కొన్ని కథలూ  ఒక అస్తిత్వమూ

కొన్ని కథలుంటాయి కథగాకంటే అనుభవం లా అనిపించేవి. ఈ పదమూడు కథల్లా ఒక చరిత్రనుంచి, ఒక కాలం నుంచీ, ఒక దుఃఖం నుంచీ అనుభవాన్ని మాత్రం ఏరి దగ్గరగా తెచ్చిపెట్టినట్టు. ఏది చరిత్ర? ఏది గతం? ఒక వీడ్కోలు సాయంత్రం లో కేన్ అంటాడు ఇంగ్లీషు పాలనలో లేని భారతదేశం ఊహకే అందటం లేదూ అని” నిజానికి ఇప్పుడు మాత్రం మన పాలన మనదేనా? అమెరికన్ విధానాల పోకడలో నడిచే ఈ దేశం పరాయిపాలనలో లేదన్నది నిజమా? అనిపించాక “గురవయ్య” ఆవేదన కూడా పాతదే అని ఎలా అనిపిస్తుంది? నిజానికి కాలం ఎప్పుడూ ఒకేరకంగా వెళ్తూ ఉంటుంది. మనచుట్టూ ఉన్న పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయ్ అనుకుంటాం గానీ లేదు… దోపిడీ తన రూపాన్ని మార్చుకుంటుంది తప్ప దానికి అంతం లేదనే అనిపిస్తుంది. ఏది సత్యం? ఏదసత్యం? ఏ మహాత్ముడూ మరే మహర్షీ ఇప్పటికీ చెప్పలేని సత్యాల్లో తరాలు తరాలు మారిపోతూనే ఉన్నాయి…

కులం” వివక్షనీ,  బానిసత్వాన్ని ఈదేశంలో నిలబెట్టి ఇప్పటికీ దాన్ని సంరక్షించే ఏకైక సాధనం. వాళ్ళూ మనం, మీరూ మేము కథలో శర్మ కి ఎదురైన అనుభవం మామూలుదేమీకాదు. దాదాపు యాబైయేళ్ళ జీవీతం ముగిసాక శర్మకి ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. “వాళ్ళు” అలాగే ఎందుకు ఉండిపోయారో. ఇప్పుడు శర్మ ఇంగ్లండులో ఎలా తప్పించబడ్డాడో, అదే సమయంలో కన్నయ్య అంత భరోసాగా ఎందుకున్నాడో అర్థమయ్యి, అన్ని సంవత్సరాలుగా తండ్రి దేనికోసం తపించాడో స్పష్టత వచ్చీ… నిజమే..! వాళ్ళ తో మనం ఎలా ఉండాలో చెప్పిన శాస్త్రి వాళ్ళు అలా ఎందుకుండాలో ఎందుకు ఉన్నారో కూడా లోపాయికారీగా చెప్పేస్తాడు. రిజర్వేషన్ మీద ఇప్పటికీ అగ్రవర్ణాల్లో ఉన్న ఒకానొక కినుక శాస్త్రిలో బలంగానూ, శర్మలో కొంత అస్పష్టంగానూ కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటితరానికి ఒక పెద్ద పజిల్ లాగా అనిపించే రిజర్వేషన్ పద్దతిమీద ఒక స్పష్టమైన అవగాహన రావటానికి ఈ కథ బాగా ఉపయోగపడుతుందనిపించింది.

