రచించె తెనుంగునన్

‘భాష్’ అనే సంస్కృత ధాతువు నుంచి ‘భాష’ అనే పదం పుట్టింది. దీనికి మాట్లాడబడేది అని అర్థం. భావ ప్రకటన సాధనాలలో ఇది ప్రధానమైనది. వ్యక్తి జీవితంలోనూ నాగరికతా నిర్మాణంలోనూ దీనికున్న ప్రాధాన్యం అపారం.  భాషా శాస్త్రవేత్తలు చెప్పినట్టు కంటికి సమీపమైనది కనురెప్ప. దాన్ని కన్ను చూడలేదు అయినా అది కంటిని రక్షించడంలో తన పనిని తను నిర్వర్తిస్తూనే ఉంటుంది. అలాంటిదే భాషకూడా. మనో నేత్రానికి బాహ్య ప్రపంచాన్ని చూపించేదీ, బాహ్య ప్రపంచం నుండి దాన్ని రక్షించేదీ భాష. నాగరికత తోపాటు భాష పెరుగుతూ , తనతో నాగరికతను వృధ్ధి చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఆలోచనా శక్తి, సమాజం, విజ్ఞాన సంస్కృతులు మొదలైన మానవ సంబంధిత విషయాలన్నీ భాషతో విడదీయలేని పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి.

నాగరికతా పరిణామ దశలతో పాటు భాషా స్వరూపాలు కూడా మార్పులు చెందుతూ పోతుంటాయి. కొందరు విజ్ఞాన వంతులైన వ్యక్తులు ఆ భాష మాట్లాడేవాళ్ళ పై విశేష ప్రభావం చూపుతారు. ఆధునిక యుగంలో గురజాడ  రచనలు , మధ్య యుగంలో వేమన పద్యాలు , ప్రాచీన యుగంలో తిక్కన రచనలు తెలుగు భాషపై, దాన్ని మాట్లాడే ప్రజల ఆలోచనా విధానాలపై విస్తృత ప్రభావం చూపాయి. అయితే కావ్య రచనకు, దాని ప్రామాణీకరణకు ఆద్యుడు ఆదికవి నన్నయ్యే అని చెప్పుకోవాలి. ఇది ‘తెనుగు’ భాష దీనిలో నేను రాస్తున్నాను, అందులో కడు రమ్యంగా రాయగలను అని గర్వంగా ప్రకటించి మరీ కావ్య రచన చేశాడు. ఇంతటి ప్రతిభావంతుడు ఒక జాతిలో పుట్టి ఆ భాషను ఉద్ధరించడం ఒక చారిత్రక అంశం. పక్షపాత దృష్టిలేని పాఠకుడు ఏ దృక్పథం కలవాడైనప్పటికీ నన్నయ్య చారిత్రక వైశిష్ఠ్యాన్ని కాదనలేడు.

ఆధునిక పరిశోధనా శాస్త్రాలు నిక్కచ్చిగా చెపుతున్నాయి నన్నయ రాసినదే మనకు లభ్యమయ్యే తొలి తెలుగు కావ్యమని. కవిని పోషించిన రాజు (రాజరాజ నరేంద్రుడు) యొక్క పాత్ర కూడా ఈ విషయంలో గుర్తు పెట్టుకోవాలి. రాజు లాంటి వ్యక్తి పూనుకొని రాయించి పదిల పరచక పోతే భద్రంగా ఇంత కాలం ఉండేది కాదు. వైదిక మత పునరుధ్ధరణ అనే ధార్మిక, రాజకీయ అంశం కూడా రాజుగారి ప్రోత్సాహానికి ఒక కారణం. నన్నయ్య కాలానికే తెలుగు కావ్య భాష స్థాయికి ఎదిగిందని సమకాలీన శాసనాలు చెపుతున్నాయి. కవులు కొంత మంది అప్పటికే పద్య రచనలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి రాజు గారి వద్ద కులబ్రాహ్మణ పదవిలో ఉన్న నన్నయ్య లాంటి వారి పనే శాసనాలు రాయడం. కాబట్టి నన్నయ్య భారత అనువాదానికి ఉపక్రమించడం యాదృచ్చికం కాదు , మరో విధంగా చెప్పాలంటే ఆ కాలపు సామాజిక, ధార్మిక, రాజకీయ అవసరం. తమిళంలో నన్నయకు 200 యేళ్ళ ముందే పెరిందేవనార్ భారత అనువాదం చేశాడు. కన్నడంలో ఆదికవి అయిన పంపడు నన్నయ్యకు వందేళ్ళ క్రితమే భారతాన్ని అనువాదం చేశాడు. ప్రధాన ద్రావిడ భాషలలో భారతాన్ని లేటుగా అనువదించింది మనమే.

