మానసిక సంఘర్షణా విశ్లేషకుడు దొస్తొయవిస్కీ

మానవ మనస్తత్త్వ శాస్త్రజ్ఞుడిగా పేరొందిన నవలాకారుడు దొస్తొయవిస్కీ 1821 లో సెయింట్ పీటర్స్బర్గ్ లో జన్మించాడు. పుష్కిన్, గోగోల్, అగస్టీన్, షేక్స్పియర్, డికెన్స్,  బాల్జాక్, హెగెల్ వంటి  ఎందరో రచయితలు, తత్వవేత్తల  ద్వారా ప్రభావితుడై దొస్తొయవిస్కీ మానవ స్వభావాలని, గుణాల్ని, లక్షణాలని తనదైన శైలిలో పాత్రీకరించాడు. మానసిక సంఘర్షణలతో కూడిన  ఇతివృత్తాలతో 11 నవలలు,  మూడు లఘు నవలలు, 17 కథలను ప్రపంచానికి అందించాడు.  సామాజిక సమస్యలను,  తాను ప్రేమించిన క్రైస్తవ మతానికి జోడించి, తన రచనల ద్వారా సమాజంలోని సంఘర్షణలు, స్వార్ధపూరిత రాజకీయాలు,  మానవ సంఘర్షణల పట్ల  తీవ్ర అసంతృప్తిని  వ్యక్తం చేశాడు. 1830 నుండి ప్రారంభమైన ‘రష్యన్ సాహిత్య స్వర్ణ యుగం’ లో ప్రధాన పాత్ర పోషించాడు.

తన వ్యక్తిగత జీవితంలో జరిగిన,  తాను చూసిన అనేక ఘటనలు – సామూహికంగా ఉరితీయడం,  సైబీరియాలో శిక్షింప బడడం,  మానసిక సంఘర్షణ, మూర్ఛలు – ఇలాంటి  అనుభవాలకు  ఆయన నవలల్లో చోటు కల్పిస్తాడు. సామాన్య జనుల జీవితాలను, వారి మానసిక స్థితులను చిత్రిస్తాడు. టాల్స్టాయ్,  తర్జనేవ్ వలే కాక  ఎప్పటికప్పుడు  తన ఆర్థిక అవసరాల కోసం రచిస్తూ,  అణగారిన, వక్రీకరింపబడిన తలరాతలు గల అభాగ్యుల జీవితాలను  తన నవలల ఇతివృత్తాలుగా ఎన్నుకున్నాడు. తనలోని ద్వైదీభావాన్నీ, సంఘర్షణలను  పాత్రలలో ప్రవేశపెట్టి  ఆ పాత్రలు వ్యక్తిగతంగా సమాజపరంగా  అనుభవించే  సంఘర్షణా వర్ణాలతో కూడిన అసమాన చిత్రపటాన్ని ఆవిష్కరించాడు దొస్తొయవిస్కీ. పిచ్చితనము, హత్య- ఆత్మహత్యలను  ప్రేరేపించే ఆలోచనలు,  అవమానించి, నాశనం చేసి, వికృత విధ్వంసాన్ని సృష్టించే ఉగ్రవాద మనస్తత్వం,  ప్రేమ, పశ్చాత్తాపం,  ఆత్మన్యూనత వంటి అంశాల్ని  తాత్త్వికంగా విశ్లేషించడంతో ఆలోచనాత్మక నవలల సృష్టికర్తగా,  తాత్త్వికుడిగా  దొస్తొయవిస్కీ చాలా పేరు పొందాడు.

ఆనువంశికంగా వచ్చిన మతపరమైన సాత్వికత, అనుభవాలు దొస్తొయవిస్కీ ని  సంక్లిష్ట, మనో సంబంధ రచయితగా తీర్చిదిద్దాయి. డికెన్స్ నవలలలో  బహిరంగ సన్నివేశాలు పాత్రలను ప్రభావితం చేస్తే ,  దొస్తొయవిస్కీ నవలలలో  పాత్రల అంతర్గత సంక్లిష్టతలు  బహిరంగ సన్నివేశాలను సంఘర్షణలను సృష్టిస్తాయి.  ‘నోట్స్ ఫ్రం ది అండర్ గ్రౌండ్’,  ‘క్రైం అండ్ పనిష్మెంట్’, ‘ది ఇడియట్’, ‘బ్రదర్స్ కర్మజవ్’  అనే అతని రచనలు  అత్యంత ప్రధానమైనవిగా విమర్శకులు ప్రశంసిస్తారు. పైన పేర్కొన్న అంశాలన్నీ ఆయన ముఖ్య రచనల్లో ఎలా దాగి ఉంటాయో పరిశీలిద్దాం.

