అవసర వేళ కాఠిన్యం ఆంబేద్కర్ మార్గమే!

శ్రీనివాసులు (ఉత్తరం ద్వారా)
ప్రశ్న: ”దళిత సమస్య…” పుస్తకంలో మీరు ఉపయోగించిన పదజాలం సున్నితంగా లేదు. అది దళితుల మనసుల్ని గాయపర్చింది… మీరు చెప్పిన పద్ధతి వల్ల మీ ఆశయం కౌంటర్‌ ప్రోడక్టివ్‌ అయింది… వ్యంగ్యానికీ పరిహాసానికీ అవహేళనకీ ఈ చర్చలో చోటు లేదు… దళితులకు అంబేద్కర్‌ మీద వున్న ప్రేమాభిమానాలకూ, గౌరవానికీ భంగం కలిగించడం మీ ఉద్దేశం కాదనుకుంటాను.
జవాబు: మీ సారాంశం ఏమిటంటే – ‘దళిత సమస్య’ పుస్తకంలో నేను ఉపయోగించిన పదజాలం సున్నితంగా లేదనీ, అది ‘దళితుల మనసుల్ని గాయపరిచింది’ అనీ ఈ విషయంలో నేను ఏదైనా మార్గం ఆలోచిస్తే బాగుంటుంది అనీ.
ఆ పుస్తకం చదివిన తర్వాత, ‘అంబేద్కర్‌ విషయంలో ఆ వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతాయి’ అనే అభిప్రాయం కలగలేదంటే, అందులో ఏదో అసహజమైన విషయం వుంది.
నా భాష దళితుల హృదయాల్ని గాయపరిచింది – అన్నారే! దేనికి గాయపడాలో, దేనికి ఆమోదించాలో ఆలోచించే బాధ్యత లేకపోతే, అలాంటి హృదయాల గురించి ఎవరు చెయ్యగలిగేదైనా ఏముంటుంది?
అంబేద్కర్‌ అభిమానుల కన్నా గాంధీ అభిమానులు వంద రెట్లు ఎక్కువ అయినప్పటికీ, అంబేద్కరు గాంధీని ‘కపటీ, టక్కరీ, మోసకారీ, ఆశపోతు రాజకీయవాదీ’ లాంటి అనేక వ్యాఖ్యలు చెయ్యడానికి జంకలేదు. అంబేద్కరు ఏ సున్నిత పదజాలమూ వాడలేదు. అంబేద్కరు వాడినట్టు, వ్యక్తిని సూటిగా తిట్టే కపటీ, టక్కరీ లాంటి మాటలు నేను ఒక్కటి కూడా వాడలేదు.
ఒకప్పుడు నేను గాంధీకి భక్తురాలిని. కానీ, అంబేద్కర్‌ కారణంగానే గాంధీ నీచత్వం తెలుసుకున్నాను. గాంధీ మీద భక్తి హరించిపోయింది. గాంధీ పట్ల అంబేద్కర్‌ విమర్శలూ వ్యాఖ్యలూ, అన్నీ అలాగే వుండాలనీ, అంత కన్నా తీవ్రంగా వుండాలనీ నా అభిప్రాయం. అంబేద్కర్‌ ఇలాంటి మాటలు వాడాడేం? ఇంత కన్నా సున్నితమైన మాటలు లేవా?’ అని నేను అనుకోలేదు.
కానీ, మీకు మొరటు భాష నచ్చదు కదా? గాంధీ విషయంలో అంబేద్కరు వాడింది మొరటు భాషేనా? మీ దృష్టిలో కూడా అది మొరటు భాష కాదు. అది అలా వుండవలిసిందే. ఆ వ్యక్తి గాంధీ కదా? అందుకూ. కానీ, అంబేద్కరు గాంధీ కన్నా ఘోరంగా ప్రవర్తించిన సందర్భాలు వున్నా సరే, ఏమీ అనకూడదు. విమర్శలూ – వ్యాఖ్యలూ ఏమీ పనికి రావు.
