మొండి రాత్రిలో వెలిగిన నెత్తుటి దీపం

నారాయణబాబు కవిత్వం చదవడం ఒక అనిర్వచనీయమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఆ అనుభవం కాలం మెళ్ళో గంటలు కడుతుంది. కవితాశ్వములు లాక్కెళ్ళే జట్కా బండి నెక్కించి భూమ్యాకాశాలని చుట్టిరమ్మంటుంది. చీకటి గుండెని కదిల్చే జాలిపాట వినపడే చోటుకు తీసుకెళ్తుంది. వెళ్ళకుండా ఉండలేవు. ఊరవతలకి వెళ్ళాలి. గుట్టలతో నిండిన నల్ల చెరువు గట్టు దగ్గరకి వెళ్ళాలి. పైడితల్లి గ్రామ దేవత దగ్గరకి, విజయరామ గాన పాఠశాల దగ్గరకి వెళ్ళాలి. విజీనగరం నుండి చినవాల్తేరు మీదుగా ఆంధ్రవిశ్వవిద్యాలయం నిలబడ్డ విశాఖపట్టణం దాకా వెళ్ళిరావాలి. అవన్నీ తిరిగి తిరిగి ఈ కవిత్వం చదవడం వల్ల కలిగిన కొన్ని స్పందనలకి మాటలు వెతుక్కోవడం ఎంత కష్టతరంగా దక్కిన ఆనందమో చెప్పాలి. వెళ్ళొచ్చిన తర్వాత ఏ చీకటి నిశ్శబ్ద వ్యోమ దారుల్లోనో నిన్ను కలుసుకున్న అనేకానేక ఊహాతీత చుక్కల చూపుల్ని ఒక వెంటాడే జ్ఞాపకంలా పాట కట్టుకోవాలి. ఎందుకంటే నారాయణబాబు కవిత్వం నిండా ఎన్నో రాగయుక్తమైన వాక్యాలుంటాయి.  అవును. అతని ఒకేఒక కవితా సంపుటి రుధిరజ్యోతి నిండా ఆధునిక తెలుగు కవిత్వం కళ్ళ జూసిన ఎన్నెన్నో పరిణామ దశలు పరువులెత్తుతాయి. అది భావ దశనుండి చేవ దశకు మారుతున్న ప్రయాణం కనిపిస్తుంది. ఛందస్సుని ఛీ అనడం కనిపిస్తుంది. సాంప్రదాయాన్ని తోసిరాజని పలికిన అధునికుడి గొంతు వినిపిస్తుంది. “తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ, జతగూడి దోబూచి సరసాల నాడి ; దిగిరాను దిగిరాను దివి నుండి భువికి, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు” అని కృష్ణ శాస్త్రి భావకవిత్వ బావుటాని ఎగురవేస్తున్నపుడు, నారాయణ బాబు మాత్రం “ఖ్యాతీ గడించే గీతం రాసి ప్రేయసికంకిత మీయాలంటూ మూతి బిగుంచుకు, చేతులు ముడుచుకు కూర్చున్నావా కవీ” అని భావ కవిత్వ స్వరూపాన్ని చేసిన ఎగతాళి కనిపిస్తుంది.

