చౌరస్తా!

ప్రపంచం ఒక నైతిక చౌరస్తాలో ఊగిసలాడుతోంది.

చూట్టానికి గొప్ప హార్రర్ సినిమాలా వుంది.

ఇది మనుషుల లోకం కాదనిపిస్తున్నది.

ఒక అమానుష శక్తి భూగోళాన్ని రబ్బరు బంతి చేసుకుని ఆడుకుంటున్నట్టుంది.

ఆటలో ఆటగా బంతిని ఏ అగాధం లోనికో లాక్కు పోతున్నట్లుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జోసెఫ్ ట్రంప్ గతంలో ఎంత అమానుషుడని అనిపిందో… ఇప్పుడు కూడా… రేపు కూడా అంత ఆమానుషుడే అని అమెరికన్లకు తెలుసు.

ఎన్నెన్నో కథలు బయటపడుతున్నాయి. పాతవి రుజువవుతున్నాయి.

అయినా ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరు.

‘అవన్నీ నిజమే కావొచ్చు, అయితే ఏం లెద్దూ, మనాడు కదా’, అనుకుంటారు, చాల మంది.

‘మనాడు’ అనుకోడంలోనే వుంది సకల శాస్త్రాల సారం. ట్రంపు లాభంలో సొంత లాభం చూసుకోడం లోనే వుంది అసలు కిటుకు. వాళ్ళే ఆయన ఆయువుపట్టు.

మొన్నమొన్నటి వరకు ఇండియా వంటి పేద దేశాల్లో రాజకీయుల అవినీతిని చూసి ‘అదే అమెరికాలో అయితేనా’ అనే వాళ్లు మన వాళ్లు. ఇండియా పత్రికలు ‘స్టేట్స్ మ్యాన్ షిఫ్’ కి, వ్యక్తిత్వ విలువలకు ఉదాహరణలుగా అమెరికా నేతలను చూపించే వారు. మన వాళ్లు ఉత్త వెధవాలోయ్ అని చప్పరించే వారు.

అదంతా నేతి బీర అని చాటి చెప్పాడు ఆ మధ్య బిల్ క్లింటన్. తన దగ్గరికి వచ్చిన ఆడపిల్లను ఎక్స్ప్లాయిట్ చేసి, ఆ కేసులో అబద్ధం మీద అబద్ధమాడాడు. కెన్ స్టార్ శోధన దాన్ని నిరూపించింది. అయితే ఏమయింది? అబద్ధాలకు గాను… కాంగ్రెస్ అభిశంసిస్తే సెనెట్ ఆదుకుంది. ఆయన ప్రెసిడెంటుగా, మాజీ ప్రెసిడెంటుగా సౌకర్యాలందుకుంటూనే వున్నాడు. అంతకు ముందు ఆండ్రూ జాన్సన్ కూడా అంతే.

ఇప్పుడు ట్రంపు మరీనూ. ఈయనకు అస్సలు ధోకా లేదు. ఈ నెల ఆరో తేదీ ఎన్నికల్లో డెమొక్రాట్ల ఓట్లు బాగా పెరిగినా ట్రంపుకు ఏమీ అవదు.

జరగరానివి ఎన్ని జరిగితేనేం, ట్రంపు అధ్యక్షుడయ్యాడు. ఇక ముందేమిటి? మాగ్జిమమ్ మాజీ అధ్యక్షుడవుతాడు. అది కూడా ఇప్పుడిప్పుడే కాదు. కాంగ్రెస్ అభిశంసిస్తే, దాన్ని సెనెట్ ఆమోదిస్తే. ఈలోగా ఈ టర్మ్ గడిచినా గడవొచ్చు. ఏవో రాజ్యాంగావకాశాల వల్ల… ట్రంపు మళ్లీ పోటీ చేసినా చెయ్యొచ్చు, మళ్లీ గెలిచినా గెలవొచ్చు.

హిల్లరీ తో ఎన్నికల డిబేట్ లో ‘న్యాస్టీ వుమన్’ వంటి మాటలతో మగదురహంకారాన్ని అలంకారంగా ధరించాడు ట్రంపు. ఫెమినిస్టులు పింక్ కలర్ టోపీలు ధరించి నిరసన ప్రదర్శించారు. టోపీలు పాతబడ్డాయి. అతడినేమీ చేయలేకపోయాయి. జనం లోని మగదురహంకార భావాలు, శ్వేతజాత్యహంకార భావాలు కలగలిసిపోయి ట్రంపు ఓట్ల సంఖ్యను మరింత పెంచాయేమో కూడా.

నైతిక సత్యమెవడికి కావాలి?

