కాలం కన్న బిడ్డలు

వంచన నాటకంలో చివరి అంకం?

వంచక చొక్కా మడతల్లో ఇంకెన్ని ట్రిక్కులున్నాయో చెప్పలేం.

జనాల మీద కుట్ర కేసులు మోపేది వాళ్ళే. జనాలకు వ్యతిరేకంగా కుట్రలు చేసేదీ వాళ్లే.

రూల్ అఫ్ లా అని కేకలు వేసేది వాళ్ళే. అన్ని రూల్స్ ను తుంగలో తొక్కి వికటహసించేదీ వాళ్ళే.

రెండు గొప్ప ప్రజాతంత్ర సింహాసనాల మీద ఇద్దరు మహనీయులు.

ఒక నరేంద్ర మోడీ. ఒక డొనాల్డ్ ట్రంప్.

వాళ్ళు వూరకే రాలేదు.

చారిత్రక అనవసరాలుగా రాలేదు.

మనకు చాల అవసరమయి వొచ్చారు.

యవ్వారం ఎంత అసయ్యంగా వుంటానికి వీలుందో… అది.. పుస్తకాల్లో థీరీగా కాదు… మన కళ్ళకు కట్టినట్లు కూడా కాదు.. నిజంగానే కళ్ళకు కట్టి చూపించడానికి వొచ్చారు.

పట్టుకారుతో కనురెప్పలు విప్పి చూపించడానికి వొచ్చారు. చూపిస్తున్నారు. నో హోల్డ్స్ బార్డ్.  

ఈ అసయ్యాన్ని అసయ్యమని అనడానికి సిద్ధంగా వున్నామా?

లేక వీళ్లని వొదిలించుకుని కొంచెం తక్కువ అసయ్యాన్ని నెత్తికెత్తుకోబోతున్నామా?

మన ప్రియమైన అరుణపతాకం ఇన్నాళ్లుగా చేస్తున్నదేమిటి?

కాపరులు గొర్రెలను కసాయులకు అమ్ముకోడాన్ని ఎందుకు నిరోధించలేక పోయింది? 

ఇంత కన్న మెరుగైన ఎర్రజెండా కోసం చేస్తున్న ప్రయత్నాలేమిటి? ప్రయత్నాలు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ప్రజలు ఎక్కడున్నారో ఆ కింది నుంచా, నాయకులుండే పై మెట్ల నుంచా?

బ్యాలెట్ పెట్టెలు, వీధి పోరాటాలు, జనతంత్ర నీతి కోసం జరిగే బలిదానాలు… కావేవీ మార్పు కనర్హం. ఉన్నది వున్నట్లుంచే పనికి మనమూ ఓ చెయ్ వేయడానికైతే, ఇక ‘మన’మెందుకు?

ఇది సమయం… గమనం గురించి యోచించుకోడానికి.

గమనమే గమ్యం అనే పాత ఆలంకారిక పదాలిక చాలు. గమ్యం లేని గమనం చేలో పడిన గుడ్డెద్దు. అది తినేది పచ్చగడ్డి కావొచ్చు విషం మొక్కలు కావొచ్చు.

ఇది ఎక్స్ పైరీ డేట్ ముగిసిన వంతెన…  ఇక్కడి నుంచి పయనమో గమనమో జరగాల్సిందే.

కాకపోతే అది మరణం వైపు కాదు, బతుకు వైపు గమనం అయ్యిండాలి. అదొక్కటే గీటు రాయి.

మోడీ, ట్రంపు వొచ్చి మనకు చేస్తున్న హెచ్చరిక కూడా ఇదే. వాళ్ల ప్రతి పని, ప్రతి కదలిక ఒక హెచ్చరిక. వాళ్ళ పనులు మనల్ని హెచ్చరించడానికేనని గ్రహించక ఊరక ఆడిపోసుకోడంలో గడిపేస్తున్నామేమో?

వాళ్లిద్దరు ఇలా ఒకే సమయంలో కూడబలుక్కుని వొచ్చారా? అదేం కాదు.