‘క్రైం అండ్ పనిష్మెంట్’ (1866)

(నేరము – శిక్ష)

ముందుగా 1866లో  అనేక మార్పుల తర్వాత వెలువడిన ‘క్రైం అండ్ పనిష్మెంట్’ ఒక ఒక సంచలనాత్మక నవలను పరిశీలిద్దాం.  ఒక హత్య చుట్టూరా తిరిగే ఈ నవలలో నాయకుడు  రస్కల్నికోవ్.  మంచి చెడులు అనేవి నమ్మడం ఒక తప్పుడు ఆలోచనని, అసలు నేరం అనేది లేదని విశ్వసిస్తాడు.  అనేక సమస్యలకు సమాధానంగా  ఒక తాకట్టు పెట్టుకునే ధనిక స్త్రీని హత్య చేస్తాడు.  తర్వాత జరిగే సంఘటనలన్నీ  ఆసక్తికరంగా దీని చుట్టూ తిరుగుతూ ఆద్యంతమూ చదివిస్తాయి. 

రోడియన్  రొమొనవిచ్ రస్కల్నికోవ్ ఒక న్యాయశాస్త్ర విద్యార్థి. సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఒక చిన్న గదిలో అతి దారిద్ర్యం తో అద్దెకుంటాడు.  తనను తాను నిలబెట్టుకునే అన్ని ఆలోచనలను  విరమించి  అల్యోనా  ఇవనోవ్నా అనే  ధనికు రాలిని, అద్దెలకు పీడించే గృహ యజమానురాలిని,  తాకట్టు పెట్టుకునే  వ్యాపారస్తురాలిని  హత్య చేయాలనుకుంటాడు.  అదే అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని కూడా అనుకుంటాడు. ఈ సమయంలో  సెమ్యోన్ జకోరవిచ్ మర్మలదేవ్ అనే తాగుబోతుతో పరిచయమవుతుంది.  తాను కుటుంబానికి ఏమీ చేయలేక పోయానని,  తన కుమార్తె సోనియా (సోఫియా) వ్యభిచారిణిగా మారి, కుటుంబాన్ని నిలబెట్టుకునేందుకు పూనుకుందని చెబుతాడు.  ఈ సమయంలోనే రస్కల్నికోవ్ తల్లి నుంచి జాబు వస్తుంది.  ఆమె  తన కుమార్తెతో కలిసి పీటర్స్బర్గ్ వస్తున్నానని,  సోదరుని  కష్టాలు ఆదుకునేందుకు కుటుంబం కోసం  ఒక ధనికుడిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటుందని రాస్తుంది.