అంబేద్కరు ఇతర దళిత నాయకుల విషయంలో కూడా ‘తోకాడించే కుక్కలు’ అనీ, ‘కాంగ్రెస్‌కి తొత్తులు’ అనీ, ఇంకా చాలా రకాలుగా అన్నాడు. వాళ్ళూ దళిత నాయకులే. వారికీ అనుచరులు వున్నారు. అయినప్పటికీ, వాళ్ళు దళిత ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు కాబట్టి, అంబేద్కరు అంత కఠినమైన మాట వాడాడు. వాటితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. దేవాలయాల ప్రవేశానికి వ్యతిరేకంగా ఓటు వేసే దళిత ఎమ్మెల్యేల్ని తొత్తులూ, కుక్కలూ అనకపోతే ఇంకేమనాలి? కచ్చితంగా సరిపోయే మాటలు అవి.
మరి ఆ అంబేద్కరే దళిత ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన సందర్భాలు కనపడితే అప్పుడేం చెయ్యాలి? ఎంత మృదువైన భాష వాడాలి?
ఆ అంబేద్కరే, కాంగ్రెస్‌లో జొరబడి ‘ఇక మన నినాదాలు కట్టి పెడదాం, అందరం ఒకటే’ అని ఉపన్యసించాడని తెలిస్తే, ఎంత మృదువైన భాష వాడాలి?
నిరుపేద వర్గ విముక్తి కోసం మార్క్సిజం చెప్పేదేమిటో చెవిన పెట్టకుండా, స్వంత ఆస్తులూ, వారసత్వ హక్కులూ దోపిడీ వర్గానికి ఎప్పటిలాగే నిలిచి వుండాలని చెప్పిన నాయకుడు, దళిత ప్రజలకు మేలు చేసినవాడా? గాంధీని గురించి అంబేద్కర్‌ చెప్పింది చదివినప్పుడు, గాంధీ మీద నా సదభిప్రాయం మారిపోయినట్టే, అంబేద్కర్‌ని చదివినప్పుడు కూడా అతని మీద నా సదభిప్రాయం మారిపోయింది. నాకు జరిగినట్టే ఇతరులకు కూడా జరిగితే జరగవచ్చు. అలా జరిగితే దానికి అంబేద్కరే బాధ్యుడు గానీ, నా బాధ్యతేమీ వుండదు.
నేను చెప్పిన పద్ధతి వల్ల ”రచయిత్రి ఆశయం కౌంటర్‌ ప్రోడక్టివ్‌ అయింది” అన్నారు.
కానీ, నా ఆశయం, నాకు తెలిసింది చెప్పడమే. అది తెలుసుకున్న తర్వాత ఎదటి వాళ్ళు మారతారా లేదా అన్నది నా పని కాదు. నేను మారాను. నా లాగే కొందరు మారవచ్చు. కొందరు మారకపోవచ్చు. అది వాళ్ళ గ్రహింపు మీదా, వాళ్ళ నిజాయితీ మీదా ఆధారపడి వుంటుంది. కానీ, నాకు తెలిసినంత వరకూ చెప్పాలంటే, ‘అంబేద్కర్‌ ఇలా రాశాడా? ఇలా అన్నాడా?’ అని ఆశ్చర్యపోయిన దళితులూ వున్నారు. ఒక వేళ వాళ్ళు లేకపోయినా అందులో నా బాధ్యతేమీ వుండదు. చెప్పడమేనా నా పని? దాన్ని వినడం వినేవాళ్ళ పని.