ఇక ఈ ఆలోచహనల నుంచి బయట పడకముందే కాషాయా ఎర్రజెండాల మధ్యకి పోయి ఇద్దరు మావయ్యలతో మాట్లాడాక.. మళ్ళీ అదే ఆలోచన ఏది సత్యం ఏదసత్యం? ఒకానొక మూఢభావాల మతాన్నీ సంస్కృతినీ వేరు చేయల్సిన అవసరం ఎంతగా ఉందో తెలిసిపోయినట్టు అనిపించింది. అవునూ…! మతం వేరూ ప్రాంతీయ అస్థిత్వంలో భాగంగా వచ్చిన సంస్కృతి వేరు కదా..!! హైందవ చాందస భావాలు ఉన్న పెదమావయ్య ఎలా? చిన మామయ్యతో కలిసి విశాఖ ఉక్కు, జై ఆంద్ర ఉధ్యమాలలో లాఠీ దెబ్బలు తిన్నారు? ఎమర్జెన్సీ సమయం లో ఎందుకు “ఇద్దరూ” అఙ్ఞాతంలోకి వెళ్ళారు? పెద్దమామయ్యని చూస్తే దాశరథి రంగాచార్యులు గుర్తొచ్చారు ఇక్కడ. “మన ఆలోచనలు, ప్రవర్తనా మారనంత కాలం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే అన్న పెద్ద మామయ్య “మతం” నుంచి పక్కకు జరిగి నట్టు స్పష్టమైపొతుంది. ఆశ్రమం లో దోపిడీ, ఐడెంటిటీ క్రైసిస్, అధికార వెంపర్లాటా ఉన్నట్టు చెప్పిన, పెదమామయ్య, కమ్యూన్ కి వచ్చిన తర్వాత బౌద్దం మీదకి దృష్టి మళ్ళించటం, కుల వ్యవస్త మీద అసహ్యపడటం పెద్దగా ఆశ్చర్యం అనిపించదు కానీ “ఆచరణలో కమ్యూనిజం పూర్తిగా విఫలమైంది” అన్న చిన మామయ్య మాటలు ఒక్కసారి నిజమేమిటో ఒప్పుకొని తీరాల్సిన అవసరాన్ని గుర్తు చేసాయి.  నిజానికి విస్తృతమైన చర్చ జరగాల్సిన కథ ఇది. చిన మామయ్య చెప్పిన ప్రతీ మాట వెనుకా కొన్ని గంటల మేథో మథనం, ఆత్మ విమర్శా అవసరం ఉంది. ఇక చివరిగా పెదమామయ్య చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవలసినవి. “మీరంతా ఇన్నళ్ళూ వర్గ శత్రువులతో పోరాడారు., ఇక మీదట మనందరి లోపలా ఉండే అసలు శత్రువులతో పోరాడండీ” అని. నిజానికి పెదమామయ్య చెప్పింది ఎవరికీ. కమ్యూనిజం లో ఉన్న అంతర్గత శత్రువుల గురించి ఈమాట చెప్పాడా? లేక ఆధ్యాత్మిక పద్దతిలో ఆత్మ విమర్శ చేసుకోండి అని తన ధోరణిలో చెప్పాడా? లేక రెండూ చేయమన్నాడా?? ఏం చెప్పాడో మాత్రం మనమే తెలుసుకోవాలి. చిట్ట చివరికి “అమ్మ” ఏం చెప్పిందీ? “చివరకు అన్నీ ఒకటేరా అని కదా!”….

ఇక “బూడిదరంగు అద్వైతం”  అసలు డాక్టర్ ఎవరు? “నార్మల్, ఎబ్నార్మల్ ఇవన్నీ మనం కల్పించుకున్నదే అని చెప్పిన సోకాల్డ్ పిచ్చివాడు కామేశ్వర రావ్ డాక్టర్ కాకుండా ఎలా పోతాడూ అనిపిస్తుంది? రచయిత ఏం చెప్పలనుకున్నాడు? “మే బీ షి ఈజ్ సో నార్మల్ దట్ షి ఈజ్ టోటలీ అబ్నార్మల్” అనేనా? యేమో ఏది నార్మల్? ఏదబ్నార్మల్?

