వ్యక్తిగత వికాసం వ్యక్తిత్వ వికాసం

భారతీయ సాహిత్యమంతా వ్యక్తిత్వ వికాస సాహిత్యమే. మానవ ప్రవర్తనకు అద్దం పట్టే విజ్ఞాన సర్వస్వాలే భారత, రామాయణ, భాగవత పురాణాలు, భర్తృహరి సుభాషితాలు, వేమన, బద్దెనల శతకాలు, పంచతంత్ర కథలు ఇంకా ఎన్నెన్నోఇవన్నీ కూడా మానవుడు ఆయా సందర్భాలలో ఎలా ప్రవర్తించాలో, ప్రవర్తించకూడదో తరతరాలుగా ప్రపంచానికి దారి చూపిన వెలుగు దివ్వెలు. ఒకప్పుడు ఇవన్నీ పాఠశాల్లోను, కళాశాల స్థాయిలోను కొంత పాఠ్య గ్రంధాలుగా ఉండేవి. చదువు అమ్మకం వస్తువు స్థాయికి ఎదిగేసరికి బోధనలో విలువలు తగ్గి, చదువుకొనడానికి మామూలు మానవుడికి ఖర్చు పెరుగుతూ వచ్చింది. దీనితో కార్పొరేట్ కళాశాలల యుగం ప్రారంభమై చదువుకొనడండబ్బు సంపాదించడానికే అన్న దురభిప్రాయం ఒక మధ్య తరగతి సంప్రదాయంగా స్థిరపడింది.

1980 ప్రాంతాల్లో ప్రారంభమైన ప్రపంచీకరణతో సరళీకృత ఆర్ధిక విధానాల నేపధ్యంలో బహుళ జాతి సంస్థలు మన దేశంలో ప్రవేశించాయి. అప్పటికే విలువలు పతనమైన విద్యతో, కేవలం చదువుకొనుక్కునితయారైన తరం ఉద్యోగాలకు పనికి రావని మైక్రోసాఫ్ట్, ఐబిఎం, యాపిల్, దేశీయంగా ఎదిగిన ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు సైతం నిర్ధారించాయి. వృత్తిగత నైపుణ్యాలు, విలువలు లేని మన యువతను చూసి విస్తుపోయాయి. ప్లేస్మెంట్ పేరుతో, ప్రకటనల హోరుతో తల్లిదండ్రుల్ని, విద్యార్ధుల్ని ఆకర్షించే కళాశాలలు చెప్పే చదువులు బహుళజాతి సంస్థలలో కొలువులకు మాత్రం పనికిరావడం లేదు. విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య గరపాల్సిన విద్యా సంస్థలు వ్యాపారమయమైపోవడంతో, అద్భుతమైన మార్కులు, అత్తెసరు సాంకేతిక నైపుణ్యాలతో ఉపాధికోసం వీధుల్లో పడిన యువతకు వృత్తిగత సాంకేతిక నైపుణ్యాలు, ప్రవర్తన నైపుణ్యాలు నేర్పించడానికి కంపెనీలు నడుం బిగించాయి. నేటి యువత ఉపాధికి అవసరమైన సాంకేతిక, ప్రవర్తనా నైపుణ్యాల బోధనే వ్యక్తిత్వ వికాసంగా రూపుదిద్దుకుంది. నిజానికీ నైపుణ్యాలు వృత్తిగత వికాస నైపుణ్యాలే గానీ, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు కాదు. ఇదే వ్యక్తిత్వ వికాసం (Personality Development) అంటూ నేడు రూపాంతరం చెంది చలామణి అవుతోంది. ప్రైవేటు రంగంలో ప్రారంభమైన విశ్వవిద్యాలయాలు ఈ కొత్త తరం కంపెనీల అవసరాలు తీర్చడానికి తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాయి.

