ఆ టెడ్డీ బేర్ వెల యాభై కోట్లు…!

నాకు దొరికిన ఒకానొక అరుదైన అవకాశం  ఒకే నెలలో ప్రపంచం లోని అత్యంత పేద దేశాన్ని ప్రపంచం లోని అత్యంత ధనిక దేశాన్ని చూడటం . అందులో  జి డి పి ఆధారంగా ప్రపంచం లో అత్యంత ధనిక దేశం ఖతార్ అయితే సబ్ సహారా ప్రాంతం లోని కాంగో అత్యంత పేద దేశం.

ఖతార్ ఎంత  ధనవంతమైన దేశమో చెప్పడానికి ఉదాహరణ మనకు ఆ విమానాశ్రయం లో అడుగుపెట్టగానే కనిపించే టెడ్డీ బేర్ ధర తెలిస్తే చాలు. పూర్తిగా అలంకరణ కోసం ఉంచిన  ఆ టెడ్డీ బేర్ ను వారు అక్షరాలా యాభయ్ కోట్ల రూపాయలకు కొన్నారు. అంతే కాదు అక్కడి పాలకులు కోసం ప్రత్యేక విమానాలే కాదు విమానాశ్రయాలు, రోడ్లు ప్రత్యేకంగా ఉంటాయి.

ఖతార్  , సౌదీ అరేబియా ,కువైట్ ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  మన దేశం లోని చదువుకొన్న వారికంటే చదువురాని వారికి ఎక్కువగా పరిచయమున్న దేశాలు. అలాగని చదువురాకపోతే అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయని కాదు చదువుకొన్న వారికి సరిపడా ఉద్యోగాలిచ్చేటంతగా  అక్కడ పారిశ్రామికీకరణ జరగక పోవడమే . అంతులేని భూగర్భ పెట్రో సంపద వారిని చాలా మేరకు విలాస పురుషులుగా, సోమరిపోతులగా మార్చింది. వారిని పాలించే రాజ కుటుంబాలు మాత్రం అగ్ర రాజ్యాలు చెప్పినట్లు ఆడుతూ ప్రజా వ్యతిరేకతను  దాచ గలుగుతున్నారు. అలాగని వారు ఆఫ్రికా లోలా సాధారణ ప్రజలను తీవ్రమైన పేదరికం లో పడవేయకుండా అత్యంత గారాబం చేశారు . ఒక దశాబ్ద కాలంగా ఖతార్ లో ఉంటున్న నాకు తెలిసిన ఒక పాకిస్తాన్ మిత్రుడు వీళ్ళను “blessed children of the god ” అంటాడు. మనదేశం తో పాటు బాంగ్లాదేశ్, పాకిస్తాన్ , ఫిలిఫ్ఫిన్స్ లాంటి ఇతర దేశాల నుంచి వచ్చిన చాలా మంది చదువురాని వారు అక్కడి వారి ఇళ్లలో పనిమనుషులు గా జీవనాన్ని కొనసాగిస్తున్నారు . ప్రభుత్వ  అకౌంట్స్ , ఫైనాన్స్ డిపార్టుమెంటు సంబంధిత ఉద్యోగాలలో ఈజిప్టియన్స్ ,టర్కిష్ వాళ్ళు ఎక్కువగా వున్నారు. ఆశ్చర్యంగా ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన చైనా నుంచి ఉద్యోగార్థం వచ్చే చైనీయులు దాదాపుగా లేరని చెప్పవచ్చు. చైనా నుంచి వేలాది మంది వ్యాపార నిమిత్తం అక్కడకు వచ్చి తమ దేశం నుంచి చవక వస్తువులను స్టోర్స్ లో అమ్ముతూ కనిపిస్తారు. ఖతార్ కాకుండా మధ్య తూర్పు లోని చాలా దేశాలలో అక్కడి ప్రభుత్వాలు “డ్రాగన్ మాల్స్ ” పేరుతొ చైనా నుంచి వస్తున్న వస్తువుల కోసం ప్రత్యేక ప్రాంతాలనే నిర్మించాయి.

ముమ్మట్టి కొడుకు డాల్కర్ సల్మాన్ ప్రచార ప్రకటన.

