, నేల మీద కంటికి కనిపించని గీతలు, వాటికి బాంబుల కాపలాలు.. ఇదంతా ఎవరిని నిరోధించడానికి?

చేతిలో డబ్బుంటే ఎవరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టొచ్చు. దానికి ఇంకా ఏమైనా అడ్డు గోడలుంటే తీసెయ్యాలని గగ్గోలు. పెట్టుబడి పెట్టిన వాళ్ళు లాభాలు మోసుకుపోవడానికి కూడా ఏ అడ్డంకులుండవు. ఉండకూడదు. స్వతంత్ర దేశాల ప్రభుత్వాలు దానికి ఎలాంటి ఆడ్డు చెప్పకూడదు. లెస్సేఫేర్. స్వేచ్ఛ.

పేదవాళ్ళకు, పని చేస్తే తప్ప బతుకు లేని వాళ్లకు అలా ఎక్కడంటే అక్కడ పని చేసుకునే స్వేచ్ఛ లేదు.

ఎక్కడ చీప్ లేబర్ దొరికితే అక్కడికి వెళ్లి లాభాలు దండుకునే స్వేచ్ఛ పెట్టుబడికి వుంటుంది. ఉండాలి. లేబర్ కు మాత్రం ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్ళే స్వేచ్ఛ లేదు. ఉండకూడదు. ఎక్కడ ప్రతిఫలం ఎక్కువుంటే అక్కడికి వెళ్లే స్వేచ్ఛ లేదు. ఉండకూడదు.

దేశాలు మరిన్ని మారణాయుధాలు కొనుగోలు చేసి, కొట్టుకు చావాలని అంతర్జాతీయ వేదికల మీద అమెరికా అధ్యక్షుని వచో మాధుర్యం. ఆయుధాల రవాణాకు సరిహద్దులు లేవు. మరణం రవాణాకు సరిహద్దులు లేవు. అది దేశభక్తి.

మనుషుల కదలికలకు సరిహద్దులు. గోడలు, ముళ్ళ కంచెలు, మందు పాతరలు… అన్నీ దేశాల పేరిట, స్వాతంత్ర్యాల పేరిట. జెండాల పేరిట. జాతీయత పేరిట. ఆ పేరుతో మళ్లి ఆయుధాల వ్యాపారం. చట్టబద్ధ సంస్థల్లోనే ఆయుధాల సరఫరాకు రహస్య మార్గాలు.

జర్మనీలో గోడ కూలిందని ఎగిరి గంతులేశాం. అది తప్పక గొప్ప సంగతే. గోడలు కూలాల్సిందే. అసలా గోడ కట్టడమే తప్పు. గోడ కూలిందని, దాని ముక్కలను సువనీర్లుగా తెచ్చుకున్నాం.

ఇప్పుడు గోడలు కడుతున్నారు. కంచెలు పాతుతున్నారు. బాంబులు… అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు కాపలా పెడుతున్నారు. రెండు కొరియాల మధ్య, మూడు భారతోపఖండ దేశాల మధ్య, ఒక అమెరికాకూ ఇతర అమెరికా దేశాలకూ మధ్య.

మంచికి చెడుకు మధ్య కాదు,

మనిషికీ మనిషికీ మధ్య గోడలు.

పెట్టుబడికి, దాని రక్త పంకిల దౌత్యానికి, దాని సైన్యానికి, దాని కుట్రలు కుతంత్రాలకు, ఆయిల్ కోసం చవక వనరుల కోసం సాగించే మారణ హోమాలకు కూడా సరిహద్దులు లేవు. జాతీయత, దేశభక్తి అనబడే హద్దులూ లేవు. వాటి కోసమైతే, ఇదొక వసుధైక కుటుంబం. వాటి కోసం మాత్రమే.

ఆ కుట్రలూ కుతంత్రాల వల్లనే తమ కాళ్ళ కింద నేలను పోగొట్టుకుని, ఆ కాసింత అత్యవసర స్థలం కోసం నేల నాలుగు చెరగులా పయనిస్తారు కష్టజీవులు. దాన్నే వలసలంటారు. వాళ్లు ఎక్కడికి వెళ్తే అక్కడ కాందిశీకులు. టెర్రరిజం నిర్మూలన యజ్ఞంలో బలిపశువులు.