1906 లో పుట్టిన నారాయణబాబు, 1930 కీ 1950 కీ మధ్య అభ్యుదయ తెలుగు కవిత వేసుకున్న కొత్త దారికి  తొలి సాక్ష్యంగా నిలబడతాడు. రెండు మూడు మినహాయిస్తే కవితా సంపుటిలోని అన్ని కవితలూ ఈ మధ్య కాలంలో రాసినవే. అతని కవితా ఖండికల్లో భాష కొత్తగా ఉంటుంది. కానీ హిందూ మత ధర్మంలోని వైదిక సనాతనత ని సూచించే చాలా శబ్దాల్ని పుస్తకం నిండా పరుస్తాడు. ఆ శబ్దాలకి అర్ధాలు కూడా ప్రాచీన ధర్మాలనే నేపధ్యాలుగా ధ్వనిస్తాయి. భారతీయ హిందూ సాంప్రదాయం పట్ల ఆ కాలంలో ఉన్న ఆధిక్య భావజాలాన్ని ఈ కవిత్వ సంపుటి ఇంకా ఎక్కువచేసే చూపించింది. అభ్యుదయ భావజాలాన్ని ప్రచారం చేయడంలో హిందూ మత నేపధ్యాన్ని ఎన్నుకోవడం తప్పనిసరి అవుతుంది కవికి. మరి అలాంటి అతన్ని ఆధునిక కవిత్వనిర్మాతల్లో ఒకణ్ణి చేయడం కరెక్టేనా ? నిస్సందేహంగా కరెక్టే. ఆ “ఎలిగరీ” (దృష్టాంత కధనం) ధ్వనిలోంచే సాంప్రదాయాన్ని ధిక్కరించే నవ్య కవితారీతిని ఈ పుస్తకంలో మనం చూడగలుగుతాం. చాలా కవితలు పురాతన పురాణ కధల్ని స్ఫురణకు తెస్తాయి, వస్తువులో శివుడూ, దక్ష యజ్ఞమూ, ఇంద్రుడి అధీనంలో ఉండే మేఘాలూ, వైతరణీ నదీ కనిపిస్తాయి, కానీ ఆ వస్తువుల్ని చివరాఖరికి ఆధునిక సమాజ రుగ్మతని పరిహరించే అభ్యుదయ భావనలతో ముడిపెడతాడు. అర్ధం చేసుకునేందుకే పాత కధని కళ్ళ ముందు నిలిపి సరికొత్త దృష్టి కోణాన్ని ప్రదర్శిస్తాడు కానీ పురాణాలు తెలియని పాఠకులకి కొన్ని కవితలు సులువుగా అర్ధం కావు . కవితా వస్తువు లోని కొత్తదనం సార్వజనీనతని ఏమేరకు లక్ష్య సమూహానికి చేరువ చేసిందో ఇప్పుడు అర్ధం చేసుకోవడం సుసాధ్యమైన విషయమూ కాదు.  ఖఛ్చితంగా అన్ని వర్గాల్నీ ఇది సంతోషపెట్టిన కవిత్వం అయి ఉండటం సామాన్య ఊహ కాదు.  కపాల మోక్షం అనే కవిత ఈ సంపుటిలో ఎంతో గొప్ప కవిత. 1931 మార్చి 5 గాంధీ ఇర్విన్ ఒడంబడిక లో భగత్సింగు ఉరిశిక్ష రద్దు లేకపోవడంతో ఆ వీరయోధుని బ్రిటీషు పాలకులు 1931,మార్చి 23 న ఉరితీసి చంపేస్తారు.దేశంమొత్తం అట్టుడుకిపోయిన ఈ సంఘటనని కవితా వస్తువుగా మలచిన (1938-ప్రతిభ పత్రిక లో అచ్చైన) కవిత ఇది. ఆ ఉద్వేగ చిత్రణకి లయకారకుడైన శివుడి కైలాసాన్ని వేదిక చేస్తాడు. ఆకలేసిన ఉద్రేక రుద్రుడికి భిక్ష పాత్ర కావాలన్న వెతుకులాట కవితలో మూడొంతులు నడుస్తుంది. చివరాఖరికి “భారత వీరుని కాపాలమొకటి కపర్ది చేతిని రివ్వున వాలింది” అంటాడు. “ఎందరు పుట్టలేదు ఇంకెందరు గిట్టలేదు అందరికీ లభిస్తుందా హాలాహలమంటిన హస్త స్పర్శ! పెదవుల చుంబనం, కపాల మోక్షం, కపాల మోక్షం” అని ముగిస్తాడు.