నన్నయ్య భారతం అనువాద కావ్యమైనప్పటికీ అది పదానువాదం కాదు. మక్కీ కి మక్కీ గా చేస్తే పదానువాదం అవుతుంది. కాని నన్నయ్య చేసింది కథానువాదం. అంటే కథా సంగ్రహాన్ని మూలం నుండి గ్రహించి పలు మార్పులు చేర్పులతో ఔచిత్యాన్ని పాటించి స్వతంత్ర కావ్యంగా తీర్చిదిద్దింది కవిత్రయం. అటువంటి పురాణ కావ్య కథానువాద పరంపరకు పాదులు వేసి మార్గదర్శకుడై నిలిచింది నన్నయ్యే. తనకు ముందు ఉన్న భాషా స్వరూపం పలురకాలుగా ఉండింది. ఉదాహరణకు ‘వాడు’ అను పదం రకరకాలుగా రాయబడేది వాన్ఱు , వాణ్ణు , వాణ్డు , వాండు , వాడు ఇలా అనేకా రూపాలలో అప్పటి సమాజపు జన బాహుళ్యంలోనూ శాసన రచనలలోనూ ఉండేది. నన్నయ్య ఈ పదాలకు ఒక ప్రామాణికతను తెచ్చిపెట్టి వ్యాకరణ బధ్ధమైన స్థిరత్వాన్ని కలిగించి రాబోయే కాలపు రచయితలకు ఒక వ్యవస్థీకృత భాషను అందజేశాడు. ఆంధ్రశబ్ద చింతామణి అను వ్యాకరణ గ్రంధాన్ని కూడా నన్నయ్యే రాశాడని మరచిపోరాదు.  నన్నయ్యకు ముందున్న భాషా స్థితి ఎలాంటిదో కవిత్రయంలో ఒకరైన ఎర్రన అద్భుతగా చెప్పారు. ‘గాసట బీసటే చదివి గాధలు తవ్వుతున్నారు నాటి తెలుగు వారు’ అని. అటువంటి ఒక సాధారణ జాతి మాట్లాడే పామర భాషకు కావ్య సౌందర్యప్రాప్తిని ఆపాదించింది మొదటగా నన్నయ్యే.

నన్నయకు ముందు తెనుగు అనే పదాన్ని తన రచనలో వాడినవాడు నూరేళ్ళ ముందు వాడైన మల్లియ రేచన. అది ఛందో గ్రంధం మాత్రమే , కావ్యం కానీ కవిత్వం కానీ కాదు. అదే విధంగా నన్నయకు 500 యేళ్ళకు ముందు అగత్తియం అనే తమిళ లక్షణ గ్రంధంలో తెలుగు అనే భాషను ప్రస్తావించారు. “కన్నడం కొంకణం  కొల్లుం తెలుంగుం” అని భాషల లిస్టు చెప్పడమయితే జరిగింది కానీ ఆ తెలుగు భాష ఎక్కడ మాట్లాడే వారో అది ఎలా ఉండేదో చెప్పలేదు. అందుకు భిన్నంగా, పరమ స్పష్టంగా తెలుగులోనే కావ్య రచన చేస్తున్నట్టుగా మహాభారత అవతారికలో ప్రకటించి మరీ కవిత్వం చెప్పినది మొట్ట మొదటిగా నన్నయ్యే. కాబట్టి ఆయనే మన తొలి కవి. ఆయన రాసిన విషయాన్ని సంవత్సరంలో ఒక రోజు జాతి మొత్తం గుర్తు చేసుకొని స్మరించుకొని పండుగ చేసుకొనే అర్హత ఆ చరిత్రకున్నది.

