మూర్ఖత్వం మూకతత్వం !!

మ‌నువు వార‌సుల‌కు, ఈ దేశ మూల‌వాసుల‌కు జ‌రుగుతున్న యుద్ధ‌మే భార‌త దేశ చ‌రిత్ర అంటారు మ‌హాత్మ జ్యోతిరావు పూలే. ఈ యుద్ధం తాలూకు వాతావ‌ర‌ణం రోజురోజుకు మ‌రింత బ‌ల‌ప‌డుతోంది. అయితే ఆ యుద్ధం ఏక‌ప‌క్ష దాడి కావ‌డ‌మే విషాదం. మ‌తం మ‌త్తుమందు అన్నాడు కార‌ల్ మార్క్స్. ఇవాళ ఇండియాలో మ‌తం అంటే ద‌ళితులు, మైనారిటీలు, మ‌హిళ‌ల‌ల పాలిట మృత్యుపాశం. అగ్ర‌వ‌ర్ణ హిందూ బ్రాహ్మ‌ణీయ శ‌క్తులు మునుపెన్న‌డూ లేనంతగా విజృంభించ‌డం బాధిత వ‌ర్గాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

హిందూ జాతీయ వాదం క్ర‌మంగా స‌మ‌స్త రంగాల‌ను ఆక్ర‌మిస్తున్న‌ది. సామాజిక రంగాన్ని అత‌లాకుత‌లం చేసిన అనుభ‌వాల నుండి ఇవాళ రాజ‌కీయ రంగంలో త‌న ప్ర‌భావాన్ని బ‌లంగా వేస్తున్న‌ది. తన ల‌క్ష్యాన్ని స‌మ‌ర్థించే వారినే పాల‌కులుగా ఎన్నుకోవ‌డానికి సిద్ధ‌ప‌డుతున్న‌ది. త‌మ‌ను విమ‌ర్శించే వారిని నిర్మూలించ‌డానికి ప‌థ‌కం ప్ర‌కారం దాడులు చేస్తున్న‌ది.

గ‌తంలో సంఘ‌ప‌రివార్ కు శ‌త్రువు కేవ‌లం మైనారిటీలు మాత్ర‌మే. ఇవాళ మ‌నువాద ఎజెండాతో సాగుతున్న ఈ హిందుత్వ సంఘాల‌కు ద‌ళితులు, మ‌హిళ‌లు, అభ్యుద‌య శ‌క్తులు, ప్రశ్నించే గొంతుక‌లు టార్గెట్ కావ‌డం ఊహించిన ప‌రిణామమే. దేశంలో నిత్యం ఏదో ఒక మూల‌న దాడులు య‌థావిధిగా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ ప‌రంప‌ర‌కు ఎలాంటి విరామం లేకుండా దాడులు చేయ‌డం వెన‌కాల సంఘ‌ప‌రివార్‌కు, దాని అనుబంధ సంఘాలకు భ‌య‌పెట్టి ఓట్ బ్యాంకు కొల్ల‌గొట్టాల‌నే ల‌క్ష్యం ఉన్న‌ట్టుగా ఎవ‌రికైనా సుల‌భంగానే అర్థ‌మ‌వుతుంది. మొన్న‌టి యూపీ ఎన్నిక‌ల్లో క‌నీసం ఒక్క ముస్లిం అభ్య‌ర్థికి కూడా టికెట్ కేటాయించ‌క‌పోవ‌డం ఇందొకొక ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే.

దేశవ్యాప్తంగా గడిచిన నాలుగేళ్లలో మూడువేల అల్లర్లు జరిగాయి. వాటిలో389మంది మరణించగా 8,890మంది గాయపడ్డారని కేంద్ర హోంశాఖ చెబుతున్న నివేదిక. ఇందులో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలోనే 121మంది మరణించారు. ఇక మూక అల్లర్లలో మరో 27మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పౌర స‌మాజాన్ని కాపాడాల్సిన ప్ర‌భుత్వాలు, దాడులు చేసే మూక‌ల వైపు నిల‌బ‌డుతున్నాయి.  ఈ విధంగా ప్రభుత్వాలు దాడుల‌కు ప‌రోక్ష మద్దతు ఇస్తున్న తీరు బ‌ట్ట‌బ‌య‌ల‌వుతున్న‌ది. దాడులు జ‌రుగుతున్నంత సేపు ఏ మాత్రం నోరు మెద‌ప‌ని మోడీ, రెండు మూడు వారాల త‌రువాత మాత్రం ఒక చిన్న ప్ర‌క‌ట‌న చేసి, చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేస్తారు. ప్ర‌భుత్వ‌మే ఉద్దేశ్య‌పూరితంగా దాడులు చేయిస్తున్న‌ది అన‌డానికి ఇంత‌కు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి?

