టాల్ స్టాయి తిరుగాడిన చోట…!

మరుసటి రోజు లేచి ఫ్రెష్ అయిన తర్వాత హోటల్ వారు ఏర్పాటు చేసిన కాంప్లిమెంట్ బ్రేక్ ఫాస్ట్ చేసి రిసెప్షన్ వద్దకు చేరుకొని మిగతా మిత్రులందరూ వచ్చి బ్యాగేజ్ సర్దుకునే సమయంలో నా పాస్ పోర్ట్ కన్పించలేదు. కొంత కంగారు పడి మళ్ళీ రూమ్ కు వెళ్లి వెతికే సరికి కన్పించింది. ఊపిరి పీల్చుకుని వచ్చాము ఇది ఎందుకు చెబుతున్నానంటే విదేశాలకు వెళ్ళినప్పుడు పాస్ పోర్ట్ చాలా ముఖ్యం. మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినా అది మీ వెంటే ఉంచుకోవడం చాలా అవసరం, గైడు రెడీగా ఉంది. అక్కణ్ణించి మొదట రెడ్ స్క్వేర్ కు వెల్దామనుకున్నాము, వెళుతుంటే దారిలో బోల్షోయ్ థియేటర్ కనపడింది బయటి నుండే ఫోటోలు తీశాము విప్లవానికి ముందే నిర్మించిన ఈ థియేటర్ ను చాలా సార్లు  ఆధునీకీకరించారు,

బోల్షోయ్ బ్యాలె నాట్యం ప్రపంచం లోని అన్ని బ్యాలె నాట్యాల వలెనే పురాతనమైనది, అతి పెద్ద బ్యాలె నృత్య కంపెనీ కూడా ఇదే. దాదాపు రెండువందలమంది నృత్య కళాకారులు పాల్గొనే కంపెనీ 1780 లో ప్రారంభింపబడినా ఈ థియేటర్ అనేక ఒడిదుకులకు లోనై  పూర్తి స్థాయి లో 1821 లో మొదలయింది. విప్లవం తర్వాత దీన్ని ‘స్టేట్ అకాడమిక్ బోల్షోయ్ థియేటర్’ పేరుతో పునర్నిర్మించారు. రెండవ ప్రపంచ యుద్ధం లో ఒక బాంబు దెబ్బకు కొంత భాగం పూర్తిగా పాడయితే, వెంటనే మరమ్మతులు చేశారు. అయినా 2005 నుండి   2011 వరకు దాన్ని పూర్తిగా మూసేసి తిరిగి పూర్తిగా పునర్నిర్మించారు. అందుకు వారు వెచ్చించిన మొత్తం బిలియన్ డాలర్లకు పైన్నే. ఇప్పుడు దాని స్వరూపమే మారి పోయింది.

అలా ఆ థియేటర్ ను బయటినుండే చూసి కారు లో ముందుకు వెళుతున్న మాకు క్రెమ్లిన్ వెళ్ళక ముందే మార్క్స్ విగ్రహం కనబడింది అక్కడ దిగి ఆయన జన్మించి రెండువందల సంవత్సరలాయిన సందర్భాన్ని గుర్తుకు  తెచ్చుకుని నివాళులర్పించాము, అక్కడినుండి నడుచుకుంటూ క్రెమ్లిన్ వైపు వెళ్ళాము. అక్కడ మాకు “స్టేట్ హిస్టారికల్ మ్యుజియం “ కనబడింది, లోపలి వెళ్లి చూడలేదు. 1872 లో స్థాపింప బడిన ఈ మ్యూజియం లో మిలియన్ల కొద్దీ ఆర్ట్ కలెక్షన్లు ఉన్నా సమయాభావం చేత చూడలేక పోయాము, ప్రపంచం లో ఐదు పెద్ద మ్యూజియంలలో ఇది ఒకటి. బయటినుండే ఈ కట్టడాన్ని వీక్షించాము నియో రష్యన్ ఆర్కిటెక్చర్ ( 19 వ శతాబ్దం మధ్య భాగం లో రష్యన్, బైజాంటిన్ పోలికలతో వివిధ రకాల నిర్మాణాలు జరిగాయి ) తో ఎర్ర రంగు రాతి కట్టడం చాలా అందంగా ఉంది, క్రెమ్లిన్ కు కూడా ఇవే రంగు రాళ్ళు వాడారు, రెండు టవర్లు ఆ టవర్లపై రష్యన్ జాతీయ చిహ్నం కంచుది  మెరిసి పోతూ కన్పిస్తుంది, ఆ కట్టడం ముందు మార్షల్ ఝుకోవ్ కంచు విగ్రహం గుర్రం మీద స్వారీ చేస్తూ ఠీవీగా కనబడింది . ఝుకోవ్ జీవితం సినిమా కథ లా ఉంటుంది.    

