గౌరీశంకర్ చనిపోయాడన్న కబురు తెలిసింది.
గౌరీశంకర్ మా ఆఫీస్ బోయ్.
నేను బదిలీతో ఈ ఆఫీస్ కొచ్చిన రోజునే గౌరీశంకర్ నన్ను ఆకట్టుకున్నాడు.
అతడి మాట తీరు బాగుంటుంది.
అతడు కలివిడిగా కలిసి పోతుంటాడు.
అతడు అరమరికల్ని ఆమడ దూరాన్న పెట్టేవాడు.
అతడు నొవ్వడు ఎవర్నీ నొప్పించడు.
అతడు నాకు మాత్రం తెగ నచ్చేశాడు.
అట్టి అతడు చనిపోయడం నాకు నిజంగా తేరుకోనీయని సంగతే.
బ్రష్సింగ్ పిమ్మట కాఫీకై ఎదురు చూస్తున్న సమయాన నా మొబైల్ ఫోన్ రింగయ్యింది.
మా ఆఫీస్ స్టాఫ్ లీడర్ కాంతారావు రింగిస్తున్నాడు.
కనక్టై, “హలో” అన్నాను.
అతడు ప్రతి–పలకరింపు లేకుండానే నేరుగా ‘గౌరీశంకర్ చనిపోయాడ‘ని ‘ఆఫీస్ స్టాఫ్ గౌరీశంకర్ ఇంటికి బయలుదేరుతున్నార‘ని ‘గౌరీశంకర్ ఇంటి అడ్రసిద‘ని ఒక్కమారుగా చెప్పాడు.
నేను షాకైనా నెమ్మదిగా తేరుకున్నాను.
నా భార్య అందిస్తున్న కాఫీని అందుకో బుద్ధి కాలేదు.
క్లుప్తంగా నా భార్యకి విషయం వివరించాను.
మోటర్ బైక్ తో గౌరీశంకర్ ఇంటికి బయలుదేరాను.
అటు వెళ్తున్నానే కానీ నా తలంపు గౌరీశంకర్ చుట్టే తచ్చాడుతోంది.
ఆ రోజు – ఈ ఆఫీస్న మొదటి జీతం పుచ్చుకున్నాను. వెను తిరిగాను. ఎదురొచ్చి చిరునవ్వుతో నన్ను ఆపాడు గౌరీశంకర్.
“సర్ మీతో మాట్లాడాలి” అన్నాడు చాలా వినయంగా.
“చెప్పు గౌరీశంకర్” అన్నాను చాలా ముచ్చటగానే.
“మన ఆఫీస్ స్టాఫ్ వారి నుండి జీతాల రోజున తలో 50 రూపాయలు చొప్పున వసూలు చేస్తుంటాను. ఎందుకంటే …”
అతడికి అడ్డుపడి, “ఆఫీస్ బోయ్వి కనుక. సహజమే. మేము చెప్పే మా పనుల్ని కూడా మీరు చేసి పెడుతుంటారు కనుక ఆ మాత్రం మా నుండి మీరు ఆశించడం అడగడం మామూలే. గత ఆఫీస్సుల్లో నాకు ఇట్టివి ఎఱికే” అన్నాను నవ్వుతూనే. అలాగే 50 రూపాయాలు అతడికి అందించాను.
అతడు ఆ నోటుని అందుకుంటూ, “ఏమో సార్. నేను మాత్రం ఇలా వసూలు చేయగా వస్తోన్న ఆరు వందల్ని ఏ నెల కా నెల మన ఆఫీస్ పేరున కస్తూరి వృద్ధాశ్రమానికి ముట్ట చెప్పుతుంటాను సార్. రశీదు తీసుకొని దానిని మన లీడర్ సార్‌కి ముట్ట చెప్పుతుంటాను సార్. అందుకే జీతాలందే రోజున నా విధిగా ఈ వసూళ్లు చేపడతాను సార్. మీరు కొత్త కనుక ఈ వివరణ ఇవ్వబోతుండగా మీరు అడ్డు పడి ఇది చెప్పనీయలేదు.” అన్నాడు నెమ్మది నెమ్మదిగానే.
“అవునా. నేను తొందరయ్యాను. మరోలా అనుకున్నాను. ఏమీ అనుకోకు. మంచి పనే చేపట్టావు. గుడ్” అని అనేశాను. అతడి భుజం తట్టాను.
మరో రోజు – ఫైల్ క్లియరెన్స్ పనిలో ఉన్న నా వద్దకు వచ్చాడు గౌరీశంకర్.