అభ్యుదయ కవిగా  నారాయణ బాబు విప్లవ చైతన్యానికి శివుణ్ణి ప్రతీక గా గ్రహించి ఏ పరమార్ధం సాధించాడో అర్ధం కాదు. అయినా కూడా భగత్సింగు తల శివుని హస్త స్పర్శ చేత మోక్షం పొందిన వర్ణన బాగా చేస్తాడు కవి. బహుశా అలాంటి వ్యక్తీకరణ అంతకు ముందు ఎవ్వరికీ సాధ్యం కాలేదంటే అబద్దం కాదేమో.అలాంటిదే భగత్సింగు శాపమనే మరొక కవితలో “క్రతువంటూ, పశువంటూ నిను బలి ఇచ్చిన ఋషులంతా పటాపంచలైనారు, నీ గళమ్మున నిరాకరణ సూత్రం వైచి నిలువునా ఉరి తీసారా నా తండ్రీ — నాటికీ నేటికీ భారత భూమి పాడి యావునకు కళ్ళల్లో కాటుక పొగలు, బుర్రను భూకంపం, గుండెల్లో కుత కుత ఉడికే లావా” అని అంటాడు. మునుపటి దానితో పోలిస్తే ఈ కవిత చాలా సూటిగా, స్పష్టంగా అన్ని వర్గాల చదువరులకీ ఇట్టే దగ్గరవుతుంది.  చదువరి చెవుల్లోంచి గుండెల్లోకి అన్నిటికన్నా గొప్ప విషయం ఒకటి ప్రవహిస్తుంది. అదేమంటే అప్పటిదాకా ఉన్న పోయెట్రీ, అంటే రమా రమి  1930 ల తర్వాతి నారాయణ బాబు కవితలు చదివాక పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తుంది. అతని పదాల వాడుక లో ఒక భిన్నమైన రూపం కళ్ళు తెరిచిన స్పృహ కలుగుతుంది. జ్వాల 1935 జనవరి 16 సంచికలో వచ్చిన జ్వలనా కవిత నారాయణబాబు చేపట్టిన కొత్త ప్రక్రియ కి అద్దం పడుతుంది.
“వేదన రగిల్చి విశ్వము పగిల్చి వెలిగింపుము మా వేడి నెత్తురుల ; ఒళ్ళు తెలియక పళ్ళు కొరుకుతూ నృత్యం చేసే రాక్షసి సంఘపు కీలాలమ్మే తైలమ్ముగ, జీవనమే వత్తిగ — రుధిరజ్యోతిని వెలిగింపుము రా, విప్లవ గీతిని వినిపింపుము రా, జ్వలనా ! జ్వలనా” అని ఎలుగెత్తి పాడతాడు. తనదైన ఒక భావ చిత్ర రూప సృష్టి చేస్తాడు. వచన కవితలో అతను చూపిన లయాత్మకత, భావాన్ని మరింత అతిశయంగా ఇనుమడింపజేస్తుంది. శబ్దాన్ని మించి వినిపిస్తుంది. పోయెట్రీ ఆఫ్ ఐడియాసే కావచ్ఛు. అలాగని ఉద్వేగం లేని అమూర్త అన్వయం మాత్రమే అంటే ఒప్పుకోలేని కవిత్వం మనల్ని ఊపిరి బిగదీస్తుంది.