రస్కల్నికోవ్ తన చెల్లెలు నిర్ణయం సోనియా నిర్ణయం లాంటిదేనని తలుస్తాడు.  వీటన్నిటికీ కారణం  అల్యోనా  ఇవనోవ్నా వంటి వారే నని విశ్వసిస్తాడు.  బాగా ఆలోచించా అల్యోనా భవనానికి వెళ్లి  ఒక గొడ్డలితో హత్య చేస్తాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన ఆమె చెల్లిని కూడా చంపేస్తాడు.  తన చర్యకు తానే చలించిపోయి  అక్కడ ఉన్న కొన్ని వస్తువుల్ని  కొంచెం డబ్బున్న పర్సును తీసుకుని  మిగిలిన ధనాన్ని ముట్టుకోకుండా  పారిపోతాడు.  ఎవరికీ కనబడకుండా, పట్టుబడకుండా తిరుగుతూ ఉంటాడు.  హత్యానంతరం తీవ్రంగా మనస్థాపం చెంది దాని గురించి ఆందోళన చెందుతూ ఉంటాడు.  దొంగిలించిన వస్తువులన్నీ ఒక రాతి కింద దాచి  దుస్తులకంటిన రక్తాన్ని శుభ్రపరిచేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తాడు. ఈలోపు తన మిత్రుడు రిజిముఖిన్ ను కలిసి వస్తాడు. తీవ్ర జ్వరపీడితులు అవుతాడు.  అల్యోనా హత్య ఉదంతం తర్వాత వస్తోన్న పరిణామాలను బట్టి విచిత్రంగా ప్రవర్తిస్తూ,  ప్రతిస్పందిస్తూ  హత్యకు తనకు గల సంబంధాన్ని   తెలియపరిచే విధంగా  ప్రవర్తిస్తాడు.  ఒక ప్రమాదంలో ఇరుక్కున్న మార్మలదేవ్ ని రక్షించి ఇల్లు చేరుస్తాడు సోనియాకు క్షమాపణ చెప్పి మార్మలదేవ్ మరణిస్తాడు.  తన తల్లి పంపిన సొమ్ము లో 20 రూబుల్ల ను మర్మల దేవ్ భార్యకు ‘పాత రుణం తీరుస్తున్నాన’ని ఇస్తాడు.  ఇంతలో తన తల్లి, చెల్లి పీటర్స్బర్గ్ కి చేరుకుంటారు.  వారు దున్యా ను వివాహం చేసుకోబోయే రిజిన్ ను కలవడానికి  రస్కల్నికోవ్ అంగీకారం కోసం వస్తారు.  మానసికంగా అనిశ్చిత స్థితిలో ఉన్న రస్కల్నికోవ్ రిజిన్ ను తిరస్కరిస్తాడు.  డిటెక్టివ్ పోరిఫేరి  రస్కల్నికోవ్ ను హత్యకు సంబంధించి అనుమానిస్తాడు.  ఈ లోగా రస్కల్నికోవ్ కు సోనియాకు మంచి బంధం ఏర్పడుతుంది.

వ్యభిచారిణి బతుకు వెళ్ళదీస్తున్నప్పటికీ సోనియా  చాలా మంచి విలువలను కలిగి ఉంటుంది.  ఈలోగా  దున్యా పట్ల రిజిన్ స్వార్థపూరితమైన ప్రేమ బయటపడుతుంది.  దున్యా పాత యజమాని  స్విద్రిగాలోవ్ ఆమెకు డబ్బిచ్చి లొంగదీసుకునేందుకు పీటర్స్బర్గ్ వస్తాడు.  తన భార్య చనిపోయిందని చెబుతాడు.  మానసికంగా సంఘర్షణలో కుంగిపోతున్న రస్కల్నికోవ్ సోనియా సహాయం అర్ధిస్తారు.  జరిగిన విషయాలను చెబుతాడు.  స్విద్రిగాలోవ్ పక్క గది నుంచి ఈ విషయాన్నంతా వింటాడు.  అవసరం వచ్చినప్పుడు వాడుకొని  బెదిరించాలని చూస్తాడు.  అయితే తర్వాత కలిసినప్పుడు తన గతాన్ని కూడా వివరిస్తాడు.  సోనియా రస్కల్నికోవ్ ని తప్పు ఒప్పుకోమని చెబుతుంది.  పోరిఫేరి  కూడా అతనికి తప్పు ఒప్పుకోవడం వల్ల శిక్ష తగ్గించడం సాధ్యపడుతుందని చెబుతాడు.

ఈలోపు  స్విద్రిగాలోవ్ దున్యను బలాత్కరించపోతాడు. కానీ ఆమె నిరాకరించడంతో వదిలివేసి  మరునాడు తనకు తాను కాల్చుకుని చనిపోతాడు.  రస్కల్నికోవ్ దీన్ని కూడా తన ప్రణాళికలో  భాగంగా వాడుకోవాలి అనుకుంటాడు. కానీ  సోనియా చెప్పినట్లు తప్పు ఒప్పుకోవాలని అంగీకరిస్తాడు .