సరిహద్దులు లేని లాభ కాంక్షల వల్ల బతుకులు పోగొట్టుకుని, బతికి వుండే చోటు వెదుక్కుంటూ రోజూ కొన్ని కోట్లమంది సొంత స్థలం నుంచి వెళ్ళగొట్టబడడం కాదు అసలు వేదన. వెళ్ళగొట్టబడిన నిరాశ్రయులు ఎక్కడ కాలు నిలదొక్కుకోబోయినా అక్కడ విదేశీయులై పోవడం విషాదం.

ఇల విశాల కాదిప్పుడు.

ఇల విషాద. కోట్ల మందికి.

అవసరమా పేదలకు, పని చేసే వాళ్ళకు మాత్రమే వర్తించే ఈ సరిహద్దులు? సరిహద్దులను కీర్తించే పాటలు?

ఇప్పుడనిపించడం లేదూ, ‘జనగణమన’ రచయిత, రవీంద్రుడు దేశభక్తిని నిరసించడం సరైన పని అని. దేశ భక్తి … ఆత్మలోకంలో దివాళాకోరుతనం కన్న హీనమైన పాపం అని గుడిపాటి వెంకటచలం అనడం కేవలం చమత్కారం కాదని….

దేశం కన్న మనిషి ముఖ్యమని. దేశమంటే మట్టి కాదని, మనుషులని….

మనిషిని రెజిష్టరులో ఒక నమోదుగా చూసే దేశభుక్తి వొదిల్తే గాని, అన్ని రక్తపాతాలు, అన్ని టెర్రరిజాలు మనల్ని వొదలవని….

దేశభక్తి కావలసిందే మన దేశ వనరులను సామ్రాజ్యవాద పెట్టుబడి దోచుకుపోకుండా వుంటానికి పనికొచ్చే దేశభక్తి అవసరమే.

తన శ్రమను మాత్రమే నమ్ముకుని మన పక్కన జీవిస్తున్న మనిషిది మునుపు ఏ దేశమైనా, ఎప్పుడూ ఏ దేశం కాకపోయినా… అతడికి… మన పక్కన… మన వలె… బతికే హక్కు వున్నదని అరవడానికి అడ్డుపడే దేశభక్తి…

ఒక హీనమైన పాపమే. అత్యాధునిక వంచనే…

అది ఎంత సనాతనమైన ముసుగు వేసుకున్నా.

13-8-2018

హెచ్చార్కె

28 comments

 • 2014 నుండి దేశంలో అభివృద్ధి ,సంక్షేమం అనే పదాలు కాకుండా మతం,గోవు,దేశీయత లాంటివి మాత్రమే వినపడుతున్నాయి.

  • అన్ని బావున్నాయి అనే వాళ్ళడి ఎంత మూర్ఖత్వమో ఆబ్బె ఏమి బాలేదు అనేవాళ్లది కూడా అలంటి మూర్ఖత్వమే .. పాయికానాల దగ్గర్నుంచి విద్యుత్ సరఫరా దాక మెం అది చేసాం ఇది చేసాం అంటూ ప్రభుత్వం చెప్తుంటే ..ఆబ్బె మాకు అవన్నీ తెలియవు ఎవరో మతం గురించి మాట్లాడారు కాబట్టి అవి విన్టాము అని ఈ వర్గం . . దేశం అంటే గౌరవం లేని దగుల్బాజి వామ పక్షులు చైనా రష్యా స్త్రోత్రాలు పాడుతూ మార్క్స్ దేవుడి ప్రవచించిన స్వర్ణ యుగపు స్వర్గ ధామాలకై భజనలు చేసే నాస్తికాగ్రేనులకు డెబ్బయి పైచిలుకు కన్నెల సావాసం మీద మోజుతో వందల మందిని చంపే స్వర్గ కాముకుడికి , ఆవు కోసం మనుషులని మట్టుబెట్టగల భక్తుడికి , మెం తప్ప మీరంతా నాశనం అయిపోతారు అనే మత పిచ్చి క్రిస్టియన్లకు తేడా ఏమి లేదు

