నేటి భారతంలో ముస్లింల కష్టం: ‘ముల్క్’

ముల్క్ అంటే దేశం, ముల్క్ కీ మజహబ్ (మతం) కీ మధ్య ఎంచుకోవాల్సి వచ్చినపుడు ముల్క్ నే ఎంచుకున్నారు భారతదేశపు అసంఖ్యాక ముస్లింలు దేశవిభజన సమయంలో. అదే వారు చేసిన తప్పిదమా అన్నట్టు పరిస్థితులు కన్పిస్తుంటాయి గొడవలు జరిగే ప్రతిసారీ. నేటి పరిస్థితిలోనైతే ప్రతి రోజూ ప్రతిచోటా!

ఈ సంగతిని పట్టించుకున్న ప్రగతిశీల దర్శకులు చాలా కొద్దిమందే వున్నారు.

1973. దర్శకుడు ఎం. ఎస్. సత్తూ తీసిన సినిమా పేరు ‘గరం హవా’. అంటే వేడి గాలి. ప్రధాన పాత్రధారి బలరాజ్ సహానీ. కాన్పూర్లో చిన్న చెప్పుల ఫ్యాక్టరీ యజమాని. మతకలహాల ఉద్రిక్త వాతావరణం తలెత్తే ప్రతిసారీ ‘మీరెందుకు పాకిస్తాన్ వెళిపోలేదు’ అనే వింత ప్రశ్న ఎదుర్కొంటుంటాడు. ఐడెంటిటీ క్రైసిస్ కు గురై చివరికి పాకిస్తానుకు వెళిపోవడానికే  నిర్ణయించుకుంటాడు. కానీ, సినిమా ఆఖర్లోని ఆ మరపురాని దృశ్యంలో పాకిస్తానుకై బయలుదేరిన వ్యక్తి తన నిర్ణయం మార్చుకుని తన పెద్ద కుమారుడితో పాటు కమ్యూనిస్టు ఉద్యమ ర్యాలీలో అంతర్భాగమై తన ఉనికికి అర్థం వెతుక్కుంటాడు.

కట్ చేస్తే 1995. సినిమా పేరు ‘నసీం’. పేరుకి అర్ధం ‘(ఉదయాన్నే వీచే) చల్లని గాలి’. దర్శకుడు సయీద్ అఖ్తర్ మీర్జా. ముఖ్య పాత్రధారి కవి కైఫీ అజ్మీ. బాబ్రీ విధ్వంసానికి ఆర్నెళ్ళ ముందు మొదలైన కథ 1992 డిశెంబర్  ఆరవ తేదీతో ముగుస్తుంది. స్వాతంత్ర్య పోరాట కాలం నాటి మతసామరస్యానికి ప్రతీకలాంటి తాతగారి ఆరోగ్యంతో పాటే దేశంలోని ఉమ్మడి వాతావరణం కూడా క్రమేణా క్షీణిస్తుంది – అద్వానీ, వాజపేయిల రెచ్చగొట్టుడు ఉపన్యాసాల వల్ల, కరసేవకుల ఆగడాల వల్ల. హిందూ-ముస్లిం సఖ్యతపై  గొడ్డలిపెట్టుగా మసీదు కూల్చివేత, తాతగారి మరణం ఒకేసారి జరిగిపోతాయి. శవపేటిక అంతిమయాత్రకై బయలుదేరేటప్పుడు ‘తాతగారూ, ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పడానికి మంచి రోజునే ఎంచుకున్నారు’ అని అంటారు మతకలహాలను ఎదుర్కోడానికి సమాయత్తమవుతున్న ముస్లిం యువకులు.

పై రెండూ లో-బడ్జెట్ ఆర్ట్ హౌస్ సినిమాలైతే ఇటీవల కమర్షియల్ ఫార్మాట్లో వచ్చిన మంచి సినిమా ‘ముల్క్’. దర్శకుడు అనుభవ్ సిన్హా.  కథాకథనాల్ని ఇంకాస్త మెరుగుదిద్దే అవకాశం ఉందనిపించినా, కొన్ని చోట్ల సింప్లిస్టిక్ అయిందనిపించినా సరే ఇది ముమ్మాటికీ మంచి సినిమా.