‘తెనుగు’ అనే పదాన్ని జగద్విఖ్యాతంగా ప్రకటించి వెలిగించిన వజ్రపు తునక ఈ పద్యం :

సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తిలో
నారసి మేలునాన్ ఇతరులు అక్షర రమ్యతనాదరింప నా
నా రుచిరార్థ సూక్తినిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహా
భారత సంహితా రచన బంధురుడయ్యె జగత్ హితంబుగన్

ప్రతి పదార్థము = సారమతిన్ కవీంద్రులు  = ప్రశస్థ్యమైన బుద్ది కలిగిన కవి పండితులు ; ప్రసన్న కథ కవితార్థ యుక్తిలోన్ = ప్రసిద్ధమైన కథలలోని మరియు కవిత్వములోని గొప్పతనాన్ని ;  ఆరసి మేలునాన్ = లోతుగా పరిశీలించిన వారై ; ఇతరులు అక్షర రమ్యత నాదరింప = పామరులు శభ్దాలలోని అక్షరరమ్యతను ఆదరింపగా ; నానా రుచిర అర్థ సూక్తి నిధి = హృద్యమైన అర్థాలతో కూడిన వివిధ సుభాషితాలకు నెలవైన ; మహా భారత సంహిత = మహాభారతము అనే వేద సమానమైన గ్రంధాన్ని ; జగత్ హితంబుగన్ = లోకానికి శ్రేయస్సు కలిగే విధంగా ; బంధురుడయ్యె = ఒప్పిదమైన వాడు

తాత్పర్యము = పేరొందిన  కవి పుంగవులు తన రచనలోని గొప్పతనాన్ని మెచ్చుకోగా , మరియు ఇతరులు ( పామరులు ) అక్షర రమ్యతను ఆదరించగా ( క్లాస్ కి మాస్ కి కూడా నచ్చే విధంగా), హృద్యమైన అర్థాలతో కూడి వివిధ సుభాషితాలను సూచించే నన్నయభట్టు అను కవి లోకానికి శ్రేయస్సు కలిగే విధంగా మహాభారతము అను వేద సమానమైన గ్రంధాన్ని ఒప్పయిన రీతిలో రచించును తెనుగు భాషలో.

ఇంత సాంద్రతరంగా పద్యాన్ని రాసిన నన్నయ్య కవిత్వ సృజనలోనే కాదు ఆద్యుడు,మేలిమి  బంగారు శిల్ప రమ్యతను ప్రదర్శించిన విశిష్ట శ్రేణి కవిత్వానికి కూడా నన్నయ్యే ఆద్యుడు అని చెప్పాలి. నన్నయ్య రచనలు లోతుగా పరిశీలించి సిద్దాంత గ్రంధాలు వెలువరించిన మరియు సినారే లాంటి వారికి ఉపాధ్యాయుడుగా ఉన్న మహా పండుతుడు ఆచార్య దివాకర్ల వేంకటావధాని నన్నయ ప్రాముఖ్యతను ఈ విధంగా అభివర్ణించారు : “నన్నయ్య భారతం తెలుగులో ఆది కావ్యం. భాషచే , భావాలచే, వస్తువుచే , వర్ణనాదికములచే వృత్త వైవిధ్యముచే , కవితచే,  పవిత్రతచే , మహోదాత్తమై , ఉత్తమ శ్రేణికి చెందినట్టి కావ్యం. మనకు లభిస్తున్న కావ్య జాలంలోనే మొదటిది. అందుకే నన్నయ ఆదికవి. అంటే ఆది కావ్య కర్త అని అర్థం”.

లెనిన్ వేముల

లెనిన్ బాబు వేముల: వృత్తికి సాఫ్ట్ వేర్ ఇంజనీరు, ఎమ్మే లో చదువుకున్న తెలుగు భాషా సాహిత్యాల సౌందర్యం మత్తు వదలని పాఠకుడూ వ్యాఖ్యాత. ప్రస్తుతం అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో నివసిస్తున్నారు. అక్కడి టాంటెక్స్ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్)  నెల నెలా తెలుగు వెన్నెల క్రియాశీలురలో ఒకరు.

2 comments

  • బాగుంది …”ఆలోచనా శక్తి, సమాజం, విజ్ఞాన సంస్కృతులు మొదలైన మానవ సంబంధిత విషయాలన్నీ భాషతో విడదీయలేని పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ” దానిలో సమాజం అంటే జాతి కూడా విడదీయ రానిది.

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.