రాయలోరి తోటలో

చీకటి మంటల చిక్కటి మసితో
పొగచూరి పోయింది వెన్నెల
వంచన గాయాల నెత్తుటి ధారలు
గడ్డ కట్టి మట్టి కొట్టుకుపోతున్నాయి
పాతిపెట్టిన నమ్మకానికి నివాళులర్పిస్తూ…
చిన్నప్పుడు ఊయలలూపిన మర్రిమాను ఊడలు
ఊరితాళ్లు పేనుతున్నాయు
ఒకటే ఉక్కపోత…
ఎడారి బ్రతుకులో నిత్యం తోడున్న ఒంటరితనమా!
నిరాశ నిప్పుల సెగలకు గొంతెండిపోతోంది
రాలిపోయే ఎండుటాకులా
ఊపిరి ఊగిసలాడుతోంది
మృత్యు ఘంటిక మ్రోగుతోంది
నిద్ర ముంచుకొస్తోంది
తప్పేలా లేదు
కానీ నాకు మరణించాలని లేదు…
నా శ్వాస నాకే హోరుగాలిలా
వినిపించేంత నిశ్శబ్ధాన…
నిట్టూర్పొకటి
ఎగిసిపడిన లావాలా…
బీడువారిన భూముల్లో
మొలకెత్తిన రాతి కుప్పల్లా
నింగి నిండా నక్షత్రాలు…
ఇది ఒక నిరంతర అమవశ నిశి
నెర్రెలిచ్చిన నేల
పిడుచగట్టిన నాలుక
నాలుగు చుక్కలకై అర్రులు చాస్తోంది…
ముఖం చాటేయడం
ఈ వర్షానికి మామూలే..
తుప్పుపట్టిన రెయిన్ గన్లు
అవినీతి తుంపర్లు కురిపిస్తూనే వున్నాయ్…
రాయలోరి తోటలో
రానేరాని వానకు ఎండిన
రాతి పూల గంధాలు
ఆశగా పీల్చుకొని
బండల్లాగే అయినా బ్రతుకుతున్నాం
ఎన్ని రోజులీ ఎండిన రొట్టెలు
ఎంత కాలమీ నలిగిన బ్రతుకులు?

మామిళ్ళపల్లి కృష్ణ కిశోర్

మామిళ్లపల్లి కృష్ణ కిశోర్: వృత్తి రీత్యా భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగి. ప్రవృత్తి సాహిత్యం. కర్నూలు జిల్ల పారుమంచాల గ్రామంలో పుట్టిపెరిగారు. ప్రస్తుతం కర్నూలులో వుద్యోగం, నివాసం
ఫోన్: 9701868171

4 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.