“నాతో నరకానికి నీవే వస్తే వైతరణిలో ఫినాయిల్ వర్షం కురిపిస్తా, కఫ స్తంభాన్నే కాప్ స్టన్ సిగరెట్టుగా వెలిగిస్తా, చిత్రగుప్తుని చిట్టాలన్నీ చింపి పత్రాలు పకోడీల సుబ్బయ్య పొట్లాలకు యిస్తా, యముని మహిషానికి ఏరు పూసి బంజరు భూములు దున్నించి పంటలు పండిస్తా –లే పద ! వేళై పోతున్నాది, వనితా వనతా న తా నన ! అనర్ధం, స్వార్ధం, నాకం ! పరార్ధం, యదార్ధం నరకం” అంటాడు. ఈ వాక్యాల్లో డైరెక్టుగా చెప్పాడనుకోవాలో, గాఢమైన ప్రతీకాత్మను ఆవిష్కరిస్తాడో చదువరే తీర్పు చెప్పుకోవాలి.
ఇప్పుడొచ్ఛే కొన్ని పొడుగాటి కవితా పాదాలు చూసినప్పుడు, నారాయణ బాబు కవిత్వం లో ఉన్న చిన్న చిన్న వాక్యాలు సమ్మోహనం గా అనిపిస్తాయి. అదొక వింత రూపం. భాష వాడడంలో ఉన్న పొదుపరితనం సాధనతో సిద్దించినా, స్వతహాగా ఉన్నా మనల్ని అది ఆకర్షిస్తుంది. “పల్లకీ దిగినట్టి పెళ్లికొడుకులు మీరు, పట్టు తివాచీని నేను, నా మీంచి నడవండి గడ్డిపరకను, గడ్డిపరకను (గడ్డిపరక); శబ్దార్ధం వాంఛించే చాంధసులం, అర్ధమనర్ధమని అనుభవమే నగ్నం గా ఆలాపన చేస్తానంటే మూగవాని నాల్కంటాం, ఎం ఏమంటావు ? గాలికి గల గల మోగే పండుటాక ! (అగ్నివీణ): చచ్చి బ్రతకడమెలాగో, మృత్యువులో వెలుగెలా దాగి ఉందొ ఈ కవిత ఆసక్తిని రేకెత్తిస్తుంది. గడ్డిపరక కవిత బలహీనులని తొక్కిపడేస్తున్న బలవంతుల ఉక్కుపాదాల గురించి బాగా తెలియజేస్తుంది. ఇలాంటి భావజాలమే చాలా కవితల్లో తొంగి చూస్తుంది. ఆరోజుల్లో ఈ తరహా ఎక్స్ప్రెషను మామూలు సంగతి కాదు.
నారాయణ బాబు ఈ పుస్తకం నిండా కవిత్వంతో పాటు సంగీతాన్నీ మేళవించాడు. తన మిత్రుడైన ద్వారం వెంకటస్వామి నాయుడి గారి వేళ్ళ మీద ఏకంగా ఒక కవిత రాసేస్తాడు.”కామానా కాదు. నరుని రధం, భారత యుద్ధం, శ్రీ కృష్ణుని చేతి కొరడా; ఫిష్ కాట్ వాయిస్తారు, బొందెను ఆత్మకు ద్వంద్వ యుద్ధమే పెడతారు మానవత్వపు కుట్లు చిటపట తెగిపోవగా” అని అంటాడు. అతని సంగీత మోహ పారవశ్యం అంతటితో ఆగదు.  “ఆకలితో నా కడుపు అగ్నివీణ వాయిస్తే దీపక రాగం (కామ వర్ధని జన్యం) దిక్కులకెగబ్రాకి ఆకాశం అంటుకుంది, నా దారిద్ర సంగీతానికి భూమ్యాకాశాలే తాళం చిప్పలు–నా శ్రావణ శంఖ ద్వయంలో ఆకలి ఓం కారం ” అంటాడు (దరిద్ర సంగీతం). తనకిష్టమైన కదన కుతూహల రాగాన్ని కవితా శీర్షిక చేసుకున్న మరో కవితలో “నిర్మల సభంపు నీలపాళికల వెన్నెల కత్తి ఝళిపిస్తాను, నోరులేని తారలచే కీలాలం కక్కిస్తాను శంకరు శ్యామల శంఖ గళంమ్మే పూరిస్తాను — కాల భుజంగం కళ్లెం లాగి చలో చలో యని సాగిపోయెదను ” అని మరఫిరంగినే మహతిగా మీటుతాడు. అగ్ని కురిపిస్తాడు. కదన కుతూహల రాగంలో ప్రసిద్దిగాంచిన కొన్ని పాటలు చెప్పనా ? పట్నం సుబ్రమణ్య అయ్యర్ స్వరపరచిన రఘువంశ సుధాంబుధి కీర్తన.  చూడాలని ఉంది (చిరంజీవి) సినిమా లో యమహా నగరి కలకత్తా పురి అన్న పాట. నారాయణ బాబు కవిత్వం అలాంటి ఎన్నో రాగాల్ని వినిపిస్తున్నట్టు ఉంటుంది. ఎన్నిసార్లన్నా ఈ మాట అనుకోవచ్చు.ఈ సంపుటిలోనే విశాఖపట్నం అని  ఇంకొక గొప్ప కవిత ఉంది. నారాయణబాబు విజయనగరంలో ఉండేవాడు, విశాఖపట్నాన్నీ అభిమానించేవాడంటారు. నగరీకరణ చెందుతున్న జీవితాన్ని గురించి ఈ కవిత ప్రస్ఫుట వ్యాఖ్య చేస్తుంది. “తాగేందుకు నీరు లేకపోయినా డయాబెటీస్ కు లోటు లేదు, పిలవకుండా పలికే ముండలకు  పిలిస్తే పలికే జబ్బులు” అంటాడు. నీళ్లులేవని వ్యగ్యంగా చెబుతాడు. ముండ అన్న పదప్రయోగం వినటానికి బాగోదు ;అంతకు మించి కవి అక్కడ గౌరవ పదం వాడలేకపోవడం కలుక్కుమంటుంది.  “దొరసానిలాంటి విశాఖపట్నానికి వాల్తేరు వక్షోజం, ధనవంతుల ధనుష్కోటి” అన్నప్పుడో, “ఓ అంతా లేడీ స్తూడెంట్లే, ఊరంతా ఒకే ఇల్లు, సమర్త గది స్కూలు, పురిటిగది ఆసుపత్రి, గాలి వీస్తే గర్భవతులగు ఆనాధలు, ధూళికే విడిచే సంతానం” అన్నప్పుడో కవిగా నారాయణ బాబు తీసుకున్న ప్రతీకలు మనల్ని కొత్తగా ఆలోచింపచేస్తాయి. స్త్రీ జీవన నేపధ్యాలని వాళ్ళ దయనీయ స్థితిగతుల్నీతాకకుండా ఉండలేని లౌల్యాన్నీ కవి అందంగా ప్రదర్శిస్తాడు. వస్తువులోని యదార్ధ చిత్రణ ఒక గంభీరతని తీసుకొస్తుంది. “విశాఖపట్నం జోడులేకుండా పోకూడదు, నీగ్రో స్త్రీ బుగ్గల్లాగా నిగ నిగ లాడే తారురోడ్లు”అంటాడు. “నగ్నం గా స్త్రీ స్నానం చేసేటప్పుడు ఎదురుగుండా పరాయి మొగాడు– ఏరాడ  కొండ, ఆలీబాబా, అబ్ధి — అని ముగిస్తాడు. చదివించే లక్షణం మెండుగా ఉన్న కవిత ఇది. కవిత ఆసాంతం వ్యంగ్య ప్రాధాన మైన భాషలోనే ఉన్నదిఉన్నట్టు చెబుతుంది. 1940 లో ఇలా రాయడం చూస్తే, 1960 లో తిలక్ “సెంట్లూ, అత్తర్లూ, స్నోలూ, పౌడర్లూ వాడదు, సినిమాలూ క్లబ్బులూ  చూడదావిడ” అంటూ రాసిన రాజమండ్రి పాటలు చదివి కళ్ళు బైర్లు కమ్మడం అంత గొప్పేం కాదనిపిస్తుంది. ఏదన్నా కొత్తగా రాయడం మొదలెట్టడం మామూలు విషయం కాదు కదా.అది నారాయణ బాబు సులువుగా చేపట్టాడు.

