ప్రత్యామ్నాయ వాస్తవాలు…!

2016, ఫిబ్రవరి 14 – వాలెంటైన్స్ డే: ఏ ‘ప్రత్యేకమైన’ రోజునో ఓ మెసేజ్ పంపించే స్నేహితుల నుంచి వస్తున్న గ్రీటింగ్స్ మధ్య ఒకేసారి కొన్ని ‘వాలెంటైన్స్ డే’ వ్యతిరేక మెసేజ్ లు కనిపించాయి. అందులో కొన్ని భగత్ సింగ్ ను ప్రస్తావిస్తూ… “ఫిబ్రవరి 14 భగత్ సింగ్ ను ఉరితీసిన రోజు. ఈ రోజున వాలెంటైన్స్ డే జరుపుకోవడం ఆ అమరవీరుడిని అవమానించడమే” – ఇలా ఉన్నాయి ఆ మెసేజ్ లు. అవి ఏ సంస్థ నుంచి మొదలయ్యాయో అందరికీ తెలుసు. ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ అవుతూ కొన్ని గ్రూపుల నుంచి వచ్చాయి. ఆ వాలెంటైన్స్ డే రోజున గుండె పగిలిపోయినట్లనిపించింది.

భారత స్వాతంత్ర్య పోరాటానికి ఏమాత్రం దోహదం చెయ్యకపోగా, స్వాతంత్ర్య వ్యతిరేక ప్రచారం చేసిన సంస్థ, గాంధీని హత్య చేసిన సంస్థ, ఇక ఇప్పుడు అమరవీరుల జ్ఞాపకాలనూ, వారి పట్ల ప్రజలకున్న ఉద్వేగాన్నీ నిర్దాక్షిణ్యంగా “వాడుకుంటోంది”. “భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించింది మార్చ్ 23న. నిజంగా భగత్ సింగ్ మీద అంత ప్రేమ ఉంటే వాస్తవాలను మరచిపోవద్దు. భగత్ సింగ్ బతికి ఉంటే ప్రపంచానికంతా ప్రేమను గుర్తు చేసే ఈ రోజును తప్పు పట్టేవాడు కాదు.” అని ఆ మెసేజ్ లకు రిప్లై ఇచ్చాను.  

“క్యాపిటల్” పరిచయంలో మార్క్స్ ఇలా అంటాడు: పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉన్న దేశం, తక్కువ అభివృద్ధి చెంది ఉన్న దేశాలకు, దాని స్వంత భవిష్యత్తు యొక్క చిత్రాన్ని మాత్రమే చూపిస్తుంది.

ఆ చిత్రాన్ని ప్రజలకు ఎర చూపిస్తాయి అవినీతి ప్రభుత్వాలు. అభివృద్ధి చెందిన దేశాల నుంచి నేర్చుకున్న సంగతేమో గానీ, ప్రజలను మభ్య పెట్టడంలోనూ, ప్రశ్నించేవారి గొంతు నొక్కడంలోనూ ప్రస్తుత భారత ప్రభుత్వం ఆ అభివృద్ది చెందిన దేశాలకే పాఠాలు నేర్పిస్తోంది.

ఎప్పుడో కాదు, కేవలం గత ఐదేళ్లల్లో హిందూత్వం పేరిట రచయితలనూ, జర్నలిస్టులనూ, అధ్యాపకులనూ హతమార్చింది సంఘ్ పరివార్.  అడ్డూఅదుపూ లేని కాషాయమూకలు దేశానికి మూఢభక్తినీ, హిందూత్వాన్నీ పులుముతూ, గోమాత’ పేరిట ముస్లింలనూ, దళితులనూ ప్రపంచం కళ్లముందే నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. విదేశీ పెట్టుబడుల పేరిట మధ్య తరగతి ప్రజల కళ్లు గప్పి విజయ్ మాల్యాలకూ, అంబానీలకూ ఆసరాగా నిలబడుతూ అభివృద్ధి పేరిట ఆదివాసీ ప్రజల హక్కులను కాలరాచి జైళ్లలోనే వాళ్లకు గోరీలు కడుతున్నారు. అబద్ధపు కేసులో, తీవ్ర అనారోగ్యంతో, డాక్టర్ సాయిబాబా ఇంకా జైల్లోనే ఉన్నాడు. గత రెండు నెలల్లో భీమ్ కోరెగావ్ సంఘటన పేరిట, పీడిత ప్రజల కోసమూ, మానవ హక్కుల కోసమూ పోరాడుతున్న లాయర్లనూ, రచయితలనూ పది మందిని అరెస్టు చేసింది ప్రభుత్వం. దళితులనూ, ముస్లింలనూ, ఆదివాసి ప్రజలనూ, వామపక్ష వాదులనందరినీ, ప్రభుత్వ వ్యతిరేకులనీ, నక్షలైట్లనీ ఒకే గుంపులో కట్టేసింది. ఇప్పుడు ఎన్జీవో సంస్థలు కూడా ‘అర్బన్-నక్షలైట్ల’కు సహాయం చేస్తున్నారని కొత్త వాదం లేవనెత్తుతోంది.