ఏ దేశంలోనైనా ప్ర‌జాప్ర‌తినిధులుగా విద్యావంతులో, మేధావులో ఉంటే మేలు జ‌రుగుతుంది. కానీ, ప్ర‌స్తుతం బీజేపీ హ‌యాంలో ఇందుకు భిన్న‌మైన సీన్ క‌నిపిస్తున్న‌ది. గ‌తంలో ఎన్న‌డూ లేనంతా సాధులు స‌న్యాసులు పాల‌కులుగా మారుతున్నారు. బీజేపీ కావాల‌ని వారిని రాజ‌కీయాల్లోకి తీసుకువ‌స్తున్న‌ది. వారిని అడ్డు పెట్టుకుని మెజారిటీ ఓట్ల‌కు గాలం వెయ్యాల‌న్న ఎజెండాను అమ‌లు చేస్తున్న‌ది. సాధులు, స‌న్యాసులు పాల‌కులు కావడం మూలంగా మూఢ‌న‌మ్మ‌కాలు, అశాస్ర్తీయ‌త రోజురోజుకు విస్త‌రిస్తున్నాయి. ఇలాంటి స‌న్నాసి ప్ర‌జాప్ర‌తినిధులు ఇచ్చే స్టేట్‌మెంట్స్ ఎవ్వ‌రికైనా న‌వ్వు తెప్పిస్తాయి. స‌రిగ్గా మ‌ధ్య‌యుగాల్లో బ‌తుకుతున్నట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం వీరికి నిత్య‌కృత్య‌మైంది. ప్ర‌పంచం రోజురోజుకు టెక్నాల‌జీ వైపు ప‌రుగులు తీస్తుంటే కాషాయ పాల‌కులు మాత్రం తిరోగ‌మ‌న దారిలో స‌మాజాన్ని మ‌ళ్లీ చీక‌టి యుగాల‌వైపు న‌డిపించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

ఇవాళ మ‌త ఉన్మాదం కులోన్మాదం వైపు ప‌రుగులు తీస్తున్న‌ది. రాజ్య‌మే స్వ‌యంగా కులంగా మారుతున్న‌ది. అధికారంలో ఉండే అగ్ర‌వ‌ర్ణ పాల‌కులు త‌మ అధికారాన్ని కాపాడుకోవ‌డానికి రాజ్యాన్ని కులంగా, కులాన్ని రాజ్యంగా మారుస్తున్నారు. గ‌తంలో ఈ దేశంలో ద‌ళితుల‌పై దాడుల‌ను అగ్ర‌కులాలు చేసేవి, ఇవాళ ఆ ప‌రిస్థితి మారిపోయి క్ర‌మంగా రాజ్యం కూడా కులంగా మారుతున్న సంద‌ర్భ‌మిది. పాల‌కులు దేశ రాజ్యాంగానికి కాకుండా కులాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తూ, కులం పేరుతో జ‌రిగే రాజ్యహింస‌ను పెంచి పోషిస్తున్నారు. తెలుగు నేల మీదే కాదు దేశంలో ఎక్క‌డ దాడులు జ‌రిగినా దానికి పాల‌కుల మ‌ద్దతు అధికారికంగా ల‌భిస్తున్న‌ది. కంచిక‌చ‌ర్ల నుండి కారం చేడు దాకా, చుండూరు నుండి నేటి రాపూరు దాకా జ‌రుగుతున్న ద‌ళితుల‌పై దాడులే ఇందుకు సాక్ష్యం.

ఎక్క‌డ హిందుత్వ‌కు వ్య‌తిరేకంగా మాట్లాడినా వారిని నిర్మూలించేవ‌ర‌కు అస‌హ‌న దాడులు నిర్విరామంగా కొన‌సాగుతున్నాయి. అట్లా నేల‌కొరిగిన‌వారే ద‌బోల్క‌ర్‌, ప‌న్సారే, క‌ల్బుర్గి, గౌరీ లంకేష్‌లు. ఈ హ‌త్య‌ల ప‌ర్వానికి పుల్‌స్టాఫ్ ప‌డుతుంద‌నే ఆశ ఎవ‌రికీ లేదు. హిందుత్వ పేరుతో చేసే ఏ దుర్మార్గాన్ని కూడా ప్ర‌శ్నించొద్ద‌నే సంకేతం పంప‌ద‌లుచుకున్నారు. ఇందులో భాగంగానే మూకోన్మాద దాడిలో స్వామి అగ్నేవేశ్ మీద దాడి జ‌రిగింది. కాషాయ వ‌స్ర్తాలు ధ‌రించిన ఒక హిందువును సైతం వీరు సహించే ప‌రిస్థితి లేదు. గ‌తంలో ముస్లిములు, క్రైస్త‌వులు, కమ్యూనిస్టులు మాత్ర‌మే వీరి ల‌క్ష్యం అనుకున్న భ్ర‌మ‌ల్ని ప‌టాపంచ‌లు చేస్తూ హిందువుల‌ను సైతం వ‌దిలిపెట్ట‌మ‌ని నిరూపించింది ఈ దాడి.

