ప్రపంచ సాహిత్యాన్ని విప్లవీకరించిన ‘అక్టోబర్’

మొదటి ప్రపంచ యుద్ధం అక్టోబర్ విప్లవానికి జన్మనిచ్చింది. 1917 అక్టోబర్ (నవంబర్) లో ప్రపంచ చరిత్రలో మున్నెన్నడూ ఎరుగని విధంగా సామాన్య జనం ఉత్పత్తి సాధనాలను సొంతం చేసుకున్నారు. ఎన్నో యుద్దాలను చూసిన చరిత్ర, సామ్రాజ్యాలకు సామ్రాజ్యాలే కూలిపోయి కొత్త సామ్రాజ్యాలవతరించడం గమనించిన చరిత్ర… అంతవరకు చూడని ఒక కొత్త యుద్ధం చూసింది. కార్మిక, కర్షక వర్గం ఒక కొత్త సమాజాన్ని నిర్మించ పూనుకోవడం మిగిలిన ప్రపంచానికంతకూ కొత్తగా, ఆశ్చర్యంగా, గొప్పగా కనిపించింది. శ్రామికవర్గం క్యాపిటలిస్టు వ్యవస్థను కూలదోయడమే కాక ఆ కూలిన ఇటుకల నుండి మానవజాతి చవి చూడని వ్యవస్థ, సంస్కృతి నిర్మాణం మొదలెట్టింది. కూలిన పాత వ్యవస్థ లోని సరైన వాటిని తీసుకుంది, కాలం చెల్లిన వాటిని విసిరేసింది. ఆ మహత్తర విప్లవం నుండి పుట్టిన సాహిత్యం కుడా తనదైన నూతన సంస్కృతీ శకలాలతో నవ్య బాటలు వేసింది.