ఎపిలోగ్   ఇతనికి విధించబడిన ఎనిమిది సంవత్సరాల శిక్ష గురించి  సోనియా అతన్ని అనుసరించడం గురించి చెబుతుంది.  దున్య రస్కల్నికోవ్ స్నేహితుడు రిజిముఖిన్ ను పెళ్లాడడం గురించి,  రస్కల్నికోవ్ తల్లి మనోవేదన, మరణం గురించి,  సోనియా ప్రేమతో రస్కల్నికోవ్ లోని మార్పు గురించి చెబుతుంది.  చాలామంది విమర్శకులు ఈ ఎపిలోగ్ కృత్రిమంగా ఉందని భావించారు.  ఈ నవల రస్కల్నికోవ్ అంతర్మధనం గురించి,  సోనియా విలువల గురించి, ప్రేమ గురించి,  సామాజిక సంఘర్షణలు మానవ ప్రకృతు ల వల్ల ఎలా సృష్టించబడతాయి అనేదాని గురించి వివరిస్తుంది.  దుష్టుడైన స్విద్రిగాలోవ్ పశుత్వాన్ని ప్రదర్శించి నప్పటికీ  ఆమె నిరాకరణ తర్వాత తన ధనాన్ని మర్మల దేవ్ పిల్లలకి ఇచ్చి  తనను  తాను శిక్షించు కోవడం గురించి కూడా చెబుతుంది.

రస్కల్నికోవ్ ఉగ్రవాదిగా, సోనియా ప్రేమ ద్వారా సాత్వికుడిగా మారిన మనిషిగా  దొస్తొయవిస్కీ చిత్రీకరిస్తాడు. వాస్తవ వాదం, తాత్త్వికత, తనదైన భాష, సన్నివేశాలు, ప్రతీకలతో ఈ నవల చదువరులను కట్టిపడేస్తుంది. ఇంత వైవిద్యభరితమైన కథనం, సంక్లిష్ట భావనలతో కూడిన పాత్రలు, మనోవిశ్లేషణ ఈ నవలను  అత్యంత ప్రతిభావంతమైన నవలగా తీర్చిదిద్దాయి.

*

‘ది ఇడియట్’ (1869)

(వ్యర్ధజీవి)

మనుషుల స్పందనల పట్ల అతి మంచితనం, నిస్సహాయత, అపరిమితమైన జాలి, పిరికితనం, అపకారికి కూడా సహాయపడే మనస్తత్వం – ఇవన్నీ వున్న వ్యక్తిని ప్రస్తుత సమాజమేమంటుంది?  ‘చేతకానివాడు’ లేక ‘వ్యర్ధజీవి’, అంటుంది. అలాంటి వ్యక్తి కధే ‘ఇడియట్’. తన చుట్టూ ఉన్నవారి పట్ల కోపం వ్యక్తం చేయలేకపోవడం, వారు తిడుతున్నా పట్టించు కోకపోవడం, జాలిపడడం, సహాయం చేయడం, ఒకటి కాదు అనేక సార్లు నమ్మి మోసపోవడం – ఇవన్నీ ఒక వ్యక్తి లోనే వుంటే తప్పనిసరిగా సమాజం తేలికగా చూస్తుంది.