వాళ్లిద్దరు కాలం కన్న బిడ్డలు. ఒకే కాలం. మన కాలం.

వికృతాల్ని చూసి మన కాలం కన్న బిడ్డలను మనమే కాదంటే ఎలా? వాళ్లిద్దరు ఎంత ‘వికృతు’లో అంత జెన్యున్ గా మన కాలం బిడ్డలు.

ఇది వికృతి. మరి, ప్రకృతి ఏదీ?

ఇది నరకం. బయటికి దారి యేది?

విముక్తి మార్గమేది?

ఇటీవలెక్కడో మన మల్లన్న (మాజీ 10 టీవీ మల్లన్న) భలే ప్రశ్న వేశాడు.

‘కేసీయార్ దొరతనం చేస్తున్నాడని ఏడుస్తారేం, మరి, దొర దొరతనం చేయక దొంగతనం చేస్తాడా?’

ఇంత సూటి ప్రశ్న వేసిన మల్లన్న ‘మనం కూడా దొరతనం చేయాలె’ అనడానికే ఆ సోపతి తీసకచ్చిండు గాని, ప్రశ్న మాత్రం చాల గొప్పది, కీలకమైనది.

(‘మనం’ అనబడే మల్లన్న మాటలో మీరు, నేను వుంటామా లేదా అనేది మన కులాల్ని బట్టి వుంటుంది. అది వేరే కహానీ).

దొర దొరతనం చేయడం చాల సహజం. దొరగారు నీ పనీ నా పనీ చేస్తాడని…  అనగా ప్రజల పని చేస్తాడని.. పెద్ద, చిన్న కవులు, కళాకారులు భుజకీర్తులు సవరించుకుంటూ, ఎన్ని కబుర్లు చెప్పినా అది నిజం కాదు.

(ఇదేదో తెలం గానమనుకునేరు, అన్ని గానాలదీ అదే మెలడీ).

దొరతనమంటే ఏమిటో అరటి పండు వొలిచి నోట్లో పెట్టినట్లు చెబుతున్నారు… రెండు లీడింగ్ ప్రజాస్వామ్య దేశాల ప్రస్తుత నేతలు.

ఇండియాలో మాఫియా ఇప్పుడు ఏ ముంబైకో పరిమితం కాదు. భాగ్యనగరం నడి బొడ్డున పట్టాకత్తులేసుకు తిరుగుతోంది. ఆ కత్తులు దళిత ప్రేమిక యువకుల తలలు నరికితే, అది కొంచెం షాకిచ్చే వార్త మనకు. కొంచెం షాకు మాత్రమే. ఎక్కువ కాదు. దాని మూలాల్లోకి వెళ్లి చూడడానికి తగినంత షాక్ కాదు. కొంచెమే. కొన్ని రెగ్యులర్ వీరాలాపాల తరువాత అంతా మామూలే.

మరేం చేయాలి? కత్తులు కఠార్లు తీసుకు పోదామంటారు కొందరు. కత్తులు కఠార్లు కాకుండా ఇంకేదీ మనకు తట్టదా?

ఉస్మానియా యూనివర్సిటీలో కామ్రేడ్ జార్జి రెడ్డిని చంపేస్తే ఆయన అనుచరులు ఆవేశానికి లోనై చేసింది మరొకటి రెండు హత్యలు కాదు. తెలుగు ప్రాంతాలనే కాదు యావద్దేశాన్ని ఊపేసిన ఒక అద్భుత విద్యార్థి వుద్యమాన్ని నిర్మించారు జార్జి వారసులు. విద్యార్థుల్ని తాటాకు మంట ఆవేశాల నుంచి మళ్లించి, నిలిచి కాలే నిప్పులుగా మలచిన నీలం రామచంద్రయ్యలేరీ ఇవాళ? దాన్ని నాయకత్వం అంటారు. నాడు ఆ నాయకత్వమే లేకుంటే జార్జి కళేబరంతో పాటు మరొక శవం వుండేదేమో. యూనివర్సిటీలో మతవాదం తుడిచిపెట్టుకు పోయి, ప్రగతి శీల జెండాలు రెప రెపలాడేవి కాదు.

