పంద్రాగస్టు నాడు ఏం జరిగింది?

(ప్రముఖుల అభిప్రాయాలు)

1947 ఆగస్టు15 న ఎర్రకోట బురుజు మీంచి పండిట్ నెహ్రూ చెప్పిన ‘భవితవ్యం తో పయనం’ (ట్రిస్ట్ విత్ డెస్టినీ) మనల్ని ఎక్కడికి తెచ్చింది? అసిఫా వంటి చిన్నిపాపలని రేప్ చేసి చంపిన మృగాల్ని చట్టం శిక్షించరాదని ఒక ఎమ్మెల్యే సపరివార సమేతంగా వూరేగే దాకా వొచ్చింది. 1971 కి ముందు ఈ దేశ పౌరులుగా నమోదు చేయించుకో(లే)ని వారెవరైనా దేశం విడిచి వెంటనే వెళ్ళాలని, వెళ్ళకుంటే వాళ్ళను కాల్చేయాలని ఆ పరివారం వాడే ఒక తెలుగు ఎమ్మెల్యే బహిరంగంగా అనడం అంగీకృత రాజకీయమయ్యే దాక వొచ్చింది ‘భవితవ్యంతో మన పయనం’. ఇదిలా జరుగుతుంటే..  ఆ రోజు వొచ్చిందసలు స్వాతంత్ర్యమే కాదని, మనదింకా సగం వలస దేశమేననే సిద్ధాంతం బరువు కింద నలిగి పోతున్నాయి అచ్చమైన సమరశీల శక్తులు. సుదూర స్థల కాలాల నుంచి విషాదకరంగా అరువు తెచ్చిన నినాదాలతోనే నేటి సమరశీలుర కాలం గడిచిపోతోంది. భలే సమయమిది… 1947 ఆగస్టు 15 ను గుర్తు చేసుకోడానికి.

ఈ విషయమై రెండు కీలక ప్రశ్నలను… తనకిష్టులైన ఏడుగురు బుద్ధిజీవుల ముందు వుంచింది ‘రస్తా’. వారిలో ఇద్దరు తప్ప అందరూ జవాబులు పంపారు. అందరికీ కృతజ్ఞతలు.

‘రస్తా’ అడిగిన ప్రశ్నలు ఇవి:

 1.    1947 ఆగస్టు 15న ఇండియా స్వతంత్రమయ్యిందని కొందరు, అప్పుడు వచ్చింది స్వాతంత్ర్యం కాదని కొందరు అంటారు. మీరేమంటారు? అలా ఎందుకంటారు?
 2.  1947 ఆగస్టు 15 ముందు వరకు ఇండియాను పాలించిన బ్రిటిష్ వలవవాదుల వల్ల చాల నష్టంతో పాటు ఒక మేలు జరిగిందని కొందరు అంటారు. ఆ పాలన కిందనే ఇండియాలో పిడచగట్టుకుపోయిన స్వయంపరిమిత గ్రామీణ వ్యవస్ఠ బ్రద్దలై, పెట్టుబడిదారీ పారిశ్రామిక విప్లవం పెల్లుబికిందని వారి వివరణ. మీరేమంటారు? ఎందుకు?

మిత్రులు జవాబుగా పంపిన అభిప్రాయాలు ఇవి:

కె. శ్రీనివాస్, ఎడిటర్, ఆంధ్రజ్యోతి

 1. 1947 ఆగస్ట్ 15 నాడు ఏదో ఒకటి జరిగింది. దాన్ని లోకార్థంలో స్వాతంత్ర్యం అంటున్నాం. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించడం విరమించుకుని, భారతదేశంలో అప్పటికి ఏర్పడిన శిష్ట లేదా కులీన రాజకీయ వర్గానికి అధికారాన్ని బదలాయించారు. ఇది బదలాయింపు మాత్రమే, లేదా అధికార మార్పిడి మాత్రమే అనేవారున్నారు. బలప్రయోగం ద్వారా స్వాధీనం చేసుకుంటే తప్ప, భారత దేశం లో జరిగిన తీరులో జరిగేది అధికారం చేతులు మారడం మాత్రమే. అట్లా చేతులు మారడం స్వాతంత్ర్యం అవుతుందా లేదా అన్నది ప్రశ్న. భారత దేశంలోని సకల వర్గాలకు , జాతులకు , శ్రేణులకు, ఇంకా ఎన్నెన్ని రకాల తరగతులుంటే అన్ని తరగతులకు ఏక రీతిన లభించిన స్వాతంత్ర్యమా, లేదా ఆనాటి ప్రాబల్య తరగతులకు లభించిన స్వాతంత్ర్యమా అన్నది పై ప్రశ్నకు వివరణాత్మక ప్రశ్న. వలస పాలన నుంచి విముక్తమైన ఏ దేశంలో అయినా సర్వ సమగ్ర సంపూర్ణ సార్వజనీన స్వాతంత్ర్యం లభించిందని నేను వినలేదు, చదవలేదు. అధికార మార్పిడి అనివార్యంగా, జాతీయోద్యమానికి నాయకత్వం వహించగలిగి, అసంఖ్యాక ప్రజలను తన ఛత్రం కిందకు తీసుకు రాగలిగి, ఒక ఆమోదనీయతను సాధించే సెక్షన్నే కొత్త పాలక వర్గంగా/తరగతిగా చేస్తుంది. ప్రజలందరికీ తాను ప్రతినిధిని అని చెప్పుకుని ఆ వర్గం అధికారం చేపట్టే నైతికతను పొందుతుంది. భౌతిక, సాంస్కృతిక వగైరా సంపదలను వృద్ధి చేయడమే అభివృద్ధి అనుకుని, ఆ క్రమంలో ఏర్పడే అసమానతలను పరిష్కరించడం కాక నిర్వహించడానికి, అసంతృప్తులను అదుపుచేయడానికి ప్రయత్నించే ఆ నూతన పాలక వర్గానికి , ఆ విషయంలో ఉన్న స్వేచ్చ స్వాతంత్ర్యాలు, ఇతర విషయాల్లో — అంటే అంతార్జాతీయ వేదికల మీద , ఇతర దేశ పాలకవర్గాలతో వ్యవహరించేటప్పుడు ఉంటాయా? ఎంతో కొంత ఉంటాయనే అనుకుంటాను. 1947 తరువాత భారత ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉన్నదనే భావిస్తాను. అయితే, ఆ సార్వభౌమాధికారం వివిధ దేశీయ, అంతర్జాతీయ ఒత్తిడుల పరిమితుల మధ్య సాగింది. అంతే కాదు, అధికారంలో ఉన్న వర్గాల / తరగతుల స్వార్థానికి, పరాధీనతలో ప్రయోజనాలని ఆశించే దళారీ తనానికి, దేశభక్తి రాహిత్యానికి లోబడి సాగింది.భారత పాలకవర్గాలు అస్వతంత్రులు, దేశద్రోహులు, దళారులు, స్వార్థపరులు కావచ్చు (ఇవి  కూడా తీవ్రత కోసం అంటున్న మాటలే, భారత పాలక వర్గాలు గుండు గుత్తగా అటువంటి వర్ణనకు తగినవి కావు)  కాని, లభించిన అధికారం దానంతట అది పరాధీనమైన అధికారం కాదు. నిరంకుశులు అధికార లాలసులు అయిన పాలకులు, అసమాన సమాజాలు కలిగిన దేశాలు కూడా తమ సార్వభౌమాధికారాన్ని వినియోగించుకుని, తాము ఇష్టపడిన తీరులో తమ పాలనను నడిపిన ఉదాహరణలు అనేకం.  భారతదేశం కూడా తన సార్వభౌమాధికారాన్ని ప్రపంచ పెద్దల ముందు ప్రదర్శించిన ఉదాహరణలు లేకపోలేదు.ఒక దేశ సమాజంలో అసమానతలు ఉన్నట్టే, ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య అసమానతలు ఉన్నాయి. దేశంలో అణచివేత, లొంగదీసుకోవడం ఉన్నట్టే, ప్రపంచంలోనూ ఉంటాయి. భారత ప్రభుత్వం నూటికి నూరుపాళ్ళు కీలుబొమ్మ అని నేను భావించను. సామ్రాజ్యవాదులకు భారత పాలకులకు  మధ్య కూడా వైరుధ్యాలు ఉన్నాయి.
 1. భారత దేశంలో ఏదైనా పిడచ గట్టుకు పోయిందా అన్నది ఆలోచించవలసిన ప్రశ్న. ఏదో ఒక గతిలో చలనం లేకుండా ఏ వ్యవస్థ అయినా స్థాణువుగా ఉండగలదా ? బ్రిటిషు వారికంటే ముందు కూడా భారత దేశంలో చలనం ఉన్నది. ఆధునిక భావనల శైశవ రూపాలు బ్రిటిష్ పూర్వ యుగంలో కనిపిస్తాయి. కులవ్యతిరేక భావాలకు, బుద్ధుడి కాలాన్ని మినహాయిస్తే, కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నది. బ్రిటిష్ వారు రాకపోయి ఉంటే ఏమి ఉండేది అన్న ప్రశ్న ఊహాత్మకమైనది. అచారిత్రకమైనది కూడా. ప్రపంచ భూగోళంలో చరిత్రలో ఏక కాలంలో అనేక ప్రక్రియలు సాగుతూ వచ్చాయి. ఐరోపా ఖండంలో సాగుతూ ఉన్న ప్రక్రియలో  భారత తీరాన్ని వాస్కోడిగామా స్పృశించడం ఒక భాగం. అప్పటికి భారత దేశంలో వేరే ప్రక్రియ సాగుతూ ఉన్నది. ఆ రెంటి సమ్మేళనం తరువాత జరిగే చరిత్ర వేరు. బ్రిటిష్ పూర్వ కాలంలో భారత దేశంలో సాగుతున్న ప్రక్రియలు కూడా ఒక భిన్నమైన ఆధునికతకో, మరోరకం పెట్టుబడిదారీ సమాజానికో, లేదా మనం ఊహించలేని మరో నిర్మాణానికో దారితీసి ఉండేవి కావచ్చు. అలాగే భారత దేశం అంతా కూడా ఒకే మోస్తరుగా ఉండి ఉండకపోవచ్చు. సాపేక్షంగా చూసినప్పుడు జడంగానో తిరోగామిగానో కనిపించే స్థితిగతులు కొన్ని చోట్ల ఉండవచ్చు. బ్రిటిష్ వారి పాలన తప్పనిసరిగా భారత దేశంలో అప్పటికే సాగుతున్న చరిత్ర గమనాన్ని ప్రభావితం చేసిఉంటుంది.   అయినంత మాత్రాన, బ్రిటిష్ వారు రాకపోతే మన గొంగడి ఇంకా పదహారో శతాబ్దిలోనే ఉండేది అనడం తప్పు. ఆ మాటకు వస్తే, స్వతంత్ర భారత దేశాన్ని పాలించిన అనేక ప్రభుత్వాలు కూడా అనేక ప్రగతి శీల మార్పులకు దోహదం చేసాయి. నేటి ప్రపంచీకరణ కూడా వివిధ సమాజాలను అతలాకుతలం చేస్తున్నది. ఈ అలజడి గర్భంలో అనేక ప్రగతి శీల ప్రవాహాలు కూడా ఉండవచ్చు. ఈ సానుకూలతలు ఆనుషంగికాలే కాని, ఉద్దేశ్య పూర్వకాలు కావు.