ప్రిన్స్ మిష్కిన్ మూర్చ వ్యాధి పీడితుడై స్విజర్లాండ్ నుండి తిరిగి రష్యాకు రావడంతో నవల మొదలవుతుంది.  రైల్లో రోగోజిన్ పరిచయమవుతాడు. ఏమి ఆస్తిపాస్తులు లేని వాడుగా, పసిపిల్లలలాటి మనస్తత్వం కలవాడిగా ఉన్నతశ్రేణి ప్రపంచంలోకి అంటే తన దూరపు బంధువులైన ఎపాంచిన్ కుటుంబంలోకి అడుగుపెడతాడు మిష్కిన్.  నిజాయితీ, అణుకువ మానవుల కెంత అవసరమో చెప్పి వారిని ఆకట్టుకోగలుగుతాడు. అత్యంత ఆశపోతూ, నీతిలేని గన్యా, తన బుద్ధిబలాన్ని వక్రంగా వుపయోగించగల ఇజాలిట్ , పరిచయమవుతారు. రోగోజిన్ ప్రేయసి, ధ్వంసమైన బాల్యం కారణంగా ‘ఉంపుడుగత్తె’ గా మారిన సుందరి నస్తాస్య లను కలుస్తాడు. వారి దుష్ట స్వభావాలకు  వ్యతిరేకంగా వాదించి నిలదొక్కుకో గలుగుతాడు. ఎవరో ఒక దూరపు బంధువుల కారణంగా ధనవంతుడౌతాడు. దాంతో అందరి దృష్టిని ఆకర్షించ గలుగుతాడు. ఏ మనిషన్నా సమాజంలో గుర్తింప బడాలంటే ధనం అవసరమే గదా? నస్టాస్యా పట్ల ఆరాధానా భావంతో రోగోజిన్ కు శత్రువుగా మారతాడు. అదే సమయం లో ఆగ్లాయా తో ప్రేమలో పడతాడు. రోజోజిన్ చేసిన హత్యాప్రయత్నం నుంచీ తప్పించుకుని ఎవరి ప్రేమను పొందలేక పోతాడు.  పెళ్ళి చేసుకుంటానని మాట నిచ్చిన నస్టాస్యా కూడా చివరి నిమిషంలో మనసు మార్చుకుని రోగోజిన్ తో పారిపోతుంది. రోగోజిన్ నస్టాస్యా ను హత్య చేయడం, 15 సం. పాటు శిక్ష పడడం, మిష్కిన్ దాదాపు పిచ్చివాడవడంతో నవల ముగుస్తుంది.

అతి మంచితనం, సాత్వికత, వినయం, పొరుగు వారి పట్ల ప్రేమ – ఇలాంటి లక్షణాలతో మిష్కిన్ జీసస్ అడుగుజాడల్లో రూపుదిద్దుకున్న పాత్రగా కనిపిస్తాడు. వర్తమాన సమాజానికి సరిపడని వ్యక్తిగా విఫలమౌతాడు.  ‘ది ఇడియట్’ జీసస్ ను పోలిన వ్యక్తి కధ అని కొందరంటే, కొందరు వ్యర్ధుడైన, నిరాసక్తుడైన, నిస్సహాయుడైన వ్యక్తి కధ అని అన్నారు. దొస్తోయవిస్కి తనలో ఉన్న ద్వైధీభావాల్ని ఈ నవలలో పూర్తిగా ‘మిష్కిన్’ పాత్ర ద్వారా ప్రదర్శించాడు. తనలోని మతపరమైన విశ్వాసాన్ని సాత్వికతను, తనలోని ప్రశ్నించే తనాన్ని, నాస్తిక వాదాన్ని అనేక పాత్రల ద్వారా చర్చిస్తూ ఈ నవలను రచించాడు.  అయితే ఇది విఫల ప్రయత్నమేనని, రష్యా జీవితం కాక రష్యాయేతర ప్రాంతాన్ని తను చూసిన యూరోపియన్ నాగరికత గల పుస్తకంగా యీ నవల విమర్శించ బడింది.

దొస్తొయవిస్కీ తానే తెలిపినట్లుగా ‘ఒక కధను వూహించి అనుకున్న దానికంటే వ్యతిరేకమైన పద్ధతిలో వ్రాసినట్లు’గా ఈ నవలారచన జరిగింది.  కృత్రిమమైన మలుపులు, వ్యతిరేకవాదం, పరిణతి చెందని పాత్రలు ఈ నవలను కుంగదీసాయి. కానీ ఎంతో విరుద్ధమైన ప్రవృత్తులతో, లక్షణాలతో ఉన్న పాత్రలతో యీ నవల – మానసిక తత్వ విశ్లేషకుల ప్రశంసలు పొందింది. క్రైస్తవ మత అనుకూల మరియు వ్యతిరేక ధోరణుల చర్చలను చూపుతూ కూడా ఆశపోతుతనం, వదరుపోతువాదం, నైతిక పతనం, ఆత్మావగాహన లేక పోవడం వంటి ధోరణులు కల అప్పటి ‘రష్యాకు క్రైస్తవ మే దారిచూపు తుంద’ని దోస్తయస్కి చేసిన ప్రయత్నంగా కూడా ఈ నవల చిత్రీకరించ బడింది.  