ఏ దేశంలోనైనా  విదేశస్తులు ఆ దేశ జనాభాలో జీరో నుంచి ఇరవై నుంచి ముప్పయి శాతం ఉండటం చూస్తుంటాము కానీ ఖతార్ జనాభా లో ఆ దేశస్తులు మూడు లక్షల ఉంటే అక్కడ పనిచేయడానికి వచ్చిన విదేశీ కార్మికులు  దాదాపుగా ఇరవై లక్షల మంది. ఇది నిజం. ఆ దేశ జనాభా కంటే అక్కడ పనిచేసే విదేశీ కార్మికులు ఎక్కువ. ప్రతి వీధి లోను మనకు భారతీయులు/పాకిస్తానీలు /అఫ్గానీయులు కనిపిస్తారు. ఇటీవలి కాలం లో కొన్ని రాజకీయ కారణాల వలన భారతదేశం తో పాటు చాలా దేశాల వారికి  ముందస్తు అనుమతి లేకుండా రావడంతోటే వీసా ఇచ్చే సదుపాయ కల్పించడం తో వేలాది భారతీయులు అక్కడ వాలిపోతున్నారు. వుద్యోగం కోసం అక్కడి దిన పత్రికలలో తమ అర్హతలతో ప్రకటనలు ఇస్తున్న వారి సంఖ్య వందలరెట్లు పెరిగిందని మాకు తెలిసిన ఓ తెలుగు వ్యక్తి చెప్పు కొచ్చాడు. భారతీయులలో మలయాళీలు మొదటి స్థానంలో ఉంటే  రెండో స్థానం లో మిగతా అన్ని రాష్ట్రాల వారు వున్నారు. మలయాళీల ప్రభావం ఎంత ఎక్కువగా ఉందంటే చాలా దుకాణాల ముందు ప్రకటనలలో మళయాలం సూపర్ స్టార్ ముమ్మట్టి వి అతని కొడుకు వే ఉంటాయి.

వెనుక కనిపిస్తున్నది రాజు మరియు వారి బంధువర్గం నివసించే ప్రాంతం.

ఖతార్ మతపరమైన దేశమైనా   అరేబియా, కువైట్ లాంటి ఇతర మధ్య తూర్పు దేశాలతో పోల్చితే కాస్తంత స్వేచ్ఛ, కాస్త  మెరుగు. నేను అక్కడ ఒక వ్యక్తి ని ఇదే విషయం అడిగితే దానికి కారణం ఇటీవలే తండ్రిని రాజరికం నుంచి తప్పించి అధికారానికి   కొడుకు రావడం అతని బాల్యమంతా యూరోప్ లో గడపటం దానికి తోడు అతని తల్లి కి ఆధునిక భావాలుండటం వుండటమేని చెప్పుకొచ్చాడు. అక్కడ దాదాపుగా అన్ని మంత్రి పదవులను రాజు గారి  వంశంలోని వారే నిర్వహిస్తుంటారు అందుకే వారి కార్యాలయాలు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కంటే ఖరీదయిన భవనాలుగా ఉంటాయి. కొన్ని నెలల క్రితం టెర్రరిజం కు మద్దతు ఇస్తున్నారనే నెపం తో సౌదీ అరేబియా , దుబాయ్ తదితర దేశాలు ఖతార్ మీద ఆంక్షలు  విధించడం వలన చాలా కాలం పాటు వారి ఆర్థిక పరిస్థితులు తలక్రిందులయ్యాయి . ప్రపంచం లో రెండవ అతిపెద్ద గ్యాస్ నిక్షేపాలు వున్నప్పటికీ తమ దైనందిక అవసరాలైన పాలు , కూరగాయలు లాంటివి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , సౌదీ అరేబియా నుంచి రావాలి. అందువల్ల వారు కొన్ని రోజుల పాటు చాలా కష్టాలు పడాల్సివచ్చింది . ఆర్ధిక ధిగ్బంధనానికి జంకకుండా ఖతార్ ఆస్ట్రేలియా నుంచి వారం రోజులలో నాలుగు వేలు  పాడి ఆవులను విమానాలలో తెప్పించి సమస్యను అధిగమించింది. దానికి తోడు దేశం ఉత్తర ప్రాంతం లో వ్యవసాయానికి కొంచం అనువుగా వున్న భూములను సాగులోకి తెచ్చి కూరగాయల కొరత నుంచి కూడా బయటపడింది. ప్రస్తుతం వారి గురంతా 2022 లో నిర్వహించాల్సిన FIFA వరల్డ్ ఫుట్ బాల్ నిర్వహణ మీదే వుంది. అదే జరిగితే మిగతా ఇస్లామిక్ దేశాలకంటే అన్ని రకాలుగా ముందుకెళుతుంది. కొందరిని విచారిస్తే మిగతా ఇస్లమిక్ దేశాలు ఖతార్ మీద అసూయతోనే టెర్రరిజం పేరు తో ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నారని చెప్పారు.