ఆర్ ఎస్ ఎస్‌గా పిల‌బ‌డే  రాష్ర్టీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ ఇటీవ‌ల దాని పంథాను మార్చింది. గ‌తంలో శాఖ‌లు నిర్వ‌హించేట‌పుడు క‌ర్ర‌సాము నేర్పేవారు. ఇవాళ క‌త్తి సాముతో పాటు, తుపాకీ పేల్చ‌డం వంటి వాటిలో శిక్ష‌ణ‌ను ఇస్తున్న‌ది. ఎవ‌రిని చంపాలో, ఎలా చంపాలో ప‌థ‌కం ప్ర‌కారం శిక్ష‌ణ శిబిరాలు నిర్వ‌హిస్తున్న‌ది. ఇది తీవ్ర‌వాదం కంటే ఏ విధంగాను భిన్న‌మైన‌ది కాదు. నీ దేశంలో పుట్టిన, నీ తోడ పుట్టిన వాడి ప‌ట్ల తీవ్ర ద్వేషాన్ని నింపి చంప‌డానికి కూడా వెనుకాడ‌ని భావ‌జాలం ఈ దేశానికి ఏ విధంగా మేలు చేస్తుందో సంఘ‌ప‌రివార్ శ‌క్తులు ఆలోచించాలి. తుపాకులు వాడుతున్న సంస్కృతికి క‌ల్బుర్గి, గౌరీ లంకేశ్‌ల హ‌త్య‌లే నిద‌ర్శ‌నం. ఆయుధాల వాడ‌కంలో ఈ శ‌క్తులు టెర్ర‌రిస్టుల‌ను అనుస‌రించ‌డం జాతి స‌మైక్య‌త‌ను దెబ్బ‌తీస్తున్న ప‌రిణామం.

550 సంస్థానాలుగా ఉన్న రాజ్యాల‌ను ఏక‌తాటి పైకి తెచ్చింది బాబా సాహెబ్ అంబేద్క‌ర్ నేతృత్వంలో రచించ‌బ‌డిన భార‌త రాజ్యాంగం. ఇది స్వేచ్ఛా, స‌మాన‌త్వం, సౌభ్రాతృత్వం అనే విలువ‌ల‌ను ప్ర‌బోధిస్తుంది. హిందుత్వ శ‌క్తుల‌కు ఇది ఇష్టం లేదు. అందుకే ‘‘మ‌నుస్మృతి’ని’ అమ‌లు చేస్తూ రాజ్యాంగ హ‌క్కుల్ని హ‌రిస్తున్నారు. అగ్ర‌వ‌ర్ణ పాల‌కులు ఎవ‌రైనా స‌రే బ్రాహ్మ‌ణిజానికి ప‌ట్టం గ‌డుతూ భార‌త రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు.