1896  డిసెంబరు 1 న మాస్కో కు దక్షిణాన గల స్థ్రెల్కొవ్కా లో ఒక రైతు కూలి ఇంట జన్మించిన జార్జి కాన్స్తాన్టినోవిచ్ ఝుకోవ్ 1915 లో రష్యన్ ఆర్మీ లో చేరాడు 1918 -1920 మధ్య జరిగిన సోవియట్ ప్రజా యుద్ధంలో రెడ్ ఆర్మీ లో చేరాడు, అక్కడినుండి రెడ్ ఆర్మీ లో అనేక ర్యాంకులలో పనిచేసి ట్యాంక్ యుద్ధ నిపుణుడుగా పేరుగాంచాడు. 1941 జనవరి1 న స్టాలిన్ ఆయన్ను సర్వ సైన్న్యాధ్యక్షుని గా నియమించాడు కానీ ఆరు నెలలకే స్టాలిన్ తో విభేదించిన కారణంగా ఆయన్ను ఆర్నెల్ల పాటు డిస్మిస్ చేశారు కానీ ఆయన దక్షత గురించి తెలిసిన స్టాలిన్ ఆయనను ఆర్మీ ప్రధాన స్థావరం లోనే ఉండమని ఆదేశించాడు, రెండవ ప్రపంచ యుద్ధం మొదలయింది, జర్మన్ సేనలు మాస్కోను చుట్టుముట్టాయి, మాస్కో నగరాన్ని రక్షిస్తునే జర్మన్ సేనలపై దాడి చేసేబాధ్యతను ఝుకోవ్ పైన  ఉంచారు, ఆయన ఆ విధులల్లో ఉండగానే ఆయనను రెడ్ ఆర్మీ కి డిప్యుటీ కమాండర్ ఇన్ చీఫ్ గా నియమించి, ఆయనను అప్పటి స్టాలిన్ గ్రాడ్(వోల్గొగ్రాడ్) రక్షణకు పంపించారు. అప్పటికే జర్మన్ సేనలు ఆ నగరాన్ని 

దాదాపు చుట్టుముట్టాయి ఆగస్టు ఇరవయ్ మూడు, 1942 న స్టాలిన్ గ్రాడ్ యుద్ధం మొదలయింది జర్మన్ సేనలు బాంబు దాడులతో ఆ నగరాన్ని దాదాపు నేల మట్టం చేశారు, సెప్టెంబర్ కంతా జర్మన్ సేనలు నగరం నడిబొడ్డుకు చేరుకున్నాయి, అక్కడి నుండి భీకర పోరు ప్రారంభమయింది అది ఎంత తీవ్రంగా జరిగిందంటే నగర కేంద్ర రైల్వే స్టేషన్ పదమూడు సార్లు చేతులు మారిందంటే ఆ పోరు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆలేక్జాండర్ వాసిలేవ్స్కీ తో కలిసి ఝుకోవ్  ఆ పోరుకు నాయకత్వం వహించాడు నగర నడిబొడ్డున గల ఎతైన ప్రదేశం ‘మామయేవ్ కుర్గాన్ ‘ ను ఎనిమిది సార్లు పట్టుకోవడం జర్మన్ సేనలు మళ్ళీ దాన్ని ఆక్రమించుకోవడమూ జరిగింది, నవంబరు మొదటి వారానికంతా జర్మన్ సేనలు దాదాపుగా నగరాన్నంతా ఆక్రమించి రెడ్ ఆర్మీని రెండు ఇరుకు సందుల్లోకి తరిమారు.

