మొగదాల మాను

మా ఊరికి పరమట పక్క పూర్వం పెద్ద సెరువుండ్య. ఆ సెరువును  ఎప్పుడో బూడ్చేసి తలా ఇంత సేండ్లు చేసుకుంటిరి. అయినా గానీ సెర్లో ఆడాడ నారవలు బూడిపోకుండా  అట్లనే మిగిలిండ్య. తరాలు మారినా సెర్లో సేండ్లని, సెర్రుకట్టని, కట్టమీద పంపులు ఇట్లా దాంట్ల పేర్ల మాత్రం అట్లనే మిగిపాయ.

సెర్లో నారవలమ్మడి తుమ్మ సెట్లు , రేని సెట్లు పెరిగుండ్య. రేనిగాయల కాలమొచ్చిందంటే సెరువు పిల్లోల్లను రప్పిచ్చుకోని జోబీల నిండా రేనిగాయలు పెట్టి పంపిచ్చాండ్య. ఆయమ్మ పిల్లోల్లంటే బలే పానమిడుచ్చాండ్య. మొగదాల మాను, పుల్ల మాను,పుట్టకాడ సెట్టు, గుండ్లల్లో మాను ఇట్లా మనుసులకున్నెట్లు సెర్లో సెట్లకు కూడా పేర్లుండ్య.

అది రేనిగాయల కాలం. ఆపొద్దు నేను మా నాయన మా రాల్ల సేనికాడికి పొయ్యొచ్చాంటిమి. తీరా సెర్రుకట్ట కాడికొచ్చాలకు  నాకు రేనిగాల కోసం సెవు పెరకబట్య. ఆ సమచ్చరం వానలు బాగ కురిసి భూమిలో తనువున్నిందాన రేనిగాయలు బోగ్గాసిన్యాయి. సెవులకు కమ్మలు పెట్టుకున్యట్లు కొమ్మల నిండా కాయలు యాలాడ్తన్నాయి.

మా నాయనకు కూడా నా మాదారే రేనిగాయాలంటే బోగిష్టం. ఐనా కలంలో యాడున్య పని ఆన్నే ఉన్నిందాన రేనిగాయలకంటే ఏమంటాడో ఏమో అనుకుంటి. ఐనాసరే ఒక తూరట్ల అడిగి సూజ్జాం అని ‘నాయ్నా… సెర్లో దావన పొయ్ రోన్ని రేనిగాయలేరుకుని పదామా నాయ్న’ అంటి.

మా నాయన ఒక్క మాట గూడా అండ్ల్య. ‘సరే పా… బ్బీ . పదాంపా’ అనె.

మేమిద్దరం ఎప్పుడు రేనిగాయలకు పోయ్నా  మా గురంతా మొగదాల మాను పైనే. దాని కాయ రుచే వేరు. ‘ఒక్క కాయ తిన్యా సాలుబ్బీ దీన్ది. ఎట్ల పన్యాదో గానీ ఈడ. నోట్లో కలకండ ఏసుకున్నెట్లు తియ్యగుంటాది. కాయ ఒక్కరవ్వ దోరమాగినా సరే యాన్నే గానీ సేదనేదే తగల్కుండా బో రుసిగా ఉంటాది’. అంటా దాని గుణం గురించి మా నాయ్న ఎన్ని తూర్లు చెప్పినా ఆ మాటలు నాకు  కొత్తగా ఇన్నెట్లే ఉంటాండ్య. నాకు మళ్లా మళ్లా ఇనాలపిచ్చాండ్య.

ఊర్లో నుంచి కలాల దావన సెర్లోకి పోతే వచ్చే మొదటి సెట్టదే. అందుకే దాన్ని మొగదాల మాననేది. అదేం అంత గొప్ప మాను కూడా కాదు. కాకపోతే మామూలు సెట్లకంటే దాని ఆకు రోంత ఎడల్పుగా ఉండ్య. కొమ్మలు ఇగురేసి పూతతో ఉన్నెప్పుడు దాన్ని సూడాల. ఇండ్లలికి  పందిరేసినట్లు సెర్లోని పూల సుట్టాలంతా ఆ సెట్టు సుట్టే మూగి జుర్రుమనుకుంటా ఎగుర్తాండ్య.

నేను మా నాయన నేరుగా మొగదాల మాను కాడికి పోతిమి. సెట్టు నిండా కాయలు ఇరగబడి ఉండాయి. బాగ సోగ ముక్కేసుకుని మమ్మల్ను సూచ్చానే ‘ఏందిబ్బా అబ్బా కొడుకు ఇంగా రాలేదే అనుకుంటాంటి’ అని సిక్కెగ నగినట్లనిపిచ్చ.