దొస్తొయవిస్కీ రష్యన్ సమాజంలో నైతిక విలువల పతనాన్ని  అనేక పాత్రలు, సంభాషణలు, ప్రతీకలు పేర్ల ద్వారా సూచిస్తాడు.  వీటన్నిటి మీదా బైబిల్ ప్రభావం వుందని విమర్శకుల అభిప్రాయం. ఎంత ప్రయత్నించినప్పటికీ రష్యన్ సమాజంలోని నైతిక వైఫల్యానికి మందు లేని తనాన్ని చెప్పడం నవల ముఖ్య వుద్దేశ్య మవుతుంది.

హెర్మన్ హెస్ మిష్కిన్-జీసస్ పాత్రల సమతుల్యత గురించి పరిశీలిస్తూ అన్నిటికన్నా గెస్త్ మేనే తోటలో జీసస్ ఆలోచనలు, పరిశీలనలతోనే మిష్కిన్ పోలిక సరి పోతుందంటారు. ‘చివరి విందు’ కు వచ్చిన తన శిష్యులందరూ మత్తులో నిద్రిస్తారు.  తన అంతిమ యాత్ర, పునరుత్థానానికి ముందు జీసస్ అనుభవించిన ఒంటరి వేదనతో మిష్కిన్ జీవిత కథను పోలుస్తాడు. ఈ నవల భవిష్యత్తుకేమీ మార్గదర్శనం చేయదు కానీ వర్తమాన పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. దొస్తొయవిస్కీ , టాల్స్టాయ్ నమ్మినట్లు బాధను భరించటం ద్వారానే మనిషిలో పరివర్తన సాధ్యమౌతుందని ఈ నవల నిరూపిస్తుంది.

**

‘బ్రదర్స్ కరమజోవ్’ (1880)

(కరమజోవ్ సోదరులు)

బ్రదర్స్  కరమజోవ్ మూడు విభిన్న పార్స్వాల నుంచీ మానవుల విచికిత్స ను చూపుతుంది.  స్థూలంగా నాలుగు భాగాలుగా వ్రాసిన నవల ఇతివృత్తం ఇలా వుంటుంది.

ఫ్యోదొర్ పావ్లొవిచ్ కరమజవ్ ఒక నాటు మనిషి.  చాలా విచిత్రంగా సౌందర్యవతి, ధనికురాలైన అడలైడా అతనితో ప్రేమలో పడి పెళ్ళిచేసుకుంటుంది.  అయితే అతని వికృత చేష్టలు, ప్రవర్తన భరించలేక అలెక్స్ అనే వ్యక్తి తో వెళ్ళిపోతుంది. ఫ్యోదొర్ వల్ల కలిగిన దిమిత్రిని అతనితోనే వదిలి వెళ్తుంది.

తరువాత ఫ్యోదొర్ సోఫియా అనే యువతిని పెళ్ళిచేసుకుంటాడు.  సోఫియా కూడా ఇతని చేష్టలకు పిచ్చిదానిలా మారిపోతుంది. సోఫియాకు ఇవాన్, అలెక్స్ (అల్యోషా) అనే ఇద్దరు పిల్లలు కలుగుతారు.  ఇదేకాక ఫ్యోదొర్ ఒక సేవకురాలిని బలాత్కరించగా స్మెర్ద్యకోవ్ కలుగుతాడు.

దిమిత్రిని  అడలైడా దూరపు బంధువులు తీసికెళ్ళి పెంచుతారు.  అతను విలాస జీవితానికి అలవాటుపడి లెక్కలేనితనం తో పెరుగుతాడు. ఇవాన్ చాలా తెలివైనవాడు. రచయితగా, కవిగా, జర్నలిస్ట్ గా ఖ్యాతి లోకి వస్తాడు. అలెక్స్ అనూహ్యంగా ఆధ్యాత్మిక చింతనతో రోమన్ కాధలిక్ చర్చి లోని ఫాదర్ జోసిమా శిక్షణ తో పరిణితి చెందిన వ్యక్తి గా పెరుగుతాడు.