యుద్దరంగం లో సైనికులే కాదు రచయితలు కుడా పాల్గొన్నారు, మే తొమ్మిది విక్టరీ డే సందర్భంగా ఎక్కడ చూసిన ఇలాంటి ఫోటోలు పెట్టారు ఇందులో కుడి వైపున వున్నది అలెక్జాండర్ ఫదీవ్, ఆయన వెనుక ఉన్నది ప్రముఖ రచయిత మిఖైల్ షోలకోవ్

అక్కడినుండి రెడార్మీ తన అసలు యుద్దాన్ని ప్రారంభించింది, వ్యూహాన్ని మార్చి ( దీనికి ఆపరేషన్ యురానస్ అని పేరు పెట్టారు ) ఆ ప్రతియుద్ధం ( కౌంటర్ అటాక్ )  తీవ్రంగా జరిగింది. అత్యంత దుష్ట సేనగా ప్రసిద్ది కెక్కిన జర్మన్ ఆరవ దళాన్ని నవంబర్ 19 కంతా ఎర్ర సేన చుట్టుముట్టింది. భీకర పోరు జరిగింది. ఎంత భీకరంగా జరిగిందంటే యుద్ధం మొదలైన ఇరవై నాలుగంటల్లోనే ముప్పై శాతం మంది సైనికులు చనిపోయారు. జనవరి 31 న జర్మన్ ఆరవ దళ కమాండర్ ఫ్రెడరిక్ పాలస్ ఎర్ర సేనకు లొంగి పోయాడు. ఫిబ్రవరి 2 కంతా మిగిలిన జర్మన్ సైన్యాన్ని రెడ్ ఆర్మీ మట్టుబెట్టింది. అలా స్టాలిన్ గ్రాడ్  యుద్ధం ముగిసింది. ఈ యుద్దాన్ని రెండవ ప్రపంచ యుద్ద చరిత్రలోనే అత్యంత పెద్దదీ, క్రూరమైన యుద్ధంగా ( 2.2 మిలియన్ల మంది ఈ యుద్ధం లో చనిపోయారు) చరిత్ర కారులు పేర్కొంటారు.

తర్వాత జరిగిన యుద్దట్యాంకర్ల భీకర కుర్స్ క్  యుద్ధం లో జర్మన్ సేనను ఓడించి బెర్లిన్ దాకా తరిమికొట్టిన రెడ్ ఆర్మీకి నేతృత్వం వహించిన మార్షల్ ఝుకోవ్ విగ్రహం ముందు అలా నిల్చుండి  చూస్తూ ఉన్న మాకు మే తొమ్మిదిన జరిగే విక్టరీ పెరేడ్ కోసం మిలటరీ దుస్తులు, వారికి గౌరవం గా బహూకరించిన రకరకాల మెడల్సు ధరించి అక్కడ ఠీవీగా తిరుగాడుతున్న మాజీ సైన్యాదికారులను, సైనికులను చూశాము. ఇప్పటి తరం వారినెవ్వరినీ  పట్టించుకోవటం లేదు, వాళ్ళ సెల్ ఫోన్లతో వారు బిజీ గా ఉన్నారు, దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడినా వారిని నేటి తరం కనీసం పట్టించుకోక పోవడం బాధనిపించింది. అక్కడే తచ్చాడుతున్న ఒక సైనికుని వద్దకు వెళ్లి ఫోటో దిగాను, అక్కడి నుండి మేము టాక్సీ లో టాల్ స్టాయ్ ఇల్లు ఉన్న ప్రదేశానికి వెళ్ళాము. పన్నెండువందల పేజీల ‘యుద్ధమూ శాంతీ’, ఎనిమిదొందల పేజీల ‘అన్నా కెరినీనా,  గుర్తుచేసుకున్నాం.

ఆ నవలల్లోని సన్నివేశాలు పాత్రలూ తనకు మాత్రమే సాధ్యమైన ఊహాశక్తి తో అత్యంత ప్రభావ వంతం గా చిత్రించిన టాల్ స్టాయ్ ఇంటిముందు మా టాక్సీ ఆగగానే కుతూహలంతో బయటికి దూకాము. మా గైడు ప్రవేశ టిక్కెట్లు కొనుక్కొని వచ్చింది, లోపలకు అడుగు పెట్టగానే ఒక యాభై సంవత్సరాలు దాటినా ఒకావిడ సాదరంగా ఆహ్వానం పలికింది. మా బ్యాగులు పెట్టుకోవడానికి ఒక ప్రదేశం చూపించింది, ఆవిడతో మా గైడు రష్యన్ భాషలో ఎదో మాట్లాడింది, ఆమె తలవూపి ఫోన్ చేయగానే ఒక మధ్య వయస్కురాలు లోపలి వచ్చింది ఆమె పేరు ఓల్గా. ఆమె అక్కడి విశేషాలు చెప్పనారంభించింది అయితే ఆమె రష్యా భాషలోనే చెప్తుంటే మా గైడు యూజీన్ ఇంగ్లీష్ లోకి అనువదిస్తూ పోయింది. ఆయన వ్రాత బల్ల, డైనింగు టేబులు, పడక గది, అతిధులకోసం వేసిన సోఫాలు, పిల్లల గదులూ ఒక్కటేమిటి ఆనాటి కులీన వంశస్తులు వాడే ప్రతి ఒక్క వస్తువును పరికించాము.   ఆయన స్వయంగా తయారు చేసుకున్న బూట్లూ, అప్పటికే ఆయన సైకిలు వాడేవాడు.