  • రవి, థాంక్సెలాట్. ప్రపంచంలో అన్ని చోట్ల ఇదే పరిస్టితి. ఇప్పుడు రైటిస్టు చీకటి దేవుడి కన్న ఎక్కువగా ‘జాతీయత’ను ‘మన సంస్కృతి’ అనే భావనను వుపయోగించుకుంటున్నది. అన్ని దేశాల్లో ఇదే తంతు. ఇదొక అంతర్జాతీయ జాతీయత. 🙂

 • అయ్యా, ఎడిటర్ గారు,
  ఏదేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీదేశ భూమి భారతిని అని ఒక కవి అన్నాడనుకోండి!
  కుల భారతిని పొగడమని చెప్పలేదు గదా! మరి తెలుగులు కులభారతిని అక్కడ అమెరికా లో విస్తరిస్తున్నారటగా. దాని మీద ఒక ఎడిటోరియల్ రాయరూ? ప్లీజ్!

  • థాంక్స్ తిరుపాలు గారు,
   ఇలాంటి వాటి గురించే ఊరక చిన్ని కామెంటు కాకుండా, ఇంకొంచెమ్ పెద్దగా సంపాదక లేఖలు రాయాలని అంటూంట. 🙂

 • అయితే దేశం కొందరదే ……. ప్రజలందరు దేశపౌరులు కాదన్నమాట. పాలకుల ముద్రలు
  పడినోళ్లే పౌరులు అవుతారా ఏంటి ఖర్మ….

  • బానే చెప్పారు .. ప్రజ వేరు .. పౌరుడు వేరు .. స్త్రీ వేరు ..భార్య వేరు .. ఖచ్చితంగా దేశం కొందరిడే 1947 లో ఇది మీకు అది మాకు అని నిర్ణయం జరిగిని నాదే అది కొందరిది ..ఇది కొందరిది అని ఒప్పుకున్నాము .. మానవత్వం మన మనుగడకు ముప్పు తేకూడదు .. తనకి మాలిన ధర్మం తగదు .. బూజు పట్టిన భావాలనే వదులుకోలేని మనకి మనది కాని భూమిని వదులుకోండి అని చెప్పే హక్కు ఎక్కడిది ?

  • థాంక్యూ శివ రావు గారు! ఇప్పుడు ఇదొక ప్రపంచ పరిణామం. ఈ రూపంలో దేశభక్తి, జాతీయత సులభం. జనాన్ని వున్న చోట వుండనీయక హింసించేది వాళ్లే, బతుకు వెదుక్కుంటూ వెళ్ళే (వొచ్చే) వాళ్ళను హింసించేదీ వాళ్ళే. రెండింటి పరమార్థం అన్ని చోట్లా వుండే బహుళజాతి కంపెనీలకు కొత్త లాభాల పంట.

 • ఇది నిస్సందేహంగా ఏక (వామ) పక్ష విమర్స. దేశం , దేశ సరిహద్దులు అవసరం లేదు అనుకునే “యుటోపియన్” అభిప్రాయాల సమాహరం ఈ విమర్స . ఒక వ్యాపారి చేసే వ్యాపారం మీకు దోపిడీ అదే పక్క దేశపు ప్రజ పొట్ట చేత పట్టుకుని ఈ దేశపు కార్మిక సోదరుడి జీతం లాక్కుంటే ? ఒక గిరిజన సంస్కృతీ గురించి మీరు పడే తపన అస్సామీ సంస్కృతిని బంగాళా మూకలు కాలరాస్తున్నప్పుడు మీరు చూపితే బావుండేది. ప్రతి రోజు అమెరికా పెట్టుబడి దారి వ్యవస్థ భారత వ్యాపారాలని కాలరాస్తోంది అని గగ్గోలు పెట్టె మీరు అదే పని ఒక దేశాన్ని సర్వనాశనం చెయ్యగలిగే బర్బర మూకల పైనా చూపితే మీ విమర్శ హేతు బద్దంగా ఉండేది
  మీ రచన శైలి చాల బావుంటుంది ..చదవక ఉండలేను… మీ భావాలతో ఏకీభవించనూ లేను .. ఎవరో అన్నట్టు పాశ్చాత్య సంగీతం అద్భుతం కానీ ఆ సంగీతం పిచ్చి దేవుళ్లపైన లేకుండా ఉంటే బావుండేది

