ఆధునిక బానిసత్వం: ఖైదీల పోరు?

అమెరికాలో బానిసత్వం ఇంకా వుంది, పూర్తిగా రద్దు కాలేదు.

ఆధునిక బానిసత్వాన్ని ఆపెయ్యాలని, తమకు కూడా కనీస వేతనాలు వర్తింపజేయాలని, మానవీయ పరిస్థితులు కల్పించాలని 17 రాష్ట్రాల్లో 2 లక్షల మంది ఖైదీలు సహాయ నిరాకరణోద్యం నిర్వహిస్తున్నారు. ఈ వ్యాస రచన సమయానికి 10 రోజులుగా ఆహారం మానేసి, సమ్మె చేస్తున్నారు.

అమెరికా జైళ్లలో ఖైదీల ‘ఆధునిక బానిసత్వం’ గురించి ‘ది గార్డియన్’ పత్రిక ఇటీవల ఒక  వ్యాసం ప్రచురించింది. అమెరికా రాజ్యాంగంలోని 13 వ సవరణ ( 13th amendment) ద్వారా 1865, అబ్రహాం లింకన్ కాలంలో బానిసత్వం రద్దయిందని అందరం చదువుకున్నాం. అదే సవరణలో మరో వాక్యం కూడా వుంది. “నేరం చేసిన వారిపై చట్టబద్ద శిక్షగా బానిసత్వం అమలుచేయవచ్చు” అని. ఇది చాలు జైళ్లు నోళ్లు తెరుచుకోడానికి. అంచెలంచెలుగా పబ్లిక్, ప్రవేటు జైళ్ల సంఖ్య పెరగడమే కాదు. జైళ్ల గోడలు పెరిగాయి, జైళ్ల విస్తీర్ణమూ పెరిగింది. లాభసాటి వ్యాపారంగా ‘జైళ్ల పరిశ్రమ’ అభివృద్ధి చెందుతోంది. ఖైదీ కార్మికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఇప్పటికిప్పుడు అమెరికా జైళ్లలో నిర్బంధంలో 23 లక్షల మంది వున్నారు. ట్రయిల్స్ పేరిటా, పెరోల్స్ మీదా వున్న వారు కాకుండా శిక్షలు అనుభవిస్తున్నారు 10 లక్షల దాకా వున్నారు. వీరంతా జైళ్ళ పరిశ్రమల్లో (ఫ్యాక్టరీ) పనిచేస్తున్న కార్మికులే. వీరికి కనీస వేతనాల చట్టం అమలు కాదు. కార్మికులకున్న ఏ సౌకర్యాలు, చట్టాలు వీరికి వర్తించవు. వీరికి వర్తించేవి 2 వందల ఏళ్ల క్రితపు బానిసత్వం మాత్రమే. ప్రపంచ జనాభాలో అమెరికా ప్రజలు 5% మాత్రమే కానీ నిర్బంధంలో వున్నవారిలో 25% మంది అమెరికా ప్రజలే. ఒకసారి ఒక నేరం పై జైలులో శిక్ష అనుభవిస్తే రాజకీయ హక్కు అయిన ఓటు హక్కు తొలగించబడుతుంది. ఆ నేరం దొంగతనమా, మత్తుమందు( డ్రగ్) కలిగివుండడమా, చిన్నదా, పెద్దదా సంబంధం లేదు. ఇలా ఓటు హక్కు కోల్పోయిన వారు అమెరికాలో 60 లక్షలమంది వున్నారంటే నమ్మశక్యం కాదు. చాల దేశాల్లో జైళ్లలో వున్న ఖైదీలు కూడా ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకుంటారు. విడుదలయిన తరువాత జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఒకసారి జైలుకు వెళితే చాలు ఓటు హక్కు కోల్పోయే విచిత్ర పరిస్థితి ఒక్క అమెరికాలోనే వుందనవచ్చు. అంతేకాదు జైలు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వారు క్రిమినల్ రికార్డ్ వున్నందుకు ఒక ఉద్యోగం కానీ, అద్దెకు ఇల్లు కానీ, బ్యాంకు లోను కానీ పొందలేరు. జైలు నుంచి బయటికి వచ్చాక వారిది అర్ఠికంగా, రాజకీయంగా, సామాజికంగా దివాళా తీసిన బతుకవుతుంది.

