కొప్పులో రగిలే దవనమాకుల అలికిడి

ఇది సిద్ధార్థ కవిత్వం. తనను తాను కవి వాగ్గేయకారుడనని పరిచయం చేసుకుంటాడు. వచన కవితే. కాని చెప్పడు. పాడుతాడు. తనకు సంగీతం వొచ్చు. సిద్ధార్థ ఎవురంటే ఏం చెప్పను? మెటఫిజికల్ కవి జాన్ డన్ ను తెలుసుకున్న తెలుగోడు. మాటలు వైలిన్ తీగలు. తెలంగాణా ఏక్ నహీ అనేక్ హై అంటాడున్నట్టుండి. తనను చూస్తే.. వింటే.. తెల్లారు ఝామున రెండు రాగి చిడతలు కణ్ కణ్ మోగిస్తూ ‘చెత్త చీకటిని తోసేస్తూ’ వీధిలో నడిచే భిక్షుక సాధువు మనసులో నడుస్తాడు. కవిత్వం అర్థమవుడేంది అంటో అర్థమవుతాడు, బయటికి చెప్పడానికి వల్లగాని అర్థం. ఊరి వేర్లను వొదులుకోకుండా నగరం ఆకాశాల్ని స్పృశించే ఆర్గానిక్ ఇంటల్లెక్చువల్. వొంటి మీద పెద్ద కంతి లేసినట్లు అది కులమో కుళ్లిన స్వార్థమో అటు ఇటు బెసకనీయని ఇరుకుతనమేదో నిన్ను తినేస్తోందని తెలుస్తుంది సిద్ధార్థ వెంట చదువుతుంటే. ఔను, తనను చదవడం వుండదు, తన వెంట చదవడమే వుంటుంది. ఇక్కడ తను లేడని ఏం లేదు. వుంటాడు తన పదాల్లో. మీరు నడవండిక తన వెంట, కాగితాన్ని మీటి పాడే మనిషి పదాల వెంట. వాడి చేతిలోని చిరు ఢమరుకం వెంట, లేదా తెల్లారడానికి ముందు తాళం కొట్టే రాగి చిడతల వెంట. చిరు చిరు చీకట్లలో, మసక మసక వెలుతురులో, ‘బాయి బొమ్మల’ కేళిలో కొంచెం కొంచెం కరిగిపోయి, మళ్లీ కొత్తగా కలుసుకుని కొత్త కొత్త జన్మలెత్తే మెర్క్యురీ మనుషులై పోదురు గాని ‘నీ రక్తంలోని నా జీవిగంజిని/ బొట్టుబొట్టుగ/ సుక్కపొద్దు కల్లుబొట్టుగ’ మూటికి మూడు సార్లు చిందుల ఛీర్లు చెప్పుకుంటూ… ఇంతే కదా, ఇంకేముంటుంది ‘సంతవొదిలి పోయేముందు …’

 

రంగక్కో …

దింపెయ్ రంగక్క దింపెయ్యే నన్ను
కళ్ళెంలోంచి దింపెయ్
సాలు సాయవాన్నుంచి తెంపి పారెయ్
చెత్త చీకటిగా … తోసి పారెయ్
బట్టలు చింపి … నన్ను పాశిపొమ్మని చెప్పు
నీ రక్తంలోని నా జీవిగంజిని
బొట్టుబొట్టుగ
సుక్కపొద్దు కల్లుబొట్టుగ
సంతవొదిలి పోయేముందు …
నా ఊరు పొలిమేరలో… నన్ను కాలిపోనియ్
ఆరిపోనియ్
అంబెటాల మధిర మాంసాల కాటుక సీకట్లలో
కలిసిపోనియ్
దింపెయ్  దింపెయ్
దింపెయ్యే నన్ను
రంగక్కో దింపు ఒంపు జీవాన్ని
దింపుడు కళ్లెంగా దింపుకో నీలో…
రంగక్కో ;