అంతటి వుద్యమం ఆవిరై, ఇవాళ యూనివర్సిటీలో మతవాద పురుగులు మళ్లీ బురబురలాడే అవకాశం ఎందుకొచ్చింది? తీవ్ర వామపక్షం  సాగించిన ఖతం కార్యక్రమాల వల్ల ఔనో కాదో మనసున్న వాళ్ళొకసారి ఆలోచిస్తారా? 

ఇవాళ లోకం ఎంత పుచ్చి పోయిందో, దీనికి ఒకట్రెండు దళ చర్యలు కాకుండా అన్ని చోట్ల ప్రజాతంత్ర జన సమీకరణ ఎంత అవసరమో తెలుసుకోడానికి ఇంకెందరు మోడీలు రావాలి, ఇంకెందరు ట్రంపులు పుట్టాలి?

అమెరికాలో అత్యున్నత న్యాయ న్యాయస్థానంలో జడ్జిని ఎంపిక చేస్తున్నారు. (ఇది రాస్తున్నప్పటికి ప్రాసెస్ ఇంకా నడుస్తోంది.) ఇప్పటికి ముగ్గురు ఆడవాళ్ళు ‘మీ టూ’ అని ముందుకొచ్చి జడ్జి బ్రెట్ క్యావనా అనే అభ్యర్థి గతంలో తమ మీద రేప్ ఆటెంఫ్ట్స్ చేశాడని బహిరంగంగా చెప్పారు.

అప్పుడాయన ఆ స్థలంలో వుండడం మాత్రమేగా ఇంకా రేప్ చేయలేదుగా, అప్పుడాయన తన శిశ్న రాజాన్ని తీసి ఒక అమ్మాయి మొహం మీద వూపడమేగా రేప్ చేయలేదుగా… అని సన్నాయి నొక్కుల వాదనలు వినిపించాయి మొదట, ట్రంపు ‘లాక్ రూం టాక్’ లాగే.

ఆ తరువాత తన మీద నిజంగానే పూర్తి స్టాయిలో రేప్ అటెంప్ట్ జరిగిందని, ఆ మగాడు జడ్జ్ క్యావనా వినా మరెవరూ కాదని డాక్టర్ క్రీస్టీన్ బ్లాస్సీ ఫోర్డ్ అనే అమె చెప్పారు. అదే ఘటనను క్యావనా మితృడు మార్క్ జడ్జ్ తన ‘సరదా’ మొమాయిర్స్ లో రాశాడు కూడా.  అది నిజం కాదని, ఆ సంగతి తన పుస్తకంలో రాసిన తన స్నేహితుడు ఆల్కహాలికుడని, తాను మాత్రం ఎప్పుడేనా ఒకసారి ఏదో కుంచెం బీరు తాగుతాడు గాని, తాగినప్పుడు కాస్త అగ్రెసివ్, బెల్లిజరెంట్ అవుతాడు గాని మరీ వొళ్లు మరిచేంతగా, తానేం చేశాడో మరునాటికి మరిచిపోయేంతగా తాగడని ఆయన వాదం, ఆయనకు వత్తాసుగా గొంతు విప్పిన ట్రంపేయుల (అనగా రిపబ్లికన్ల) ఘాట్టి విశ్వాసం. తమ ఆధ్యక్షుడు మాజీ ప్రియురాళ్ళ నోరు మూయించడానికి భారీగా డబ్బులిచ్చి ఆ పాపానికి తన లాయరుని జైలు అంచులలో నిలిపినా చీమ కుట్టినట్టు అనిపించని వీర విధేయులు… ట్రంపు నియమింపజేసుకోదలిచిన సుప్రీం న్యాయమూర్తిని కాదంటారా, పాపం!

వీళ్లూ.. చట్టబద్ధ పాలన గురించి మాట్లాడేది. తలలూపే గొర్రెలకు కొదువ లేదు.

