పెను విషాదం మోసిన సమవాద రచయిత్రి

వర్జీనియా ఉల్ఫ్ చాలామందికి  కేవలం  ఒక  స్త్రీ వాద రచయితగా విషాద జీవితాన్ని మోసిన రచయిత్రి లాగే పరిచయం. సాహిత్యాన్ని  ఎంతో తపన తో ప్రేమించి  ఎందరినో ఉత్సాహపరిచి  ఒక స్త్రీగా  స్త్రీల కోసం  సాహిత్యాన్ని రూపకల్పన చేసిన మహా రచయిత్రి ఆమె. 1822లో జన్మించి 19వ శతాబ్దంలో  మానవ జీవితంలోనూ, సంఘంలోనూ, సాహిత్యంలోనూ వచ్చిన మార్పులనూ, లక్షణాలని  లోతుగా అధ్యయనం చేస్తూ  తనకంటూ ఒక స్థిర మైన ముద్రను  ఏర్పాటు చేసుకున్న రచయిత్రి వర్జీనియా  వుల్ఫ్. 

పది నవలలు  ఇంకా అనేక అకాల్పనిక రచనల  వంటి అనేక పుస్తకాలను రాసిన వర్జీనియా ఊల్ఫ్  20 వ శతాబ్దపు మేటి రచయిత్రి.  ఆమె పేరు చెప్పగానే  చదువరులకి ‘చైతన్య స్రవంతి’ అనే ప్రక్రియ వెంటనే గుర్తొస్తుంది. 20వ శతాబ్దపు ప్రారంభంలో ఏర్పడ్డ బ్లూమ్స్ బరీ బృందం లో సభ్యురాలైన ఆమె సాంఘిక,రాజకీయ, సాహిత్య విషయాలేకాక లింగ విచక్షణ లకి  అతీతంగా ఉండాల్సిన అవసరం గురించి,  స్వేచ్ఛను  గురించి తీవ్రంగా ఆలోచించింది.

చిన్నతనంలోనే తల్లి మరణం తర్వాత తన సవతి సోదరుడి  మూలంగా ఆమె శారీరకంగా హింసించబడడంతో  చిన్నప్పటినుంచి మానసికమైన వేదనను అనుభవించింది.  బైపోలార్ వ్యాధి  తో బాధపడి  అనేకసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది.  అయితే ఆమె భర్త  లియోనార్డ్ ల్ఫ్ ఆమెకి చేయూతని, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు.

లండన్లోని  బ్లూమ్స్ బరీ జిల్లాలోని మేధావులు కళాకారులు అయిన లిట్టన్ స్ట్రాచీ, ఇ. ఏం ఫోస్టర్ , వర్జీనియా ల్ఫ్ వంటి రచయితలు  రోజర్ ఫ్రై, వానిస బెల్ వంటి చిత్రకారులు  ఇంకా కళావిమర్శకులు, జర్నలిస్టులు, ఆర్ధిక శాస్త్రవేత్తలు అందరూ కలిసి  ఒక బృందంగా ఏర్పడ్డారు. వీళ్ళందరూ  పాతతరపు విక్టోరియన్ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చేసరికి  ఆ పాత సంప్రదాయాలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు . అనేక ఆధునిక విప్లవాత్మకమైన భావాల్ని పంచుకున్నారు. వాటిమీదే రచనలు సాగించారు. వర్జీనియా ఉల్ఫ్ భర్త  లియోనార్డ్  ఉల్ఫ్ కూడా ఈ బృందంలోని సభ్యుడే.