  • ‘ఒక వ్యాపారి చేసే వ్యాపారం మీకు దోపిడీ అదే పక్క దేశపు ప్రజ పొట్ట చేత పట్టుకుని ఈ దేశపు కార్మిక సోదరుడి జీతం లాక్కుంటే?’

   భలే అడిగారండీ. అంతర్జాతీయ వ్యాపారి వలస కార్మికుడి మధ్య మీరు వ్యాపారి వైపు నిలబడి వలసకార్మికుని వైపు నిలబడిన సంపాదకీయాన్ని ప్రశ్నించడం చాల బాగుంది. కృతజ్ఞతలు.

   • లేదు లేదు. ఆయన వలసవాదుల ప్రమేయం వల్ల చేజారిపోతున్న మన వాళ్ళ అవకాశాల్ని గురించి మాట్లాడుతున్నారనుకోవచ్చుగా. శరణార్ధుల విషయం ఎప్పుడూ సంక్లిష్టమే. వాళ్ళకీ మనకీ హక్కుల విభజన అనేది శాశన సంబంధి. రాజకీయాంశం. అన్ని చట్టాల్లా అదీ మూజువాణీ లో నో, ఇంకోలానో అయిపోతుంది. వివక్ష హేతువే బాధాకరం. అందర్నీ సమానంగ చూడగలిగే విశాల వనరులు దేశం లో ఉన్నాయా లేదా తర్వాత, ఉన్నవాటిని దేశీయులకి ముందు ఎంతమేరకు న్యాయం జరుగుతోందనేదీ తీసిపారెయ్యలేని విషయం. ఎనభైమూడులో అస్సాం మారణహోమం ఎందుకు మర్చిపోయింది దేశం ? నేటికీ వాళ్ళలో ముస్లింలని వివక్షకు ఎందుకు గురిచేస్తోంది ప్రభుత్వం ? వోట్లే అన్నింటికీ ఎండ్ పాయింట్.

    వాటే రీడబిలిటీ. సలాం.

    • ధన్యవాదాలు శ్రీ రామ్ గారు.. నిజమే కానీ ..నేను కేవలం వారి పక్షం మాత్రమే తీసుకోవట్లేదు . దేవుడి విషయంలో హేతు వాదినయిన నేను దేశం విషయంలో ఖచ్చితంగా భారత భక్తుడినే… ఆలా అనుకోకపోతే ఆలా అనుకుని ప్రాణార్పణ చేసిన ఎందరో మహానుభావాలని అవమానించినట్టే కదా . “ముస్లింలని వివక్ష” అనే పదాలు చాల సులువుగా వాడొచ్చు .. చారిత్ర పుటల్లో బోలెడు పుటలు చింపేస్తే .. నిజాన్నీ చదువుకున్న వాళ్ళము కూడా మాట్లాడకపోతే ఎవ్వరు మాట్లాడలేరు .. వామ పక్ష భావాలు దెస భక్తికి అడ్డురావక్కర్లేదు అని నా ముఖ్య ఉద్దేశ్యం

   • నేను ఎవరి వైపు మాట్లాడట్లేదండి … సమ దూరంతోనే ప్రశ్నించాను రెండు చోట్ల నష్టపోయింది చిన్న పొట్టే.. పొట్ట మారింది ..ఆయుధం మారింది .. ఒక గిరిజనుడు భూమిలోకి మనం “పరులని” రానివ్వక అక్కడి సంస్కృతిని కాపాడతాము,దానికి తుపాకుల అండ మంచిదే అని సమర్థిస్తాము, అదే మాట అస్సాములో ప్రజలు కోరుకుంటే “మత వాదము” అంటాము … ఇక్కడ మీ తపన ఆ చిన్న పొట్ట మీద కన్నా కేవలం ప్రభుత్వం మీద కాదా ?