ఒక ఊళ్ళో దళితుల మీద దాడి జరుగుతుంది జనం ఓ నిట్టూర్పు విడుస్తారు, మరో రోజు అదే పేపర్లో ఒక ఎన్ కౌంటర్ వార్త వస్తుంది కొందరు నిట్టూరుస్తారు, కొందరు రాజ్య వ్యతిరేకులని అలా చంపాల్సిందే అంటారు. కానీ ఇంకో ఊళ్ళో దేవుడు అని చెప్ప బడ్డ పాము మరణిస్తే జనం కన్నీరు మున్నీరుగా మా దేవుడు చచ్చిపోయాడంటూ ఏడుస్తారు, రోడ్లు దిగ్బంధించబడతాయ్, అధికారులమీద క్రమశిక్షణా చర్యలూ తీసుకోబడతాయ్. నిజమే ఇక్కడ మతం కన్నా మరేదీ జనాన్ని కదిలించదు. నిజానికి “కర్మ” పేరుతో ఈ కదిలించే స్వభావాన్ని చంపేసిన మతమే తన ఉనికి ప్రమాదంలో పడ్డప్పుడు దేన్నైనా కదిలించగలదు. “మాయాదర్పణం” స్పష్టంగా చూపించిన మన “మొహమే” కనబడుతుంది ఈ కథలో. “భర్త చేతిలో పక్కింటావిడ మృతికి “ఎర్రజెండా మహిళా సంఘం వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నారు, కాలేజీ కుర్రాళ్ళు అరెస్టు చేయబడ్డారు. కానీ టీవీలో రామాయణం వచ్చే సమయంలో కరెంటు పోతే మాత్రం  జనంలో “చైతన్యం” పెళ్ళుబికింది. బీభత్సం జరిగిపోయింది. ఆవు పట్టిన దేశంలో ఇంతకంటే కొత్తగా జరిగేదేముంటుందీ?  

చరిత్రని చరిత్రగా నేర్పించటం కాస్త ఇబ్బందే ఈ విశయాన్ని “మతాలు అర్థం చేసుకున్నంతగా మరెవ్వరూ చేయలేకపోయారు” చరిత్రకి పురాణాలని అంటగట్టి నిర్మించిన సాహిత్యం నేడు ఎలా ఉందో చూస్తేనే అర్థమయ్యే విషయం ఇది. ఒక చరిత్ర విదార్థి అర్థం చేసుకున్నట్టు “జమీన్ దారీల కాలం నాటి వ్యవస్తనీ, దళారీ వ్యవస్త బలపడ్డ క్రమాన్నీ మామూలు విధ్యార్థి అర్థం చేసుకోలేడు కానీ “చేపకనుల రాకుమారి” కథ ఎంత సింపుల్ గా ఈ విషయాన్ని చెప్పేసిందీ! ఒక చరిత్రలో ఉన్న రాజుగా రామున్నీ, రాజ్యాధికారం కోసం జరిగిన దాయాదీ యుద్దమైన “కురుక్షేత్రాన్ని “చరిత్ర”గా చెప్పి ఉంటే నందుల రాజ్య పరిపాలనా, చోళ రాజుల కాలంలాగా మామూలు మనిషికి అందనట్టుగానే ఉండిపొయేవి కాదా?! చినరాణీ మీనాక్షీ దేవి గారి తండ్రి రాజావారి మరణం ఆనాటి జమీందారీ వ్యవస్త కుప్పకూలిన విధాన్ని, మేనేజరు ఎలా లాభ పడ్డాడో చెప్తూనే మన దేశంలో దళారీ వ్యవస్త వేళ్ళూనుకున్న విధానాన్నీ ఎంత సులభంగా చెప్పేసాడు ఈ రచయిత!  రాజభరణాల రద్దు ఈ దేశ గ్రామీణ చరిత్రలో ఒక ముఖ్య విషయం అని (మంచా చెడా అన్నది పక్కన పెడితే) మామూలు పౌరునికి ఎట్లా తెలిసేను ఈ కథ చదివితే తప్ప. వాసుదేవరావు అనే ఆ పిల్ల వాడు యువరాణీ మీనాక్షీదేవిని కలిసి ఉంటే బహుమతి ఏమిచ్చేవాడు??