ఏ దేశంలో అయినా ‘నేరాలు’, ‘దొంగతనాలు’ పేర జైళ్లలో ఎక్కువగా వుండేది పేద ప్రజలే. అమెరికాలో పేద ప్రజలంటే ఆఫ్రికన్-అమెరికన్లు( నల్లవారు), బ్రౌన్ కలర్ ప్రజలు. అంటే అమెరికా జైళ్లలో అత్వధికంగా శిక్షలు అనుభవిస్తున్నది ఆఫ్రికన్- అమెరికన్లు, బ్రౌన్ కలర్ వారు. అమెరికాలో నల్లవారి జనాభా 19% ఉంటే జైళ్లలో వున్నవారిలో 58% నల్లవారే.

అంతే కాదు మత్తుమందులు ‘డ్రగ్స్’ కలిగివున్నారనే నేరం కింద అరెస్టయ్యే వారి సంఖ్య ఇతర రకరకాల నేరాలు చేసి జైలు శిక్షలు అనుభవిస్తున్నవారి మొత్తం సంఖ్యకు సమంగా ఉంటుంది. మత్తుపానీయాలు, మత్తుమందులు సేవించే వారికే ఆర్థికపరమైన,ఆరోగ్యకరమైన సమస్యలు ఎదురవుతాయి. అది ఆయా వ్యక్తులకు, ఆ వ్యక్తుల కుటుంబాలకు నష్టకరం. ఇతరులకు నష్టకరం కావు కనుక మత్తుమందులు కలిగి వుండడం దానికదే నేరం కాదు అని చాల మంది భావిస్తారు. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, రేప్ ల వంటి నేరాలు ఇతరులకు హాని కల్గిస్తాయి కనుక వాటిని నేరాలుగా పేర్కొనవచ్చు. ఆ నేరాలకు మించిన నేరంగా మత్తుమందును పేర్కొనడం, దానిపై యుద్ధం ప్రకటించడం కాకతాళీయం అనలేం. అఫ్రికన్ అమెరికన్ యువతపై ఆ పేరుతో రీగన్ కాలంలో ప్రకటించిన యుద్ధం క్లింటన్ సమయానికి మరింత ఉధృతమయింది. ఫలితం..నేడు లక్షలాది మంది యువతీ యువకులు ‘డ్రగ్స్’ నేరం కింద జైళ్లపాలయ్యారు. నల్లవారి బానిసత్వాన్ని కొనసాగించడానికే ఈ “వార్ ఆన్ డ్రగ్” చట్టం ఉపయోగపడుతోందని చెప్పవచ్చు.

లాభదాయక పరిశ్రమ:

లక్షలాది ఖైదీలకు తినడానికింత తిండి పెట్టి గొడ్డు చాకిరీ చేయించుకోవచ్చు. పనిగంటలు అడగరు, సెలవులు పెట్టరు, ఆరోగ్య భీమా చెల్లించక్కర్లేదు, అమెరికాలో జైళ్లను ప్రైవేటు రంగమే నిర్వహిస్తుంది. వారికిదో లాభాసాటి వ్యాపారం. ఖైదీల కోసం ప్రభుత్వం చెల్లించే మొత్తంటోనే ప్రైవేటు కంపెనిలు చాల  లాభం పొందుతున్నాయి. అనేక ఇతర ప్రవేటు కంపెనీలకు పని చేసిపెట్టడానికి కాంట్రాక్ట్ లేబర్ గా ఖైదీలను ఉపయోగించి మరిన్ని లాభాలు పొందుతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఖైదీలతో పనిచేయించడం జరుగుతున్నది. వారికి పనులు నేర్పించాలని, బయటికి వెళ్లాక పనులు చేసుకొని మెరుగైన జీవితం గడపాలని, ఆ విధంగా జైళ్లు పునరావాస కేంద్రాలుగా పనిచేయాలని చెబుతారు. అమెరికా జైళ్లు అందుకు భిన్నం.  మిలిటరీలోని సైనికులకు, మాక్డోనాల్డ్, వెండిస్ లలొ పనిచేసే సిబ్బందికి దుస్తులు, ఆడవాళ్ల లోదుస్తులకు పేరెన్నిక గన్న ‘విక్టోరియాస్ సీక్రెట్’ కంపెనీకీ ఖైదీ కార్మికులే పనులు చేస్తున్నారు. వారికి గంటకు కొన్ని10-12 సెంట్లు మాత్రమే చెల్లిస్తారు. కొన్ని జైళ్లలో అది కూడా చెల్లించరు. ఖైదీ కార్మికులకు నెలకు 10-12 డాలర్లకు మించి లభించవు . ఇవి వారికి పాకెట్ మనీగా ఉపయోగపడుతుంది. అందులో సగం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసుకోడానికే సరిపోతుంది.  ఆగస్టు నెలలో కాలిఫోర్నియా రాష్టృంలో చెలరేగిన మంటలను ఆర్పే పనిలో కూడా ప్రాణాలకు తెగించి ఖైదీ కార్మికులు పాల్గొన్నారు. మంటలు ఆర్పే ప్రాణాంతకమైన పనికి కూడా గంటకు 1 డాలరు మాత్రమే చెల్లించారు జైలు అధికారులు. అదే మంటలు ఆర్పే ఫైర్ ఫైటర్స్ కు గంటకు 30-40 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మంటలు ఆర్పే పనిలో ఇద్దరు ఖైదీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఈ ఘటన వల్ల ఖైదీ కార్మికులపై శ్రమ దోపిడీ బయటి ప్రపంచానికి మరింత బాగా వెల్లడయింది. అమెరికా పబ్లిక్ పార్కులు, రహదారులంతా అందమైన పచ్చిక బయళ్ళుగా కనిపించడంలో ఖైదీల శ్రమ దాగి వుంది. భయంకరమైన మంచుతో రహదారులు మూసుకపోతే వాటిని బాగుచేయడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో కాంట్రాక్ట్ లేబర్ గా వీరిని ఉపయోగించడం కద్దు. అమెరికన్ బ్యాంకు నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, స్టార్ బక్స్ , వాల్ మాట్ నుంచి ఫైజర్ కంపెనీ వరకు … 50 కంపెనీలకు పైగా …. అన్ని రకాల కంపెనీలు ఖైదీ కార్మికులతో పని చేయించుకుంటున్నాయి. జైళ్ల ఫ్యాక్టరీలు  ఖైదీ కార్మికుల నుంచి దేశ వ్యాప్తంగా ఏడాదికి 182 బిలియన్ల (18 వేల 200 కోట్లు) డాలర్ల శ్రమను దోపిడీ చేస్తున్నాయి అంటారు నేవాడ యూనివర్సిటీ లా ప్రొఫెసర్ రూబెన్ జె. గార్షియా. ఖైదీ కార్మికులు ఉత్పత్తి చేసే వస్తువులకు “మేడిన్ అమెరికా” అనే లేబుల్ తగిలిస్తారు. ‘మన దేశ ఉత్పత్తుల్నే కొనాల’ని మరో వైపు అమెరికా పాలకులు ఊదరగొడుతుంటారు. ఇప్పుడు జరుగుతున్న సమ్మె వల్ల అమెరికా సామాన్య ప్రజలకు అసలు నిజాలు తెలుస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు స్కూళ్ళు తెరిసే సమయం, పిల్లలకు బట్టలు, స్కూల్ బ్యాగులు, షూస్, లంచ్ బాక్సులు వగైరా కొనడానికి వెళ్లినప్పుడు ఆ వస్తువులు ఖైదీ కార్మికులు చేశారని తెలుసుకుంటారని రూబెన్ జె. గార్షియా అంటారు.