వివిన మూర్తి, కథకులు, రచయిత

 1. ఇండియా అంటే ఏమిటి? ఇండియా అంటే ఒక దేశం. ఇటీవలి అర్ధంలో దేశం ఒక భౌగోళిక ప్రదేశం. దానిలో నివసించే ప్రజలది దేశం. ఆ నేలపైన ఉన్న ఉత్పత్తి వనరులు వారివి. వారు చాలాకాలంగా అనుసరిస్తున్న జీవనశైలి, పాటిస్తున్న సంప్రదాయాలు, నమ్ముతున్న భావాలు వెరసి సంస్కతి అనేది ఒకటుంది. ఆ సంస్కృతిని కాపాడుతూ… అక్కడి ఉత్పత్తి వనరులతో ఆ ప్రజలకి జీవిక కల్పిస్తూ… వారందరికీ ఆ వనరుల ప్రతిఫలాలను అందించే విధంగా కంజాయింపు(management) చేసే ఓ ఏర్పాటు కావాలి. దానినే ప్రభుత్వం అంటారు. ఆ ప్రభుత్వం నిర్వహించేవారికి అధికారం ఉంటుంది. బాధ్యత ఉంటుంది. ఆ నిర్వహణ వేలాది సంవత్సరాలుగా రాజు చేసేవాడు. అనేక భూఖండాలు ఉండేవి. అవి ఒక్కోరాజు కింద ఉండేవి.  వాడు ఏకవ్యక్తి అయినా అక్కడి ప్రజాసమూహానికి చెందినవాడు. పాశ్చాత్యులు ఇక్కడ ఉండే అనేకమంది రాజులను తొలగించి ప్రభుత్వాలను స్వాధీనం చేసుకున్నారు. చాల ప్రాంతాలలో నేరుగానూ కొన్నిచోట్ల పరోక్షంగానూ పాలించటానికి ఒక ప్రభుత్వం ఏర్పరిచారు. ప్రజలు పడుతున్న కష్టాలన్నింటికీ కారణం ఇక్కడి వారికి ఆ ప్రభుత్వంపై అధికారం లేదు. కష్టాలకి విరుగుడు ఇక్కడ పుట్టిపెరిగినవారు గద్దె ఎక్కటం. గద్దె ఎక్కించేవారు ఇక్కడి ప్రజలు. ఇదీ స్వతంత్రం. ఈ అవగాహనతో చూస్తే ఇండియా అనే దేశం మీద అధికార నిర్వహణ చేసే అవకాశం ఆంగ్లేయులకి 1947 ఆగస్టు 15న పోయింది. అంటే స్వతంత్రం వచ్చిందని అర్ధం. అయితే స్వతంత్రం అంటే ఏమిటి? ఇంతేనా? ప్రజల కష్టాలు పడుతున్నారన్నది వాస్తవ పరిస్థితి. అవి తీర్చటమే స్వతంత్రం అని చెప్పారు గదా… ఆ కష్టాలు ఏమిటి? 1947 నాటికి స్వతంత్రోద్యమంలో ఉన్నవారికి ఆ కష్టాలేమిటన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. అది ఇప్పటికీ లేదని నా అబిప్రాయం. ఆ కష్టాలను వారు చూసిన తీరుని జాగ్రత్తగా గమనించితే రెండు ప్రధానమైన  పరస్పరవ్యతిరేకమైన భావనలు నాకు కనిపించాయి. ఒకటి భౌతికం. రెండవది అధిభౌతికం. కూడు గూడు గుడ్డ వంటి వాటితో బాటు భద్రత లోపించటం భౌతిక కష్టాలు. అవి తీర్చటానికి 1947 నాటి స్వతంత్రం సరిపోదన్నది కమ్యూనిస్టుల అవగాహన. మరో భావన.. అంతవరకూ సంస్కృతిపై దాడి జరిగింది. దానిని పునరుద్ధరించాలి. జనం యొక్క వాస్తవ కష్టాలు ఏమిటి? వారికి వారి నమ్మకాలతో, దేవుళ్లతో జీవించే హక్కు లేకపోవటం… ప్రజలను మభ్యపరిచి వారికి ఇతర