ప్రతీ కథ ఒక చరిత్రకు ముడిపెట్టిందే, ప్రతీ కథా మనం మర్చిపోతున్న లేదా వదిలివేసిన చరిత్రనీ, ఇప్పటికీ దాని ప్రభావంతో ఉన్న వర్తమానాన్ని కలిపి చెప్పేదే  పెదబాబు అక్రమ అరెస్టూ, అతని కళ్ళకు కట్టబడ్డ గంతలూ, అతని ఎన్ కౌంటర్ తెచ్చిపెట్టబోయే ప్రమోషన్ కోసం ఆ కుర్రాడి తలకి తుపాకీ గురిపెట్టి ఏడుకొండలవాడికి మొక్కుకుంటూనే ట్రిగ్గర్ నొక్కిన సీఐ… ఈ మానవ అమానుషానికి సాక్షంగా నిలిచిన ఏడుకానాల వంతెన. ఎవడిది పోరాటం, ఎవడిది ఆరాటం? ఏది యుద్దం ఏది విధ్వంసం?? మన దేశం లో ఎన్ కౌంటర్లు  ఎలా జరుగుతాయో, ఎందుకు జరుగుతాయో ఆ రాత్రే ఏడుకానాల వంతెన తెలుసుకుంది…. ఇంకా ఆ తూటా పేలిన శబ్దం ప్రతిద్వని వినిపిస్తూనే ఉంది. నిజ కాల్పనికత అంటే ఈ ఏడుకానాల వంతెన కథేనా??

ప్రజా పోరాటం ఎన్ని కన్నీటి కథలని ఇచ్చిందీ? యుద్దం ఇప్పుడు ప్రజా జీవితాల్లో భాగమైపోయి సొంత పౌరుల మీదనే ప్రభుత్వం చేసే యుద్దం మరెంత భయంకరంగా ఉంటుందీ,వృత్తి విద్యల హననం, తద్వారా మార్కెటీకరణ, చొరబాటు సామ్రాజ్య వాదపాలనా ఎట్లా మనలోకి చొచ్చుకు వచ్చిందీ అన్న విషయాలు కైలాసం ద్వారా చెప్తూనే. సైడు పోజులో “హరనాథ్ లా ఉన్నాను అనుకొని” విప్లవాన్ని తనకోసం వాడుకోవాలనుకున్న వైకుంఠం రెండు కోణాలుగా కనిపిస్తారు. మధుసూదన మాష్టారిచ్చిన పుస్తకాన్ని ఆ ఇనస్పెక్టరు చూసి ఉంటే, కైలాసం గడ్డం గీసే కత్తిని “సరిగ్గా వాడి ఉంటే!” కథ ఇంకో మెట్టు ఎక్కి ఉండేది. కానీ నిజం వేరేలా ఉంటుంది ఎలాగంటే చివరలో “మనుషులని చంపటం అంత తేలికేమీ కాదు. కసి ఒక్కటే సరిపోదు నిర్థాక్షిణ్యంగా ఉండాలి. మీవాళ్ళు ఇప్పుడిప్పుడే మాదగ్గర నేర్చుకుంటున్నారు” అని ఇనస్పెక్టరు చెప్పిన మాటలంత నిజం లాగా.

మూడుకోణాలు” ఇప్పుడు కూడా ఉన్న కోణాలే మారిన కాలంతో పాటుగా కాస్త రూపాన్ని మార్చుకున్న మూడు కోణాలు. కొండయ్య చేతివంట తినకూడదనుకుంటూనే, వేరే గిన్నెల్లో వండి పెడితే” తినాలనుకున్న గుమస్తా పంతులూ, చుట్టూ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని వెనువెంటనే పరిష్కారాన్ని వెతకగల పొడుగురాజు అనబడే సూర్యణారాయణ రాజు, తాను చేసిన అత్యద్బుతమైన పని తనానికీ “తన ఊరి మొత్తానికీ కావాల్సిన ఉప్పు ని అడిగిన” డుంబ్రీ. ఇప్పటికీ ఈ వ్యవస్తలో వేళ్ళూనుకున్న ఒకానొక సూడో ఇంటలిజెంట్ తనాన్ని, శ్రమ, కీర్తి దోపిడీనీ చూపిస్తూనే, తిరుగు బాటు అనే ఆలోచన కూడా రాని గిరిజన డుంబ్రీ ద్వారా ఇక్కడ గిరిజన ఉధ్యమ అవసరాన్నీ, గిరిజన శ్రమదోపిడీ జరుగుతున్నా పట్టించుకోని మన నిర్లక్ష్యాన్ని చూపించిన విధానం, బ్రిటీషు కాలం నాడు వచ్చిన “అభివృద్ది” కొన్ని వర్గాలకే ఎలా పరిమితమైపోయిందో చెప్పేస్తుంది.

