ఎప్పటిలానే…

సాయంత్రానికి….
నిస్సత్తువను
క్యారియర్ బ్యాగులో మోసుకుంటూ
ఖాళీయైన టాటా గ్లూకోజ్ గ్లాసులా
ఇంటికొస్తాను

అప్పటి వరకు
చూపులను
ఇంటి గేటుకు అతికించుకున్న పిల్లలు
నాన్నా…అంటూ
నలిగిన చాక్లెట్ రేపర్లలా
చుట్టుకుంటారు

ఇంతకీ…వారి ప్రేమ
నా మీదా..లేక
నా జేబులోని
సెల్ ఫోను మీదా…
అన్న అనుమానం
క్షణంలో
పెవీక్విక్లా అంటుకుంటుంది

సెల్ ఫోను..
పిల్లలతో ఆడుకుంటుంటే
కాసేపు…నేనో పుస్తకంలో
రెపరెపలాడే పేజీనైపోతాను
పొద్దుటికి
కాయగూరలు లేవంటూ
అంతవరకు మరిగిన ‘టీ’లా
మా ఆవిడ పొగలు కక్కుతుంటుంది

చేతి సంచిని వెంటబెట్టుకుని
నడిచే తోవలో
కవితా వాక్యం కోసం వెతుకుతాను
తోవ పొడుగునా
తెగిన వాక్యం నన్ను పలకరిస్తుంది

కాయగూరల ధర బరువు
జేబులో డబ్బుల మధ్య
తెగని బేరమై కాటా తూగుతుంటుంది
ఎదురు పడిన స్నేహితుడ్ని చూసి
వాచీలో ముల్లు గిర్రున తిరుగుతుంది

పచ్చని ఆలోచనలతో
సగం నిండిన చేతిసంచితో
ఇంటికొస్తాను

ఇంటిలో
పాలు మాడిన వాసనేస్తుంటుంది
స్క్రీన్ గార్డు పగిలిన సెల్
బుద్దిగా
>ఓ పక్కన కూర్చుని వుంటుంది
కన్నీళ్ళను పీల్చుతూ
హోంవర్క్ బుక్ పై కదిలే పెన్ను
బెక్కుతుంటుంది

సీరియల్ ను తింటూ
కార్టూన్ నెట్ వర్కును నంచుకుంటూ
వాట్సాప్ గ్రూపుల విందుతో
క్యాలండర్లో ఒక రోజు
మమ్మల్ని కొద్దిగా ఆరగిస్తుంది

సెలవురోజును కలగంటూ
స్కూలు బ్యాగు…
పుట్టింటిని తలుచుకుంటూ
విజిలరిగిన కుక్కరు…
పెట్రోలు ధరలను తిట్టుకుంటూ
నడిచే స్కూటరులా నేను
ఎప్పటిలాగానే….
ఆ రాత్రికి
చీకటిని జోకొడతాం

మొయిద శ్రీనివాస రావు

9 comments

 • చాలా బాగుంది శ్రీనుగారు.
  రకరకాల అనుభూతులను కలిగించింది.
  నిజం చెప్పాలంటే చదువుతున్నంతసేపూ
  సగటు మనిషి యొక్క ఆత్మ పరకాయ ప్రవేశం
  చేసిన అనుభూతి ని కలిగించింది.

 • ముందు కవిత చదివి ఆ తర్వాత కవి పేరు చూశాను. మొయిదా…ఫిదా. నువ్వెంత చిక్కనో అంత రుచి కూడా. నిర్వేదంలోంచి అమృతాన్ని తీస్తావు. చాలా, చాలా బాగుంది మిత్రమా. హేపీ.

  • నాకు అంతపాటి నైపుణ్యం వుందంటావా? మిత్రమా… ధన్యవాదాలు.

  • కష్టాన్ని వ్యక్తీకరించే వారందరూ కవులే….

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.