ఒక అమ్మా నాన్నా…

హాయ్ ఫ్రెండ్స్..

ఒకసారి ఏమయిందంటే-

నేనొకటి కనిపెట్టేసా.

‘అవును, నువ్వో పెద్ద సైంటిస్టువి మరి..’ అంటుంది అమ్మ. ఏం చిన్న పిల్లలు కనిపెట్టకూడదా ఏంటి?

‘ఏంటే నువ్వు కనిపెట్టింది?’ అని అన్నయ్య అంటాడు, కాని నేనీ విషయం కనిపెట్టానని వాడికి కుళ్ళు.

నాకయితే చాలా థ్రిల్లు. హాశ్చర్యం కూడా. తలచుకుంటే భలే భలే సరదా.

ఏంటది అనుకున్నారా?

నాకు మా అమ్మానాన్నా వున్నట్టే, మా అమ్మానాన్నలకి కూడా అమ్మానాన్నా వున్నారట. మీక్కూడా హాశ్చర్యంగా వుంది కదూ?!

‘ఇదేనా నువ్వు కనిపెట్టిన కొత్త విషయం?’ అన్నాడన్నయ్య.

‘యా.. అమ్మానాన్నా మాట్లాడుతుంటే.. కనిపెట్టేసా తెలుసా?’ అన్నాను.

‘ఛ..’ అన్నాడన్నయ్య.

‘ఛీ..’ అన్నాను, నేనూరుకుంటానా?

‘పోవే’ అన్నాడు.

‘పోరా’ అన్నాను.

ఊరుకుంటానా? అమ్మకీ నాన్నకీ కంప్లైంట్ చేసాను.

అమ్మానాన్నా అదేదో పెద్ద జోకులా పడిపడి నవ్వారు.

నేను నవ్వలే, ఎందుకంటే నాకు కోపం వచ్చింది.

‘అమ్మానాన్నా లేకపోతే నువ్వయినా మేమయినా ఎవరయినా ఎలా పుడతారు?’ అంటూ నవ్వారు. అమ్మ నాన్నను చూసి నవ్వింది. ‘గొప్ప సైంటిస్టువి.. సరేనా?’ నన్ను చూసి అంది అమ్మ.

‘నాన్నా.. నీకు కూడా అమ్మానాన్నా వున్నారా?’ వచ్చిన డౌటే అడిగాను.

‘ఉన్నారమ్మా, నీకు మేం అమ్మానాన్నా వున్నట్టే, నాకూ మా అమ్మానాన్నా వున్నారు’ అన్నారు నాన్న.

నాకు చాలా ఇంట్రెస్టుగా అనిపించింది.

‘మీ అమ్మానాన్నా ఎక్కడ వుంటారు?’ అడిగాను.

‘వేరే చోట వుంటారు’ అన్నారు నాన్న.

‘వేరే చోటంటే ఎక్కడ?’ నాకు తెలీదు కదా? అడిగాను.

‘నీవు పుట్టినప్పుడు వచ్చి చూసారులే’ అంది అమ్మ.

‘ఇప్పుడెక్కడ వుంటారు?’ నేనడిగితే అమ్మానాన్నా ముఖాలు చూసుకున్నారు.

‘మనతో ఎందుకు లేరు?’ మళ్ళీ అడిగాను.

‘వాళ్ళకి అక్కడే బాగుంటుంది’ అంది అమ్మ.

‘అక్కడంటే ఎక్కడ?’ నా మాటకు అప్పుడే వచ్చిన అన్నయ్య ‘ఓల్డ్ ఏజ్ హోంలో’ అని చెప్పాడు.

‘ఓల్డ్ ఏజ్ హోమంటే?’ నాకు తెలీదు కదా?, చూడ్లేదు కదా?, అందుకని అడిగా.

‘నీకెందుకు?’ అంది అమ్మ. అమ్మకి ఆ టాపిక్ ఇష్టం లేనట్టుంది.

‘ప్లీజ్ డాడీ.. ప్లీజ్ మమ్మీ..’ బతిమాలాను.

‘ఓల్డ్ ఏజ్ హోమంటే- ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ వుండే హోం’ అదీ తెలీదా అన్నట్టు చూసాడు అన్నయ్య.

‘మీ అమ్మానాన్నా ఎందుకు ముసలివాళ్ళయిపోయారు?’ నాన్ననడిగా.

‘రేపు మేం కూడా ముసలివాళ్ళమయిపోతాం’ అమ్మ చెప్తే నాకెందుకో భయం వేసింది.

‘నిజంగా మీరూ ముసలయిపోతారా?’ మళ్ళీ అడిగాను.

‘మేం కూడా ముసలయిపోతాం..’ నాన్న కూల్ గా చెప్పారు.

‘అప్పుడు మిమ్మల్ని కూడా ఓల్డ్ ఏజ్ హోంకు పంపెయ్యాలా?’ బాధేసి అడిగాను.

‘నోర్ముయ్..’ అని అమ్మ నాన్నకన్నా ఎత్తు లేచింది.

నాది వెధవ వాగుడన్నారు. బుద్దిలేని మాటలన్నారు. వయసుకు మించిన ఆలోచనలన్నారు. కాలమలాంటిదని అన్నారు. ఏవేవో అన్నారు.

నేనేడిస్తే అన్నయ్య పక్కకు తీసుకువెళ్ళి వూరుకోమన్నాడు. నా కళ్ళు తుడిచాడు.

‘పెద్దవాళ్ళని అన్ని విషయాల్లో ఫాలో కాకూడదు..’ అని బుద్ది చెప్పి నా బుగ్గలు రెండూ తుడిచాడు.

‘పెద్దవాళ్ళని ఫాలోకావాలి.. పేరెంట్సుని ఫాలో కావాలి..’ అని అమ్మ చెప్తుంది. ఆ మాటే అన్నాను.

‘అదీ నిజమే, ఇదీ నిజమే’ అన్నాడన్నయ్య.

‘ఏంటి?’ అంటే-

‘అదంతే.. ఇది ఇంతే..’ అన్నాడన్నయ్య.

‘…..?!?…..’

-అమూల్య,

సెకండు క్లాస్, న్యూ ఇండియన్ స్కూల్.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

1 comment

  • మా ఆరు సంవత్సరాల బాబు ఈ మధ్యన ‘నాన్న…., జేజి అబ్బ నీకు అమ్మా నాన్న, అవ్వ తాత అమ్మకు అమ్మ నాన్న…కదా!’ అన్నాడు.

    పసి హృదయాలు ఆలోచనా తీరును ‘పిల్లలకే నా హృదయం అంకితం’ అనే పుస్తకంలో సుహ్లొమోవ్ స్కీ చాలా బాగా రాశాడు. ఇలాంటి కతలు మనకు చాలా అవసరం అనిపిస్తుంది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.