ప్రజా యుద్ద కాలం లో బోల్షివిక్ పార్టీ, దాని నాయకుడు లెనిన్ సాహిత్యానికి గల ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకొని మాక్సిం గోర్కి వంటి రచయితలను ప్రోత్సహించడం వల్ల ప్రజాయుద్ధ ప్రచారానికి సాహిత్యం బలమైన వాహకం గా పనిచేసింది. 1912లో స్థాపించిన ‘ప్రావ్డా’ పత్రిక ద్వారా కుడా ఈ రచయితలకు ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహించారు. జారిస్టు ప్రభుత్వాన్ని, క్యాపిటలిజం వైఫల్యాలను ఎండగడుతూ కార్మిక ప్రజాయుద్ధ పోరాటాలను ప్రోత్సహిస్తూ రచనలు చేసిన రచయితలను ‘ఫెలో ట్రావెలర్స్ ఆఫ్ రెవల్యూషన్’ గా పేర్కొన్నారు. అదే సమయంలో పాశ్చాత్యం నుండి వచ్చిన యువ కార్మిక రచనలు కూడా రష్యన్ సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి. రష్యాలో కార్మిక కర్షకులు నడుపుతున్న ప్రజాయుద్ద ప్రభావం ప్రపంచ సాహిత్యం పై పడింది. అనేక దేశాల కార్మికులకు ఈ విప్లవం ఉత్తేజాన్నిచ్చింది, ఆ స్పూర్తితో వారికి బాసటగా ఆ యా దేశాల్లో రచనలు వచ్చాయి. తూర్పు , పశ్చిమ దేశాల్లో జరుగుతున్న కార్మిక పోరాటాలకు సాహిత్యమే ఉత్ప్రేరకం గా పనిచేసింది. జర్మనీ దేశం లో కుడా మొదలైన ప్రజాయుద్దం అనేక నాటకీయ పరిణామాలతో సోషల్ డెమోక్రసీ నమ్మక ద్రోహం తో ముగిసినా ఆ పోరాట చరిత్రకు అసమాన స్పూర్తినందించి ప్రాణాలు కోల్పోయిన ‘రోజా లక్జెం బర్గ్’ , ‘కార్ల్ లీబ్నెక్ట్’ వంటి రచయితల ధీరత్వాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ యుద్దమంతా ప్రధానంగా ఫ్యాక్టరీలలో పనిచేసిన కార్మిక నాయకుల సారధ్యం లోనే నడిచింది, మార్చ్ విట్జా, గ్రున్ బెర్గ్, క్లేబెర్ వంటి నాయకులు ఆ కాలంలో జర్మన్ భాషలో చేసిన అనేక రచనలు అక్కడి ప్రజయుద్దాన్ని నడిపించాయి. మనకు అంతగా తెలియన్దేమిటంటే అక్టోబర్ విప్లవ ప్రభావం ఆసియా దేశాల మీద పడినా అది అంతగా ప్రచారం కాలేదు. జపాన్ లో అక్టోబర్ విప్లవ ప్రభావం తో వచ్చినన్ని రచనలు రష్యా లో తప్ప మరే దేశం లో కూడా రాలేదు. ఆ సాహిత్యం లో వారు చూపిన కార్మిక వర్గ సహానుభూతి, సామాన్యత చాలా గొప్పగాఉంటాయి. అక్కడి కార్మిక సమూహాల్లోంచి వచ్చి రచనలు చేసిన వారిలో పేర్కొనదగిన వారు కొబయాషి, కుకుషిమా, సెకేటి, హయాషి, టోకుంగా. వీరిలో కొంతమంది రచయితలుగానే కొనసాగగా కొంతమంది అక్కడి కమ్యునిస్ట్ పార్టీ సభ్యులుగా పనిచేశారు. జపాన్ లో వచ్చిన ఈ సాహిత్యం అక్కడి కార్మికులను విపరీతం గా ఆకర్షించింది, అక్కడ జరిగిన అనేక పోరాటాలకు ఉత్ప్రేరకంగా పనిచేసింది, ఇది ఎంతగా ఆకర్షించిందంటే ఈ సాహిత్యాని కున్న డిమాండు చూసి అక్కడి క్యాపిటలిస్టు పబ్లిషర్లు కుడా ముద్రించడం మొదలుపెట్టారు. అమెరికాలో రచయితలలో ఒక విభజన వుండటం గమనిస్తాం. జేమ్స్ స్టీల్ వంటి రచయితలు ఆనాటి ఫోర్డ్ కార్మికుల కడగండ్లను వర్ణించడం కద్దు. డోస్ పాసోస్ వంటి వారు ‘ది సెకండ్ ప్యారలల్’ , ‘1919’ వంటి రచనల్లో కార్మికుల పక్షం తీసుకున్నారు. ఎన్ని విభేదాలున్నా ప్రపంచ రచయితలు క్యాపిటలిజం దుర్మార్గ పోకడలను వర్ణిస్తూ రచనలు చేశారు. ఫ్రాన్సు లో అనేక మంది రచయితలు తమని తాము కమ్యునిస్టులుగా అభివర్ణించుకున్నారు. ఆంద్రీ గిడ్ అనే రచయిత కార్మిక పక్షం మళ్ళగానే ఫ్రాన్స్ రచయితలూ, పబ్లిషర్లూ రచయితగా అతడు చనిపోయినట్టే అని ప్రకటించారు. రోమన్ రోలాండ్ వంటి గొప్ప రచయిత మొదట తనను మానవతా వాదిగా ప్రకటించుకున్నా ‘జెన్ క్రిస్తోఫ్’ తో తానూ కార్మిక పక్షమే అని తేల్చాడు. ‘డెస్టినీస్ ఆఫ్ ది ఏజ్’ రచయిత జీన్ రిచర్డ్ బ్లాక్, ఫెర్నాండేజ్ ఆనాటి ప్రసిద్ద ఫ్రాన్స్ కార్మిక రచయితలు.