దేవుళ్లపై నమ్మకం కలిగించటం.. ఇది నేను అధిభౌతికం అంటున్నాను. మూడవ ప్రధాన భావన సామాజిక అసమానత. వేల ఏళ్లుగా రూపొందిన సమాజ నిర్మాణంలో కొన్ని సమూహాలకి లభించిన న్యూనత ప్రధాన కష్టం. అది తీరాలంటే పాత సంస్కృతి భావాలు సమూలంగా పెకలించివేయాలి. వాటికి మూలమైన కొన్ని సమూహాల అణచివేత, ఆధిపత్యం తొలగించాలి. ఆధిపత్య స్థాయిలో ఉన్న సమూహాలలో కొందరు వ్యక్తులు ఉదారంగా ఉన్నా, సమూహంగా అది తన స్వభావాన్ని ఐచ్ఛికంగా వదులుకోదు. వారితో పోరాటం తప్ప మార్గం లేదు. దానికి న్యూనంగా పరిగణించబడిన సమూహాల మధ్య తమందరి కష్టమూ ఒకటేనన్న చైతన్యం కలిగించాలి. 1947 నాటికి అది నిర్ణాయక రూపంలో లేదు. ఆనాటి ఆ మూడు ప్రధాన అవగాహనల ప్రకారమూ స్వతంత్రం ఒక మెట్టు మాత్రమే. అది రాజకీయ స్వాతంత్ర్యం. అంటే ఇండియా అనే భౌగోళిక హద్దుల మధ్య ఉండే పౌరులకి మాత్రమే పరిపాలనాధికారం ఉండటం.
 2. ఆంగ్లేయ పాలన వల్ల మన సమాజంలో వాంఛనీయ పరిణామాలు వచ్చాయని నేను భావిస్తాను. ప్రాంతీయ సమాజాల కలయికలోనే ప్రపంచంలో మానవాభివృద్ధి జరిగింది. ఆ కలయికలో జ్ఞానం పరస్పరం ప్రభావితమయింది. జ్ఞానమంటే మానవ శ్రమని సరళతరం చేయటానికి ఉపకరించేది. అయితే ఆ కలయిక రక్తపాత రహితంగా జరగలేదన్నది వాస్తవం. ఆ కలయికని అనివార్యం చేసింది చాలావరకూ తప్పుడు ప్రేరణలే. ఏ సమాజంలోనైనా మౌలిక మార్పులు ఇతర సమాజాల కలయిక వల్లనే వచ్చాయి. ఆ మార్పుల ఆవశ్యకతపై తాత్వికంగా భిన్న అవగాహనలు ఉన్నాయి. మనిషి బట్టలు లేని దశలోనే ఎక్కువ తృప్తిగా ఆనందంగా జీవించాడనేది ఉదాహరణకి ఒక తాత్విక అవగాహన. మానవశ్రమ సరళమవటమనే దృష్టికోణం నుంచి నేను చూస్తాను. స్వయంపరిమిత గ్రామీణ వ్యవస్ఠ బ్రద్దలై, పెట్టుబడిదారీ పారిశ్రామిక విప్లవం రావటమనేది వాంఛనీయ పరిణామనేది ఒక అవగాహన. అది మానవుని దురాశకీ స్వార్ధానికీ ఫలితమనీ, దానిని పెంచిందనీ అందువల్ల అవాంఛనీయమన్నది మరో అవగాహన. అది వాంఛనీయమైతే ఆంగ్లపాలన దానికి కెటలిస్టు. ఆంగ్లపాలన లేకపోయుంటే మనదైన పారిశ్రామికీకరణ జరిగుండేదని ఒక వాదన. అది ఊహకి సంబంధించినది. ఒక జరిగిన దానిని గుత్తగా నిరాకరించటానికి గతం పట్ల ఇలాంటి ఊహలు ఉపయోగపడతాయి. వలస ప్రాంతాల మేధావులలో ఇలాంటి ఊహలు పుట్టటం సహజం. మార్పులతో మాత్రమే సాధారణ జనం ప్రభావితమవుతారు. తమ జీవితాలను మెరుగుపరుచుకునేందుకు తామే పూనుకోవాలన్న చైతన్యానికి ఇవి వీసమంతకూడా ఉపయోగపడవని నేననుకుంటాను.

