తలిదండ్రుల ప్రేమకు ఎంతెంత మూల్యం…

  1. 1. పి. అనసూయ, నాగర్ కర్నూల్

ప్రశ్న: ఈ మధ్య టీవీ ఇంటర్వ్యూలలో ఒక మాట వింటున్నాను. పిల్లలు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చేసుకోవాలంటే, తల్లిదండ్రుల్ని ఒప్పించే, తల్లిదండ్రులకు ఇష్టమైతేనే, చేసుకోవాలట! లేకపోయినా, ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటే, ఆ పిల్లలకి ఆస్తులు పోతాయట! తల్లిదండ్రుల సహాయాలు పోతాయట! ఇలా చెబుతున్నారు, మంచిదంటారా?

జవాబు: అంత సందేహం వచ్చిందా మీకు? ఆ మాటల్ని బట్టి ఏం తెలుస్తోంది? తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తుల కోసం ఆశ పడుతూ ఉంటే, వాళ్ళ ప్రకారం నడవవలిసిందే! ‘ఆ ఆస్తి తో సంబంధం లేకుండా, మా మట్టుకి మేం బతుకుతాం’ అనుకుంటే, వాళ్ళకి ఇష్టమైనట్టే చేసుకోవచ్చు! తల్లిదండ్రులు, తమ ‘ఆస్తి’ ని చూపించి, పిల్లల్ని తమ అదుపులో ఉంచాలి అనుకోవడం పూర్వం నించీ జరిగేదే! అలాగే బతకాలో, లేదో, పిల్లలు ఆలోచించుకోవాలి. ఆ ఆలోచనలు కూడా తల్లిదండ్రుల పెంపకాల్ని బట్టే, ఆ పెద్దవాళ్ళ ప్రవర్తనల్ని బట్టే వస్తాయి అనుకోండి!  

2. బి. జ్యోతి, విజయవాడ

ప్రశ్న: ఇప్పుడు, ‘ప్రేమ, ప్రేమ’ అనే మాట చాల వినపడుతోంది! కానీ, మంచి ప్రేమ కనపడడం లేదు. ‘ప్రేమ’ లో మంచి చెడ్డలా అని కూడా అనిపిస్తోంది. మా దూరపు బంధువుల కుటుంబంలో ఒక సమస్యగా వుంది. ఆ అమ్మాయి, ‘కింది’ కులం అబ్బాయిని పెళ్ళి చేసుకుంటానంటే, ఆమెకి పెద్దవాళ్ళు అభ్యంతరం పెట్టలేదు.  కానీ, ఆ అబ్బాయికి, సిగరెట్లూ, తాగుడూ కూడా ఉన్నాయట! ఆ సంగతి ఆ అమ్మాయే చెపుతోంది. ‘అతను, తన సంగతి రహస్యం లేకుండా చెప్పేశాడు. అది ఎంతో మంచితనం కదా? అంటుంది. పెద్దవాళ్ళు ఏ మన్నారంటే, ‘అతనికి చెప్పు, ఆ అలవాట్లు నిజంగా మానుకుంటేనే చేసుకుంటానని చెప్పు! కులం సంగతి కాదు. మంచి అలవాట్లు లేకపోతె, నువ్వు నాశనం అవుతావు’ అంటున్నారు. ఆ అమ్మాయి వినడం లేదు. ‘పాపం, అతని అలవాట్లు ఎలా మనుకుంటాడు? డాక్టర్లే తాగుతారు. అది అంత  ఘోరమా?’ అంటోంది. ఇప్పుడు ఆలా జరుగుతోంది. ఆ అమ్మాయికి ఎలా చెప్పాలంటారు?

జవాబు: చెప్పవలిసిందంతా చెప్పేశారు. చెప్పడానికి ఇంకేం లేదు. ‘నీకు అభ్యంతరం లేకపోతే, అదేదో నువ్వే చేసుకో! పెళ్ళి మా చేతుల్తో మేం  చెయ్యం. అతను ఇక్కడికి రావడానికి వీల్లేదు. కొన్నాళ్ళకి నీతో కూడా దూరంగా ఉండకపోతే, ఆ ఇబ్బందులన్నీ మేం పడం’ అని చెప్తే చాలు!