ఏదేమైనా అక్టోబర్ విప్లవం అప్పటి రచయితలను రచయితలారా మీరెటు వైపు అని ప్రశ్నించింది. ప్రపంచ సాహిత్యం మొదట రష్యా విప్లవాన్ని మూర్ఖుల నాయకత్వంలో నడిచిన బానిసల తిరుగుబాటుగా చూసింది. ‘ఆన్ లస్ట్ , ఫిల్త్ అండ్ బ్లడ్’ అనే పుస్తకం రాసిన ఫ్రెంచ్ రచయిత ‘గాబ్రియల్ డౌ మెర్గ్’ అక్టోబర్ విప్లవాన్ని ‘అశుద్ధం నిండిన కుండ’ అన్నాడు. విప్లవం తర్వాత ‘కుండ పగిలింది అశుద్ధం మిగిలింది’ అని వాక్రుచ్చాడు. అంతే బిలియన్ల కొద్దీ ఆ కుండ మీద డబ్బు వెచ్చించిన వారికి అంతకన్నా ఏం తెలుస్తుంది? ఇలాంటి సాహిత్యానికి ఇంకొక ఉదాహరణ హెచ్ జి వెల్స్ రచన ‘రష్యా ఇన్ ది షాడోస్’ ఆయన అభిప్రాయం ప్రకారం ‘అక్టోబర్ విప్లవంతో అక్కడి పాలనా పద్దతులూ, విద్య లేమి, యుద్ద వాతావరణం ఆధునిక నాగరికతను(?) కడతేర్చాయి, జీవిత అవసరాలూ, నాగరికతా పోకడలన్నీ నిష్క్రమించాయి’. ఈయన రష్యన్లను విపరీతం గా ఈసడించుకున్నాడు ‘రష్యన్ ప్రభుత్వాన్ని అవగాహన లేమి ప్రభుత్వం’ గా వర్ణించాడు. ‘వారు ఎంత అమెచ్యూర్ అంటే కైరో , డమాస్కస్ లలో ఉన్న ముస్లిం పాలకుల వంటి వాళ్లు’ అంటూ విమర్శించాడు. ఆయన మార్క్స్ ను అవహేళన చేశాడు కానీ చివరకు ‘వారి ఆదర్శాన్ని మాత్రం నేను గౌరవిస్తాను’ అనక తప్పలేదు. ఇంగ్లీషు బూర్జువాల గురించి అది మాత్రమే చరిత్ర అన్నట్టుగా రాసిన తన పుస్తకం ‘హిస్టరీ ఆఫ్ ది వరల్డ్’లో అక్టోబర్ విప్లవానికి ఒక చాప్టర్ కేటాయించక తప్పలేదు.

“ప్రపంచాన్ని కుదిపేసిన ఆ పది రోజులు” రచయిత జాన్ రీడ్ అమెరికా సోషలిస్టు పత్రిక ‘ది మాసెస్’ లో జర్నలిస్ట్ గా పనిచేస్తూ అప్పటి పెట్రోగ్రాడ్ ( సెయింట్ పీటర్ బర్గ్) అక్టోబర్ విప్లవాన్ని కళ్ళారా చూస్తూ రికార్డ్ చేశాడు. నిజానికి అతనికి మార్క్సిజంతో సంబంధం లేదు. ఆ విప్లవంతో అతనికే మాత్రం సంబంధం లేదు. 1919 లో ప్రచురించబడిన ఈ పుస్తకం త్వరగానే టాప్ లిస్టులోకి చేరుకుంది. దానికి ముందు మాట రాసిన ఎ జే పి టేలర్ ‘బోల్షివిక్ విప్లవమే కాదు మరే విప్లవాన్ని ఇంతబాగా వర్ణించిన వారు లేరు’ అంటూ కితాబిచ్చాడు. కమ్యూనిస్టు భావాల పట్ల ఆకర్షణ ఉన్నవారి కెవరికైనా రీడ్ రాసిన.. .. పెట్రోగ్రాడ్ లో సామాన్యులు, అసాధారణంగా అధికారాన్ని చేజిక్కించుకున్న వర్ణన చదువుతుంటే ఒక జానపద కథను చదువు తున్నట్టుంటుంది.