చంద్ర కన్నెగంటి, కవి, కథకులు

 1. అది స్వతంత్రమంటే మనమిచ్చుకునే అర్థాన్ని బట్టి ఉంటుంది. స్వతంత్రం వచ్చాకా ఎందుకు రాలేదంటున్నారంటే పరిపాలనలో అన్ని వర్గాలూ నిజమైన భాగస్వాములు కాలేకపోతున్నారు కనుక. అనుకున్నట్టుగా అక్షరాస్యత రాజకీయ చైతన్యానికి దారితీయడం లేదు. ఒకవైపు ఆర్థికంగా అంతరాలు పెరగడమూ, మరొక వైపు సాంఘికంగా ఆంక్షలు పెరగడమూ కొన్ని వర్గాలను అంచుల్లోనే నిలబెడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశంగా, భిన్న వర్గాల ప్రయోజనాల, ప్రాథమ్యతల మధ్య ఘరషణలు తప్పని సరి అయినా అందరికీ సమాన ప్రతిపత్తీ, ప్రాధాన్యతా లేనిదే నిజమైన ప్రజాస్వామ్యంగా నిలబడడం కష్తం.
 2. ఏ విపత్కర పరిస్థితిలోనయినా కొన్ని మేళ్లు చూడవచ్చు. గ్రామీణ వ్యవస్థలు కూలిపోవడమూ, పారిశ్రామిక విప్లవాలూ మన దేశానికో, ఆ కాలానికో పరిమితం కాదు. ఆ గొప్పను బ్రిటిష్ పాలకులకు అంటగటక్కర్లేదు.