3. కె. పురుషోత్తం, హైదరాబాద్

ప్రశ్న: ఒక సందేహం తోనే ఇది అడుగుతున్నాను. మీరు ఎవ్వరినీ కలవడానికి అంగీకరించారట! మీరు ‘మార్క్సిజం’ అంటారు. సందేహాలు ఉంటే, మీతో మాట్లాడాలి కదా? లేదా, మీతో కలిసి మాట్లాడాలనిపించవచ్చు. అయినా మీరు, ‘పాఠకులు, పాఠకులు’ అని రాస్తారు. పాఠకుల్ని కలవకపోవడం తప్పు అవదంటారా?

జవాబు: ‘తప్పులు’ ఎప్పుడు అవుతాయి?  ‘స్వార్ధం’ తోనో, ‘గర్వం’ తోనో చేస్తే! అవీ తప్పులు! కలవడానికి నేను అంగీకరించని సందర్భాలు ఎటువంటివి అంటే, నా ఫోన్ నంబర్ కోసం ప్రయత్నించకుండా, నా పుస్తకాల్లో నా అడ్రస్ ఉన్నా, ఒక్క కార్డు ముక్క అయినా రాయకుండా, ఎప్పుడంటే అప్పుడు వచ్చి నిలబడితే, నేను సిద్ధంగా ఉండాలా? ఉత్తరాల సౌకర్యం ఉంది. ఇప్పుడు ఫోను సౌకర్యం కూడా ఉంది. ఫోను నంబర్ తెలియకపోతే, పుస్తకాల్లో నా అడ్రస్ ఉంది కదా? ఇవ్వాళ మధ్యాన్నం, నేను అన్నం తింటూ ఉంటే, ఒకరు వచ్చారు. నేను వచ్చేదాకా కూర్చుంటాం–అన్నారు. అప్పుడు నాకు కొంత పని ఉంది. ఆ పనిని కూడా కొంత ఆపి నిద్ర పోతాను. లేచాక మళ్ళీ పని ఉంటుంది. రాకముందే నన్ను అడిగితే, వచ్చే వారికీ ఏది వీలో తెలుసుకున్న తర్వాతే, టైము చెబుతాను. అసలు విషయం ఏమిటంటే, ఆ వచ్చే వ్యక్తి, ఒకటి రెండు పుస్తకాలు కూడా పూర్తి చేసి ఉండరు. అయినా వచ్చి మాట్లాడాలంటారు. మాట్లాడే విషయాలు ఏం ఉంటాయి? వాళ్ళకి ఏదైనా సందేహం ఉంటె దానికి నేనేదైనా చెప్తే, ఆ మాటల వల్లే అది అర్ధం అవదు. ‘శ్రమ దొపిడీ’ ని మాటలతో చెప్తే కాదు; దాన్ని చదవాలి. చదవడానికి పుస్తకాలూ ఉన్నాయి. అది చెయ్యరు.  

రచయితలూ, పాఠకులూ కలవడం అవసరమే. ప్రారంభంలో నేను అలాగే ఉన్నాను. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. నా వయసు తెలీదా మీకు? ఈ సెప్టెంబర్ లో నాకు 79 నిండుతాయి. నా కాలాన్ని ఎంతో  పొదుపుగా వాడుకోవాలి. నా పనీ, నా ఆరోగ్యాలకన్నా, అసలు పాఠకులతో నాకు ఉత్తరాల ద్వారా, ఫోన్ ద్వారా కొంత పరిచయం ఉంటేనే కలిసేది.

4. తెలిసిన వారి ఉత్తరం నించీ కొంత:

ఎరువుల కోసం ఆ ఊరు వెళ్లి, తెలిసిన వాళ్ళు చాల సార్లు కొత్త ఇల్లు చూడడానికి రమ్మని పిలిచారని మా అమ్మాయితో కూడా వెళ్ళాను. ఎరువులు దొరక లేదు. ఆ కొత్త ఇల్లే వెళ్ళి చూస్తే, కళ్ళు తిరిగి పోయాయి. వాళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద గదిలో, 20, 30 కుర్చీలు వేసి, గోడకి ‘తెర’ పెట్టి సినిమా హాలు ఉంది. సినిమాల టేపులో, సీడీలో నట, ఒక పెట్టెనిండా చూపించారు. మమ్మల్ని ఒక సినిమా చూడమని పట్టుకున్నారు. మా అమ్మాయి ఒక కుర్చీ ఎక్కి, సినిమా చూద్దామని పట్టు! దాన్ని బతిమాలి బైటికి తీశాను. అక్కడ వాకిట్లో జలపాతం లాంటిది కూడా ఉంది. స్విచ్చి వేస్తే నీళ్ళు కిందకి పడి,అవే పైకి పోతాయట! ‘ఈతకొలను’ కూడా పెట్టాలనుకుంటే, పెరట్లో అంత చోటు లేదని విచారంగానే చెప్పారు. ఆ స్థలం 900 గజాల పైన అంట! నేను రెండెకరాల రైతుని. వాళ్ళు మాకు దూరపు బంధువులు. ఆ ఇల్లు కట్టించుకున్న తర్వాతే ఫోనులో మాట్లాడారు. బాగుండదని వెళ్లాం. చెప్పాలంటే, ఇంకా ఉంది లెండి.

నేనిచ్చిన జవాబులోంచి: చెప్పక పోయినా, అన్నీ తెలుస్తాయి లెండి! డబ్బుతో పులిసిపోయిఉన్న వాళ్ళు, ఆ డబ్బుని వాడాలి. ఎలా వాడతారు? విలాసాలతోనే వాడాలి కదా? అదే కాదు, కొత్త వ్యాపారాలు పెడతారు. వాళ్ళకి అంత  డబ్బూ, సిటీలో అంత చోటూ, ఎలా వచ్చాయో అది ఆలోచించాలిగానీ, ఊరికే చూసి వస్తే కాదు. మీ అమ్మాయి వయసు ఎంతో చెప్పలేదు. “పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం” మీరైనా చదివారా? అమ్మాయికి చదివి చెప్పండి. ఈ ధనవంతుల విలాస భోగాలు, వేల సంవత్సరాల కిందటే పుట్టినవి కదా? వాటి అంతమే ముఖ్యం మరి!

5. నరేష్ &  పవన్, హైదరాబాద్

ప్రశ్న: మా ఉత్తరాన్ని పోస్టులో వేస్తే, అది చాల ఆలస్యంగా అందుతుందనీ, ఒక్కోసారి అందకుండా పోవచ్చనీ, ఉత్తరం పట్టుకుని వచ్చాము.  నిజం చెప్పాలంటే, మీరు కనపడితే మాట్లాడి, మీ చేతికే ఉత్తరం ఇవ్వాలని అనుకున్నాం. స్పార్టకస్ తెలుసు మాకు, మీ పుస్తకంలో. అతనే కాబోలు వచ్చాడు గేటు దగ్గిరికి. పేరు అడిగితే అదే చెప్పాడు. ఉత్తరం ఇస్తే, లోపలి పరిగెత్తాడు. మళ్ళీ బైటికొచ్చాడు. ‘నాయనమ్మ నిద్రపోతోంది’ అన్నాడు. తర్వాత మళ్ళీ  వచ్చాడు. ‘ఇంకా వెళ్ళలేదేం?’ అన్నాడు. ‘బూట్లు వేసుకుంటున్నాం’ అన్నాం. తెల్లబోతూ చూశాడు. ఉత్తరం మీరు చదివే ఉంటారు.

జవాబు: ఎందుకు చదవనూ, చదివాను. చక్కగా రాశారు. మిమ్మల్ని ‘పుస్తకాలు చదివే మంచి పాఠకులే’ అనుకున్నాను. అయినా, అప్పుడు నేను నిద్రపోయే సమయం. రాత్రుళ్ళు నిద్ర తక్కువ. పగలు నిద్ర తప్పదు. మీ ఉత్తరం బాగుంది గానీ, మీరు ‘విషవృక్షం’ ఇంకా ముట్టుకోలేదు. కలిసి ఏం మాట్లాడతాం? ఏవైనా రెండు మూడు పుస్తకాలు  చదివి ఉంటే, వాటిమీద ఏవైనా ప్రశ్నలు ఉంటే, కలిసి మాట్లాడుకోవచ్చు. అర్ధం చేసుకుంటారు కదా?

రంగనాయకమ్మ

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.