భారీ యంత్రాల అలైన్మెంట్కోసం ఎన్నాళ్ళో కృషి చేసి కనుక్కున్న “ఆప్టికల్ అలైన్మెంట్” ని అవలీలగా వాడి తియోడలైట్ ని బాగుచేయగల సవర డుంబ్రీలు ఎంతమంది ఇంకా ఆకొండల్లో కనుమరుగయ్యారో, ఇప్పటికీ ఎందరు “పెద్ద కాలేజీ పట్టాల ఇంజినీర్లు” అసిస్టెంట్ల ఆలొచనలతో గొప్ప పేరు తెచ్చుకుంటున్నారో, ఆ కొండల్లో మొదలయిన కదలిక ఇంకా ఎప్పటికి వాళ్ళని వెలుగులోకి తెస్తుందో.. ఎవరు చెప్తారు?  

మనం లేకపోతే ఈ దేశం ముప్పైమూడు చెక్కలవుతుంది, ఈ దేశపు లోలోపలి సంఘర్షణలూ, మధ్యయుగ అవలక్షణాలూ బయటపడతాయ్ అనుకున్న జాన్, కెన్ లు ఇద్దరూ ఈ దేశానికి వచ్చే ముప్పుని చెప్పటం.. రైళ్ళలో కలసి కట్టుగా ప్రయాణించటం వల్ల కులాలమధ్య విభేదాలు తొలగిపోతాయి అంటూ “జర్మన్ పాత్రికేయుడైన” కార్ల్ మార్క్స్ చెప్పిన జోస్యం సగమే నిజం కావటం, ఇక్కడి ప్రజలకి ఏదైనా మంచి చేయాలనుకున్న “జాన్” కోరికా అన్నీ కలిపి చూస్తే అనిపిస్తుంది. ఎవరు మనకు నిజమైన శత్రువు? తెల్లవాడా? మనల్ని మనమే దోచుకునే అవకాశాన్ని తెచ్చుక్కున్న మనవాడా? బార్ సప్లయర్ సింహాచలం, జట్కా సాయిబూలని కావాలనే తీసుకువచ్చాడా రచయిత?  ఏదీ అర్థం కాక, ఏదో అర్థమయ్యీ… ఒక ఊగిసలాట, ఏది నిజం? ఏది ఊహ? ఒక వీడ్కోలు సాయంత్రం ఒక పజిల్ సాల్వ్ చేయబోయి మళ్ళీ మరింత చిక్కులోకి పడేసినట్టే అనిపిస్తుంది… ఎక్కడా నిజాన్ని దాచినట్టూ అనిపించక, అలాగని పూర్తిగా చెప్పినట్టూ ఉండక చివరిగా కొన్ని ప్రశ్నలు మనమే వేసుకొని వాటికి సమాధానాలు మనమే చెప్పుకుని “నిజం అర్థమయ్యే దారిలోకి తీసుకొచ్చేకథ ఇది.     