కథ విషయానికొస్తే అది బెనారస్. దర్శకుడు తను చిన్నప్పటి నుండీ ఎరిగిన బెనారస్. గంగా-జమునా తెహజీబ్ కు నమూనా ఐన బెనారస్. టైటిల్స్ వేసేటప్పుడు గంగా హారతీ చూస్తాం. బ్యాక్ గ్రౌండ్ లోని పాట కూడా మతసామరస్య భావనకు అద్దం పడుతుంది. టైటిల్స్ తర్వాత మసీదులో ఆజాన్, కెమెరాను పాన్ చేయగా హిందువుల శవయాత్ర. ఆజాన్, ‘రామ్నాం సత్యహే’ల సమ్మిశ్రమం, హిందువుకు ‘రాం రాం’ చెప్పే ముస్లిం, ముస్లింకి ‘సలాం వాలేకుం’ చెప్పే హిందువులున్న వాడ అది. వెజిటేరియన్ చౌబే ముస్లిం పొరిగింటిలో సీక్రెట్ గా  కోర్మా, కబాబ్ లాగించేసే లోకాలిటిలో ఒక ముస్లిం కుటుంబం చుట్టూ అల్లుకున్న కథ ‘ముల్క్’. ఆ కుటుంబ పెద్ద మురాద్ అలీ మొహమ్మద్ (రిషీ కపూర్) ఒక రిటైరైన పేరున్న లాయర్. అలీ తమ్ముడు బిలాల్ (మనోజ్ పహ్వా). బిలాల్ సంపాదన కొంచెమే అయినా మనస్పర్థలు లేకుండా సాగుతున్న ఉమ్మడి కుటుంబమది. వారికి తెలియకుండానే బిలాల్ కొడుకు సాహిద్ (ప్రతీక్ బబ్బర్) జిహాద్ కి ప్రేరితుడై అలహాబాద్ వెళ్తున్న బస్సులో బాంబు పేల్చగా పదహారు మంది చనిపోతారు.  అతన్ని సజీవంగా పట్టుకునే అవకాశం వున్నప్పకీ దానిష్ జావేద్ (రజత్ కపూర్) అనే ఒక ముస్లిం ఎన్కౌంటర్ స్పెషలిస్టే కాల్చి చంపేస్తాడు. తీవ్రవాద చర్యని ఆమోదించని ఆ పరివారం ఆ శవాన్ని తీసుకోరు. కొడుకు తీవ్రవాద చర్యలో తండ్రి బిలాల్ భాగస్వామ్యాన్ని అనుమానించి అతడ్ని కస్టడీలోకి తీసుకుంటారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ పేరుతో వేధించగా హృద్రోగంతో బాధపడుతున్న బిలాల్ అనారోగ్యానికి గురై చనిపోతాడు. నిన్నటి వరకూ కలిసున్న ఇరుగుపొరుగు స్నేహితులే మత ప్రాతిపదికన ప్రవర్తిస్తారు. మంచి పేరున్న కుటుంబాన్ని  తీవ్రవాదుల ‘అడ్డా’గా నిరూపించాలనుకుంటాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (అశుతోష్ రాణా). తన ఇంటి గోడపై ‘పాకిస్తాన్ వెళ్ళిపొండ’న్న రాతలు ప్రత్యక్షం కాగా ఒక దశలో మనో స్థైర్యం కోల్పోయి, తన కోడలికే తన కుటుంబంపై పడ్డ మచ్చని తొలగించే బాధ్యత అప్పగిస్తాడు మురాద్ అలీ. మతాతీతంగా ప్రేమ వివాహం చేసుకున్న కోడలు ఆరతీ మొహమ్మద్ (తాప్సీ పన్నూ). చనిపోయిన బిలాల్తో పాటు తన అత్తగారి కుటుంబం నిర్దోషి అని నిరూపించడమే మిగాతా కథంతా. ముస్లింలపై మన సమాజంలో ఏర్పడిపోయిన లేదా మతవాదులు ఏర్పరచిన ప్రిజుడిస్ (అహేతుక పూర్వభావన) పైనే ఈ కేసు ఆధారపడిందని రుజువుచేస్తాడు దర్శకుడు.