“సార్ కొన్ని నిముషాలు మీతో మాట్లాడాలి. ఇప్పుడు అవుతోందా” అని అడిగాడు.
నేను కుతూహలపడ్డాను. మాట్లాడమన్నాను.
“మన ఆఫీస్ జీప్ డ్రయివర్ కూతురుకి ఎల్లుండి పెళ్లి కదా సార్. మనందరినీ పిలిచాడు. మనం ఎవరంతట వారం ఏదో కానుక ఇస్తాం కదా సార్. నేను ఇప్పటికే చాలా మంది మిగతా మన ఆఫీస్ వారితో మాట్లాడేను. వాళ్లంతా అలానే కానీ అన్నారు. మీరు ఏమంటారో అని అడుగుతున్నాను. అదే సార్. మనం ఎవరి మట్టుకు వారం కానుక ఇచ్చే బదులు. ఆ కానుకకై ఎవరు ఎంత హెచ్చించాలనుకుంటున్నారో ఆ డబ్బు నాకు ఇస్తే మన ఆఫీస్ తరుపున మనమంతా కలిసి అతనికి ఆ మొత్తం డబ్బుని ముట్ట చెప్పాలని ఉంది సార్. అతనికి ఖర్ఛుకి అది తప్పక కలిసి వస్తోంది కదా సార్. వస్తు రూపంలోకంటే ఇదే మంచిది సార్. ఏమంటారు” అని చెప్పాడు గౌరీశంకర్ నిదానంగానే.
నేనూ సమ్మతిగా తలాడించేశాను.
అతడు పొంగిపోయాడు.
ఆ వెంటనే నా వంతుగా రెండు వందలు అతడికి ముట్ట చెప్పాను.
హారన్ల హోరుకి గౌరీశంకర్ తలంపు నుండి తెములుకున్నాను.
ట్రాఫిక్ చక్కబడినంత వరకు మోటర్ బైక్‌ని మెల్లిగా నడిపాను. పిమ్మట సాఫీగా ముందుకు కదిలాను.
తిరిగి గౌరీశంకర్ తలంపులో పడ్డాను.
మరో రోజు – ఒక ఆవిడని నాకు చూపుతూ, “ఈవిడ మంచి వంట మనిషి సార్. పిల్లలకి పెద్దలకి ఇష్టమైనట్టు ఆరోగ్యకరమైన చిరు తిళ్ళుని పిసరంత రాజీ పడకుంటా వండుతోంది సార్. వాటిని మన ఆఫీస్ వాళ్ళం తలో కొన్ని చొప్పున వారంకి ఒక మారు చొప్పున కొనుగోలు అదీ నెల వారీ చెల్లింపు లెక్కనే చేయగలిగితే ఈవిడ కుటుంబంకి మన ఆఫీస్ ద్వారా నికరాదాయంగా ఆ మొత్తం ఉంటుంది సార్…
ఆ రెడ్ సిగ్నేల్తో నా మోటర్ బైక్‌ని సాఫీగానే ఆపగలిగాను.
నా తలంపు మాత్రం కొనసాగుతోంది.
… ఈవిడ భర్త ఆ మధ్యన ఆనారోగ్య మూలాన చనిపోయాడు. మరో ఆధారం లేని ముగ్గురు చిన్న పిల్లలున్న సంసారం ఈమెది. మిగతా వారితో మాట్లాడేను. మీతోనూ చెప్పుతున్నాను సార్. తలో చెయ్యి అందిద్దాం సార్ అదీ ఈవిడ వంటలు కొనుగోలు చేస్తూ” అని చెప్పాడు గౌరీశంకర్ చాలా నిలకడగా.
నేను ‘సరే‘ అనేశాను. గౌరీశంకర్ పనితనం పని తీరు ఎఱిగిన వాడ్ని. అందుకే అతడి మాట మీర లేకపోతున్నాను.
సిగ్నేల్ మారింది. నా మోటర్ బైక్‌ని కదిల్చాను.
ట్రాఫిక్ జామ్ చాలా ఉండడంతో గౌరీశంకర్ వైపు తలంపు నుండి నా దృష్టిని రోడ్డు వైపుకి తప్పక మరల్చవలసి వచ్చింది.
అలా మూడు జామ్‌లు ఆరు వాకబులతో గౌరీశంకర్ ఇంటిని చేరగలిగాను.
మా ఆఫీస్ వారు వచ్చి ఉన్నారు.
కాంతారావు దగ్గరకి చేరాను.
“పాపం. ఎలా చనిపోయాడు” అడిగాను.