పౌరాణిక ప్రతీకల్ని వాడుతూ పురాణాల్ని అవహేళన చేసేంత యదార్థవాదాన్ని ధ్వనిస్తాడీ సుకుమారపు కవి. “లెండోయి ఋషులు లెండి భూమిని చాప చుట్టగా చుట్టి చంకను పెట్టండి, ఈ సముద్రం తీసుకెళ్లి అవతల పార పొయ్యండి”(లేండోయి ఋషులు) వంటి వ్యక్తీకరణలు దానికి ఉదాహరణ.“కల్పనకిది కాని రోజు, కవి కంఠంలో పట్టింది బూజు, కలదింకా నీ కొక రోజు; దులుపు బూజు “(దులుపు బూజు); “నా నరాల తీగల, వరాల పాటలు పాడ, హృదయ గర్భాలయంలో కంచుగంట మ్రోగించి, నా వెన్నెముకనే శివధనుస్సుగా విరిస్తే, కూడలిలో అవ్యక్తం, జగమంతా నిండితే సముద్రమే సంజీవన పర్వతమైంది” (తత్వమసి); పరోక్ష వ్యక్తీకరణ నారాయణ బాబు కవిత్వం లో చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. తన  ప్రతి ఆలోచనలోనూ ఉపమాన ఉపమేయాలు దాటిన  ఒక సామాజిక అతి వాస్తవికత కొన్ని కవితల్ని దేదీప్యమానం చేస్తుంది. బహుశా సర్రియలిస్టు ధోరణిలో రాసిన “మౌన శంఖం” కవిత చదివితే :మానవుణ్ణి మానసికంగా షాక్ కు గురిచేసే అంశాలు పుష్కలంగా కనిపిస్తాయి: అతను సర్రియలిజాన్ని షాగ్గానే ప్రయోగించాడీ కవిత్వమంతా !