ది వాయిజ్ ఔట్ (1915),  నైట్ అండ్ డే(1919),  జాకబ్స్ రూమ్ (1922),    మిసిజ్ డాలవే(1925) ,  టు ద లైట్ హౌస్ (1927) ,  ఆర్లాండో(1928) ,   అ రూమ్ ఆఫ్ వన్స్ వోన్ (1929),  ద వేవ్స్ (1931) ,  ఇయర్స్ (1937),   త్రీ గినీస్ (1938), బిట్వీన్  ద యాక్ట్స్ (1941) మొదలైనవి వుల్ఫ్ రచనలు. వీటిలో  మిసిజ్ డాలవే,  టు ద లైట్ హౌస్ , ఆర్లాండో , ద వేవ్స్,   అ రూమ్ ఆఫ్ వన్స్ వోన్ అనేవి  బాగా ప్రసిద్ధి కెక్కాయి.

విలియం జేమ్స్  తన ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే పుస్తకంలో  మనసు ఒక నిరంతర ప్రవాహం లాంటిది అని చెప్పాడు.  ఒక నదిని ఎలా అయితే ముక్కలు చేసి చూడలేమో  అలాగే మనస్సుని  దాని ఆలోచనలను కూడా  విడివిడిగా చూడలేము.  అది ఒక నిరంతర ప్రవాహం.  వర్తమానాన్ని,  గతాన్ని   అనేక రకాలుగా ముడిపెడుతూ  కాలంతో అనుసంధానిస్తూ వెళ్తూ ఉంటుంది.  దీన్నే సాహిత్యంలో చైతన్య స్రవంతి అనే ప్రక్రియ గా విలియం జేమ్స్ వర్ణించాడు.  ఇది రానురాను    వర్జీనియా ల్ఫ్, రిచర్డ్సన్,  జేమ్స్ జాయిస్  వంటి వారు తమ రచనల్లో ప్రయోగించారు. వీరు పాత్రల మనోభావాలు, జ్ఞాపకాలు, ఆలోచనలు, భావనలు  కలగలిసిపోయేట్లుగా చిత్రీకరించారు.

అ రూం ఆఫ్ వన్స్ వోన్ మరియు త్రీ గినీస్ అనే రచనలు 50 భాషలలోకి అనువదింపబడడం ద్వారా ఆమెను ప్రపంచ స్థాయి రచయితగా పాఠకులు స్వాగతించడం లో ప్రముఖ పాత్ర వహించాయి. ఉల్ఫ్ విశ్వమానవ దృక్పధమే ఆమె ప్రపంచవ్యాప్త ఆదరణ పొందిన రచయితగా కావడానికి ముఖ్య కారణం. వర్జీనియా ఉల్ఫ్ యొక్క జీవన , రాజకీయ, సామాజిక , ఆర్థిక దృక్పధము ఈ రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది.

  రచయితకైనా శైలి చాలా ముఖ్యం. అందులోనూ నవలా రచయిత కు ఇంకానూ. మానసిక విశ్లేషణతో నడిచే నవలలు మామూలు నవలల కన్న భిన్నంగా వుంటాయి.  వుల్ఫ్ శైలి ఎడ్వర్డియన్, జార్జియన్ శైలీ లక్షణాల సమాహారం. ఎడ్వర్డియన్ లు సూక్ష్మ వివరణకు ప్రాధాన్యమిస్తే జార్జియన్ లు వాస్తవిక విషయ వివరణకు ప్రాధాన్యమిస్తారు. సెమీ కోలన్ లతో సాగే దీర్ఘ వాక్యాలు, మధ్యలోనే  దారి మళ్ళి పోయే విషయాలు , పాత గుర్తులు గతం వర్తమానాల కలయిక ఇలా సాగుతుంది ఆమె రచన. 

మానవ స్వభావాన్నీ మానవ లక్షణాలను స్త్రీ పురుష దృక్కోణాలలో వివరించే వుల్ఫ్  శైలి  కొంత ఆత్మా శ్రయ వివరణతో సాగుతుంది.  మార్సెల్ ప్రౌస్ట్  ను అభిమానించిన ల్ఫ్  తన పాత్రల లో  జరిగే మానసిక మార్పులు విశ్లేషణ లను  చిత్రీకరిస్తుంది.  ఆమె నవలలోని పాత్రలు  కథతో పాటు మారుతూ నిజజీవిత పాత్రల  లాగా అస్పష్టమైన గుర్తింపును కలిగి ఉంటాయి. 