“గుండెపోటుట” చెప్పాడు కాంతారావు.
“ప్చ్” అన్నాను. నాకు మాటలు రావడం లేదు. అతడు సరైన ఆరోగ్యవంతుడే మరి. ఏమిటో ఈ చావు.
కొద్దిసేపటికి మా ఆఫీస్ ఎంప్లాయ్ ఒకడు వచ్చాడు.
“కస్తూరి వృద్ధాశ్రమం నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. బాగుంది కదూ” చెప్పాడు అతడు కాంతారావుతో.
కాంతారావు ఏమీ అనలేదు.
నేనింకా ఏమీ మాట్లాడలేకపోతున్నాను.
ఆవిడ వచ్చింది. మాకు తన చిరు తిళ్ల వంటకాల్ని అమ్మేది ఆవిడినే.
ఆవిడ నాకు టీ గ్లాస్ అందించబోయింది.
నేను, “వద్దు” అన్నాను.
“మేము తాగాం. నువ్వూ తాగు. సమయం పడుతోంది. ఆవిడ ఈ టీలుకు డబ్బులు పుచ్చుకోదట” చెప్పాడు కాంతారావు నాతో.
నేను ‘వద్ద‘న్నట్టు తలాడించేశాను జోరుజోరుగా.
ఆవిడి వెళ్లిపోయింది.
గౌరీశంకర్ … అన్నింటా మంచివాడే. ప్చ్. కొద్ది వయస్సులోనే చనిపోయాడు.
అతడి ఇంటి వారిని పలకరించాలనిపిస్తోంది.
“అతడి ఇంటి వారిని కలిశారా” అని అడిగాను కాంతారావుని.
“లేదు.” చెప్పాడు అతడు.
“నేను ఒకమారు అటు వెళ్లి వస్తాను” అని అటు కదిలాను.
అక్కడ చిక్కటి దీనము అగుపించింది.
గౌరీశంకర్ భార్యని ఓదార్చడం అక్కడ వారికి కష్టమవుతుంది.
గౌరీశంకర్ కి ఇద్దరు పిల్లలట. ఆ చిన్నారులు బెంబేలు పడిపోతున్నారు.
గౌరీశంకర్ తర్వాత మరో దిక్కైన ఆధారమేమీ ఆ కుటుంబంకి లేనట్టు స్పష్టంగా కనిపించింది.
వెను తిరిగాను. కాంతారావు చెంతకి తిరిగి చేరాను.
అప్పుడే మా ఆఫీస్ జీపు డ్రయివర్ అక్కడ కనిపించాడు.
అతడు మాటల్లో, “గౌరీశంకర్‌కి తలకొరివి పెట్టడానికి తగు వారు లేరంటే అందుకు నా అల్లుడు ముందుకు వచ్చాడు” అని చెప్పాడు.
నా ఒళ్లు పులకరించింది.
కొద్దిసేపటి తర్వాత అతడు అటు వెళ్లాడు.
“హు. పైసలు మనవి గొప్పతనం గౌరీశంకర్‌కి.“ అన్నాడు కాంతారావు సడన్‌గా.
హడలిపోయాను.
***
ఎందుకూ హడలిపోవడం?
కాంతారావన్నది తప్పు మాట కాదు.
అబద్ధం అంతకన్నా కాదు.
మరెందుకూ కధకుడు హడలిపోవడం?
అందరితోనూ అసలు విషయం చెప్పి, వారు ఒప్పుకుని ఇచ్చిన పైసలతో, ఎవేవో చిన్న చిన్న సంస్కరణలు చేశాడు, గౌరీశంకరు. అదేదో, ఏమీ చెయ్యకుండా వుండడంతో పోలిస్తే, కాసింత గొప్పేగా? అయినా ఇక్కడ మనుషుల కున్నది కీర్తి పిచ్చి. తాను ఇచ్చిన పైసలతో, గౌరీశంకరుకి కీర్తి వచ్చేసిందని కాంతారావు ఏడుపు. అదేదో, గొప్ప రహస్యం బయట పెట్టేసినట్టు, ఈ కధకుడికి గొప్ప హడలు!!
ఏవిటో, ఒకటే అయోమయం!!
ప్రపంచంలో అందరినీ ఆదుకునే సంస్కరణలు చేసే రెడ్ క్రాస్ సంస్థ సీ.ఈ.ఓ కి చాలా పెద్ద జీతం అంట – అర్థ మిలియను అంట!
ఇలాగే వుంటుంది సంస్కరణల వాతావరణం.
పాఠకుడు
ఏవిటో, ఒకటే అయోమయం!!