దేశంలో ముఖ్యంగా హైద‌రాబాద్ వంటి చోట‌, శ్రీ‌రామ న‌వ‌మి, హ‌నుమాన్ జ‌యంతి వంటి పండుగ‌లు ప‌బ్బాల‌ను కూడా హిందుత్వ రాజ‌కీయాల‌కు వేదిక చేసుకుంటున్నారు. భారీ విగ్ర‌హాల రౌద్రంతో నిండిన చూపులు ఆధ్యాత్మిక‌త‌ను గాక మ‌త విద్వేషాన్ని మాత్ర‌మే రెచ్చ‌గొట్ట‌డానికి ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. ఇది బోనాల పండుగ వంటి గ్రామ‌దేవ‌త‌ల ఊరేగింపుల్లో కూడా చొర‌బ‌డ‌డం ఇటీవ‌లీ ప‌రిణామం. ఒక‌నాడు రామ‌జ‌న్మ‌భూమి పేరుతో దాడులు, దౌర్జ‌న్యాలు చేసిన సంఘ‌ప‌రివార్ శ‌క్తుల‌కు బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక గోవు ఒక ఆయుధంగా దొరికింది. ద‌ళితులు, ముస్లిముల‌కు బీఫ్ అనేది ఒక‌వైపు పౌష్టికాహారంగా, మ‌రోవైపు ఉపాధి వనరుగా ఉంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ప‌రివార్ గోవును తెర మీదికి తెచ్చారు. గో హ‌త్య‌ల‌ను అడ్డుకుంటామ‌నే పేరుతో అమాయ‌కుల‌ను ప‌ట్టి కొట్ట‌డం చంప‌టం ప్రారంభించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఆక్లాక్ మొద‌లు ఇది దేశ‌మంతా పాకింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ దాడుల‌కు హ‌ద్దే లేకుండా పోయింది. కార‌ణం అధికార ప‌క్షం అండ‌దండ వారికి మెండుగా ల‌భించింది. నిజానికి బీఫ్ తిన‌డం అంటే కేవ‌లం ఆవును మాత్ర‌మే తిన‌డ‌మ‌న్న‌ట్టు హిందుత్వ శ‌క్తులు ప్ర‌చారం చేశాయి. ఒక్కో చోట, ఒక్కో ర‌కంగా బీఫ్ వాడ‌కం ఉంది. ఆంధ్రాలో ద‌ళితులు తినే బీఫ్ అంటే దున్న మాంసం మాత్ర‌మే. అదే తెలంగాణ‌లో బీఫ్ అంటే ఎద్దు కూర. అందుకే మాస్టార్జీ ఏనాడో ‘‘ఎద్దుకూర తిన్నోడే ఎంతా ముద్దుగున్నాడే’’ అని పాట రాశాడు. అంతేతప్ప ఆవు కూర తిన్నోడే అనిరాయలేదు. కాబ‌ట్టి గోసంర‌క్ష‌ణ పేరుతో దాడులు జ‌రుప‌డ‌ం సంఘ‌ప‌రివార్ ల‌క్ష్య‌మే త‌ప్ప, ఈ తేడాల‌ను గ‌మ‌నించ‌డం కాదు. పైగా కౌ స్లాట‌ర్ చ‌ట్టం అమ‌లు పేరుతో బీఫ్ బ్యాన్‌కు పాల్ప‌డ‌డం వ‌ల్ల, ఒక్క మ‌హారాష్ట్రాలోనే 5ల‌క్ష‌ల మంది ఉపాధిని కోల్పోయారు. దళితులు, ముస్లిముల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ర‌కంగా ఆ ఉపాధిపై ఆధార‌ప‌డ్డ‌వారిని చావు దెబ్బ‌తీశారు. రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే రామున్ని రంగంలోకి దింపిన ద‌శ నుండి గోమాత వ‌ర‌కు హిందుత్వ శ‌క్తుల‌ హిడెన్ ఎజెండా రాజ్యాధికారాన్ని ద‌క్కించుకోవ‌డ‌మే.

కులాల‌తో నిర్మిత‌మైన భార‌త స‌మాజం క్ర‌మంగా అంత‌ర్యుద్ధానికి సిద్ధ‌మ‌వుతోంది. అందుకోసం మెజారిటీ మతస్తులైన హిందువుల బలహీనతను ఆధారం చేసుకుంటున్నాయి హిందుత్వ సంఘాలు. అన్య మతస్తుల పట్ల అసహనంతో ఆలోచించే ధోరణి క్రమంగా ప్రతీ మెదడును ఆవహిస్తున్నది. దీంతో దాడులు చేయడమే దేశభక్తిలాగా, కొట్టిచంపడమే హీరోయిజంగా మారుతున్నది. అందువల్లనే లౌకిక ప్రజాస్వామ్యం, భిన్న‌త్వంలో ఏక‌త్వం, ప‌ర‌మ‌త స‌హ‌నం వంటి భావ‌న‌లు గ‌తమే తప్ప వర్తమానం కాదు. ఈ ప‌య‌నం ఎక్క‌డికి దారి తీస్తోంది? అనేది బుద్ధిజీవుల‌కు ఆందోళ‌న క‌లిగిస్తున్న అంశం. ఈ తిరోగమన వాదాన్ని తిప్పి కొట్టకుంటే దేశం మరిన్ని అల్లర్లను చూడక తప్పదు. మెజారిటీ మతస్తులు మాత్రమే మనుషులు, మిగిలిన వారు ఏమై పోయినా పర్వాలేదు అనుకునే ధోరణి ముందు పాలకుల్లో పోవాలి. అప్పుడు మాత్రమే  ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు పరిరక్షింపబడుతాయి.

ఈ సందర్భంగా ఇటీవల కనుమూసిన ద్రావిడ ఉద్యమనేత కరుణానిధి రాసిన కవిత గుర్తుకొస్తున్నది.
“బిడ్డ‌ల పాల‌కై బిచ్చ‌మెత్తు దేశంలో
రాళ్ల‌కు పాలిచ్చు క‌థ న‌శించున‌దెన్న‌డో
పేడ‌కు బొట్టు పెట్టి దైవ‌మ‌ని పూజించువారు
పేద‌ను గుర్తించ‌గ మారున‌దెన్న‌డో
ఎప్పుడొచ్చునో ఈ దేశానికి చైత‌న్యం
అది తెచ్చుట మ‌న క‌ర్త‌వ్యం”
-క‌రుణానిధి

 

పి. బోధిసత్వ

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.