‘వ్యంగ్యానికీ, పరిహాసానికీ, అవహేళనకీ ఈ ‘చర్చలో చోటు లేదు’ అన్నారు. కానీ, చర్చ చర్చే. చిన్న విషయంమీదైనా, పెద్ద విషయంమీదైనా. ఇది దళిత నాయకుడి మీద చర్చ కాబట్టి ఇక్కడ ఆ సూత్రాలు వర్తించవు – అని మీ అభిప్రాయంలా వుంది. కానీ, దళితులకు దళిత ప్రయోజనాలు ముఖ్యమైతే ఈ చర్చని అర్ధం చేసుకుంటారు. ప్రయోజనాలకు వ్యతిరేకంగా నడిచిన వ్యక్తే ముఖ్యమైతే, చర్చే మానుకుంటారు. అది మీ ఇష్టం.
తప్పులేమో కొండలంతంత వుంటాయి. కానీ, వాటి మీద విమర్శలు పూలు విసిరినట్టు వుండాలి! ఇతని కోసం మృదువైన భాష ఉపయోగించాలా?
మృదుత్వాన్ని ఏ సందర్భంలో చూపిస్తారో, కాఠిన్యాన్నీ, ఆగ్రహాన్నీ ఏ సందర్భాల్లో చూపిస్తారో మీకూ తెలుసు. కానీ, గాంధీకి అయితే ఒక సూత్రమూ, అంబేద్కర్‌కి అయితే ఇంకో సూత్రమూ. ఇద్దరూ చేసింది ఒకే రకమైన తప్పు అయినప్పటికీ.
గాంధీ, దళిత ప్రయోజనాలకు వ్యతిరేకి. అది అందరికీ తెలిసిందే. మరి, అంబేద్కరు దళిత ప్రయోజనాలకు అనుకూలుడా? ఈ ప్రశ్న లేదా మీకు?
నా పుస్తకంలో అంబేద్కర్‌కి అన్యాయం జరగలేదు. పోజిటివ్‌ని కూడా చెప్పాను నేను. దాన్ని తక్కువ చెయ్యలేదు. అది చాలదనీ, దాన్ని చూసి మురిసిపోవద్దనీ, అంబేద్కర్‌లో నెగిటివ్‌ విషయం బోలెడు వుందనీ చెప్పాను. ఈ నిజంతో ఏకీభవించడానికి ఏమిటి అభ్యంతరం మీకు? భాష అడ్డం వచ్చిందా మీకు?
భాష, అలాగే వుండాలి. అదే సరైన రూపం. ఆ స్వభావాన్ని అదే చెపుతుంది. అంబేద్కరు, గాంధీ గురించి అంత కన్నా ఘోరమైన భాష వాడాడు. అలా వాడడం న్యాయమే.
ఇవ్వాళ అంబేద్కర్‌ విషయంలోనే కాదు. నాకు ఎంతో ఇష్టమైన మావో విషయంలో కూడా, అతని వ్యక్తి పూజ పిచ్చిని అసహ్యించుకుంటే అలాంటి భాషే వాడాను. అదే అవసరం కాబట్టి. అవసరమైన ప్రతీ విమర్శలోనూ అలాగే చేశాను.
”దళితులకు అంబేద్కర్‌ మీద వున్న ప్రేమాభిమానాలకూ గౌరవానికీ భంగం కలిగించడం మీ ఉద్దేశ్యం కాదనుకుంటాను” అన్నారు.
‘… భంగం కలిగిద్దాం’ అనే వుద్దేశ్యంతో నేను ప్రారంభించలేదు. అంబేద్కర్‌ రచనల్లో నాకు కనపడిన దాన్ని చెప్పాలన్నదే నా వుద్దేశ్యం.
చివరికి మీరేం సూచించారంటే, నా భాష ‘సామాజిక సంబంధాల పరిరక్షణకి ప్రతికూలం’ కాబట్టి దళితుల మనసుల కోసం నేను ఏదో చేస్తే బాగుంటుంది – అని!
నేనేం చెయ్యాలంటే – అలాంటి భాష వాడి చాలా తప్పు చేశానని ఒక స్టేట్‌మెంట్‌ లాంటి దేదైనా ఇవ్వాలి! ‘దళితులు ఇంత బాధపడతారని అనుకోలేదు, చాలా మొరటు భాష వాడాను, నన్ను క్షమించండి’ అని చెప్పుకోవాలి.