నేనెవర్ని ? అన్న ప్రశ్నలోంచి ఈ కవిత తన స్వరూపాన్ని నిర్దేశించుకుంటుంది. కానీ అతనెవరో తనకి తెలిసిన కవి “నీలగిరి లో పురుడుపోసుకుని దాహం దాహం అంటూ మరణించిన చూలాలి వక్షంలో గడ్డకట్టిన చనుబాల జిడ్డును, ఒక ఇల్లాలు ఒక చీకటి రాత్రిలో వీధి కాలువలో కురిపించిన పాల వానను” అంటాడు. ఈ కవిత మొత్తం తన్ను తాను  తెలుసుకున్న ప్రాణం భగీరధుడయ్యిందంటాడు, వెన్నుముక మీద ఆకాశగంగా జలపాతం వర్షించిందంటాడు, నా పొత్తికడుపు హిమాచల తనయ తన చల్లని మంచు హస్తాలతో నిమిరింది ” అంటాడు. “పార్వతి నగ్నంగా పూలు కొస్తుంది : నా ఎముకల మూలుగులో చంద్రోదయమైంది ” అని రాసి; ఇంకా “ఆకాశం చిరిగిపోయిన అరటిదొప్పలా ఒక మూల పడి ఉంది. భూగోళ పటం మీద ఉల్లిపొర కాగితం లాగ మృతించిన శేషుడు భూమిని చుట్టుకుని ఉన్నాడు. వెలిసిన రంగు గుడ్డలు మంచీ చెడ్డా, జండాలై ఎగురుతున్నాయి” అంటాడు. ఈ కవిత భిన్న విమర్శలకి  తలుపులు తెరిచింది. ఈ అన్వయాలు అసామాన్యమైనవి.

నారాయణ బాబు తన కవితలన్నింటిలో ఉండే  గంభీర విషయ ప్రస్తావన చేత మన ఇంద్రియాల్ని విచలితం చేస్తాడు. ఇంత ప్రయోగాత్మక అభివ్యక్తి, భిన్న రూపమూ, మనల్ని లోలోపలికి తీసుకెళ్లే నిగూఢత వల్ల ఈ పుస్తకం చదివినంతసేపూ ఒక విధమైన సంచలనానికి గురవుతాం.