అటెంప్టెడ్ రేప్ విక్టిమ్స్ సాధారణంగా బయటికి వొచ్చి మాట్లాడరు, తమ మీద మరింత బురద పడుతుందనే భయంతో.  అయినా, ఆరోపణలు చేసిన డాక్టర్ క్రిస్టీన్ బ్లాస్సీ ఫోర్డ్ తమ మీద ఎఫ్ బి ఐ పరిశోధనకు అంగీకరించడం కాదు, ఆహ్వానించారు. ఈ మగ మహరాజు మాత్రం దానికి అంగీకరించడు. ‘నేనెంత గొప్పవాడినో నేను చెబుతున్నాను కదా, మీ ప్రశ్నలన్నిటికి నేనే జవాబు చెబుతున్నాను కదా, ఎఫ్ బీ ఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు’ అంటాడీయన అమాయకంగా మొహం పెట్టి. అవునవునెందుకు అని కమిటీ లోని రిపబ్లికన్ల తాన తందానా వాదన.

వాదనల సంగతేమో గాని, ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ అధికారి, ఎవరు ఒక మీట నొక్కితే ప్రపంచం భస్మీపటలం కాగలదో ఆ అధికారి… అమెరికా ప్రెసిడెంట్ దొర… స్వయంగా ఈ జడ్జి క్యావనా చానా చానా మంచోడని, పులుకడిగిన ముత్యమని…. ఇంకా ట్వీటుతూనే వున్నాడు.

ఇది జగతి. భారతం కూడా ఇదే, రూపాలు కాస్త వేరు కావొచ్చు.

నిన్న మొన్నటి వరకు ఇండియాలో, అమెరికాలో ‘లిబరలిజా’న్నే చూశాం. అది ప్రవచించిన సోషలిస్టు కబుర్లకు మురిశాం.

బయట వీత్నాంలో, ఇరాక్ లో, అఫ్ఘానిస్తాన్ లో ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్నెన్నె అబద్ధాలతో ఎదిరి నేతలను ఉరి తీసినా.. ఇప్పటిలా… స్వదేశంలో… ఆడవాళ్లూ పిల్లల విషయంలో… అందరికి తెలిసేంతగా… హీనచర్యల అభియోగాలెదుర్కొన్న నాయకులు గతంలో లేరు. ఒక మేకపోతు గాంభీర్యమైనా వుండేది. అది వుండాలని కాదు గాని, ఇప్పుడా ముసుగులు కూడా చిరిగిపోయాయి. దుర్మార్గాలు బట్టలిప్పుకుని వూరేగుతున్నాయి.

యెస్, మేమిలాగే చేస్తాం. ఇలా చేయడానికి వీలుగా పోలీసుల్ని, న్యాయస్థానాల్ని మరింత మార్చుకుంటాం. ఏఫ్బీఐ లూ, సీబీఐ లూ మా ఎదిరి పక్షాల్ని హింసించడానికే గాని, మా వరకు వొస్తే ‘నాట్ బిఫోర్ మీ’ ఎత్తుగడల నుంచి డెలిబరేట్ ఎగ్జోనరేషన్ దాకా దేనికీ వెనుదీయం.. అంటున్నారు నేటి పాలకులు.

నిజమే కావొచ్చు; మోడీ, ట్రంపు కూడా పాత పెట్టుబడి, కట్టుకథల రాజకీయం కొనసాగింపే కావొచ్చు,

కాని, మునుపటి వాళ్ల మాదిరి వీళ్ళు సిగ్గు పడరు. సందేహించరు. నేరుగా నియంతృత్వం చెలాయించరెందుకంటే అది మరీ ఖరీదైన యవ్వారం కాబట్టి. అనవసరమైన వ్యయం కాబట్టి. ఇప్పుడంతా పరమ చీప్ గా జరిగే డిజిటలైజ్ద్ నియంతృత్వం. మోసపు మాటలతోనే పని జరిగినంత కాలం తూటాలూ లాఠీలూ యెందుకు? గొర్రెలు తమంత తాముగా కబేళాలకు పయనమై పాటలు పాడుకుంటూ వొస్తున్నంత కాలం ప్రత్యేకించి వాటి గొంతులు కోసే పని వాళ్ళెందుకు? గొర్లకాపరులుగా అచ్చు మన వాళ్ళే వున్నప్పుడు మళ్లీ మనం ఎవరికో కొరడాలిచ్చి పంపడమెందుకు?