చేసింది తప్పు అయితే అలా చెప్పుకోడానికి నాకేం అభ్యంతరం వుండదు. కానీ, జబ్బుని బట్టి వైద్యం వుంటుంది;  ఆ జబ్బు ఏ వ్యక్తికి చేసినా సరే. చర్చించే విషయాన్ని బట్టి, విమర్శలూ వ్యాఖ్యలూ వుంటాయి. వెటకారాలూ పరిహాసాలూ అన్నీ విమర్శలో భాగమే. అవసరమైనచోట అవి అన్నీ వుండవలిసిందే.
సామాజిక సంబంధాల్ని పరిరక్షించుకోవలిసిన బాధ్యత అంతా రచయితదే కాదు, పాఠకులది కూడా! అగ్ర కులస్తులు అధికులు కానట్టే, దళితులు కూడా అధికులు కారు. అందరూ సత్యం ముందు తల దించ వలిసిందే. ఏది సత్యమో దాన్ని అంగీకరించవలిసిందే!
ప్లేటో గురించి అరిస్టాటిల్‌ ఏమన్నాడో తెలుసా?
”ప్లేటో ప్రేమపాత్రుడు. కానీ, సత్యం మరింత ప్రేమ పాత్రమైనది” అన్నాడు.
అలాగే, ఒకప్పుడు గాంధీ ప్రేమపాత్రుడే. కానీ, అతని కన్నా సత్యమే మరింత ప్రేమ పాత్రమైనది అయింది.
ఒకప్పుడు అంబేద్కర్‌ ప్రేమపాత్రుడే. కానీ, సత్యం తెలిసిన తర్వాత, సత్యమే మరింత ప్రేమపాత్రం అయింది.
దళితులకు సత్యమే ప్రేమపాత్రమైనది అయితే, ఆలోచిస్తారు, తెలుసుకుంటారు. ఎవర్ని ఎంత వరకూ తీసుకోవాలో అంత వరకే తీసుకుంటారు. అదేమీ పట్టనివాళ్ళు, తమకు తోచినట్టు చేసుకుంటారు.
సత్యం ముందు ఎన్నెన్ని నమ్మకాలో చెల్లాచెదురైపోతాయి. ఎన్నెన్ని ఆరాధనలో ఆవిరైపోతాయి. నమ్మిన ప్రపంచమే తారుమారైపోతుంది. అదంతా మంచిదే.
అంబేద్కర్‌ అనే నాయకుడు, కేవలం గాంధీ లాంటి రాజకీయపుటెత్తుగడల బూర్జువా నాయకుడు. తను ఒక నాయకుడిగా ఎదిగే క్రమంలో, కొన్ని సమస్యల్ని పట్టించుకున్నాడు. దళిత వర్గ ప్రయోజనాలు తన వ్యక్తిగత ప్రయోజనాల కన్నా ఎక్కువగా పట్టలేదు.
గాంధీకీ, అతనికీ రూపంలో తేడా తప్ప, స్వభావంలో తేడా లేదు. నా పుస్తకం ఈ విషయాన్ని చూపించింది కాబట్టే అసలు సంఘటన గురించి ఏమీ మాట్లాడలేక, వ్యాఖ్యలూ, వెటకారాలూ – అని, వాటిని ఆశ్రయించారు.
అవును! అవి అన్నీ అలాగే అవసరం!
కుక్కలు అనదగ్గ వాళ్ళని ‘కుక్కలు’ అనీ, ‘తొత్తులు’ అనదగ్గ వాళ్ళని ‘తొత్తులు’ అనీ అంబేద్కర్‌ చేసిన వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకోండి! మీ మనసులు వ్యక్తి పూజా మత్తుతో జబ్బు పడి వుంటే ఆ నేరం నాదా?