జేమ్స్ జాయిస్, విలియం ఫాక్నర్ ల  శైలిని పోలిన ఆమె చైతన్య స్రవంతి  ప్రక్రియ పాత్ర పరిణామాన్ని చదువరికి అందజేస్తూ వస్తుంది.  స్వేచ్ఛాయుత పరోక్ష వివరణ (free indirect discourse) అర్థం చేసుకునేట్లు గా చేస్తుంది.  మిసిజ్డాలోవే నవలలో వాడిన ఈ పద్ధతి ఒకేసారి ఒకే సంఘటనలో అనేక పాత్రల భావాల్ని తెలియజేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే నిశ్శబ్దాన్ని నవలలో చూపించడం,  చర్యలను,  ప్రతిచర్యలను చూపడానికి నాటకంలో లాగా ఏకాంతాన్ని బ్రాకెట్లలో సూచించడం  ల్ఫ్  శైలిని మరింత రాణింప చేస్తుంది.

1927లో వర్జీనియా ల్ఫ్ రాసిన నవల To the Light house.  మల్టిపుల్ ఫోకలైజేషన్  మరియు చైతన్యస్రవంతి ఆధారంగా వ్రాయబడిన నవల ఇది.  కథ ఏమంత చెప్పుకోదగ్గదిగా లేకపోయినా వ్యక్తులు వ్యక్తుల మనోభావాల మీద ఆధారపడి న నవల ఇది.  కథ కొందరు కుటుంబ సభ్యులు ఒక లైట్ హౌస్ కు ప్రయాణం చేయడంమాత్రమే. 10 సంవత్సరాల పాటు జరిగిన ఇతివృత్తంగా ఉన్న కథ ఇది.

మొదటి నుంచి కోరుకుంటున్నట్లుగా  స్త్రీ పురుషులు ఇద్దరూ  సమాన హక్కులు, అధికారాలు అనుభవించాలని ఈ నవల సారాంశం. మూడు భాగాలుగా విభజింపబడిన నవల దాదాపు పది సంవత్సరాల కాలాన్ని తెలియజేస్తుంది.  రామ్సే కుటుంబంగురించి వారిలో వచ్చిన మార్పుల గురించి విశదీకరిస్తుంది. జీవితాన్ని మనుషులను విభిన్న పార్శ్వాల నుంచి, దృక్కోణాల నుంచి  చూస్తుంది. మొదటి భాగంలో  శ్రీమతి రామ్సే దృష్టి నుంచి చూస్తే రెండవ భాగం వారి లో వచ్చిన మార్పుల గురించి మూడో భాగం వారి పిల్లల రాక గురించి వారి స్నేహితురాలైన లీలీ బ్రిస్కో గురించి చెప్తుంది.

శ్రీమతి రామ్సే  స్త్రీ తత్వాన్ని గురించి ప్రతిబింబిస్తే,  రామ్సే పురుషత్వాన్ని ప్రతిబింబిస్తాడు. అయితే వారిద్దరి లో కూడా వారి వారి లోపాలు ఉంటాయి. ఉల్ఫ్ ప్రతి వ్యక్తి కూడా స్త్రీ పురుష లక్షణాలని రెండిటిని కలిగి ఉండాలని కోరుకున్నట్టుగా లీలీ బ్రిస్కో ఆదర్శవంతమైన సమాన లక్షణాల్ని రెండిటిని ప్రతిబింబిస్తుంది.  నవల పూర్తయ్యేసరికి ఆమె  ఒక చిత్రాన్ని పూర్తి చేయడం అనేది ఈ  రెండు లక్షణాల మేలుసంయోగ ఫలితం అని రుజువు చేస్తుంది.