అదీ మోడీల, అమిత్ షా ల, ట్రంపుల, వారి తెరవెనుక ఆర్థిక యజమానుల లాజిక్.

వాళ్ళ తర్కం సరే. మల్లన్న సారు చెప్పినట్లు ఆ లాజిక్ అలాగే వుంటుంది. దాని లాజికల్ ఎండ్ మోడీ, ట్రంపులే.

ఆ, ఇంతేనా వీళ్ళ కన్న పదునైన కత్తులొస్తాయి, గొర్రెల కుత్తుకలుత్తరించుటకు అంటారా? రావొచ్చు మన మంద బుద్ధులకు వీళ్ళు చాలకపోతే, దయగల కాలం ఏం చేస్తుంది పాపం? మరింత పదునైన మానవ రూప మారణాయుధాలను సమకూర్చుతుంది.

ఈ లోగా మేల్కొన గలిగితే,

మన మధ్యన తిరుగాడే గొర్లకాపరులను వొదిలించుకుని మనకు మనం అప్రమత్తులమైతే, చరిత్ర ఒక మంచి మలుపు తీసుకోనూ వొచ్చు.

చాతనైన వాళ్ళం… చాతనైన పని చేస్తో మలుపు కోసం ఎందుకు ప్రయత్నించగూడదు?

ఏ ఆలోచనా అంతిమం కాదు. ప్రతిదీ ఆ దిశగా నిజాయితీగా చేసే ఆలోచన అయితే చాలు. ప్రతి ఆలోచనకూ పెట్టుబడి, కట్టుకథ (క్యాపిటలిజం, మతం) కాకుండా పనిచేసే ప్రజల నిర్ణయం మూలకందమైతే చాలు.

28-9-2018

(పైన ఫోటో: క్రిసలిస్ ( ప్యూపా గూడు) చివరి దశలో వున్న సీతాకోక చిలుక. దీంతరువాత ఇక సీతాకోక చిలుకే. ఈ గూడు నిర్వాహకురాలు… అనన్య).

 

POST SCRIPT: అమెరికాలో ఇప్పుడు కథ కొంచెం మారింది. సెనెట్ లో కీలక వోటు ధారి… అనగా ఎవరు వోటేస్తే జడ్జ్ క్యావనా జీవితాంత సుప్రీం జడ్జ్ అయిపోతాడో ఆ సెనెటర్… జెఫ్  ఫ్లేక్… చివరి నిమిషంలో చిన్న అడ్డుపుల్ల వేశారు. డాక్టర్ బ్లాస్సీ ఫోర్డ్ తదితరుల తాజా టెస్టిమొనీల నేపధ్యంలో … జడ్జ్ క్యావనా బ్యాక్ గ్రౌండ్ మీద ఎఫ్ బీ ఐ మరో వారం రోజుల శోధన తరువాతే తన వోటు నిర్ణయమని అనడంతో నియామకం మీద నిర్ణయం ఆగింది. ఆ గడువూ ముగిశాక… ఏం జరిగిందీ అలా ఎందుకు జరిగిందీ మాట్లాడుకుందాం, ఈ స్థలంలోనే.  వివా లా ఇంటర్నెట్. (ఈ మేరకు పరిణామం కూడా చిన్నది కాదు.. వివా లా అమెరికన్ ఫెమినిజం)

2nd POST SCRIPT: తరువాత్తరువాత జడ్జి కావనా మీద మరిన్ని అరోపణలొచ్చాయి. ఆయన అబద్ధీకుడని తేలిపోయే సాక్ష్యాలు మరిన్ని ముందుకొచ్చాయి. అయినా సెనెట్ మెజారిటీ ఆయన నియామకాన్ని ధృవీకరించింది. ఈ ఘటన లిబరలిజం (ఉదారవాదం) విస్తృతిని, పరిమితిని… ఒక్క మాటలో చెప్పాలంటే వర్తమాన జీవితంలో హిపోక్రసీ ప్రాబల్యాన్ని.. విష్పష్టంగా ప్రదర్శించింది. ప్రత్యామ్నాయమేది?… అనేది ఒక మూట్ కొశ్చన్ గానే మిగిలి వుంది.