అధివాస్తవికత ని గుమ్మరించే హడావుడిలో పడిపోయిన నారాయణ బాబు రూప దూరానికి గురికావడాన్ని దాచలేదీ కవితా సంపుటి. ఉద్వేగాన్ని కలిగించడంలోనూ బహు నెమ్మది. కానీ చదివినంత మేరా లోన కొంగ్రొత్త ఆలోచనలని కలిగించడంలో ఏ మాత్రం వెనుదీయదు. విపరీతమైన క్లుప్తత నవకవితా లక్షణంగా కనిపిస్తుంది. పదాలేవీ దిగుమతి చేసుకున్నవి గా తోచనే తోచవు. ఒక సమ్మోహ శబ్ద సంచయమూ, నిండా సెటైరూ ఉన్న పోయెట్రీ గా తోస్తుంది. చదివినంతనే ఆకర్షిస్తుంది. ప్రతీ వాక్యంలోనూ మానవుడి దీనత్వమూ, దాన్ని జయించాల్సిన కోరికా, అది తీరని అసహనమూ కనిపిస్తాయి. ప్రాచుర్యం తక్కువ కావడం చేతనే కవితలు చాలా మందికి తెలియవు. రుధిరజ్యోతిలోని కవితలన్నీ 1950 కల్లా రాసేసినా 1972 లో ఆరుద్ర పూనుకుని అచ్చ్చేసేంతవరకూ ఇవన్నీ ఒకచోట చేర్చి అందుబాటులోకి రాలేదు. అతగాడు 1961 లోనే కన్నుమూశాడు. అతనితో పాటు సరిసమానమైన పరిపక్వత కలిగిన సోదర కవుల ప్రభంజనం జంఝామారుతంగా వీస్తున్న కాలాన్ని ధైర్యం గా ఎదుర్కొన్న నారాయణ బాబు, “శిరసున రతనము, గళమున విషమ్ము, కాలము కొసలో కాటుక మబ్బులు;కాగితమే కంపించింది — సూరన అడిదాన్ని, తిక్కన ఖడ్గాన్ని, పేలిన బీజాపూర్ ఫిరంగి గుండు నా గుండె” అని సామిథేని వినిపించిన వాడు. అతని కవిత్వం చదివితే ఆధునిక తెలుగు కవిత్వం జీవన యానం తొలి పాదముద్రలు కనిపిస్తాయి. రుధిరజ్యోతిర్ జ్వలనా లలనా ప్రియుండ; విప్లవ ఋషిని, విద్రోహ కవిని” అని తనని తాను ప్రకటించుకున్నాడు. నారాయణబాబుని ఎంతగానో ప్రభావితం చేసిన బెంగాలీ కవి నజ్రుల్ ఇస్లాం విద్రోహి అని ఒక కవిత రాశాడు. ఆ కవితలో ” ఖగోళ మండలాన్ని బద్దలు కొట్టి, సూర్య చంద్రుల్ని, గ్రహాల్నీ, నక్షత్రాల్నీ, పరుగులెట్టిస్తాను భూమ్యాకాశాల్ని చీల్చుకుని దేవుడి పవిత్ర పీఠాన్ని పక్కకునెట్టి పైకి లేస్తాను. పుడమితల్లి అంతులేని అద్భుతంలా, యుద్ధ విజేతకు దక్కిన కీర్తి పతాకంలా కోపోద్రిక్త దేవుడు నా నుదిటి పై మెరుస్తుంటాడు. ప్రకటించు వీరుడా నా శిరస్సు మహోన్నతము – నన్ను చూసి హిమాలయ శిఖరం తలదించుకుంటుంది” (స్వేచ్చానువాదం: బొల్లోజు బాబా) అనే వాక్యాలుంటాయి. అవును తెలెత్తుకుని చెప్పుకోవాల్సిన విషయం. ఏ వివాదమెందుకు వచ్చినా, ఏ కవి ఈ యుగం నాదని చాటుకున్నా, ఎవ్వరు ఎవర్ని ఎందుకోసము ఎంత తూలనాడినా, నారాయణ బాబు రాసిన రుధిరజ్యోతి కవిత్వమెంతో మహోన్నతమైనది. ఈ తరం తప్పకుండా చదవి తీరాల్సింది.

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. ప్రస్తుతం బ్యాంకు వుద్యోగి గా రాజమండ్రిలో వుంటున్నారు. కవిత్వం కథలు చదవడం ఇష్టం. అడపాదడపా కవిత్వం రాస్తుంటారు. తమ కవితకు డాక్టర్ రాధేయ ఉత్తమ కవితా పురస్కారం పొందారు. ఇటీవల, మరో కవిత అమెరికా 'నాట్స్' బహుమతి గెల్చుకుంది.

15 comments

 • మలిచూపు అంటూ మీరు రాస్తోన్న వ్యాసాలు నాలో తొందర పెంచుతున్నాయి. అన్నీ మళ్లీ మళ్లీ చదవాలన్న ఆరాటం పెంచుతున్నాయి. చదవని వాటి గురించి మీరు రాసినవి, regret ఫీలింగ్ ని కలిగిస్తున్నాయి. కవి నాడిని పట్టుకుని పరిచయం చేయడంలో మీరు ప్రావీణ్యులవుతున్నారు. I like that. పోతే, ఏదో దాస్తున్నట్టు తటపటాయిస్తూ కాకుండా నేరుగా శ్రీశ్రీ కవిత్వాన్నీ నారాయణబాబు కవిత్వాన్ని పోలుస్తూ బేధపరుస్తూ మీరొక వ్యాసం రాస్తే చదవాలని కోరిక 🙂

  • నవీన్, వాళ్ళిద్దరి ప్రస్తావన లేని వ్యాసమే ఉండదు. దానికి భిన్నంగా రాద్దామని ట్రై చేశాను. అంతే. థ్యాంక్స్

 • హబ్బ, ఎన్నాళ్ళకి మళ్లీ నారాయణ బాబుని గుండెలకి హత్తుకోగల్గాను. పీజీ చదువే రోజుల్నుంచీ
  ఈ రుధిరజ్యోతి మీద ఎవ్వరూ రాయట్లేదేమిటి అనే యాతన వుండేది.
  ఇప్పుడది తీరింది.
  ఇట్లా
  బైరాగి గురించి కూడా ఎవరో ఒకరు రాస్తే చదివి తరించాలని ఉంది.