హిల్లరీ మీద రష్యన్ ఇ మెయిళ్ళ అనుమానం రగిలించి, తన విజయానికి కట్టుకున్న అక్రమ సోపానాలకు గాను మరెవరో ఆంతరంగికులు జైలు పాలు అయ్యుండొచ్చు, ట్రంపుకేమీ కాలేదు. ఏమీ కాదు. అతడు విజేత.

రాజకీయ సత్యమెవడిక్కావాలి?

ఇలా సత్యం, విజయం… విలోమ పథాలలో నడవడానికి కారణమేమిటి?

విజేత కొందరి కొన్ని ‘సౌకర్యాల’కు ప్రాత్రినిధ్యం వహిస్తాడు. ఆ సౌకర్యాలు పాతవీ, కొత్తవీ. పలువురు తెల్లవాళ్ళ మనసుల్లో, మన వాళ్ళ మానస కాంతారాల్లో దాగిన ‘వర్ణ’ (రంగు, కులం) ఔన్నత్య వైఖరులకు, పెట్టుబడి ‘లాభాల’ మీద పన్నులు తగ్గించే వైఖరులకు, అబద్ధమైనా సుబద్ధమైనా దోచుకో, దాచుకో విచ్చలవిడిగా జీవించు అనే వైఖరులకు, పర్యావరణం పాడుబగ్గమైనా లాభం ముఖ్యం అనుకునే వైఖరులకు… నేటి విజేత ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆ పని చేసినంత వరకు అతడు  ‘మన వాడు’. అతడి పదవీ గౌరవం ఏ కాస్త తగ్గినా మన ప్రివిలేజేస్ కు ప్రమాదం.

ఎవడిక్కావాలి సత్యం? ఎవరిక్కావాలి నీతి?

కావలసింది… తర తరాలుగా తమకు అప్పనంగా దొరికిన సౌకర్యాలు మరి కొన్ని తరాల దాకా కొనసాగడం మాత్రమే. దానికి గండి కొట్టేది ఏదయినా నేరమే.

అది సాహిత్యమైనా, రాజకీయమైనా, వాణిజ్యమైనా ఇంతే..

నేటి జీవన వైఖరులను, అభిప్రాయ ప్రకటనలను నిర్ణయిస్తోంది ఈ నేలబారు కారణాలే. ఈ సౌకర్యాలే.  సొంత లాభం కొంత కూడా మానుకోలేనితనమే.

ఇప్పుడు, లోకం బాగుండాలంటే మనం చర్చించాల్సింది కూడా ఈ నేలబారు కారణాలనే. వీటిని తొలగించే ఉపాయాలనే.

నేల మీది దోషాలకు నేల మీదే మొదలవ్వాలి దిద్దుబాటు చర్యలన్నీ.  

సత్యం కోసం సొంత సౌకర్యాల్ని ఖాతరు చేయని మంచి వాళ్ళు మన మధ్యన చాల మంది వున్నారు.

వారి కోసమె ఈ వీర గంధము.

ఆ మంచి వాళ్లు మాత్రం ఏం చేస్తారు?

ఔను, డొనాల్డ్ జోసెఫ్ ట్రంపు అంటే ఇదే. ఇదే సత్యం. అయితే, ఏం చేస్తారు?

నరేంద్ర మోడీ ఏనాడూ చాయ్ వాలా కాదు, అది మార్ఫ్ చేసి ప్రచారం చేసిన బొమ్మ, అయితే ఏం చేస్తారు?

గుజరాత్ పేద ముస్లింల మీద దాడులు జరిగాయి, వాటితో అమిత్ షా తదితరుల ప్రమేయం వుందని రాణా ఆయూబ్ ప్రాణాలకు తెగించి మరీ నిరూపించారు.

ఛెళ్, అవన్నీ మాకు తెలుసు. అయితే ఏం చేస్తారు?

టెర్రరిస్టులంటే ఒక మతస్తులు కాదు. ‘పరివారం’ మనుషులూ అందులో వున్నారు. గౌరీ లంకేష్ మరణం అలాంటి వాళ్ళ పనే.

తెలుసు. అయితే ఏం చేస్తారు?

అన్ని సత్యాలూ అందరికీ తెలుసు. అయితే ఏం చేస్తారు?

అసలు సమస్య సత్యం ఏమిటో తెలుసుకోడం కాదు.

తెలుసుకుని ఏం చేస్తారు అని అడుగుతోంది అసత్యం.

తెలిసిన సత్యంతో కాస్త గంజి కాచుకుంటారా? తెలిసిన సత్యంతో హోమ్లెస్ జనాలు చలి కాచుకుంటారా?