రంగనాయకమ్మ

4 comments

 • రంగనాయకమ్మ వ్యాఖ్యలు తప్పుకాదు

 • కొన్ని వందల యేళ్ళ తర్వాత అయినా, సమాజం బాగుపడాలన్నా, శ్రమ దోపిడీ పోవాలన్నా (దళితుల సమస్య శాశ్వితంగా పరిష్కారం అవ్వాలన్నా), ముందుగా ఏం జరగాలీ?

  శ్రీనివాస్‌ గారు, రంగనాయకమ్మ గారి సమాధానం చదివాక, “మీరు చాలా వివరంగా, చాలా తర్క బద్ధంగా రాసిన సమాధానం చదివాక నాలో మార్పు వచ్చింది. మీరు, గాంధీ మీద భక్తి పోగొట్టుకున్నట్టే, నేనూ అంబేద్కర్ మీద భక్తిని పోగొట్టుకుంటాను. మీరు అన్నట్టే, అంబేద్కర్‌ కొన్ని మంచి విషయాలు చెప్పినట్టే, కొన్ని తప్పు విషయాలు కూడా చెప్పారు. ఆ విషయం అర్థం అయింది. మెచ్చుకునేటప్పుడు ఎంత చక్కగా మెచ్చుకుంటామో, విమర్శించేటప్పుడు కూడా, అంత సీరియస్‌గా, తీవ్రంగా విమర్శిస్తాము. నా అభిప్రాయాలను మార్చుకుంటున్నాను”, అని రాయాలి.

  అలా ఎక్కడన్నా జరుగుతుందా, సినిమాల్లో తప్ప? అది కూడా ప్రేక్షకుల నించీ సొమ్ము లాగడానికే లెండి.

  “ఆ, గొప్ప చెప్పొచ్చారులే” అని అనుకుంటారు.
  “అయితే మాత్రం, చాలా సున్నితంగా చెప్పాలి గానీ” అంటారు, అదే పాట మళ్ళీ పాడుతూ.

  దీనర్థం ఏమిటంటే, పాఠకులు (ప్రజలు) చాలా సున్నితమైన వారనీ, వాళ్ళకి నచ్చిన పద్ధతిలోనే చెప్పాలనీ, మారాల్సింది రచయితలే గానీ, ఈ పాఠకులు కాదనీ!!
  మంచిని తొందరగా నేర్చుకుంటూ, తప్పుని తొందరగా వొదిలేసుకుంటూ వుంటే, సమాజం ఎప్పుడో బాగు పడిపోయేది కదా?

  పాఠకుడు

 • ఒక నాయకుడు ని కానీ, ఒక వ్వక్తి ని కానీ విమర్శించే టప్పుడు అతని సామాజిక, ఆర్థిక, సాంస్కుతిక,రాజకీయ వెనుక బాటు తనాన్ని పరిగణనలోకి తీసుకో వద్దా! గాంధీ, అంబేద్కర్ ఇద్దరు వ్వక్తులు గా – పైన ఉదహరించిన వెనుక బాటు తనం లేకపోతే- సమానమైన తరుణంలో ఇక ఎస్సి, ఎస్స్టి రిజర్వేషన్ లతో అవసరం లేదు కదా! మరి ఈ కమ్యూనిస్టు లు రిజర్వేషన్ లను ఎందుకు సమర్దిస్తున్నట్లు? చిలకలూరిపేట బస్సు దహానం కేసులో ఉరి శిక్ష పడిన ఇద్దరు దళితులు కు పడిన శిక్షనుండి బయట పడేయమని, అందుకు వారి సాంఘిక వెనుక బాటు తనాన్ని పరిగణలోకి తీసుకోవాలని అప్పటి పౌర హక్కుల నాయకులు వాదించారు. వాదించి, వారి శిక్షను కైదులుగా మార్పించినట్లుగా గుర్తు. ఇది నిజమైతే దీనిని గురించి రంగనాయకమ్మ గారు ఏమంటారు. అలా మార్చటమే తప్పంటారా? అంబేద్కర్ ను బూర్జువా నాయకుల అందరి సరసన కూర్చొ పెట్టటం రంగనాయకమ్మ గారి సమానత్వ భావాన్ని మనం సమర్దించవచ్చు కానీ, ఆమె ఇది అసమ సమాజం అన్నది మర్చిపోయారా! అదీ అంబేద్కర్ నాటి కాలం ఇంకా ఫ్యూడల్ వెనుక బాటు తనంలో ఉన్నదని మనం గుర్తించాలి. అయితే “బుద్ధుడు చాలడు అంబేద్కర్ చాలడు మార్క్స్ కావాలి ” అన్న దాంతో మనకు విభేదం ఉండాల్సిన అవసరం లేదు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.