పెనుకంతి

జర్గరు బయటికి రారు వానకు తడువరు విప్పుకోరు గాలాడనీయరు
ఆగరు ఇరుక్కపోతరు ఇరుసుక పడిపోతరు పక్కోని సోయేపడదు
అంటనే అంటరు నేనంతే వానిలాగే నాదింతే .. నాకింది నాకినంత
వానికొచ్చిందంత నాదే… కొంత కొంతనే నవ్వుత కొంత కొంతనే
జరుగుత గల్తీ గల్తీగా ఏమన్నడుగుతడో ఏమో గల్తీ గల్తీగా ఏమన్న
అడుగుతడో ఏమో దగ్గరయ్యి లోపలి సామాన్లను అడక్కపోతడో
ఏమో ఉద్దెరయ్యమంటడో ఏమో… దూరంగా నిలవడ్త దూరంగా
నిలవెడ్త ఇంచుల దూరం ఇంచుల స్నేహం ఇంచుల మందం దగ్గరితనం
నీళ్లఛాయ్ల దాకనే మర్యాద ఎక్కువ నవ్వొద్దు గుండెలవెట్టద్దు రంది
బొందల కూడు గసెక్కి గసెక్కి అంత సాపుగ కనబడాలె దుఃఖమెలగక్కొద్దు
ఎవ్వడు అందిరాడు ఎవ్వడు కెల్కడు కలెన్నం లోపలేం లోపలేం చేసుకున్నా ఏం గాదు
ఎంత లంగపని చేసినా చేస్కో నీ ఇష్టం తలుపు తెరువు పర్దేసుకుని
చేస్కో… అంత లోపలి చెత్త లోపల్నే తొయ్ గాజుల సప్పుడు
రానీయకు మూతి తుడుసుకుని రా గంభీరంగుండు సుట్టుపక్కల
ఎవ్వనికేం తెల్వదనుకో .. పైసున్నోళ్ళంత బంధుబలగం తలనాడించు
తోకూపు తోకతో తోకగా పైసా పైసా చీమలో చీమ దోమలో..
గోస కామ ఈగలోపలి ఈగగా పురుగొకటిగా పుండొకటిగా
థూ .. నీ గ్లోబల్ బతుకుల మన్నువొయ్య ఈ మానవ ఘాతకం
మీద ఉచ్చవొయ్య కులకంతి భుజమ్మీద పెరిగి పెరిగి నేనే వొక
పెన శాపెన కంతినయ్యి

యాల పొద్దుగాల

రాయాలి రాయాలి
విస్మృతంగా రాయాలి
వినమ్రంగా రాయాలి
తెరను తీసెయ్యాలి
నిద్రలోని పెను మెలుకువలోకి
సుతారంగా స్వరం స్పృశించినట్టు
ముసురు ముట్టిన సింగిడితో
అరమెర పేజీలను అంటించి రాయాలి
గాలిలోని గంధం నీదే అంటూ…
పాటనెత్తుకోవాలి…
నుదుర మీది మడతోలె
గండెమ్మ గుండోలె
వొడ్డెర బక్కమ్మోలె
పగిలే రాత్రి…
పలకరించేలాగా
నవ్వేలాగా చించెరువు
యాల పొద్దుగాల సుతారంగా
ఆమె అరిపాదాలను నొక్కినట్టు
దూపారినట్టు
దవనమాకులు అలికిడితో
కొప్పులో రగిలి పొగిలి
నా చెంతలోకి చిన్నతనమంతా
నడిచొచ్చినట్టు…
వొక్క అక్షరం ముక్క రాలకుండానే
అమాస పొద్దుగాల ఆయాసం తగ్గించిన
తాపిన
దుఃఖరసాన్ని పిండాలి… పిండాలి
నన్ను నాలోంచి నిన్నుగా
మాయమ్మా…
నీ కడుపు చూపుల నివేదనంతా
తెలిసొచ్చినట్టు
నువారినట్టు  – తెలవారినట్టు
దీపం …
తన కనురెప్పల్ని తానే మూసుకున్నట్టు
రాయాలి రాయాలి
చప్పుడు లేకుండా పొద్దెక్కినట్టు
దాని సరాన పడ్డట్టు
రాయకుండానే
రాస్తూ పోవాలి

సిద్ధార్థ

ప్రముఖ కవి. హైదరాబాదులో వుంటారు.

3 comments

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.