ఎన్నికల వేళ ట్రంపు మాజీ ప్రియురాళ్ళ నోళ్లు మూయించడానికి ఆయన దర్శకత్వం లోనే ఆయన ‘న్యాయవాది’ మైఖేల్ కోహెన్  పెద్ద పెద్ద మొత్తాలు ముట్టజెప్పాడు. అది ‘అట’ కాదు. నిజం. ఆ లాయరు గారే… తనకు తక్కువ శిక్ష పడేలా న్యాయవ్యవస్థతో ఒప్పందం  చేసుకుని.. ‘నేరం’ అంగీకరించడానికి అంగీకరించాడు.

అంతే కాదు. ట్రంపు కోసం పని చేసిన మరి కొందరు… ఇప్పటికే శిక్షలు పడినవారుగానో, పడనున్న వారుగానో మన కళ్ళ ముందు సాక్ష్యాలుగా వున్నారు.

మైఖేల్ కోహెన్ కు ముట్టాల్సినవన్నీ ముట్టి వుంటాయి. అసలీ ఒప్పికోలు మరేదో నాటకంలో భాగం కాదని అనుకోలేం. లాయరు ఒప్పుకున్న సత్యం లాయరుకు ‘సంబంధించినది’ కాదు. ఆ ప్రియురాళ్లు ఆయన ప్రియురాళ్ళు కాదు. వాళ్ళ నోటి మూతతో లాభపడింది….  అమెరికా అధ్యక్ష పీఠమెక్కింది తను కాదు.

లాయరుకు… ఎన్నికల ప్రచార నిధుల నుంచి ఆ డబ్బు సమకూర్చి, ఆ డబ్బును ఎలా వుపయోగించాలో ‘దర్శకత్వం వహించిన’ ట్రంపు తన నేరం అంగీకరించ లేదు.

అంగీకరించ లేదు కనుక ట్రంపు అధ్యక్షుడిగానే వుంటారు.

ఉంటే ఏం?

ఉండి ఏమైనా చెయ్యొచ్చు. ఇప్పటికీ మాట వినని ఉత్తర కొరియా ను దుంపనాశనం చెయ్యొచ్చు. లేదా, అలాంటివి ఇంకేవేవో ఇంకెన్నెన్నో చెయ్యొచ్చు.

అంతటి అవకాశం అతడికి ఇప్పటికీ వుంది. బహుశా ఉంటుంది.

అతడిని అభిశంసించి ఇంటికి… కనీసం ఇంటికైనా… పంపాల్సిన కాంగ్రెస్ ఏమీ చేయలేదు.

దొరికితే దొంగలు అన్నారు. అది గతం. ఇప్పుడు దొరికినా దొంగలు కారు. దొంగలను దొంగలని మీరూ నేనూ అంటే చాలదు. వాళ్ళు నిజంగా దొంగలని రుజువైనా చాలదు. ట్రంపు యవ్వారంలో రాబర్ట్ ముల్లర్ విచారణ పూర్తయ్యి, నిజాలను కోర్టు శంకులో పోసి తీర్థం చేయడానికి… ఇంకా చాల తతంగం వుంది. తతంగం పూర్తయ్యి నేరాన్ని నేరమని చెప్పినా ప్రెసిడెంటు గారిని శిక్షించడానికి ఆయనకున్న ప్రివిలేజెస్ ఒప్పుకోకపోవచ్చు. ప్రెసిడెంటుకే కాదు, మాజీ ప్రెసిడెంటుకు కూడా అలాంటి రక్షణ కవచాలేవో వుంటాయి.

కనుక, ఎలా గడిస్తావో ఏమో గాని… బిలియన్లు జిలియన్లు గడించు.

ఏమీ సిగ్గు పడకు. లోకాన్ని ఎక్కి తొక్కి గడించు.

పన్నులు కట్టకు. అదేమంటే, నా తెలివి తేటలతో నేను తప్పించుకున్నాను, నేనెంత జీనియస్ నో చూడు అని వెక్కిరించు. నిన్ను వారెవ్వా అనే వాళ్ళే ఎక్కువ.

సరిగ్గా ఎన్నికలప్పుడు ప్రత్యర్థి మీద  అనుమానాలు కలిగేలా అంతర్జాలంలో, సోషల్ మీడియాలో కల్లోలం సృష్టించు. అవన్నీ తరువాత విచారణకు  వస్తాయా? రానీ! ఎవడిక్కేర్. అప్పటికే మనం విజేతలం అయ్యుంటాం. విజేత చెప్పిందే వేదం. విజేత చెప్పినోడే దేవుడు. విజేత ఎవడిని వేలెత్తి చూపితే వాడు దుర్మార్గుడు. కొన్ని మైనర్ బలులు అవసరమైతే కావొచ్చు.