రెండు దశాబ్దాల క్రితం వృత్తిగత ప్రవర్తనా నైపుణ్యాలు అంటే ఏమిటో తెలిసినవారు అరుదు. వృత్తిగత నైపుణ్యాలతోపాటు ఆంగ్లభాషా నైపుణ్యం కూడా వ్యాపార వ్యవహారాల్లో అత్యవసరం కావడంతో ఇంగ్లీషు లెక్చరర్లను ట్రైనర్లుగా తీర్చిదిద్దడం సులభమని భావించారు. సాంకేతిక నైపుణ్యాలకు బహుళ జాతి సంస్థలు నైపుణ్య ధృవీకరణ తప్పనిసరి చేశాయి. అదే విధంగా ప్రవర్తనా నైపుణ్య శిక్షకులకు కూడా సర్టిఫికేషన్ అంటే ధృవీకరణ తప్పని సరి అని భావించాయి. దీనితో వీటికి తగిన డిమాండ్ పెరిగింది. ఒక సరికొత్త ఉపాధి రంగం ప్రారంభమైంది. అదే వృత్తిగత సరళ కౌశలాల (Soft Skills) శిక్షకుల రంగం. అంటే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ (Soft Skills Trainers). స్ఫూర్తిభరిత ఉపన్యాసాలు (Motivational lectures) కూడా వీరు తమ శిక్షణలో భాగం చేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. చదువు చెప్పని, చెప్పడం చేతకాని డిగ్రీ చదివిన లెక్చరర్ల చేతుల్లో తయారైన ఇంజనీరింగ్ విద్యార్ధులు ఆత్మవిశ్వాస రాహిత్యంతో నిరుద్యోగ భారతంలోకి చేరడంతో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు కూడా శిక్షణలో ఒక భాగమయ్యాయి. వీరినే మోటివేషనల్ ట్రైనర్స్ అనడం ప్రారంభించారు. జీవితంలో తల పండిపోయిన సీనియర్ సిటిజెన్లు కూడా మోటివేషనల్ ట్రైనర్లుగా రూపాంతరం చెందారు. నవలా రచయితలు, పాత్రికేయులు, ఇంద్రజాలికులు, పోలీసు అధికారులు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, సైకాలజిస్టులు, రచయితలు కూడా మోటివేషనల్ ట్రైనర్లుగా, జీవన నైపుణ్యాల (Life Skills) ఉపన్యాసకులుగా రూపుదిద్దుకున్నారు. ప్రస్తుతం వీరే నిరుద్యోగులను తీర్చిదిద్దడంలో విస్తృత కృషి చేస్తున్నారు. తొలినాళ్ళనుంచి ఎంతో శ్రమకోర్చి ధృవీకరణలు సాధించి ట్రైనర్లుగా తయారైన ఆంగ్ల ఉపాధ్యాయులు, మానవ వనరుల నిపుణులు కొత్త తరం కంపెనీలకు సాధికారిక శిక్షణనిస్తూ సేవలందిస్తున్నారు. శిక్షణలో నాణ్యతలో తేడాలు సహజంగానే వృత్తిగత బాధ్యతలు సమర్ధంగా నిర్వహించడంలో ప్రతిఫలిస్తాయి. రాజకీయాల్లో లాగా ఈ రంగంలో ప్రవేశించడానికి కనీస అర్హతలు అవసరం లేకపోవడంతో కాస్త వేదికలెక్కి ప్రసంగించగలిగిన ప్రతి ఒక్కరూ ట్రైనర్లుగా ప్రభావితం చేయగలమని భావిస్తూ ఈ రంగంలోకి దిగుతున్నారు. దీనితో ఈ రంగంలో కూడా నాణ్యమైన శిక్షణ కనుమరుగవడం ప్రారంభించింది.

ఈ నేపధ్యంలో అసలు వ్యక్తిత్వ వికాసమంటే ఏమిటి? అసలు విజయం అంటే ఏమిటి? జీవితంలో విజయం సాధించడమంటే ఏమిటి? వృత్తిగత జీవితం, వ్యక్తిగత జీవితం సమన్వయం చేసుకోవడం ఎలా? ఏం చేస్తే వృత్తిగత జీవితంలోను, వ్యక్తిగత జీవితంలోను అద్భుత విజయాలు సాధించవచ్చు? వీటిలో ఆర్ధిక క్రమశిక్షణ పాత్ర ఎంత? ఎవరివల్ల, దేనివల్ల ప్రభావితమైతే మన జీవితం మన నియంత్రణలో ఉంటుంది? కెరీర్ కోచింగ్, కెరీర్ కౌన్సెలింగ్, నెట్ వర్కింగ్ తో సత్ఫలితాలు సాధించడం ఎలా? డిజిటల్ యుగంలో నిరుద్యోగాన్ని లొంగదీయడం ఎలా? అవకాశాల్ని అందిపుచ్చుకోవడం ఎలా? ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి అనుసరించాల్సిన మౌలిక సూత్రాలేమిటి వంటి ఎన్నో విశేషాంశాలతో ప్రతి నెలా ఈ ‘కాలం’లో మిమ్మల్ని పలకరిస్తాం. మీ స్పందనతో, మీకు అవసరమైన అంశాలమీద సలహాలతో ఈ ‘కాలం’ ఉద్దేశం మరింతగా నెరవేరుతుంది. రొటీన్ కి భిన్నంగా రాయాలంటే మంచి పాఠకుల మార్గదర్శకత్వం ఎంతగానో తోడ్పడుతుంది. పదండి! కదలండి! సాంకేతిక యుగంలో సరికొత్త విజయాలకు నాంది పలుకుదాం!

(వ్యాసంలో బొమ్మ: అంపశయ్య మీంచి ధర్మ రాజుకు రాజ్యపాలన సులువులు చెబుతున్న భీష్ముడు)

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.