ఇలాగే 1928 లో వ్రాసిన ఆర్లాండో అనే నవల చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీనిలో  ఆర్ల్యాండో అనే యువకుడు  పురుషుడిగా,  స్త్రీగా (androgyne) అనుభవాల్ని చర్చించడం జరుగుతుంది.  జీవిత చరిత్ర రూపంలో రాసిన ఈ నవల మారుతున్న ఆంగ్ల సాహిత్య విధానాల గురించి ఎలిజబెతెన్ , రెస్టరేషన్, విక్టోరియా కాలాల కవుల,  రచయితల గురించి చెబుతుంది. ఇది నాలుగు వందల సంవత్సరాల కాలపు ఆర్లాండో జీవితాన్ని వివరిస్తుంది.

ద వాయిజ్ ఔట్ రాచెల్ విన్రేస్ యొక్క అంతర్గత బహిర్గత ప్రయాణాలలోని మానసిక సంఘర్షణను విశ్లేషిస్తే, ద వేవ్స్ఆరుగురు స్నేహితుల మధ్య బంధం, వారి చనిపోయిన స్నేహితుడి పై గల ప్రేమ ద్వారా ఎలా నిలబడుతుందో చెప్తుంది.

మిసిజ్ డాలోవే, యులిసెస్ నవలలోలా ఒకే రోజు జరిగిన కధను భూత కాలపు సంఘటనలతో అల్లుకురావడం ద్వారా అనేక పాత్రల మధ్య జరిగిన ఘటనలు మాటలు ద్వారా కలబోత చిత్రమై చైతన్య స్రవంతిలా సాగిపోతుంది. మనం ఉల్ఫ్ కాల్పనిక అకాలనిక రచనలను పరిశీలిస్తే అవన్నీ ఆమె అనుభవాలనుంచి ఆలోచనలనుంచీ సహేతుకంగా ఉత్పన్నమైనవని తెలుస్తుంది. జీవితమూ, మనస్సు, బాధ, మృత్యువు వీటి మధ్య సంబంధాన్ని విశ్లేషిస్తూ వ్రాసినవిగా బోధపడుతుంది. తాను జీవితంలో ఎలాటి మానసిక వేదనను అనుభవించి చివరకు విసిగి ఆత్మహత్యతో జీవితాన్ని ముగించిందో ఆ సమస్యలనన్నిటినీ తన నవలలలో పాత్రలలో ప్రతిబింబించింది.

ఇక అకాల్పనిక రచనలను పరిశీలిస్తే ఉల్ఫ్ చాలా సూటిగా సమాజంలోని పురుషాధిక్యాన్ని ప్రశ్నించింది. ఎవరికెవరు తక్కువ కాదనీ ప్రతి వ్యక్తిలో ఈ రెండు పార్శ్వాలు సమానంగా ఉండాలని చెప్పింది. అ రూం ఆఫ్ వన్స్ వోన్ రెండు వేర్వేరు సందర్భాలలో ఆమె ప్రసంగాల సంకలనం కాగా, త్రీ గినీస్’ ‘మీ అభిప్రాయంలో యుద్దాన్ని నిరోధించడం ఎలా? అన్న ప్రశ్నకు ప్రతిస్పందనగా వచ్చిన 130 పేజీల వ్యాసం. ఈ రెండు రచనల ద్వారా మహిళల పట్ల చారిత్రక వారసత్వం గా చూపబడుతున్న వివక్ష – అంటే ఆ నాటి విద్యా విధానం , అది స్త్రీ పురుషులు మరియు సామాజిక దృక్పథం పై చూపుతున్న ప్రభావం, చారిత్రకంగా , సాహితీ పరంగా స్త్రీని చిత్రీకరించిన విధానం మరియు (మహిళా) రచయితలు ఎలాంటి రచనా శైలి దృక్పథం కలిగి ఉండాలి అనే అంశాలను ఉల్ఫ్ వివరిస్తుంది.