    • 1, సంపాదకీయంలో మతవాదం సంగతులు లేవు. బయటి నుంచి వొచ్చినవారందరూ ముస్లింలు కాదు. టెక్స్ట్ లో లేనివి తెచ్చి మాట్లాడ్దం సరి కాదు.

     2.మతపరంగా చూపించే వివక్ష వుంది. హిందువులైతే కాందిశీకులని, ముస్లిములయితే చొరబాటుదారులని అనడం వుంది. కాని దాన్ని సంపాదకీయం పేర్కొనలేదు, అది సంపాదకీయం చర్చించే కేంద్ర విషయానికి డైగ్రెషన్ అవుతుందపించి ప్రస్తావించలేదు. మీరు లాగారు కాబట్టి ఇక్కడ స్పష్టం చేస్తున్న్నాను.

     3. వ్యాపారి (ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారి) వ్యాపారాన్ని (లాభాలు మూట గట్టుకు పోవడాన్ని ) అనుమతిస్తూ, శ్రామికుల మొబిలిటీని (బతకడానికి చేస్తున్న ప్రయత్నాన్ని) నిరోధించడం తప్పు అని సంపాదకీయం పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం అంతర్జాతీయ వ్యాపారాన్ని పూర్తిగా అనుమతిస్తోంది. వలస వొచ్చిన పేదలను హింసిస్తోంది. ఇన్ రివర్స్, పేదలను అనుమతించాలని, వ్యాపారాన్ని అదుపు చేయాలని సంపాదకీయం పేర్కొంది. అందుకే, మనం విరుద్ధ పక్షాలమని నేను స్పష్టం చేశాను.

     4. ఇంతా చేసి, పేదలు పొట్ట చేత బట్టుకుని మాత్రమే కాదు… ప్రాణాలర చేత పెట్టుకుని, సరిహద్దులు దాటి వొస్తున్నారు. అలా వచ్చేట్టు చేస్తోంది మళ్లీ ప్రభుత్వాల పనులే. పెట్టుబడి కుతంత్రాలే అని కూడా సంపాదకీయం స్పష్టం చేసింది.

     5. ఇందులో ఊహాజనితం (యుటోపియన్) ఏమీ లేదు. పైన చెప్పిన నాలుగంశాలు వాస్తవాలే. అందులో ఇమిడి వున్న వర్గ-వైషమ్యాలు (క్లాస్ కాన్ ఫ్లిక్ట్స్) పూర్తిగా నేల మీది వాస్తవాలే.

     శ్రీహర్ష గారు, దయచేసి సంపాదకీయంలోని విషయాలపై మాత్రమే.. మాట్లాడాలని మనవి.

 • దేశం మనది ?
  కాలం మనది ??
  ఎగురుతున్న జెండా మనది ???
  దేశం లేని దేహాల రక్తం ఎక్కడిది
  మరి విజయ మాలిన్యాలూ
  నీరవ మూఢులూ
  ఈళ్ళది ఏ దేశం
  గుజరాత్ లో రాత్రికి రాత్రి
  తుడిచేసిన శవాలది ఏ దేశం???
  ప్రాణి ఊపిరి మీద కూడా విచారణ జరగా లా
  అలాగే మొదటి ఆవు మీద
  ఆదిమ జీవనం మీద
  దేవుళ్ల మీదా
  రాజకీయ దయ్యాల మీదా
  వి…చా….ర…ణ
  కానివ్వండి…

  • వఝల గారు, థాంక్యూ. విజయ మాలిన్యాలకు, నీరవ మూఢులకు దేశాలు వాళ్ళ లాభాలే. లభాలు పిండుకునే అవకాశాలే వాళ్ళ దేశాలు.