గుర్రం సీతారాములు, దళిత విషయాల పరిశోధకులు, ప్రజా కార్యకర్త

 1. 1947 ఆగస్ట్ 15 న ఇండియా స్వతంత్రం పేరుతో జరుపుకున్న చిన్న సర్దుబాటు. వాస్తవానికి రెండు ప్రపంచ యుద్దాలు చూసిన ఐరోపాదేశాలు ముఖ్యంగా బ్రిటన్ ఆర్ధికంగా నైతికంగా కుదేలు అయ్యి తమ తమ వలసదేశాల మీద క్రమ క్రమంగా నియంత్రణ కోల్పోయాయి. నాటి జాతీయ బూర్జువా వితరణతో జరిగిన స్వతంత్ర పోరాటం నాటి బడా పెట్టుబడిదారీ అనుకూల  నిర్ణయాలు గాంధీలాంటి నమ్మకమైన ఉద్యమకారుడు తన అవసరాల కనుగుణంగా ఉద్యమ ఉధృతిని పెంచడం తగ్గించడం దాచేస్తే దాగని సత్యం. ఇండియా స్వతంత్రం పేరుతో నయా పెట్టుబడీ దారీ సమాజ ఆవిర్భావానికి పునాదులు అనుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఏ జాతీయ ఉద్యమం లోనూ ఇంత విషాదం మనం చూడలేము. గాంధీ లాంటి వీర విధేయ బ్రిటిష్ అనుకూల నాయకుడు కాకుండా ఏ లాహోర్ కుట్రకేసు త్రయం, లేదా బోస్  నాయకత్వం లో జాతీయ పోరాటం జరిగి ఉంటే ఇంత విషాదం చూసి ఉండేవారం కాదు. అయినా స్వతంత్రం పేరుతో ఏటా తంతు ఈ దేశ దళిత బహుజనులకు ఎక్కిరిస్తూనే ఉంది. అది జరగని నాడే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు.
  2. జాతీయోద్యమ కాలం లో ఈ దేశంలో జరిగిన అభివృద్ధి కేవలం వలసపాలన ఇక్కడ సవ్యంగా జరగడానికి మాత్రమే. ఇక పొతే వలసవాద ఆధునికత ఇక్కడ గ్రామీణ వ్యవస్థను ద్వంసం చేసింది అనేది అబద్దం. అది కేవలం ఒక్క భారత దేశం లోనే కాదు అన్ని మూడో ప్రపంచ దేశాలలోనూ జరిగింది. పాలన, న్యాయవ్యవస్థ ఈనాటికీ వలసవాద బ్రెయిన్ చైల్డ్ అనుకోవచ్చు. దానికి మించి మనకు స్వతంత్ర ఆలోచనా మేధా ధార ఈనాటికీ తయారు అయ్యింది అనుకోలేము. ఇకపోతే, “స్వయంపరిమిత గ్రామీణ వ్యవస్ఠ బ్రద్దలై, పెట్టుబడిదారీ పారిశ్రామిక విప్లవం పెల్లుబికిందని”. ఇది ఒక చారిత్రిక అనివార్యత. మూడో ప్రపంచ దేశాలన్నీ కాసింత ముందూ వెనక ఈదశ ను చూశాయి. సుదీర్ఘ కాలం బ్రిటిష పాలన మూలంగా  ఒనకూరిన నష్టం వలసవాద పాలన తర్వాత కూడా వెంటాడుతూనే ఉంది. డెబ్బై ఏళ్ళ స్వతంత్ర పాలనలో పెట్టుబడి దారీ సంపద హిమాలయాలతో తలపడితే బీద వాళ్ళ దుస్థితి మెరియానా అఘాతం అంత పతన స్థితిలో ఉంది. హిమాలయాలు కుంగడం మెరియానా పూడడం ఇప్పట్లో జరిగే పనికాదు. ఇన్నేళ్ళ స్వీయ పాలనలో ఈ వైరుధ్యాలు మరింత పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు.