టెలీగ్రాఫ్ ప్రపంచాన్నే ఒక మెట్టు ఎక్కించిన సాంకేతిక విప్లవం లో భాగంగా వచ్చిన ఈ వ్యవస్థ, భారత దేశం లోని తిరుగుబాట్లని అణచి వేసేందుకు వాద్ఫుతారన్న భయమూ, దాన్ని ఆపటానికి చేసిన ప్రయత్నాలూ “అదిగో ఆ తీగలే మా పాలిట యమపాశాలయ్యాయి” అంటూ ఉరితీయబడే తిరుగుబాటు దారుడు అన్న మాటలూ చూస్తున్నప్పుడు. భారత స్వతంత్రానంతరం నక్సలైట్లూ అనబడే తిరుగుబాటు దారులు భళ్ళు భళ్ళున పేలిన “టెలీఫోన్ ఎక్స్చేంజిలు” గుర్తొచ్చాయి. అభివృద్ది ఏ ఏ వర్గాల సౌకర్యం కోసమో కొద్దికొద్దిగా అర్థమయ్యి అదోరకమైన భాధ నిండిపోతుంది. వార్తా హరులుగా ఉన్న కాలియా, మరియంల ఆశల్లాగే కుప్ప కూలిన వారి తిరుగుబాటు యత్నమూ, తర్వాత వాళ్ళ జీవితాల్లో ముందుకు సాగిన తీరూ ఆ పాత్రలని మరిచిపోనివ్వవు, అన్నిటికంటే ముఖ్యంగా సూజన్ పడ్డ వేదన కూడా అత్యంత హృద్యంగా ఉంటుంది. సామ్రాజ్యాలని నిలబెట్టటానికి తమ ప్రాణాలను అడ్డువేసే “జాన్” లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఉంటారుకూడా. కథలో కాలియాని దలితుడు గానూ, మరియంని ముస్లింగానూ చూపించటం ఎంత మాత్రమూ కాకతాళీయం కాదు. మరీ ముఖ్యంగా కావాలనే ఈ ప్రయత్నం చేసినట్టుంది రచయిత. అంతే కాదు “కాలియా బాగా కింది కులం వాడట, అతనికి గొడ్డుమాంసం ముట్టనూ అనే పట్టింపులు ఉండవు కాబట్టే అతను దొరలకు ఇష్టమైన వంటవాడయ్యాడు అన్న మాట చెప్పటమూ కేవలం కథ రాసే “ఫ్లో”లో వచ్చిన వాక్యం కాదు.  

తెగిన నూలుపోగు ఒకానొక అత్యద్బుతమైన “మార్కెట్” విశ్లేషణ. తండ్రి కొనాలనుకున్న మగ్గాలనీ, గోదాములనీ దాటి సొంత ఓడలూ, సొంత కుంఫిణీ వరకూ ఆలోచించిన గురవయ్య. కాస్త తాగాలనీ, ఇంకాస్త విలాస జీవితాన్ని అనుభవించాలని కోరుకున్న గురవయ్యని చూస్తే ఈ తరం యూనివర్సిటీల్లో తిరుగు బాటు దారులుగా ముద్ర వేసుకున్న ఎందరు యువకులే గుర్తొస్తారు. అవును వీళ్ళకి జీవితం మీద వల్లమాలిన ప్రేమా, సమాజం మీద అత్యంత ఇష్టమూ సమపాళ్ళలో ఉన్నాయి. అయితే ఇంత వేగంగానూ, పై స్థాయిలోనూ ఆలోచించే యువకులంటే రాజ్యాలకీ, అధికారులకీ ఎప్పుడూ భయమే. గురవయ్యకి పడ్డ శిక్ష తగ్గించటానికి “లంచం ఇచ్చే ఆఫర్ ఇచ్చిన” కొత్వాల్ లు మాత్రం ఇప్పుడు కష్టమే.

కాలం అత్యంత కౄరమైంది దేన్నైనా తనలో కలిపేసుకొని వెళ్ళిపోతుంది. ఒక సిద్దాంతం, ఒక మతం, ఒక జీవన విధానం ఏదైనా కావొచ్చు ఒక పీరిడ్ ఆఫ్ టైం తర్వాత కాలంతో పాటు మారిపోతాయి, పోవాలి కూడా చివరిగా దీపాంకరుడు తెలుసుకున్నది కూడా ఇదేనేమో. అత్యంత లోతుల్లోకి వెళ్ళి పరిశోధన చేస్తే తప్ప “తూరుపుగాలులు” లాంటి కథ సాధ్యం కాదు. భారత దేశ బౌద్ద మూలాలనుంచీ చర్చించిన కథ ఇది. నలందాలో ఙ్ఞానాన్వేషకుడిగా వెళ్ళిన దీపాంకరుడు అక్కడ మహా విధ్వంసాన్ని చూశాడు, తురుష్కులు చేసిన ఊచకోతనీ చూశాడు. విచలితుడై తిరిగి వచ్చాడు మళ్ళీ కోలుకుంటున్న క్రమంలో సింహళదేశంలో గురువు శాంతి దేవుడి మరణాన్నీ చూసాడు, తనమీద జరగబోయే హత్యాప్రయత్నాన్ని తప్పించుకొని ధాన్యకటకం చేరాడు. ప్రతీ మజిలోనూ ఒకటే ఆలోచన, పాలకులనూ రాజులనూ కాదు ప్రజలను ప్రభావితం చేయాలి బౌద్దాన్ని విస్తరింపజేయాలి అన్నదే ఆలోచన. కానీ చివరికి తథాగతుడైన బుద్దుడు “నా తర్వాత వెయ్యేళ్ళకు బౌద్దం ఈ దేశం నుంచి నిష్క్రమిస్తుందని” చెప్పినట్టే జరిగింది. మొత్తంగా కథ చరిత్రనీ వర్తమానాన్నీ, ఒకానొక సత్యాన్నీ తెలుపుతూ చివరగా “వజ్రయాన విధానంలో తెలుసుకున్న తానుపుట్టిన ప్రదేశంలోనే” తన అస్తికలు కలపాలని కోరుకున్న దీపాంకరుడి ద్వారా మనకేమైన అర్థం అవుతుందా??   