      ముస్లింలపై ప్రజల్లో పేరుకున్న దురభిప్రాయాలన్నీ కోర్టురూమ్ పాత్రల్లో బహిర్గతమవుతాయి. అలీ ఇంటిని తీవ్రవాదుల అడ్డా అని సంభోదిస్తుంటాడు  ప్రాసిక్యూటర్. ముస్లింలకి చదువులు తక్కువ, భార్యలెక్కువ, పిల్లలెక్కువ కనుక ఒక పిల్లాడిని జిహాద్ కోసం అప్పగించేస్తారు అన్నది అతడి వాదన. అతడు విసిరే ఒక్కో వెకిలిమాటకీ గొల్లున నవ్వుతుంటారు కోర్టు గదిలోని చాలామంది జనాలు. అంటే వారూ ఆ ప్రిజుడీసులో వున్నారన్నమాట. అన్నయ్యపై ఆధారపడకుండా తన చికిత్సకై పాకిస్తాన్ బంధువుల నుండి బిలాల్ అప్పు తీసుకుంటే, అది తీవ్రవాదానికై అందిన పారతోషికంగా రుజువు చేయాలనుకుంటాడు  ప్రాసిక్యూటర్. బాబ్రీ విధ్వంసం సమయంలో జరిగిన మీటింగుకు మురాద్ హాజరవడం వెనుక మతసామరస్యాన్ని దెబ్బతీసే కుట్రను అన్వేషిస్తాడు. ఇలా ‘పూర్వభావన’పై నిర్ణయాలు జరిగినపుడు మైనారిటీ సముదాయమంతా సందేహ దృష్టినుండి తప్పించుకోలేదు. ‘డాడీ, ముస్లింలు తమ వాడల్లో పాకిస్తాన్ జెండా ఎందుకు ఎగరేస్తారు? అవసరమైతే, ఫోటోతీసి పంపిస్తాను’ అని దర్శకుడి కుమారుడు అతనికి అడిగాడట. ‘నాన్నా, అది పాకిస్తాన్ జెండా కాదు ఇస్లామిక్ జెండా’ – దర్శకుడి జవాబు. ‘అయితే ఇస్లామిక్ జెండాల్ని పాకిస్తాన్ జెండాల్లా ఎందుకు తయారుచేస్తారూ?’ – మళ్ళీ ప్రశ్న. ‘అది కాదు నాన్నా, పాకిస్తాన్ వాళ్ళే తమ జెండాని ఇస్లామిక్ జెండాలా తయారుచేసుకున్నారు, అర్థమైందా?’ – దర్శకుడి వివరణ. ఇస్లామోఫోబియాని  వ్యాప్తి చేస్తున్న ఈ తరుణంలో ప్రిజుడిస్ తన కుమారుడినీ వదల్లేదని చెప్పుకొచ్చాడు దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో. బెంగాల్ బస్సు వెనుక జెండాను పాకిస్తాన్ జెండాగా భ్రమించి గొడవ చేసిన హర్యానా హిందుత్వవాదుల కథనం గుర్తొస్తుంది మనకు. (ఆ మధ్య పేస్ బుక్ లో చూశాం కదా?)

        ఈ సినిమాలో దానిష్ జావేద్ పాత్ర చాలా ఇంటరెస్టింగా వుంటుంది. తన ముస్లిం సోదరులపై తనే ఒక తప్పుడు భావనతో వుంటాడతడు. ఇస్లామోఫోబియా ప్రచార ప్రభావంలో తనను తాను తన సముదాయం నుండి మానసికంగా వేరుచేసుకుని, కొంతమంది వల్ల ముస్లింలకు చెడ్డపేరు వస్తోందని, దొరికిన ముస్లిం యువకులని నిర్దాక్షిణ్యంగా కాల్చేసి, మిగతా యువకుల గుండెల్లో గుబులు పుట్టించి వారిని టెర్రరిజం నుండి కాపాడుతున్నాననే భ్రమలో వుంటాడతడు. అతడిది ప్రిజుడిసుతో కూడిన మరో ఐడెంటిటీ క్రైసిస్. ఈ సంగతిని  అతడు వొప్పుకునేలా చేస్తుంది ఆరతి కోర్ట్ వాదనలో. టెర్రరిజం నిర్వచనం చెప్పమంటుందతడికి. “The unlawful use of violence and intimidation, especially against civilians, in the pursuit of political and social aims” అన్న నిర్వచనంలో మతం ప్రస్తావన ఎక్కడుంది అని నిలదీస్తుంది. అస్పృస్యత టెర్రరిజం కదా? అమాయక ఆదివాసిలపై జరిగే అత్యాచారం టెర్రరిజం కదా? పెద్ద కులం వాళ్ళు చిన్న కులాలపై చేసే అధిపత్యం టెర్రరిజం కదా? అని సవాలుచేస్తుంది. హృదయ పరివర్తన జరిగిన అతడికి సినిమా ఆఖర్లో  ధోనీ జెర్సీతో గంతులేసుకుని వెళ్తున్న స్కల్ క్యాప్ (ముస్లిం) పిల్లాడు కన్పిస్తాడు.