దేశరాజు , కవి, పాత్రికేయులు, విమర్శకులు

 1. అవును, 1947 ఆగస్టు 15న ఇండియా స్వతంత్రమయ్యింది. అప్పుడు వచ్చింది స్వాతంత్ర్యం కాదనే కొందరికి- కాదు, చాలామందికి స్వాతంత్ర్యం రాలేదు. ఇంతకాలం స్వాతంత్ర్యం అనే భ్రమైనా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదని- కొన్నేళ్లుగా దళితులు, ఆదివాసీలు, ఇతర మతస్తులపై జరుగుతున్న దారుణాలు చాటి చెబుతు న్నాయి. పసిబిడ్డలపై సైతం అత్యాచారాలకు తెరబడుతున్న దుర్మార్గులు భారత మాతను ఏమాత్రం గౌరవిస్తున్నారో అందరికీ తెలిసిందే. అందుకే ‘ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి/వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది’ అన్న చెరబండరాజు మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి.
 2. పెల్లుబికిందో లేదోగానీ, కొంత మంచి జరిగింది. వాళ్ల అవసరాల కోసమే అయినా-ఇండియాలో రైల్వే లైను పడింది. రైళ్ల రాకపోకలతో ఇండియాలో కుల వ్యవస్థ రూపుమాసిపోతుందని మార్క్స్ భావించినట్టు చెబుతారు.  ఓడ రేవుల అభివృద్ధి, డ్యామ్ ల నిర్మాణం, స్టీల్, టెక్స్ టైల్ పరిశ్రమల ఏర్పాటు, పోస్టల్ సర్వీస్, న్యాయ వ్యవస్థ, సివిల్ సర్వీసెస్, వ్యాక్సినేషన్ పద్ధతి, జనాభా లెక్కలు, సర్వేలు ఇవన్నీ బ్రిటీషర్ల నుంచి సంక్రమించినవే అని అందరికీ తెలిసిందే.

రస్తా

3 comments

 • గుర్రం సీతారాములు గారు చెప్పినట్టు ” 1947 ఆగస్ట్ 15 న ఇండియా స్వతంత్రం పేరుతో జరుపుకున్న చిన్న సర్దుబాటు. వాస్తవానికి రెండు ప్రపంచ యుద్దాలు చూసిన ఐరోపాదేశాలు ముఖ్యంగా బ్రిటన్ ఆర్ధికంగా నైతికంగా కుదేలు అయ్యి తమ తమ వలసదేశాల మీద క్రమ క్రమంగా నియంత్రణ కోల్పోయాయి. నాటి జాతీయ బూర్జువా వితరణతో జరిగిన స్వతంత్ర పోరాటం నాటి బడా పెట్టుబడిదారీ అనుకూల నిర్ణయాలు గాంధీలాంటి నమ్మకమైన ఉద్యమకారుడు తన అవసరాల కనుగుణంగా ఉద్యమ ఉధృతిని పెంచడం తగ్గించడం దాచేస్తే దాగని సత్యం. ఇండియా స్వతంత్రం పేరుతో నయా పెట్టుబడీ దారీ సమాజ ఆవిర్భావానికి పునాదులు అనుకోవచ్చు” . అలాగే దేశరాజు గారు చెప్పినట్టు మనకు నిజంగా స్వతంత్రం వచ్చిందా?

  రావి శాస్త్రి గారు ఇలాగే 1961 లో తమ ఆరు సారకధల్లో చెప్పారు”ఆఖర్నయినా ఏం చేశాడు? అక్కడా-అక్కడా చలాయించినట్టు ఇక్కడ (కూడా) కూలి వెధవలు పెత్తనం చలాయిస్తారేమోనని అనుమానం కలిగింది. వెంటనే సాటి షావుకార్లకి రాజ్యం అప్పచెప్పి చల్లగా తెర వెనక్కి జారుకున్నాడు. గొప్ప మాయగాడు. వ్యాపారం, వ్యాపారం లాగే ఉంది. లాభాలు లాభాల్లాగే ఉన్నాయి. ఏదైనా రొష్తుంటే అదంతా మన వెధవల్దే అయింది.”