ఆపొద్దు మా అదృష్టం బాగుండ్య. అప్పటికింగా సెర్లో ఎవరి దండయాత్ర మొదలుగాల్య. రాలిన కాయలు రాలినట్లే ఉండ్య. నాకు దాంట్లను సూచ్చానే ‘అబ్బ మాంచి కాయలు’ అనుకుంటా  బలే సంబరమాయ. పట్టల్యాక వంగి నాలుగ్గాయలు ఎదిరి నోటికేసుకుంటి. కాయ బలే కమ్మగుండ్య. గబగబ భుజం పైనుండే టవాల తీసి న్యాల మీద పడిచ్చి. బంగారాన్ని ఏరినట్లు రాలిన కాయల్ను  బెరబెరా ఏరి టవల్లో ఎయ్యబడ్తి.

నేనట్ల కాయలేర్తాంటే మా నాయన సెట్టుకటు పక్కకు ఒకంటికని పాయ. రాలిన కాయలేరకముందే సెట్టుకుండే కాయల్ను కూడా రాలగొడ్దామని నాకు బో ఆశపుట్టె. అంతే. సెట్టు పక్కకొచ్చి రెండు రాళ్లు తీసుకుని సెట్టు పైకి బిసకొద్దీ ఇసిరేచ్చి.

మా నాయన ఆ శబ్దం ఇని “బ్బీ ఏంది సెట్టునట్ల కొడ్తనావ్ రాళ్లతో …! కొట్టగాకు బ్బీ. ఉండు నేనొచ్చనా…’ అని క్యాకేసె. దాంతో నేను గామ్ముగైపోతి. మళ్లా రాలిన కాయలు ఏరబడ్తి. మా నాయన ఈ పక్కకొచ్చి ‘మనిసి మాదిరే మానుగ్గూడా పానముంటాదిబ్బీ.. సెట్లగ్గూడా దెబ్బ తగుల్తాదిబ్బీ. ఏమంటే దాంట్లకు మాటల్ రావంతే. మూగ జీవులు. సెట్లను రాళ్లతో కొట్టగుడ్దబ్బీ…’ అనె.

నాకు బలే సిత్రంగా అనిపిచ్చ. ఇందుకేనేమో పిల్లప్పట్నుంచి మమ్మల్ను ఎప్పుడేగాని మా నాయ్న సెయ్యిత్తి కొట్టల్య. యాదున్యా మాటల్తోనే వినయంగా సెప్తాండ్య. మమ్మల్నే గాదు.  ఎద్దుల్ను గాని ఎనమల్ను గాని మా నాయన సెయ్ జేసుకున్య పాపాన పోల్య. ఎప్పుడన్నా బెత్తు పెట్టడానికి అట్ల సెయ్యెత్తింటే ఎత్తిండచ్చు గానీ అదేపనిగా కక్ష పెట్టుకొని కొట్టిందిల్య ఎప్పుడేగానీ. మానాయన ఊరికే ఏదీ సెప్పడని నాకు బో నమ్మకం ఉండ్య. అందుకే ఆ మాటలు పాలల్లో నీళ్ళ మాదిరి నా మనసులో కల్సిపాయ.

ఉండబ్బీ…అని మా నాయన తలకు రుమాలు సుట్టుకుండ్య. పంచ బిగ్గట్టుకోని సెట్టు మొదలుకాడికి పొయ్యి కండ్లు మూసుకుని సేతులు జోడించి దండం బెట్టుకుండ్య.   ఆ సెట్టుకు మొదల్లోనే కొమ్మలు పంగసీలుండ్య. ఆమైన రెండు సేతల్తో కొమ్మల్ను పట్టుకుని సెట్టును ఎక్కబట్య. తలపైన అడ్డమొచ్చే కొమ్మలను సేత్తో వాటంగా తప్పిచ్చా సెట్టు పైకెక్య. కాళ్ళు కుదురుగా పెట్టి ఒకసాట నిలబడి సిటారు కొమ్మలు ఊగేటట్లు కొమ్మలను పట్టుకుని ఊంచబట్టె.

ఆ ఏటుకూ యాడాడుండే పండ్లన్నీ టపటపటప మంటా వడగండ్లు రాల్నెట్టు రాలబట్టె. రోంతసేపు ఉసిచ్చి ‘ఏంబ్బీ..సరిపోతాయా ‘ అని అడిగ్య. ‘ఆ.. సాల్రా నాయ్నా’. అంటి. నేను సెట్టుమొదలుకాడికిపోయి మానాయన కాళ్ళకింద సేతులు పెడదామని, ఆపుకు. ‘ఎందుకు తీబ్బీ అని మా నాయనే శానా వాటంగా దిగ్య.

