పదాల్లో కనిపించే వెన్నెల నీడలు

వినోదా వారి ‘దేవదాసు’ చిత్రంలో పాటలన్నీ ఆణిముత్యాలే అని ఈరోజు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు.

ముఖ్యంగా టైటిల్ పాత్ర దేవదాసు జీవితంలోని అంతులేని దుఃఖాన్ని ఆవిష్కరించే పాటల్లో, ఎడమైపోయిన పార్వతిని తలచుకొంటూ పాడుకునే ‘చెలియలేదు చెలిమిలేదు’, తాగుడుకు బానిసై పాడుకునే అధివాస్తవిక గీతం ‘ కుడిఎడమైతే పొరపాటు లేదోయి’, చివరికి మరణం ఆసన్నమై పాడుకునే వెర్రివేదాంతపు పాట జగమేమాయ, ఇవన్నీ ఘంటసాల, నాగేశ్వరరావు, సముద్రాల, సుబ్బరామన్ గార్లకు కీర్తికిరీటాలు గా నిలిచిపోవడమే కాక, ఆ పాటల్లో మాటలు పలుకుబళ్ళు గా తెలుగు భాషలో చేరి పోయాయి.

వీటన్నిటికంటే ముందు వచ్చే మరో అతిమధుర విషాద గీతం ‘కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే’ అన్న పాట.  

వివాహమై పార్వతి పల్లకిలో వెళ్లిపోతుంటే నిస్సహాయంగా నిలుచున్న దేవదాసు అంతరంగాన్ని ప్రతిబింబిస్తూ, అతని పతనానికి నాంది పలుకుతూ నేపథ్యంలో వచ్చే పాట ఇది.

మిగతా అన్ని పాటలలానే ఈ పాట సాహిత్యం కూడా అద్భుతంగా ఉంటుంది.

కల ఇదనీ నిజమిదనీ

తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే

పసితనపూ మనోరథం

వెన్నెలనీడై పోయేనులే బ్రతుకింతేనులే

 

ఎవియో మురిపాలెటకో పయనాలు

దైవాల నీమాలింతే, వరమింతే

చివురించిన పూదీవే విరియగా

విరితావులు దూరాలై చనేనులె

ప్రేమ ఇంతేలే ,  పరిణామమింతేలే

 

నెరవేరని ఈ మమకారాలేమో

ఈ దూరభారాలేమో, హితవేమో

ఎది నేరని ప్రాయానా చనువునా

రవళించిన రాగమ్మే తిరమ్మవు

యోగమింతేలే ,  అనురాగమింతేలే   

 

పార్వతిమీద అనురాగం కరిగిపోతున్న కలలాగా ఒకపక్క, ఎదురుగా కనిపించే కఠోరమైన నిజం ఒకపక్క, ఈ రెండిటినీ అర్థం చేసుకోలేక నిశ్చేష్టుడైన దేవదాసు వాస్తవంతో రాజీ పడటానికి చేసే ప్రయత్నంతో మొదలవుతుంది పల్లవి.

కల ఇదనీ నిజమిదనీ

తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే

అంటూ.  దీనికి కొనసాగింపుగా ..  

పసితనపూ మనోరథం

వెన్నెలనీడై పోయేనులే బ్రతుకింతేనులే

వెన్నెలకాంతి లాంటి చిన్ననాటి ఆశలు చీకటినీడలాగా మారిపోయినట్టుగా ఉందని చక్కని వర్ణన చేశారు సముద్రాల.  

ఎవియో మురిపాలెటకో పయనాలు

దైవాల నీమాలింతే, వరమింతే

ఒకచోట వారిద్దరి ప్రేమలు, మరి ఎక్కడికో పార్వతి ప్రయాణాలు, ఇవన్నీ దైవాల నియమాలు.  ఇదంతా ఒకచోట విరిసిన పూలతీగ సుగంధం ఎక్కడికో గాలిలో వెళ్లిపోవడం లాగే ఉందట.

చివురించిన పూదీవే విరియగా

విరితావులు దూరాలై చనేనులె

ప్రేమ ఇంతేలే ,  పరిణామమింతేలే

ప్రేమకు పరిణామం ఎడబాటేనని తనను తాను సమాధాన పరచుకుంటాడు.  అయినా …

నెరవేరని ఈ ప్రేమ ఏమిటో, ఈ దూరమై పోవటాలు ఏమిటో అని ఇంకా ప్రశ్నలు ఉదయిస్తూనే ఉంటాయి (ఇక్కడ దూరభారం అనే చక్కని జాతీయం సార్థకంగా వాడారు సముద్రాల).

నెరవేరని ఈ మమకారాలేమో

ఈ దూరభారాలేమో, హితవేమో

ఒక రకంగా అదే మంచిదేమో, ఏమీ తెలియని వయసులో పాడుకున్న పాటలు, ఆ అమలిన అనురాగం, అలాగే మిగిలిపోవడం మంచిదేమో.

ఎది నేరని ప్రాయానా చనువునా

రవళించిన రాగమ్మే తిరమ్మవు

యోగమింతేలే ,  అనురాగమింతేలే   

ఈ జీవితానికి అంతే స్థిరమైన యోగం, ప్రాప్తం, అని సరిపెట్టుకుంటాడు చివరికి.

 

చిన్నతనం, ఆనాటి స్నేహమాధుర్యం, అమాయకంగా కన్న కలలు కోరికలు, ఈనాటి ఊహించని పరిణామాలు, ఇవన్నీ విధి నేర్పే పాఠాలు, ఇదే చివరికి జీవితం అన్న భావన పాట అంతటా పరచుకుని ఉంటుంది.

ఈ విధంగా పాత్ర మసత్వాన్ని చిత్రించడానికి ప్రౌఢకవి, అవధాని, సముద్రాల రాఘవాచార్యులవారు, అపురూపమైన మాటల్ని, ఉపమానాన్ని వాడారు.  

పసితనపూ మనోరథం వెన్నెలనీడై పోయేనులే, ఎవియో మురిపాలెటకో పయనాలు, చివురించిన పూదీవే విరియగా విరితావులు దూరాలై చనేనులె, ఎది నేరని ప్రాయానా చనువునా

రవళించిన రాగమ్మే – మొదలైన పాదాలు ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటాయి.  

 

మద్దుకూరి విజయ్ చంద్రహాస్

మద్దుకూరి విజయ చంద్రహాస్: సాహిత్యం సంగీతం ప్రత్యేకంగా అభిమానిస్తారు. వినడం, చదవడం, ఎప్పుడైనా వ్రాయటం, నచ్చిన వాటి గురించి ఆసక్తి ఉన్నవారికి చెప్పటం, సహధర్ములతో సమయాన్ని గడపటం ఆయనకు ఇష్టమైన విషయాలలో కొన్ని. ప్రస్తుత నివాసమైన డాలస్ లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తోచిన సహాయం చేయటం కూడా ఒక వ్యాపకం.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.