యమకూపాలు:

జైళ్లలో అరగొర సౌకర్యాల మధ్య అమానవీయ పరిస్థితుల్లో ఖైదీలు శిక్షాకాలాన్ని గడుపుతున్నారు. జైలులో వుండేవారు, బయటి ప్రపంచం నుంచి లోపలికి వెళ్లినవారే. బయటి ప్రపంచంలో ఎన్ని రుగ్మతలు వున్నాయో అన్నీ వారిలో వుంటాయి. బయటి క్రిమినల్ ముఠాలు ( గ్యాంగులు) జైల్లోనూ అవి కొనసాగుతాయి. అక్కడా ఒక సమాజం వుంటుంది. అయితే కుటుంబ సభ్యుల ప్రేమలు, ఆప్యాయతలు ఉండవు. ఎలా వుండాలి, ఎక్కడికి పోవాలని నిర్ణయించుకునే స్వేచ్చ వుండదు. ఒక చోట బందీ అనుకోవడంలోనే ఎంతో మానసిక వత్తిడి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పరిశుభ్రత, సౌకర్యాలు లేకుండా జంతువుల్లా బతకాల్సి రావడంతో తినే తిండి దగ్గర నుంచి, స్నానాలు చేసే చోటు వరకు… ఎన్నో రకాల గొడవలు తలెత్తుతుంటాయి. ఆ చిన్న ప్రపంచంలోనూ ముఠాలు, ముఠా నాయకులు తలెత్తుతుంటారు. ముఠాల మధ్య శత్రుత్వాలు బద్దలవుతాయి. ఏప్రిల్ లో సౌత్ కరోలినా రాష్ట్రంలోని లీ(ఎల్ సి ఇ) జైలు లో   ముఠా శత్రుత్వాలతో ఖైదీలు గొడవపడ్డారు. జైలులోని సెక్యూరిటీ గార్డులు ప్రేక్షక పాత్ర పోషించారే కానీ గొడవలను ఆపలేదనీ, ఫలితంగా 7 గురు ఖైదీలు మరణించారని “జైల్ హౌస్ లాయర్స్ స్పీక్” (జె ఎల్ ఎస్) అనే యాక్టివిస్టుల గ్రూప్ వెల్లడించింది. ఇప్పుడీ ఖైదీల సమ్మెకు ఇదే ప్రధాన కారణమనీ ఆ గ్రూప్ చెప్పుకుంది. జైళ్లలో సౌకర్యాలు పెంచాలని, మానవీయ పరిస్థితులు కల్పించాలని, తాము చేస్తున్న శ్రమకు కనీసవేతనాలు చెల్లించాలని, ఓటుహక్కు వుండాలని, విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించాలని… 10 డిమాండ్లతో సమ్మె చేస్తున్నట్లు ఈ సమ్మెకు నాయకత్వం వహించిన జె ఎల్ ఎస్ సంస్థ వివరించింది. జైళ్లు యుద్ధభూమిని తలపిస్తాయి. ఖైదీలు ప్రతిరోజు గాయపడుతూనే వుంటారని ఈ సంఘం వెల్లడించింది. జైళ్లల్లో సరైన వైద్య సౌకర్యాలు లేనందువల్ల దీర్ఘ కాల శిక్షలు పడిన వారు అకాల మరణాలకు గురవుతున్నారని, దీర్ఘ కాల శిక్షలు అంటే మరణశిక్షలుగా  భావించాల్సి వుంటుందని, జులై నెలలో మిసిసిపి రాష్ట్రంలోని జైలులో 10 మంది ఖైదీలు ఇలాగే అంతుచిక్కని ఆనారోగ్యాలతో మరణించారను వారు పేర్కొన్నారు.

చారిత్రిక నేపథ్యం:

జైల్లో వున్న ఖైదీలకు యూనియన్లు లేవు. మీటింగులు పెట్టుకొని చర్చించుకోడానికి సమావేశ స్థలాలు లేవు. సోషల్ మీడియా లేదు, మెయిన్ స్ట్రీం మీడియా తోడ్పాటు లేదు. కేవలం నోటి మాటల ద్వారానే ఒకరి నుంచి ఒకరు సమ్మె గురించి మాట్లాడుకుంటూ సమ్మెకు సిద్ధమయ్యారు. ఖైదీలు ఒంటరిగా లేరని వారికి తామున్నామని ముందుకు వచ్చింది జైల్ హౌస్ లాయర్స్ స్పీక్ (జె ఎల్ ఎస్) అనే సంస్థ. జైల్ లోపల వున్నవారితోనే గాక జైలు బయటి హక్కుల సంస్థలతో మాట్లాడామని దాదాపు 100 సంఘాలు సమ్మెకు మద్ధతు తెలిపాయని జె ఎల్ ఎస్ నాయకులు ప్రకటించారు. ఆగస్టు 21 నుంచి ప్రారంభమైన ఈ సమ్మె సెప్టెంబర్ 9 వరకు అంటే 19 రోజులు కొనసాగుతుందని, ఆ రెండు తేదీల చారిత్రిక నేపధ్యాలను వాళ్లు వివరించారు. ఆ రెండు సంఘటనలు 1971లోనే   జైళ్ళలోనే జరిగాయి. ఆ ఏడాది ఆగస్ట్ 21 న ‘బ్లాక్ పాంథర్స్’ పార్టీ సభ్యుడు జార్జ్ జాక్సన్… కాలిఫోర్నియాలోని శాన్ క్వెంటిన్ జైలు నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన కాల్పుల్లో జైలు మైదానంలో మరణించాడు.