టాల్ స్టాయ్ వాడిన బూట్లు సైకిలు

టాల్ స్టాయ్ ఇల్లు ఒక డజను గదులతో ముచ్చటగా ఉంది, అందరికీ అన్ని సౌకర్యాలతో అమర్చి ఉంది, ఇంట్లో పనిచేసే వారికి కూడా అన్ని వసతులూ ఉన్నాయి. విశాలమైన ఇంటి ఆవరణ ( దాదాపు ఒక నాలుగెకరాలుంటుంది) అందులో పచార్లు చేస్తూ ఆయన తన సాహిత్య సమాలోచన చేస్తుంటాడని గైడు వివరించింది, ఒక పెద్ద పియానో కుడా ఉంది, ఆయన గొంతును రికార్డ్ చేసి పెట్టారు అది వినిపించారు.

ముందుగా చెప్పుకున్నట్లు టాల్ స్టాయ్ నవలల్లో విస్తారమైన మానవ జీవితం కనిపిస్తుంది. యుద్ధమూ శాంతీ నవల అన్ని నవలలాగా ఒకటి రెండు పాత్రలమీద కేంద్రీకరించి ఉండదు, ఒకటీ రెండు సంఘటనలపై కేంద్రీకరించి కాక 550 పాత్రలతో 50 సంఘటనలతో ఒక మహా కావ్యం లా ఉంటుంది. ఆసలన్ని పాత్రలను గుర్తు పెట్టుకుని బిగువు సడలకుండా ఏకాగ్రతతో రాయడమనే దాన్ని ఊహిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. అది చారిత్రక నవల అంటారు కానీ అది అలాంటిది కాదు ఆ కాలం లో మానవ జీవితం లో జరిగిన అనేక వైరుధ్యాలను ఎత్తి చూపాడు దాని పేరే  యుద్ధమూ శాంతీ అందులో ఏహ్యత-ప్రేమా, మరణమూ- ప్రాణమూ, నాయకుడూ –సాధారణ వ్యక్తీ, పట్టణమూ- పల్లె లాంటి అనేక వైరుధ్యాల వర్ణనా, మానవ జీవిత చిత్రణా ఉంటాయి. అలాంటి మహా రచయిత నివసించి ఒక పుస్తకాని రచించిన స్థలంలో తిరుగాడుతున్నందుకు ఆనందం వేసింది. అసలు ఆయన మొదట నివసించిన ఎస్టేటు ‘యాస్నాయా పోల్యానా’ కు వెళదామనుకున్నాం కానీ అది మాస్కో కు రెండొందల కిలోమీటర్లు పైనే ఉందని సమయాభావం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నాము.

 

వేణుగోపాల రెడ్డి

వేణు గోపాల రెడ్డి: కర్నూల్ జిల్లా వడ్ల రామాపురంలో జన్మించారు. వృత్తి రిత్యా హై కోర్ట్ లో న్యాయవాది. ప్రవృత్తి వామపక్ష సాహిత్య అధ్యయనం, ప్రచారం. రెండు దశాబ్దాల కింద కర్నూల్ కేంద్రంగా పని చేసిన LEAP (లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఎయిడ్ పర్ పూర్) వ్యవస్థాపకుడు. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా మొదట కర్నూల్ లో ఇప్పుడు హైదరాబాద్ లో అనేక సాహిత్య సాంస్కృతిక వ్యాపకాలలో ఉన్నారు. ‘ప్రజ్వలిత’అనే సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వామపక్ష సైద్దాంతిక అంశాల మీద పలు జాతీయ దిన పత్రికలలో వ్యాసాలూ సమీక్షలూ రాశారు.  ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకోడానికి​,​ వ్యాఖ్యానించడానికీ, మార్చడానికీ వామపక్ష రాజకీయాలు మినహా మరేదీ లేదనే అచంచల విశ్వాసం.

1 comment

  • నేను మీతో నడిచాను.ఝకోవ్ ఫోటో ను చూపి వుంటే ఇంకా బాగుంటుంది.
    యుద్ద వ్యూహం బాగుంది.వావ్ టాల్స్టాయ్.He was tall Talstaay .Beautiful narration.

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.