ఒకసారి దిమిత్రి ఫ్యోదొర్ ఇంటికి వెళ్ళినప్పుడు తన ప్రియురాలు గృషెంకా పాత ప్రియుడు గ్రెగరితో  వుండడం చూసి అతనిపై దాడి చేస్తాడు. ఆ దాడిలో గ్రెగరి మరణిస్తాడు. గృషెంకా దిమిత్రి పారిపోతారు. ఫ్యోదొర్ ను స్మెర్ద్యకోవ్ హత్య చేసి అతని ధనంతో పారిపోతాడు.  ఆ హత్యా నేరం దిమిత్రి పై పడి అతన్ని జైల్లో పెడతారు. ఇవాన్, అల్యోన్షా ఎలా దిమిత్రిని విడిపిస్తారు వారీ జీవితాలలో వచ్చిన ఇతర మార్పులేమిటనేది మిగిలిన కధ. విచిత్రమేమంటే ఇతని రచనలలోని చెడు పాత్రలపై మనకు కోపంకలగదు, జాలి మాత్రమే కలుగుతుంది .

దొస్తొయవిస్కీ మానవులలోని కామాన్ని, జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను కరమజోవ్ సోదరులు  దిమిత్రి, ఇవాన్, అల్యోషా లలో ప్రతిబింబిస్తాడు. ప్రపంచంలోని మదమాత్సర్యాలు, కామక్రోధాలు ఫ్యోదొర్, దిమిత్రి, స్మెర్ ద్యకోవ్ల ద్వారా చూపితే, (మతం పట్ల) తన మనసులోని ద్వైధీ భావాల్ని ఇవాన్, అల్ల్యోషా ద్వారా చూపిస్తాడు. ఇవాన్ వ్రాసిన వ్యాసం ‘ The Grand Inqusitor’ లో చర్చి, ‘మంచి చేయగల సంఘ వాదాన్నెలా నేర్పాలి – ఎలా నేర్పలేక పోతోంది’ అనే విషయాన్ని, క్రీస్తుకు, స్పెయిన్ లోని ‘గ్రాండ్ ఇంక్విజిటర్’ కు మధ్య జరిగిన సంభాషణలో, పునరుత్థానం చెందినా క్రీస్తు వోడి జైల్లో పెట్టబడే సందర్భం గురించి రాస్తాడు.

సమాజం లో జరిగే అక్రమాలు,దుశ్చర్యలు, దురాగతాలను చర్చి ఎలా ఆపలేకపోతున్నదో వుదాహరణ లతో సహా వివరించి వాదిస్తాడు.  అల్ల్యోషా కూడా వీటికి సమాధానం చెప్పలేకపోతాడు.

అల్ల్యోషా మాటల్లో ప్రేమ, క్షమ ద్వారానే ప్రజలను మార్చడం సాధ్యమవుతుందన్న క్రీస్తు సిద్ధాంతాన్ని, ఇవాన్ ద్వారా సంఘం లో జరుగుతున్న వైకల్యాలు, మతం విఫలమైందన్న ఉద్దేశ్యాన్ని, మిగిలిన పాత్రల స్వభావాల్లో సంఘాన్ని  చూపుతూ వుత్తమమైన నవలగా ‘బ్రదర్స్ కరమజోవ్’ నిలుస్తుంది. మతవాదిగా, యూరోపియన్ సోషలిస్ట్ సంఘ సభ్యుడిగా ద్వైధీభావాల్ని దోస్తయస్కి తన నవలల్లో తెలియ చేస్తాడు. ఇవాన్, రస్కల్నికోవ్ ఒక వేపునిలిస్తే, అల్ల్యోషా, సోనియా, మిష్కిన్ ఒక వైపు నిలుస్తారు.  ఐన్ స్టెయిన్, వర్జీనియా ఉల్ఫ్ వంటి మేధావులు దోస్తోయవిస్కీ ని గొప్ప యోగి గా కొనియాడారు.

  • డా. విజయ్ కోగంటి

 

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

1 comment

  • మూడు గొప్ప నవలల గురించి మంచి పరిచయం చేసారు. -ప్రభు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.