“ రష్యా మొత్తం చదవడం నేర్చుకుంటుంది రాజకీయాలు, ఆర్థికమూ, చరిత్రా ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు, ….. ప్రతి నగరమూ, ప్రతి పట్టణమూ, అన్ని రాజకీయ గుంపులూ వారి వారి వార్తా పత్రికలతో వందల వేల కరపత్రాలు వేల సంఘాల సభ్యులు సైన్యంలో, గ్రామాలలో, ఫ్యాక్టరీలలో, వీధుల్లో కుమ్మరించారు. ఎన్నో ఏండ్లుగా తొక్కి ఉంచిన నేర్చుకోవాలన్న దాహం ప్రజాయుద్దంతో ఒక్క సారిగా ప్రజలను ముంచెత్తింది”

ప్రజలు చదవడంతో ఆగలేదు వాటిని గురించి చర్చించుకున్నారు

“ప్రతి ప్రజాసమూహం రాత్రిళ్ళు మీటింగ్ లు నిర్వహించేది, తీవ్రమైన చర్చలుండేవి. విశాల రహదారులన్నీ ఆ నిరాశా సాయంత్రాలు ప్రజా సమూహాలతో నిండిపోయి కెరటాల్లా నేవస్కా వైపుకు పత్రికల కోసం కదిలేవి”

లండన్, పారిస్ నగరాల్లా ప్రశాంతంగా కాకుండా ఓక్ సైన్స్ ఫిక్షన్ నవలల్లో లాగా మానవ జీవితమంతా ఒక్కటిగా కదలడం గురించి

“నెలల తరబడి పెట్రోగ్రాడ్ నగరమంతా, రష్యా మొత్తమంతా, ప్రతి వీధి చివరా, రైళ్లలో, వాహనాల్లో ఎక్కడ చూసినా చర్చలే చర్చలు”

రీడ్ ఒక ఎర్ర సైన్య ఆఫీసర్ చెప్పిన విషయాన్ని ఇలా రాశాడు ‘ రష్యాలో రాజకీయాలు అంత సులభం కాదు. మీ అమెరికన్లు పుట్టుకతోనే పొలిటీషియన్లు, మీకు మీ జీవితాల్లో రాజకీయాలున్నాయి కానీ మాకు …..’

రీడ్ ఇంకా ఇలా రాస్తాడు “విదేశీయులు, ముఖ్యంగా అమెరికన్లు రష్యా కార్మికులకు తెలివిలేదని నమ్ముతుంటారు. వారికి పాశ్చాత్యులకున్న రాజకీయానుభవం లేదు అన్నమాట నిజమే కానీ వారు ఎంత నిర్మాణాత్మకంగా ఉంటారంటే 1917 కంతా రష్యన్ కన్స్యూమర్ కొ ఆపరేటివ్ సొసైటీ లలో పన్నెండు మిలియన్ల మంది సభ్యులుగా ఉన్నారు”

రీడ్ కలలో లాగా విప్లవ ప్రాంగణమైన పెట్రో గ్రాడ్ అంతా కలయ తిరిగాడు. ఒకటి రెండు చోట్ల రెడ్ గార్డ్ లు ఇతన్ని చంప బోయారు కూడా

టెన్ డేస్…. సినిమా పోస్టర్

రీడ్ ఈ పుస్తకాన్ని ఒక ఆర్టిస్టు లాగా కాక ఒక చారిత్రాత్మక పత్రం గా తయారు చేశాడు. ఈ పుస్తకం ఆధారం గా 1928 లో సినిమా తీశారు దానిపేరు కుడా “అక్టోబర్ : టెన్ డేస్ దట్ షుక్ ద వరల్డ్ “. ఇందులో లెనిన్ పాత్ర దారి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుడు. మయకోవస్కీ ఆ పాత్రను చూసి తిట్టకుండా ఉండలేక పోయాడు, అంత నాసి రకం గా తీశారు.