నా దేశంలో నాకు స్వాగతం చెప్పే అధికారం మీ కెవరిచ్చారని ప్రాసిక్యూషన్ను ప్రశ్నిస్తాడు. ‘మీకు ఒసామాబిన్ లాడెన్ గడ్డం, నా గడ్డంలో తేడా కన్పించకపోతే అది నా తప్పెలా అవుతుంద’ని కోర్టును నిలదీస్తాడు మొరాద్ అలీ. “పెళ్లయిన కొత్తలో నా భార్య నన్నంటూ వుండేది, మీరు నన్ను ప్రేమిస్తున్నారా, అయితే నిరూపించండీ అని. ప్రేమను నిరూపించేదేలా? ప్రేమించే కదా? నా దేశభక్తిని నేనెలా నిరూపించాలి?” అన్నది మురాద్ అలీ ప్రశ్నయితే అసలు వోట్ల కోసం మతాన్ని వాడుకునే ముష్కరులముందు అసలెందుకు నిరూపించాలి అన్నది మనం ప్రశ్నించాలి. “దేశమనేది కాగితపు పటం మీద గీసిన గీతలతో ముక్కలవదు, అది మన మెదడులో మనసులో ముక్కలవుతుంది. రంగుతో, భాషతో, మతంతో, కులంతో ‘మనమూ’, ‘వారూ’ అనే భావనతో దేశం ముక్కలవుతుంది.” అని హెచ్చరిస్తుంది ఆరతి తన వాదనలో.

తీర్పు ఇచ్చిన జడ్జి కొన్ని ఆనణిముత్యాల్లాంటి విలువైన మాటలు చెబుతాడు –

“అబ్దుల్ కలాం, అబ్దుల్ హమీద్, బిస్మిల్లాఖాన్ ఎక్సెప్షన్ (అపవాదులు) మాత్రమే అని  వాట్సప్ లో చదివారా? న్యూస్, వాట్సప్ కోసం ఇచ్చే సమయం చరిత్ర అధ్యయనం కోసం వెచ్చిస్తే… ముస్లింలలో టెర్రరిస్టులు ఎంతమందో , దేశానికి పేరుతెచ్చిన వారెంతమందో తెలుస్తుంది. 1000 మంది ముస్లిం దేశభక్తుల పేర్లు యిట్టే చెప్పెయ్యగలను” అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు చీవాట్లు పెడతాడు. మసీదులో (రాజకీయ) ప్రసంగాలు, పార్లమెంటులో పూజలు అపించగలిగితే చాలా సంగతులు సర్దుకుంటాయి. ‘వారు చెడ్డవారు’, ‘మనం మంచివాళ్ళం’ అని రాజకీయ నాయకులెప్పుడన్నా అంటే వోట్లు దగ్గరలో వున్నాయేమోనని కేలెండర్ చూడండి అని తీర్పు వినడానికొచ్చిన ప్రజలనుద్దేశించి చెబుతాడు. మీ దేశభక్తిని శంకించే వారికి రాజ్యాంగంలోని పీఠిక కాపీని పంచిపెట్టండని మురాద్ అలీకి చెబుతాడు.

      ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న ఈవెంట్లో ఒక ప్రెస్ రిపోర్టర్ దర్శకుడితో – “ముస్లిం యువకులు ఎందుకు టెర్రరిజాన్ని ఆశ్రయిస్తున్నారు?” అని అడిగితే, ‘మీరు టీవీ చూస్తారా? పేపరు చదువుతారా? నిన్ననే మైనారిటీలను ఊచకోత కోసిన వారిని సన్మానించారు, దానిపై మీకు  ప్రశ్న ఎందుకు రాలేద”ని ఎదురు ప్రశ్న వేశాడు దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్ రిలీజైనప్పటినుండీ దర్శకుడినీ, తాప్సీనీ ట్రోల్ చేస్తున్నారు పాలకపక్ష ట్రోలర్లు. వారికి ఒక బహిరంగ లేఖలో ఘాటుగానే సమాధానమిచ్చాడు దర్శకుడు.

 

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

5 comments

  • మంచి రివ్యూ.
    సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడడమే కాదు, ప్రచారం చేయాలని మనవి. దర్శకుడికి దిల్ సే అలాయిబలాయి! పాత్రధారులు అందరూ చాలా బాగా చేశారు. డైలాగ్స్ మళ్లీ మళ్లీ ఆలోచింపజేయడమే కాకుండా ముస్లిం వ్యతిరేకులకు చెంపపెట్టుగా ఉన్నాయి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.