ఖతార్ మనకు ఖచ్చితంగా నచ్చేది చివరకు యూరోప్ , అమెరికా ,దుబాయ్ లలో లేని సదుపాయం  పార్కింగ్ రుసుము . ఆ దేశం లో మనకు పార్కింగ్ సమస్య కాదు. ఎక్కడా రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేకపోవడం. ఖతార్ కు వచ్చిన ప్రతివారు చూడవలసిన  ప్రదేశాలలో ముఖ్యమైనది “ఇస్లామిక్ మ్యూజియం”. ఈ మూడంతస్తుల వైభవోపేత భవనం చూడటానికి అక్కడి ప్రభుత్వం మనకు పూర్తిగా ఉచిత ప్రవేశం కల్పిస్తుంది. రోజుకు వేలాదిమంది వస్తున్నా అందరికి పార్కింగ్ తో పాటు ఉచిత ప్రవేశం కూడా వుంది. దానికి తోడు విదేశీ కార్మికుల కోసం తక్కువధరలో రొట్టెల లను అందుబాటు లో  ఉంచడం. మిగతా గల్ఫ్ దేశాలతో పోల్చితే ఇక్కడ భారతదేశం నుంచి వస్తున్నవారిని గౌరవంగా చూస్తారు. సౌదీ అరేబియా లో అయితే ఏర్ పోర్ట్ లో దిగిన దగ్గర్నుంచి అవమానకరంగా చూస్తారని, ఖతార్ లో పరిస్థితి కొంత మెరుగని చాలా మంది చెప్పారు.

ఖతార్ చూడాలను కొన్నవారికి ఇది అనువైన సమయం.  మారిన రాజకీయపరిస్థితుల మూలంగా ఖతార్ వెళ్లదలుచుకొన్న వారికి ఇటు ముందస్తు వీసా కానీ వీసా రుసుము కానీ లేకుండానే ఆ దేశం లోకి  మనం వెళ్ళవచ్చు. పాస్ పోర్టు ఉంటే చాలు, విమాన ప్రయాణానికి అయ్యే మొత్తం కూడా చాలా తక్కువ హైదరాబాద్ నుంచి బడ్జెట్లో indigo, spice jet వున్నాయి  (పోను రాను కలిపి పదిహేను వేలు మించి ఉండదు) దానికి తోడు మనకు భారతీయ భోజనం (ఎక్కువగా మలయాళీ హోటల్స్) కూడా మనం కోరుకొన్న బడ్జెట్ లో దొరుకుతుంది.  రెండు వేల రూపాయల లోపు లో నగరం నడిబొడ్డు లో హోటల్ రూమ్ కూడా లభిస్తుంది. చూడదగ్గ ప్రదేశాలలో desert safari ది మొదటి స్థానం. మనకు అతి అరుదుగానే అక్కడ రాజ కుటుంబం వారు కానీ ఆ దేశ ప్రజలు గాని కనిపిస్తారు, ఆ దేశ రాజధాని దోహా లో తిరుగుతుంటే మనదేశం లోనో లేదా పాకిస్తాన్ లోనో తిరుగుతున్నట్లుంటుంది.

ఖతార్ లో ఎక్కడ చూసినా రాజు గారి ఫొటోలే

జియెల్ నర్సింహా రెడ్డి

తన గురించి తానే  జియెల్ నర్సింహా రెడ్డి: ఆరేళ్ల క్రితం మేము ( నేను, నా భార్య లక్ష్మి ) తక్కువలో తక్కువ గా ప్రపంచం మొత్తంగా చూడటానికి ఎంత ఖర్చువుతుందో బేరీజు వేశాం. ఐదు లక్షలయితే అమెరికా ఖండం తో సహా  యాభయ్ దేశాలను చూడవచ్చని భావించాం. మొదట సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ లతో మొదలైంది మా ప్రయాణం. ఖర్చు మేమనుకున్నంత కన్న చాలా తక్కువే అయ్యింది. ఇప్పటికి మేము ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలో ఇరవై పైగా దేశాలు చూశాం. ఇంకా చూస్తాం. ఈ ప్రయాణాల కథ అందరూ వింటానికి బాగుంటుందని ... మా యాత్రానందాన్ని మీతో పంచుకుంటున్నాం.

1 comment

  • ఇది నిజమైన యాత్రాసాహిత్యం అంటే ! నరసింహారెడ్డిగారికి అభినందనలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.