మహిళల పట్ల చూపే విద్య, ఆర్థిక సామాజిక పరిపాలన , కౌటుంబిక మతపరమైన వివక్ష ను ఆమె ఆనాటి సమాజపు చర్యల, నిర్ణయాల మరియు ఉదాహరణల ద్వారా వివరిస్తుంది . ఎనిమిది మంది సోదర సోదరీమణుల మధ్య జీవించిన ఉల్ఫ్ తానే కొన్నిసార్లు ఈ వివక్షను ఎదుర్కొంది. ఆనాటి బ్రిటిష్ సమాజంలో కూడా స్త్రీకి విద్య నిషేధము. ఆమె సోదరులు ఆక్స్ఫర్డ్ , కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించగా ఆమె మాత్రం ఇంటివద్దనే గురువుల పర్యవేక్షణలో చదువుకుంది. అయితే మిగతా మహిళలతో పోలిస్తే ఆమె పరిస్థితి కొంత నయం. తన తండ్రి తన గ్రంథాలయంలో పుస్తకాలను నిస్సంకోచంగా వాడుకోవడానికి ఆమెకు అవకాశం ఇవ్వడమే కాక ఆనాడు స్త్రీలకు గౌరవంగా భావించే రచనా వ్యాసంగాల లో ఆమెను ఆయన చాలా ప్రోత్సహించేవాడు. కానీ విద్యావకాశాలు పొందడంలో ఆ కాలం నాటి మహిళలు వివక్షకు గురి అవ్వడాన్ని ఆమె ఈ క్రింది విషయాల ద్వారా తెలియజేస్తుంది .

విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లేకపోవడమే కాక మహిళా విద్యకు ఎలాంటి ప్రోత్సాహం ఉండేది కాదు. మారుతున్న కాలాన్నిబట్టి ఏర్పరచబడిన కొన్ని మహిళా కళాశాలలకు ఎటువంటి ఆర్థిక సహకారం లభించకపోగా విశ్వవిద్యాలయాలు మహిళా కళాశాలకు సభ్యత్వమును నిరాకరించాయి. దీనికి తమ వాదనను బలపరచుకోవడం కోసం వారు మతపరమైన అంశాలను కూడా పేర్కొనేవారు. క్రైస్తవ మతము స్త్రీలకు విద్యను నిషేధించింది అనే వాదం ద్వారా మొత్తం సమాజాన్నే ఆ కట్టుబాటుకు లొంగి ఉండే విధంగా చేశారు. పురుషుడు కుటుంబ భార్య బిడ్డల బాధ్యతలను మోస్తే స్త్రీ కి గృహ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించే చదువు సరిపోతుందనే సూత్రాన్ని  ప్రచారం చేశారు.

మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం ద్వారా సమాజంలో చైతన్య పూరితమైన మార్పుకు శ్రీకారం చుట్టవచ్చు అనే అభిప్రాయాన్ని సమర్ధిస్తూ, విద్య, కళలు, అభిరుచులు స్త్రీకి భర్త ను సంపాదించుకున్నంత మేరకు చాలనే విక్టోరియన్ విలువలను ప్రోత్సహించిన సమాజాన్ని ఆమె తన కాల్పనిక రచనల లో చిత్రించడమే గాక, ఆ రెండు అకాల్పనిక రచనలలో సహేతుకంగా విమర్శించారు ల్ఫ్.