 • నిజమే ఎవరి సొతంత్రం . ఇప్పటి మన దెస హీనా పరిస్థితిని చూపుతో రాసిన మంచి సంపాదకీయం. “మనిషిని రెజిష్టరులో ఒక నమోదుగా చూసే దేశభుక్తి వొదిల్తే గాని, అన్ని రక్తపాతాలు, అన్ని టెర్రరిజాలు మనల్ని వొదలవని….

  దేశభక్తి కావలసిందే మన దేశ వనరులను సామ్రాజ్యవాద పెట్టుబడి దోచుకుపోకుండా వుంటానికి పనికొచ్చే దేశభక్తి అవసరమే”

  సరి అయినా మాటలు .

  • సామ్రాజ్యవాదం మంచిది కాదు అనే ఒకే కోణంలో అన్ని సమస్యలకి పరిష్కారం వెతుకుతాము .. అసలు ఏమిటి సామ్రాజ్యవాదం ? సాటిలైట్ దేశాలని తనలో ఇముడ్చుకుని పాలించిన అలనాటి సోవియట్ సాధించినది ఈ బ్లాగు సంపాదకులు రాసిన స్వీయ విమర్శ లో చూసాం .. యుటోపియన్ భావజాలాన్ని వదిలి నిజానికి దెగ్గరగా పాతని నాశనం చెయ్యకుండా జాగ్రత్త కొత్త ఒరవడికి చేయూతనివ్వగలిగే సిద్ధాంతం కావాలి .. మనిషి ఒక జీవి .. అధికారం, బలం డార్వినియన్ …దానిని ఎలా ఆపగలం ? దానిని బలవంతంగా పైన్నుంచి ఆపలేము “ఎంపతీ” తో అర్ధం చేస్కోగలగాలి .. భూమి నిజం .. మనిషి నిజం ….దీనికి తోడ్పడేది ధర్మమే .. ధర్మమంటే దేవుడు కాదు .. భక్తి కాదు ..మతం అంతకన్నా కాదు ..

  • థాక్సండీ.
   విదేశీ పెట్టుబడి చొరబాటే కాదు, విద్యా, సాంస్కృతిక సంస్థల్లోనూ విదేశీ చొరబాటు. నిరోధం అంతా కేవలం శ్రమ తప్ప వేరే ఆస్తిపాస్టులు లేని వాళ్ళకే. వాళ్ళను నిర్నిరోధంగా కదలనిస్తే, చీప్ లేబర్ దొరకదు. అందుకూ ఈ నిర్బంధాలు. ఎక్కడికక్కడే అగ్గువకు పని చెయ్, మరణించు… అని వాళ్ళను శాసిస్తున్నది పెట్టుబడి నిర్వహించే సో కాల్డ్ జాతీయవాదం.

 • సంపాదకీయం చదివి మెచ్చిన స్నేహితులే ఎక్కువ. ఇలాంటి సమయాల్లో సరైన పక్షం వహించడం అంత సులభం కాదు. ప్రతి కార్నర్ లో ‘దేశభుక్తులు’ దాగి వుంటారు.

  ఒక మితృడు వెలిబుచ్చిన సందేహాలకు జవాబు దొరికిందనుకుంటాను, అవి సందేహాలయితే.

  ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం.

  ఒక రచన మీద ఏ విమర్శ చేయదల్చినా దాని లోని విషయాలకు లోబడి చేయండి.

  ఉదాహరణకు సంపాదకీయం మార్క్సిజం డిస్కోర్స్ కాదు. ఇది ఏ వామ పక్ష పార్టీ అభిప్రాయమూ కాదు.

  వామపక్షాల మీద, మార్క్సిస్టుల మీద విమర్శ పెట్టడం ఏమీ తప్పు కాదు. దాన్ని ‘రస్తా’ ఆహ్వానిస్తుంది కూడా.

  కాని, వామపక్షాల మీద, మార్క్సిజం మీద నిర్హేతుక వ్యతిరేకతతో విషం కక్కడం ‘అబ్యూజ్’ అవుతుంది. అలాంటి వ్యాఖ్యలను మేం డిసప్రూవ్ చేయక తప్పదు.

  దానికి నొచ్చుకోవద్దని మనవి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.