హెచ్చార్కె

12 comments

 • “చాతనైన వాళ్ళం… చాతనైన పని చేస్తో మలుపు కోసం ఎందుకు ప్రయత్నించగూడదు?” నిజమే మీ ఆలోచనలతో మీరే ఎందుకు మొదలు పెట్టాకూడదు ?.

 • చాల థాంక్స్ సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు నేను చేస్తున్న పని అదేననుకుంటున్నానండి.

 • చక్కని వ్యాసం. ‘నాట్ బిఫోర్ మీ’ మరీ నచ్చింది. ఎర్రజెండా వాళ్ళు ఈ మాటు ఏ ‘దొర’ వెనకాతల ఉండాలీ అని ఆలోచిస్తున్నారు.

 • బాగుంది. రెండు దేశాల్తో పాటు దొరగార్నీ, గొర్రెల్నీ, అరుణ పతాకాల్నీ, శిశ్న చలనాన్నీ, జనతంత్ర నీతి, బలిదానమూ… అన్నింటినీ ఉండ చుట్టిన సంపాదకీయం. విక్రుత కాలమే. ఎక్స్పైరీ డేట్ ముగిసిన వంతెన మీదే నడవాలా ? అదిలేకుండా ప్రజాతంత్ర జన సమీకరణకి ఎం చేయలేమా ? ఒకటి మాత్రం నిజం. ఇకపై అందరూ ట్రంపులూ, మోడీలే వస్తారు. కానీ మనం భజన చేయకుండా కవిత్వం రాసుకోవడమే, లేదంటే ‘ఒక లెవల్లో’ ఒత్తిడి చేయడమే. ఆ ఒత్తిడి మనమే చేయాలంటారు మీరు. మన లెవల్లోనే. అయితే మీరన్నట్టు బతుకువైపు గమ్యానికైతే వేస్తే వోటు, లేకపోతే వేటు. అంతే. అసహనంగా ఉంది.

  • థాంక్సెలాట్, శ్రీరామ్. మీకు అసహనం కలిగించినందుకు భలే హ్యాపీ. 🙂 ఏ లెవెల్ అయినా సరే, మంచి దిశగా లోకం నడిచేలా వొత్తిడి చేద్దాం. కవి వొత్తిడికి గురయినప్పుడు లోకాన్ని వొత్తిడి చేయకమానడు. (తనకూ ప్రపంచానికి సామరస్యం కుందిరిందాకా కవి చేసే అంతర్ బహిర్….. 🙂 )

 • An emotional article..

  ఒక ప్రక్షాళనకు దారి తీసే పరిస్థితులను తెచ్చే ఒక ఆయుధం ఈ వ్యాసం.
  చాలా క్లియర్ గా ఉంది. ఒక అమెరికన్ జడ్జి కావ్యనా.. ఇష్యూ రాసినప్పుడు మరింత క్లారిటీ అవసరమని అనిపించింది.
  వామపక్షాలు ఈ దిశగా కదలలేదన్న బాధ కనిపించింది.

  ప్రస్తుత పుత్రులు డోనాల్డ్ .ట్రంప్ లను కడిగిపారేసి న గొప్ప ఆర్టికల్…కుడోస్

 • దేశం పోకడ గూర్చి ఆలోచించడానికి చాలా ఉపయోగకరమైన వ్యాసం సార్ మా వంటి విద్యార్థులకు.

  • Thank you so much Ramnarayana garu. We cannot leave it just to political parties. Even individuals (out of the parties) need to think as if they were leaders . Only that way, there can be any concerted action in mind and on road, I believe. Let us work as thinkers and Propaganda workers and pressure builders on behalf of what’s to be done.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.