ఇప్పుడు ఆనాటి ఇరాక్ లేదు. ఇరాక్ లో వెలిగిన ఒక దివ్వె లేదు. అది వురి తీయబడింది. ఇరాక్ వినాశానికీ, సద్దాం హుస్సేన్ ఓటమికీ కారణమైన ఒక యుద్ధానికి చెప్పిన సాకు… అక్కడ రసాయనిక మారణాయుధా లున్నాయనే మాట.. అబద్ధమని అప్పటికే తెలుసు. యుద్ధానంతరం అది రుజువయ్యింది. ఎవడిక్కావాలి నిజం. ఉరి ఆగలేదు. బుస్సుమని పాము కాటేయడం ఆగలేదు.   

బహుశా, ఇవాళ జరగాల్సింది ఈ రకం సత్యాసత్యాల మీమాంస కాదు.

మనం ఆగిపోవలసింది ఈ నిరాశ వద్ద కాదు.

దీన్ని వున్నదున్నట్లుంచి ఎన్ని మెరుగులు దిద్దినా వేస్ట్.

అవన్నీ వున్న వంకరలను కాసేపు దాచడానికే. అన్నీ శవాలంకరణలే.

దీన్ని పూర్తిగా మార్చుకోవాలి.

ఎలా మార్చుకుంటాం? కేవలం ఎన్నికలతోనా? కేవలం  తూటాలతోనా? ఎన్నికలు తూటాల మధ్య చూడ్డానికి ర్యాడికల్ వత్యాసం కనిపించినా… ఆ రెండూ…  పార్టీల రాజ్యాధికార సాధనాలే. రాజకీయాధికారమైనా ఎందుకు? దాన్ని ఏ దిశగా వుపయోగించాలి? అది అందే దాక ఆగడమెందుకు?

ఉన్న ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వొచ్చినా ఏమీ జరగదు. ర్యాడికల్ గా కొత్తదైన ప్రభుత్వం వొచ్చినా అంతే. ఉన్న ఆస్తిపాస్తులన్నీ ప్రభుత్వపరమయినా ఏమీ ఒరగదు. సోవియట్ రష్యాలో చూడలేదూ?!

మార్పు మొదలవ్వాల్సింది మార్కెట్ వ్యవస్థలో కూడా కాదు. ఇండివిజువలిస్టు నిర్ణయాలకు బదులు ప్రణాళికా బద్ద మార్కెట్ వ్యవస్థ వొచ్చినా మార్పు రాదు. అది కూడా రష్యాలో చూశాం, చైనాలో చూస్తున్నాం. ఇందిర హయాం వరకు ఇండియా లో కూడా చూశాం.

ఉత్పత్తి క్రమంలోనే మార్పు రావాలి.

కార్మికులు సృష్టించే ‘అదనపు విలువ’ ఎలా ఖర్చు కావాలో కార్మికులే నిర్ణయించే వ్యవస్థ వినా మార్గం లేదు.

కార్మికుల తరుఫున కార్మిక పక్ష రాజకీయ నాయకులు నిర్ణయించే వ్యవస్థ కాదు. నిక్కమైన కార్మికుల సహాకార సంఘాలు. ఆంటోనియో గ్రాంసీ కలలు గన్న వర్కర్స్ కౌన్సిళ్ళు. వర్కర్స్ కో ఆపరేటివ్స్.

మేనేజర్లు కార్మికులను నియమించడం కాదు. వర్కర్లు మేనేజర్లను  నియమించాలి. అది సాధ్యం, అదే సహజం.

తన నెల జీతం రోజుకు 10,000 డాలర్లకు మించుతున్నా, కార్మికుల గరిష్ట వేతనాన్ని 15 డాలర్లుగా  నిర్ణయించే సిఈవో లు లేని వ్యవస్ట దీనికి జవాబు. దాన్ని కార్మికులు కాకుండా మరెవరూ తయారు చేయలేరు. ‘అదనపు విలువ’ ఎలా ఖర్చు కావాలో కార్మికులు నిర్ణయిస్తే తప్ప ఈ లోకం మారదు.

రోజుకు వేల లక్షల డాలర్ల ‘లాభా’లు… రహస్య ప్రదేశాల్లో దాక్కుంటున్న బిలియన్లు… ఎవరి అబ్బ సొమ్ము కాదు. అది కార్మికులు సృష్టించే అదనపు విలువే. అది కార్మికులదే.