పైన చెప్పిన అంశాలపై ఆమె వ్యక్తపరిచిన అభిప్రాయాలు కొన్ని ప్రస్తుత సామాజిక పరిస్థితులలో కూడా అనువర్తించేలా ఉన్నాయి. 19వ శతాబ్దపు చివరి మరియు 20వ శతాబ్దపు మొదటి సగభాగం నాటి ఇంగ్లాండు మరియు యూరోపియన్ ఖండములో ఆమె గమనించిన, మరియు స్వతహాగా అనుభవించిన వివక్షను ఆమె చాలా సున్నితమైన వ్యంగ్యోక్తి తో స్పష్టంగా ఖండిస్తుంది. స్త్రీవాద సాహిత్యంలో తదుపరి కాలంలో వచ్చిన స్త్రీ వాదులకి ఇది ఒకింత పునరుక్తి గా అనిపించినా ఆమె స్త్రీల పట్ల వివక్షను చాలా స్పష్టంగా కచ్చితమైన, పరిశోధనా పూరితమైన , సహేతుకమైన పరిశీలన ద్వారా వ్యక్త పరిచినట్లు తెలుసుకోవచ్చు.

ఆనాటి వార్తా పత్రికలలో కొంతమంది వ్యాసకర్తలు స్త్రీ స్థానం ఇల్లు మరియు భర్త పిల్లలకు పరిమితం కావాలని వ్యక్తపరచగా వుల్ఫ్ ఈ అభిప్రాయాలు ప్రపంచంలోనే గొప్పదైన ప్రజాస్వామిక దేశంగా చెప్పబడే బ్రిటిష్ సమాజంలో ఫాసిస్టు ధోరణులు గా కనిపిస్తున్నాయని తీవ్రంగా విమర్శిస్తుంది. మహిళల పట్ల వివక్షతో విద్యను నిరాకరించడమే కాక ప్రభుత్వ మరియు ఇతర ఉపాధి రంగాలయిన ఉపాధ్యాయ, వైద్య, ఇంజనీరు, వ్యాపార, సివిల్ సర్వీసు రంగాలలో మహిళలే కనిపించరని, ఉన్నత పదవులలో వారి స్థానము శూన్యమని, అయితే ప్రాథమిక స్థాయి పదవులలో వారు అక్కడక్కడా కనిపించినా వారికి ఇవ్వబడిన జీతం పురుషుల కంటే చాలా తక్కువ అని ఆమె పరిశీలిస్తుంది . సైన్యము, నౌకాదళం, స్టాక్ ఎక్స్చేంజ్, వైద్య రంగం మొదలైన వాటితో పాటు చర్చి కూడా తమకు సంబంధించిన ఉద్యోగాలు పదవులలో స్త్రీని విమర్శిస్తూ ఈ రంగాలలో స్త్రీకి స్థానం ఇవ్వకపోవడాన్ని గమనిస్తుంది ఉల్ఫ్. స్త్రీ-పురుషులనే తేడా లేదు మీరందరూ జీసస్ లో భాగమే అని బైబిల్లో చెప్పబడినపుడు మహిళలను మత బోధకులుగా అంగీకరించడంలో సమాజం ఎందుకు వివక్ష చూపుతుంది అని ప్రశ్నిస్తుంది .

ఈ విధమైన వివక్ష మహిళల పట్ల చూపడానికి గల సామాజిక చారిత్రక కారణాలను విశ్లేషించి క్రమంలో స్త్రీ పురుషులు ఒకరి పట్ల ఒకరికి గల ఉండవలసిన అవగాహన గురించి ఈ విధంగా పరిశీలన చేస్తుంది .

పితృస్వామ్య విలువలను ప్రతిబింబిస్తూ పురుషులు ఆధిపత్య భావజాలంతో ప్రవర్తించడానికి కారణం వారిని ఆ విధంగా మలచిన విద్యావిధానం. అదే విధంగా స్త్రీలు న్యూనతా భావంతో పితృస్వామ్య ఆధిపత్యానికి లొంగడానికి కారణము అదే విద్య. పురుషులు ఆధిపత్య ధోరణితో ప్రవర్తించడానికి, పితృస్వామ్య విలువలను పెంచి పోషించిన స్త్రీలు కూడా కారకులు. వారి వలనే పితృస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చిన భూస్వామ్య రాచరిక వ్యవస్థలు సమాజాన్ని నియంత్రించాయి. కానీ ఒక మహిళ ఆర్ధిక స్వావలంబన యొక్క రక్షణ కలిగినప్పుడు తార్కికంగా సహేతుకంగా ఆలోచించగలదు. తద్వారా పురుషుని ద్వేషించడం లేదా కీర్తించడం అనే రెండు విపరీత ధోరణులను తప్పించుకో గలదు. విద్యను పొందడం ద్వారా మహిళ, పురుషుని పట్ల భయం మరియు వ్యతిరేకతను లేక జాలి మరియు సహనం ప్రదర్శించడమేగాక, నెమ్మదిగా నిష్పక్షపాతంగా ఆలోచించగలిగే స్వేచ్ఛను పొందుతుంది.