  అంతే కాదు సస్స్త్రి గారు “ఆరు సారా కధల్లో రావి శాస్తి గారు రాజ్యం, ప్రజల, ముఖ్యంగా అణగారిన ప్రజల పైన, తన అధికారం చూపడానికి సులభంగా, అది కూడా వలస వాదులు, ఎదురు తిరిగే ప్రజలను అణచివేయడానికి పనికి వచ్చే శిక్షా స్మృతి , మిగిలిన వలస వాద న్యాయ సూత్రాల సహాయంతో, రాజ్యం కొమ్ము కాచే రెండు ముఖ్య సంస్థలు పోలీసు , న్యాయ వ్యవస్థ ల గురించి ఒక తిరస్కార విమర్శ చూపించారు.” ఆయనింక ఇలా అన్నారు “అందుకే ఇప్పటి న్యాయవ్యవస్థలో, అప్పటి వలస రాజ్యం లో లాగా, కోర్టుల్లో అనాధుల ఆక్రందన, పేదల కన్నీటి జాలులే కనిపిస్తాయి. ప్రభుత్వం వారి లెక్కల ప్రకారమే డిసెంబర్ 31, 2015 కు , దేశంలో నిందమోపబడి, న్యాయ విచారణ కోసం జైళ్లలో మగ్గుతున్న ఖైదీలలో సగానికి పైగా – 54.9 శాతం , (దళితులు 21.6%. గిరిజనులు 12.4% మరియు ముస్లింలు 20.9%) వీరే కనిపిస్తారు. వీరు కాక మిగతా వెనుకబడిన కులాల (OBC) 31% శాతం కూడా కలిపితే మొత్తం 85.9% ఉన్నారు.
  ఇదేమాట శాస్త్రి గారు 50 సంవత్సరాల కిందట రాసిన వారి నిజం నాటకం ముందు మాటలో ఇలా చెప్పారు.
  ప్రస్తుతం మన దేశంలో ప్రతి రోజూ, ప్రతీ ఛోటా కూడా ఎందరో కొందరమాయకులు వాళ్ళు చేయని నేరానికి శిక్షలనుభవించడం జరుగుతోంది. కానీ , ఈమాత్రం డబ్బూ పలుకుబడీ, పదవీ, హోదా కలవాడెవడూ పడడు, ఇరుక్కోడు, ఒకవేళ పడినా, ఇరుక్కున్నా పైకి తప్పించుకోగలడు.”

  • రావి శాస్త్రిని తీసుకురావడం చాల బాగుంది, మీ వ్యాఖ్యలో. తెలుగులో ఆయన మాట విరుపు మరెవరికీ రాదేమో. విశాఖ మట్టిలో వున్నదాన్ని అలాగే అక్షరాలకెత్తారాయన

 • నెహ్రు గారి పదవి పట్టుదల తో — దేశం విడి పోయింది –దానితో స్వాతంత్రం రంగు -రుచి -వాసన
  తేలిపోయింది —వారి పాలన లో — కొన్ని కులాల కు పట్టం కట్టడం అయింది —దోచుకోవడం -దాచుకోవడం –అప్పటినుంచే మొదలు అయింది —
  వారి వల్లనే కాశ్మీర్ సమస్య నేటికి మం డి పోతూ—పరిష్కారం లేక ??
  వారి వల్లనే ఫ్యామిలీ పాలన మొదలు అయింది — విత్తనం నాటింది వారే ????
  దానితో అన్ని రాష్ట్రాల లో వారసత్వ కుటుంభ అగ్రకులాల పాలనలు
  బూసంస్కరణలు
  ఆర్థిక సమానత్వం
  కుల మత పట్టింపులు
  హిందు మత పిచ్చి
  అంటరానితనం
  70 ఏళ్ళ స్వాతంత్రం లో అన్ని అలాగే ఉన్నాయి
  మారింది ఎక్కడ
  నాడు — నేడు దళితుల కు రాజకీయ ఆధిపత్యం లో చోటు లేదు .
  రాజకీయాల లో అ ఆ లు తెలియని వాళ్ళు — మంత్రులుగా చలామణి అవుతూ
  అనుభవం లేని రాహుల్ గాంధీ — ప్రధాని కావాలని
  యింకా ఎంతకాలం నెహ్రు ఫ్యామిలీ పాలనలు
  లాల్ జి — పి.వి గారాల పాలనలో మార్పును చూశాం
  దేశం లో — రాష్ట్రాల లో రిమోట్ కంట్రోల్ రాజకీయాల తో —అగ్రకులాల వాళ్ళు
  పాలిస్తూ —ఆడిస్తూ ???

  ============== బుచ్చి రెడ్డి గంగుల

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.