రుమాలుతీసి టవాల్తో ఒళ్ళు ఇదిల్చుకుని ముఖం రోంతట్ల తుర్సుకుండ్య. నాతో పాటి రాలిన రేనిగాయల్ను ఏర్తా ఒక పండట్ల నోట్లో ఏసుకుని ‘అబ్బా … ఏమి తీపిబ్బీ దీని కాయలు. ఎట్ల పన్న్యాదో గానీ ఈడ!……” అంటా మళ్లా మొదలు పెట్య. ఎన్ని తూర్లు ఇన్యా నాకామాటలు మళ్లా కొత్తగా ఇంటన్నెట్లే ఉండ్య.  మా నాయన నా కండ్లకు సిన్న పిల్లోని మాదిరి కనిపిచ్చ. నేను లోలోపల బో నక్కుంటి. మళ్ళా మా నాయనే ఉండి ఏదో మతికొచ్చినోని మాదిరి ‘పా పా బ్బీ మళ్ళా పైటాల కలంలో కట్టె ఎగేసి వామేసుకోవాల. పరపాట్న వానందుకొచ్చే శానా ఇబ్బంది పడ్తాం’ అనుకుంటా రేనిగాయలు ఉషారుగా ఏరబట్య.

సుమారుగా పడికాయలమైన ఒదిగుంటాయ్. దావన తినడానికి సెరిన్ని పిరికిట్లో పట్టుకుని టవలకు మూతికట్టు బిగిచ్చి వచ్చే ముందర మళ్ళా సెట్టుపైకి జూసి ‘పొయ్యోచ్చామ్మా…’ అన్జెప్పి రేనిగాయలు నములుకుంటా ఇంటిదావ పడ్తిమి.

సొదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

13 comments

 • సొదుం జయరాం సార్ను , సొదుం గోవిందరెడ్డి సార్ను సూడ్డానికి మీ ఊరికి చాలా మాట్లు వచ్చాన్నెం. వచ్చినప్పుడు ఆ దావలో గంగిరేగ్గాయల తోట ఒకటి ఉండ్య. అక్కడొక పెద్దాయన గంగిరేగ్గాయలు అరుగుపైన పెట్టుకొని అమ్ముతాన్నెడు. అయిదు రూపాయలిచ్చే నాలుగు దోసిళ్ళు గంగిరేగ్గాయలు పెడతాండ్య . గంగిరేగ్గాయలు తింటా సత్రం కాడికి నడుచుకుంటా వచ్చి బస్సు ఎక్కుతాంటిమి. నీ కథ చదివి మళ్ళీ ఉరుటూరు, అక్కడ జరిగే పీర్ల పండగ , జయరాం సార్ , సొదుం గోవిందరెడ్డి సార్ లతో మాట్లాడుకున్న సాహిత్య సంగతులను గ్యాపకం సేసినావ్ శ్రీకాంత్ ..సంతోషం !

  • అన్నా, ఆ గంగి రేనిగాయలు ఎంత రుచిగా ఉండేయో. దానిపైన కూడా ఒక అనుభవం ఉంది. తప్పక రాయవలసినది.

   నిజంగా వాళ్లే గనక లేకున్నుంటే నా సాహిత్య జీవితాన్ని ఊహించుకోలేను.

 • Wow , what a depiction, Wonderful. The dialect of the characters and the back ground of the story , the way how it is presented is really superb . I am one among his readers who always love to read his stories.
  Thanks for the realistic story which took me to my Roots..
  Rajendra Prasad.

  • Thank you sir .

   మీ మాటలు మరింత మనోధైర్యాన్ని ఇస్తున్నాయి.

   అన్నీ విధ్వంసమౌతున్న సందర్భంలో జ్ఞాపకాలను పదిలపరుచడం అవసరం అనిపించింది.

   మరిన్ని మంచి కథలను అందిచగలనని ఆశిస్తున్నాను.

 • కత ఇంటాటే మా వూరి గనగమ్మగుట్ట రేనె గాయాలు తిన్నెట్టె వుండాది!

  • అన్నా , ధన్యవాదాలు. నా కత మీ జ్ఞపకాల పుట్టను కదిపిందనడం కంటే మించిన సంతోషం ఏముంటుంది

 • నా బాల్యం కూడ మీ రాత లో నుంచి చూసినట్టుంది . నిజంగా అద్భుతం

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.