కరడుకట్టిన స్త్రీ వాదులకు ఈ విధమైన పరిణతి చెందిన ఆలోచన అంతగా రుచించకపోయినా , ఉల్ఫ్ ఇదే విధమైన ఆలోచనను ఈ విధంగా కూడా వ్యక్తపరుస్తుంది. పితృస్వామ్య వ్యవస్థ ఆధిపత్య భావజాలంతో, పురుషులు ఫాసిస్టు నాజీల ఆధిపత్యంపై ఎలా పోరాటం చేస్తున్నారో , మహిళలుగా అదే విధంగా పోరాడుతున్నా మని తమ ఇద్దరి సామాజిక స్థానముల యొక్క సమస్థితిని, అణచబడిన రీతిని చాలా చక్కగా విశ్లేషిస్తుంది.

స్త్రీపురుషులిరువురూ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయము అనే హక్కుల కోసం పోరాడే సందర్భంలో స్త్రీ వాదమనే పదము అవసరం లేదని, స్త్రీలు తమ హక్కుల కంటే మానవ హక్కుల కోసం పోరాటం జరుపుతున్నారని చెప్తూ స్త్రీ పురుషుల మధ్య తీవ్ర అంతరాయం తగ్గించే ప్రయత్నం చేస్తుంది.

ఇదే విధంగా స్త్రీ పురుషులకు సమాజంలో కల్పించబడిన భిన్నమైన స్థానాలను విమర్శిస్తూ, చరిత్రలో మహిళను, స్త్రీలపై రచనలలో మహిళలను చిత్రీకరించిన తీరును కూడా విశ్లేషిస్తుంది. పురుషుల సాహిత్యమంతా స్త్రీలను చాలా వరకు శారీరకంగా, మానసికంగా, మేధోపరంగా, విలువల పరంగా తక్కువ స్థాయి వారిగా చూపించారని భావిస్తుంది. ఈ రకమైన చిత్రీకరణకు కారణం పురుషునికి గల అభద్రతాభావమని, ఆ భావనలో ఒక రకమైన ద్వేషం (ధనవంతుడికి పేదవాడు తనను దోచి వేస్తాడేమో అని అభద్రతా భావంలో నుంచి కలిగేటటువంటి ద్వేషం) వలన ఈ రకమైన చిత్రీకరణ ద్వారా మహిళను నియంత్రించే ధోరణికి దారితీసిందని అభిప్రాయపడుతుంది.

చారిత్రకంగా స్త్రీలను రచయితలుగా పరిశీలించినప్పుడు ప్రారంభ దశలో స్త్రీలు రచనావ్యాసంగం నిషేధింప బడటం వలన తమ వేదన, కోపం , అసంతృప్తులను వ్యక్తపరిచారని ఇదే ధోరణి చాలా కాలం కొనసాగింది అని చెప్తూ ఉల్ఫ్ కు ఒక మహిళా రచయితగా స్త్రీవాద బలపరిచే ఒక సామాజిక చైతన్యవంతురాలి గా గుర్తింపు తెచ్చిన ఈ క్రింది అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తుంది.