న్యూయార్క్ లోని అట్టికా జైలు లో 1971, సెప్టెంబర్ 9 న ఖైదీల తిరుగుబాటు జరిగింది. జైలు లో మానవీయ పరిస్థితులు నెలకొనాలని, ప్రాథమిక రాజకీయ హక్కులు కావాలని డిమాండ్ చేస్తూ ఖైదీలు 20 మందిని జైలు అధికారులను బందీలుగా పట్టుకున్నారు, న్యూయార్క్ గవర్నర్ చొరవతో నాలుగు రోజులు చర్చలు జరిగాయి. ఖైదీలపై కాల్పులు జరపడంతో చర్చలు విఫలమయ్యాయి. ఈ కాల్పుల్లో 33 మంది ఖైదీలు, 10 మంది బందీలుగా వున్న జైలు సిబ్బంది మరణించారు.

సమ్మె జరుగుతున్న తీరు:

వాళ్ళు “మేం వండం, తినం, పనులు చేయం” అని శాంతియుతంగా ఒకచోట కూర్చుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, గాంధీ మార్గంలో సత్యాగ్రహం చేస్తున్నారు.

జైల్లో ఖైదీలు తమ వంటలు తామే వండుకోవాలి. చుట్టూ పరిసరాల్ని శుభ్రం చేసుకోవాలి ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి. ఉదయం అల్పాహారం తరువాత కాంట్రాక్ట్ లేబర్ గా కేటాయించిన పనులు చేయాలి. ఏ పనులు పురమాయించినా చేయాలి. ఆ పని చేయను అని ఎవరూ నిరాకరించడానికి వీలు లేదు. అలా ఎవరైనా చెబితే వారిని సాలిటరీ కన్ఫైన్ మెంట్ లో వుంచడమో, లేదా కఠినంగా శిక్షించే మరో జైలుకో తరలించడమో చేస్తారు జైలు అధికారులు. తమ హక్కులు హరిస్తున్నారని ఖైదీలు కోర్టుకు అప్పీలు చేసుకోడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె ఒక్కటే తమ గొంతుని వినిపించేది. ఈ సమ్మెను వారు సహాయ నిరాకరణోద్యమంగా మలుచుకున్నారు. నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ మధ్య ముఠా శత్రుత్వాలు తలెత్తకుండా చేసుకోవాలని, కలిసికట్టుగా హక్కుల కోసం పోరాడాలని ప్రయత్నాలు చేస్తున్నారని  జె ఎల్ సి నాయకులు ఒకరు ‘డెమొక్రసీ నౌ’ కు ఇచ్చిన ఇంటర్య్వూలో చెప్పారు. ఇప్పటికి 10 రోజులుగా సమ్మె సాగుతున్నది తూర్పున బోస్టన్ నుంచి పశ్చిమాన కాలిఫోర్నియా వరకు, ఉత్తరాన వాషింగ్టన్ రాష్టృం నుంచి దక్షిణాన జార్జియా, ఫ్లోరిడా, అలబామా వరకు 17 రాష్ట్రాల్లో ఖైదీలు శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు.

ఇక ముందేం జరుగుతుందో చూడాలి.

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

2 comments

  • we are not aware of that the jails in America are so inhuman.Thanks for bringing to d notice of Rastaa readers.

  • అమెరికా లో బానిసత్వాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.