‘ది జంగిల్’ వంటి నవల రాసిన అప్టన్ సింక్లైర్ మరో అమెరికన్ రచయిత రష్యా విప్లవాన్ని ఇలా పోల్చాడు’ ‘అమెరికా రైతు మొదటిసారిగా ఒంటెను చూసినప్పుడు ఇలాంటి జంతువు భూమ్మీద ఉండదు గాక ఉండదు అనుకుంటాడు.. అలాంటి దే అక్టోబర్ విప్లవం కూడా, క్యాపిటలిస్టులు అచ్చం ఆ రైతులాగే అనుకుంటారు’ .

అక్టోబర్ విప్లవ తుఫాను మనదేశాన్ని కూడా తాకింది అది కలగజేసిన అలజడి కుడా తక్కువేమీ కాదు సుబ్రమణ్య భారతి పురాణాల నుదాహరిస్తూ అక్టోబర్ విప్లవాన్ని ప్రస్తుతించాడు. నజ్రుల్ ఇస్లాం “లేవండి సహోదరులారా, నవీన మాతకు స్వాగతం చెప్పండి” అంటూ పద్యాలు రాశారు. ప్రేమ చంద్ తనదైన శైలి లో అక్టోబర్ విప్లవాన్ని స్వాగతించాడు. ఇక్బాల్ “ మేల్కొనండి ప్రపంచమొక కొత్త మలుపు తిరుగుతోంది, మన వేకువ పొడుపిక తూర్పు, పశ్చిమాన ఉదయిస్తుంది” అంటూ రాశాడు. మాక్సిం గోర్కి ‘అమ్మ’ నవల దొంగ చాటుగా భారత్ లోకి తీసుకురాబడ్డది. అన్ని భారతీయ భాషల్లోకి తర్జుమా అయింది. భగత్ సింగ్ ను ఉరితీయ బోయే ముందు ఆయన లెనిన్ రాసిన ఒక పుస్తకాన్ని తీవ్రం గా చదువుతూ ఉండగా ఆయనను పిలిచిన పోలీసుకు ఆయనిచ్చిన సమాధానం’ “కొద్ది సేపు ఉండండి ఒక విప్లవకారునితో ఇంకొక విప్లవకారుడు సంభాషించుకునే సమయం ఇది”

ఆనాటి స్వాతంత్ర్య పోరాట జ్వరతీవ్ర వాతావరణం లో అక్టోబర్ విప్లవ స్ఫూర్తి భారత్ లో అనేక రచనలకు ఆస్కారమిచ్చింది.

***

వేణుగోపాల రెడ్డి

వేణు గోపాల రెడ్డి: కర్నూల్ జిల్లా వడ్ల రామాపురంలో జన్మించారు. వృత్తి రిత్యా హై కోర్ట్ లో న్యాయవాది. ప్రవృత్తి వామపక్ష సాహిత్య అధ్యయనం, ప్రచారం. రెండు దశాబ్దాల కింద కర్నూల్ కేంద్రంగా పని చేసిన LEAP (లీగల్ ఎడ్యుకేషన్ అండ్ ఎయిడ్ పర్ పూర్) వ్యవస్థాపకుడు. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా మొదట కర్నూల్ లో ఇప్పుడు హైదరాబాద్ లో అనేక సాహిత్య సాంస్కృతిక వ్యాపకాలలో ఉన్నారు. ‘ప్రజ్వలిత’అనే సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వామపక్ష సైద్దాంతిక అంశాల మీద పలు జాతీయ దిన పత్రికలలో వ్యాసాలూ సమీక్షలూ రాశారు.  ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకోడానికి​,​ వ్యాఖ్యానించడానికీ, మార్చడానికీ వామపక్ష రాజకీయాలు మినహా మరేదీ లేదనే అచంచల విశ్వాసం.

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.