  శ్రీరామ్ గారూ, చాలా బావుంది వ్యాసం.

  • థ్యాంక్యూ సర్. మీ మాటలు ప్రోత్సాహాన్నిచ్చాయి

 • నారాయణ బాబు గారి రుధిరజ్యోతిని చదవాలనే కోరికను కలిగించారు మీ మలిచూపు ద్వారా…
  ముక్కుసూటితనం,విషయస్పష్టత,ఆధునికతతో విభిన్న కోణాలపై విస్తుపరిచే ప్రతీకల ప్రవాహంలో ఓలలాడించిన తీరు చూస్తుంటే కవిగా తనెంత ఎదిగాడో అవగతమవుతుంది…చాల బాగుంది శ్రీరాం గారు మీ వ్యాసం… అభినందనలు

 • ఈ కాలానికి చాలా అవసరమైన వ్యాసం మాలి చూపు కొంతమందికైనా కొత్త చూపు నివ్వాలి , ఒకే భావ ఆవేశంలో పది పోకుండా అప్పుడప్పుడు ఇలా మేలుకొలుపు గీతాల్ని పాడుతూ ఉండాలి , మీ వ్యాసం సరళంగా ఉంది , కొత్తగా ఉంది నాకు చాలా త్వరగా ఈ పుస్తకం చదవాలని ఉంది

 • శ్రీరామ్ గారు “రుధిరజ్యోతి” పై మీ పరిశీలన ,సమీక్ష ఆ తరం నారాయణ బాబు గారి వైవిధ్యభరిత భాష, ఆలోచన ,కవితాశిల్పం తో కూడిన ఆ కవితా సంపుటిని చవాలనే కుతూహలం రేపింది .
  ఎక్కడ లభిస్తుందీ కవితా సంపుటి.

  • థ్యాంక్యూ మేడం. కాపీలు దొరకడం లేదు. నాదగ్గర ఫోటో స్టాట్ ఉంది కావాలంటే.

 • దిగంబరకవులకి అర్ధశతాబ్దానికి ముందేపుట్టిన నగ్నకవినారాయణబాబు.భయంకరరోగపూరిత క్రిములు కారుతున్న సమాజాన్ని చూసిన కళ్ళు రుధిరజ్వాలలు కక్కడం అసాధారణమేం కాదు.అందునా విలయకంపిత మానసం విస్ఫులింగాల్ని ఎగజిమ్మడానికి హద్దులుండవు.అదే ఆ కవి కవిత్వానికి వేదిక.నిప్పుల్లో పరిగెత్తినవాడివెనక వేగంగా వెళ్ళలేం.ఫూంకృతులతో చెలరేగినవాడికి అనుయాయులూ వుండరు.నారాయణబాబు కవితారీతి అలాంటిది.శ్రీరాం పరిచయం ఎలా వుంటుందంటే ఇంచుమించు ఆ కవిని సరాసరి మనలోకి దించెస్తాడు.ఇంక ఆ కవిని గానీ ఆ పుస్తకాన్ని కానీ పట్టుకోకుండా ఎలావుండగలం?కొన్ని ప్రభంజనాల్లోకొట్టుకుపోయిన తరానికి ఆ వెల్లువ తగ్గాక ఒకసారి వెనక్కి చూస్తే గాంధీ ఒక్కడే స్వాతంత్ర్యం తేలేదనే విషయం ఎలా బోధపడుతుందో అలానే శ్రీశ్రీ కి సమానమైన విప్లవోన్మీలమైన,అధిక్షేపణోగ్రవ్యగ్ర కవిత్వాన్ని ఆతరం అపుడే వొంటబట్టించుకున్నదాన్ని అర్ధంచేసుకుంటూ మనం ఏస్థితిలో వున్నాం?ఎందుకింకా మన పాదాలకు నూనె రాసుకునే నడుస్తున్నాం? అనే ఆలోచనలతో కొరడా కొట్టించుకుంటూ అంటకాగుతున్న వెధవాయత్వాన్ని వొదిలించుకునేందుకు శ్రీరాం ‘రుధిరజ్వాల’నిఇప్పుడు మరింత మండించడం దొంగ మొహాలమీద తుప్పున ఉమ్మేంత ఆవశ్యకం!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.