మహిళా రచనావ్యాసంగం సఫలీకృతం గా చేయాలంటే రెండు విషయాలు చాలా అవసరం అని , అవి – తనకంటూ ఒక ప్రత్యేకమైన నివాసం మరియు తనకంటూ ఆదాయం అని చెప్తుంది. అదేవిధంగా రచనా సాహిత్య రంగంలో తమ ప్రత్యేకతను స్థానమును చాటుకోవాలంటే తమదైన భాష ఉండాలని, ఆ విధమైన భాష, వాక్య నిర్మాణము జేన్ ఆస్టిన్ లో కనిపిస్తాయని చెప్తుంది. సమాజమెప్పుడూ స్త్రీల రచనలను పురుషుల రచనా ప్రమాణాలతో కొలిచి పురుషుల రచనలలా గొప్పవిగా ఉన్నాయని, లేదా కేవలం స్త్రీల రచనలు సామాన్యంగా ఉన్నాయనే విమర్శల ప్రభావానికి మహిళా రచయితలు లోను కాకూడదు అని సూచిస్తుంది. మహిళా రచయితలైనా, పురుష రచయితలైనా సమాజాన్ని ప్రతిబింబించే సాధారణ పరిస్థితులను, ప్రజలను, సంఘటనలను, భావాలను తమ రచనలలో చూపాలని అదేవిధంగా ప్రఖ్యాత కవి Coleridge చెప్పినట్లు మహిళా లేదా పురుష రచయితలు తమ ఆలోచనా విధానంలో రెండవ వర్గం వారి గురించి ఆలోచించాలని, దీనిని ఆయన ఆరోగ్యకరమైన androgynous లక్షణంగా అంటే స్త్రీ – పురుష లక్షణాలు రెండుగా కలిగి ఉండటమని, దానిని రచయితలు ముఖ్యంగా పాటించాలని సూచిస్తుంది. స్త్రీ, పురుష అనే లింగ ప్రత్యేకతను చూపించే స్థితిని విడిచి వ్యక్తులుగా ఆలోచించి రచన చేయాలని చెప్తుంది. దీనిని అనేక నవలలోను వ్యక్తపరుస్తుంది.

దేశభక్తి, జాతీయతా భావం గురించి వ్రాస్తూ అవి చాలా పరిమితమైన ఆలోచనలని , దేశ రాజకీయ, ఆర్థిక అంశాలలో భాగస్వామ్యం, అధికారము మరియు యాజమాన్యం పొందని మహిళకు దేశభక్తి ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తుంది. చారిత్రకంగా అధికకాలం స్త్రీని బానిస గా చూసి, తన దేశ సంపదను, విద్యను స్త్రీకి నిరాకరించి, తనను తాను రక్షించుకోవడానికి మహిళకు అవకాశం ఇవ్వక, ఒక విదేశీయుడిని వివాహమాడ గానే తన దేశ పౌరసత్వం నుంచి మహిళను దూరం చేసే దేశం పట్ల భక్తి ,జాతీయతా భావన ఎలా కలుగుతుంది? అని తీవ్రంగా ప్రశ్నిస్తుంది. పురుషులకి స్వతఃసిద్ధంగా పోరాటము, బలప్రయోగం అనే లక్షణాలు ఉన్నాయని, వాటిని తృప్తిపరచడానికి దేశభక్తి, జాతీయత అనే భావాలను ప్రోత్సహిస్తారని, తాను మాత్రం ఒక స్త్రీగా ప్రపంచం అంతా నా దేశం అని భావిస్తాననీ తెలియచేస్తుంది.

ఇలా తన సమకాలీన కాలమాన సామాజిక పరిస్థితులకతీతంగా వుల్ఫ్ అభిప్రాయాలు చాలా విప్లవాత్మకంగానే కాక ఈనాటి పరిస్థితులకూ ఒక మార్గదర్శకంగా నిలిచాయి.

*

డాక్టర్ విజయ్ కోగంటి, డాక్టర్ పద్మజ కలపాల

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.