కొన్ని కథలంతే మనం ఉన్న స్థానం నుంచీ, మనం బతుకుతున్న సమయం నుంచీ స్థల, కాల,ప్రదేశాలను దాటించి మరీ ఇంకొక్క త్రిశంకు ప్రపంచం లోకి మనల్ని తీసుకు పోతాయి. యేమో..! ఇట్లా ఈ 13 కథలు హైదరాబాదు నుంచీ 2018 నుంచీ సుదూరంగా వెనక్కి తీసుకు పోయి మరీ ఎక్కడో పడేసాయి. వినీ, చదివీ కాకుండా అనుభవించిన కథల్లో ఈ కథలు ఉండి తీరతాయని ఈ 21శతాబ్దపు పాఠకుడిగా చెప్పగలను. ఎందుకూ అన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే . “చదవండి” .  నిజమే ఒక్కసారిగా టైం మిషన్ లోకి ఎక్కినట్టు మళ్ళీ వెనక్కి వెనక్కి భారతదేశపు బాల్యానికి వెళ్ళిపోతే?  ఇప్పుడు చూస్తున్న భారత దేశపు స్వరూపమే మరోలా ఉండి ఉండేమో….

నరేష్కుమార్ సూఫీ

9 comments

  • బాగుంది నీ అత్యాశ. వెళ్ళిపోదామనే? కధల గురించి నవీన్ కొంత చెప్పాడు, నువ్వు పూర్తి చేశావు. ఇక చదవాలి. నువ్వు చెప్పినట్టు, టైం మషీన్ ఎక్కేందుకు !

  • మంచి పరిచయ విశ్లేషణ . కధలను తప్పక చదివించి ఆలోచింపచేసే శక్తీ ఉంది ఈ విశ్లేషణలో . వినీ, చదివీ కాకుండా అనుభవించిన కథల్లో ఈ కథలు ఉండి తీరతాయని ఈ 21శతాబ్దపు పాఠకుడిగా చెప్పగలను. ఎందుకూ అన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే .” “చదవండి” . నిజమే ఒక్కసారిగా టైం మిషన్ లోకి ఎక్కినట్టు మళ్ళీ వెనక్కి వెనక్కి భారతదేశపు బాల్యానికి వెళ్ళిపోతే? ఇప్పుడు చూస్తున్న భారత దేశపు స్వరూపమే మరోలా ఉండి ఉండేమో…” ఈ మాటలు చాలు చదివేలా చేయడానికి. ఈ విశ్లేషణ చదివితే జర్మన్ నాటక కర్త బెట్రోల్డ్ బ్రెక్ట్ చెప్పిన alienation , అంటే వాటిలో లీనమవ్వకుండా చదివి ఆలోచించవలసిన కదలని అర్ధమవుతోంది. తప్పక చదివించేలా రాసిన ఈ పరిచయానికి థాంక్స్

  • చదవాలి నరేష్ ఈ కధల్ని ఒక కొత్త ఉత్తేజానికి ఒక కొత్త ఒరవడికి , నీ సమీక్ష అంత బాగుంది

  • వెంటనే కథలు చదవాలనే తొందర కలిగించే విశ్లేషణ.. అన్ని కోణాలు స్పర్శించింది..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.