కాని; నరేంద్ర మోడీలను, డొనాల్డ్ ట్రంపులను సృష్టించేది కూడా ఇలా కొద్ది మంది చేతిలో లాభాలుగా జమ గూడిన అదనపు విలువే.

మోడీలను, ట్రంపులను, అంబానీలను…  ఓడించాల్సింది కేవలం రాజకీయంలో, లేదా కేవలం మార్కెట్లో కాదు. ‘ఉత్పత్తి’ ఎక్కడ జరుగుతున్నదో అక్కడే వాళ్ళను ఓడించాలి. అదనపు విలువ ఎక్కడ తయారవుతున్నదో అక్కడే, ఉత్పత్తి క్రమంలోనే ఓడించాలి.

అసత్యం విష వృక్షాన్ని కూల్చాల్సింది ఆకుల్లో కొమ్మల్లో కాదు. వేర్లతోనే కూల్చాలి.

అనుక్షణం రూపు మారే బహురూపుల రాజకీయం సంగతి సరే,

మనందరి దైనందిన జీవితంలో భాగమైన వస్తు- సేవా-ఉత్పత్తి దగ్గరే మార్పును మొదెలెట్టలేమా… అందరొక్కటై… !

ఆఫీసులో బాసిజం గురించి తెగ గింజుకోడమెందుకు, దాని మూలం

బాసుల అధీనంలో వుంటున్న అదనపు విలువ అయినప్పుడు,

కార్మికుల అజమాయీషీలో లేని అదనపు విలువ అయినప్పుడు?

….

కార్మికులంటే ఎవరో కాదు. మనమే, వేతనాల కోసం పని చేసే ప్రతి ఒక్కరమే.

….

అలాంటి కార్మిక సహకార సంఘాలు ఇప్పటికే పని చేస్తున్నాయి. వాటిని తెలుసుకోవాలి.

వాటికి చెప్పాలి జిందాబాద్, అవెంత చిన్నవైనా, పెద్దవైనా… ఇప్పుడిప్పుడే ఆకారం ధరిస్తున్న ఆలోచనలైనా!

30-8-2018

హెచ్చార్కె

12 comments

 • అన్నా,

  మీ అక్షరాలు గొంతెత్తి గర్జిస్తున్నాయి
  పదాలు తూటాలై పేలుతున్నాయి

  ఉత్తమ సమాజ కాంక్షకై కలల కువ్వ పోసినట్లు

  వారెవ్వా…ఎంత అద్భుతంగా ఉంది!

 • You are making me hang to the cliff of hope with your editorials which are so realistic and reassurig. This one came at a time when I was feeling angry and terribly helpless in wake of the recent crack down on dissent in India. Thank you HRK , for the new oxygen . – Devipriya

  • దేవి, మీ మాటలు చాల ఆత్మవిశ్వాసాన్నిస్తాయి. వియ్ షల్ ఓవర్ కం అనిపిస్తాయి. థాంక్యూ.

 • మీ ఎడిటోరియల్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అభినందనలు.

 • జిందాబాద్ జిందాబాద్. ప్రతి పదానికీ, అవి చేతులు కలిపే వాక్యాలకి. వేగానికి, వేడికి జిందాబాదో జిందాబాద్.

  ఇంత ఒరిజినాలిటీ ఉంటే ఎట్టా ? ఏంచేసుకోను ? కాస్తంత నాజూకుతనమొద్దా ? కూస్తంత పిసుకుడుండవద్దా ? ఇలా మొహాన చెప్పేస్తే సరిపోద్దా ? బహురూపుల రాజకీయ రెస్టారెంట్లలో జంక్ ఫుడ్ తిని ఇళ్ళల్లో వెస్ట్రన్ స్టయిల్లో అరుగుతుంటాం.

  ఈ ఏర్పాటు బాగుంది. డిస్టర్బ్ చేస్తే ఊరుకోము. ఇండియాలో నైనా, అమేరికాలోనైనా, రస్తాలో నైనా, ఏ చౌరస్తాలో నైనా — అంతే.

  • కలిసి నడుద్దాం, శ్రీరామ్, తప్పొప్పుల నిప్పుల మీదుగానే.

 • బావుంది.’తులనాత్మక’ సత్యం.

  • థాంక్స్ రవి, ఇది మనల్ని మనం దిద్దుకుని, ముందుకెళ్ళాల్సిన సమయం. కలిసి నడుద్దాం.

 • మీ ఆలోచన అక్షర సత్యం సార్. రూట్ లో యుద్దం అనివార్యం.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.