అక్షరమంటే
కలువ పూల చెరువులో
స్నానమాడే
అందమైన చందమామ
గుండె గూడు నుండి
ఒకటొక్కటిగా
జారి పడే తేనె చుక్క
నరాల తీగలపై చిగురించి
మనసులో విరిసే
మల్లెపూల పందిరి
ఆకాశం నల్ల చీరపై
తళుకు మెరుపుల
జలతారు అంచు
గుండె ఉలిక్కిపడేలా
నిరంతర చైతన్యాల
ఉరుముల ఫెళ ఫెళ
భావోఉద్వేగాల జెండా రంగుగా నిలిచినా,
అనుభూతుల హరివిల్లయ్ పూసినా
నిశీధి విషాద గీతాల
అశ్రు కణాలుగా జారినా
అక్షరం
భావ సుగంధాన్ని పూసే
చల్లని చందనం
ఇప్పుడది
మాట ఒద్దిక లేక,
రాత పొంతన లేక
గాజు కుప్పెలో వాలి
గులకరాళ్ళ మధ్య
ప్లాస్టిక్ పూలు పూస్తున్నది.
Beautiful