ఎందుకు ఇదంతా? నిజంగా ఈ ప్రభుత్వానికీ, సంఘ్ పరివార్ కూ దేశం పట్లా, హిందూత్వం పట్ల ప్రేమ అంతగా జీర్ణించుకుపోయిందా? మరైతే ఏదీ ఈ దేశమూ, హిందూత్వమూ సగ్వర్వంగా ప్రకటించుకునే గోమాతకున్నంత సహనమూ, నీతీ, ధర్మనిబద్ధతా, ఇంకా ఇలాంటివేవేవో?

ఎందుకంటే….

ఉద్యోగావకాశాల్లో పెరుగుదల కాక, డీమానిటైజేషన్ వల్ల కొన్ని వేలమంది నిరుద్యోగులయ్యారు. మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాల్లో మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది భారత దేశం. హిందూమత పిచ్చిలో జరుగుతున్న దారుణాలు ప్రపంచం దృష్టిలో పడుతున్నాయి. ఇప్పటిదాకా భాజపా ప్రభుత్వం తరపున మాట్లాడిన తులసీ గబర్డ్ (అమెరికాలోని హవాయీ రాష్టృ హౌస్ రెప్రజెంటెటివ్) లాంటి విదేశీ రాజకీయ నాయకులు కూడా మెల్లగా తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నారు.

అదే సమయంలో ప్రభుత్వం ప్రజల తరుపున క్రియాశీలంగా పని చేస్తున్న కార్యకర్తల మీద అర్థం లేనీ, నిరూపించలేనీ కుట్రలను ఆపాదిస్తూ అరెస్టులతో, ఇంటి సోదాలతో వారిని వేధిస్తోంది, హత్యలు చేయిస్తోంది.

అయినా…. ఈ దేశంలో ప్రజల్ని ప్రేమించే వారు చాలా మంది వున్నారు. ప్రభుత్వ సహాయానికో, ఇంకెవరి సహాయానికో ఎదురు చూడకుండా తన దళిత జాతి ప్రజల బతుకులు బాగు చేసేందుకు స్వచ్చందంగా పాఠశాలలు ఏర్పాటు చేసిన ఒక చంద్రశేఖర్ ఆజాద్,  అమెరికాలో పుట్టీ, భద్ర జీవితాన్ని వదిలి చత్తిస్ఘడ్ లో ఇనుప గనులకు జీవితాలను అర్పిస్తున్న ఆదివాసీ ప్రజల తరుపున పోరాడుతూ, వాళ్ల మధ్యే నివసించే ఒక సుధా భరధ్వాజ్, రాజ్యహింసను ఎదుర్కోడానికి కవిత్వమూ ఒక పోరాట రూపమేనని నమ్మి ఆచరించే  ఒక వరవర రావు….

ప్రభుత్వం దృష్టిలో వీళ్లంతా కుట్రదారులు. ఇంతకీ, పోలీసులు ఈ కుట్రదారులకు పెట్టిన పేరు “యాంటీ-ఫాసిస్టు” లని. అంటే నియంతృత్వ వ్యతిరేకులని. అంటే ఈ ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వం అన్నమాట. అదండీ సంగతి. అంటే, బాహాటంగానే తమ స్వరూపాన్నీ, ఎజండానూ ముందుకు తెస్తున్నారు.

నిజాన్నే చూస్తామో, నిజం కాని నిజాన్ని నెత్తికెత్తుకుంటామో…. మచ్చుకి ఒక ఉదాహరణ చూద్దామా?

ఆగస్టు 28న అరెస్టులకు సంఘ్ ముందుగానే అన్ని విధాలుగా సమాయత్తమయు వుందని నిరూపిస్తూ, ఒక్క రోజు గడవకముందే ‘నియంతృత్వ వ్యతిరేకులకు’ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘నో యువర్ నక్షల్స్’ అంటూ చక్కర్లు కొడుతున్న ‘మీమ్స్’ చూడండి. వాటికి జవాబుగా ‘నో యువర్ యాంటీ-ఫాసిస్ట్స్’ అని హక్కుల కార్యకర్తలకు మద్దతునిస్తున్న ‘మీమ్స్’ కూడా మీ కోసం…

 

 

 

 

 

 

(సంఘ్ ‘నక్షల్’ మీమ్స్ కు ధీటైన జవాబిస్తూ ‘యాంటీ-ఫాసిస్టు’ మీమ్స్ తయారు చేసిన ‘ఇండియా సివిల్ వాచ్’ కు ధన్యవాదాలతో…)

కొడిదెల మమత

2 comments

  • వారు తమకు తామే మతోన్మాదులమని,ఫాసిస్టులమని ప్రకటించుకుంటున్నారు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.