అమెరికా ఆస్ట్రేలియా దేశాలలో చాలా పదాలు అఫెన్సివ్ అనిపిస్తాయి. అఫెన్సివ్ అంటే అసహ్యకరంగా, అసంబద్ధంగా, నిందార్ధకమైన, దూరీతమైన, తుచ్చమైన, జాతి వివక్షతతో కూడిన..ఇలా అనేక అర్ధాలు చెప్పుకోవచ్చు. ఒక్కొక్క. పదం ఒక్కొక్క జాతీయతకు లేదా జాతికి చెందిన వ్యక్తులకు ఇవి ప్రమాదకరంగా అనిపించవచ్చు. కలర్డ్ అనే పదాన్ని ముఖ్యంగా నల్లవాళ్ళని పిలవడానికి వాడతారు. తెల్లవాళ్ళకు, నల్లవాళ్ళకు పుట్టిన సంతతిని కలర్డ్ అంటారు. ఆస్ట్రేలియాలో ఈ పదాన్ని పలకడానికి కూడా అక్కడి చట్టం ఒప్పుకోదు. ఇది చాలా అఫెన్సివ్ పదం. కూలీ అనే పదం ఎంత తుచ్చమైన పదమో! మనకు తెలియకుండానే ఎడాపెడా వాడేస్తాం. చైనా, భారతదేశం ఇంకా ఆసియా దేశాలలో పని ప్రత్యేక నైపుణ్యాలు లేని కార్మికులను కూలీలని పిలిచేవారు. ఇంకా పిలుస్తున్నారు కూడా. తెలుగు రాష్ట్రాలలో కూడా ఇది అత్యంత అవమానకరమైన పదం. దాగో అనే పదాన్ని ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ అమెరికాలకు చెందిన వ్యక్తులు తిట్టులా భావిస్తారు. అలాగే ఎస్కిమో అనే పదం. మనం తరుచుగా తెల్ల జాతీయులను అవమానకరంగా మాట్లాడడానికి వాడే పదం ఫిరంగీ. మన తెలుగు వాళ్ళు క్రైస్తవులను కిరస్తానీయులు అనీ, చాందసం బాగా తలకెక్కినవాళ్ళయితే మ్లేచ్చులని ఆనాయాసంగా పిలుస్తారు. పత్రికల్లో ఎలాంటి భేషజాలు కూడా లేకుండా రాయడానికి అలవాటుపడిపోయాయి.
నేను విదేశాలలో ప్రభుత్వం తరపున విదేశీ అసైన్మెంట్ చేస్తున్నప్పుడు భారత రాయబార కార్యాలయంలోని అటాచీలు, డిప్లొమేటిక్ స్థాయి కలిగి వున్న భారతీయ సిబ్బంది కూడా తెల్లవారిని ఫిరంగీలని సంబోధించడం విన్నాను. నాకు అశ్చర్యం కలిగేది. చైనాలోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది పాకిస్తాన్ వాళ్ళని ‘పాకీ’లని పిలిచేవారు. విరోధి దేశంగా పాకిస్తాన్ పట్ల మన ఎంబసీ సిబ్బందికి కోపం ఉండొచ్చు, న్యాయం కూడా. పాకిస్తాన్ చేసే పనులు వీరికి చికాకు కలిగిస్తూ ఉండొచ్చు. పాకీ అనే పదం కేవలం పాకిస్తానీయులను అవహేళన చెయ్యడానికి మాత్రమే ప్రచారంలో ఉండి ఉండొచ్చు. కానీ పాకీలని పిలవడం ఇండియాలో పారిశుధ్య కార్మికులను చులకన చేస్తునట్లుగా అనిపించేది. పాకీ అనే పదాన్ని వాడి ఒక పాకిస్తాన్ కమెడియన్ ఇబ్బందుల్లో పడ్డాడు. మన దేశంలో అయితే పాకీ అనే పదాన్ని ఎడాపెడా వాడేస్తుంటాము. వాడు పాకీ వాడ్రా అని అనడం సర్వ సాధారణం. పాకీ పని ఎంత గొప్పదో, పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మురిక్కాలువలను శుభ్రం చేస్తూ ఈ సమాజానికి ఎంత సేవ చేస్తున్నారో బెజవాడ విల్సన్ మాటలు వింటే తెలుస్తుంది. జంధ్యాల అనే ఒక సినిమా డైరెక్టర్ అనేక సినిమాల్లో పింజారీ వెధవ అని ఒక కులాన్ని కామెడీ పాత్రలతో తెగ తిట్టించేవాడు. ఇప్పుడు బతికి ఉంటే జంధ్యాల ఆ మాటలకు ఏం జవాబు చెప్పేవాడో! ఫ్రెంచ్ వాళ్లని తిట్టడానికి ఫ్రాగ్ అనే పదాన్ని వాడుతుంటారు. జిప్సీ, గూక్, హాఫ్ బ్రీడ్, గొయ్, పిగ్మీ, రెడ్ ఇండియన్ వంటి పదాలు కూడా వినడానికి చెత్తగా, అసంబద్ధంగా అనిపిస్తాయి. స్థానిక ప్రజలకు ఈ పదాలు అసహ్యం పుట్టిస్తాయి. కానీ మీడియా మాత్రం పట్టించుకోదు. కేసులూ దావాలకు భయపడి అభివృద్ధి చెందిన దేశాలలోని మీడియా సంస్థలు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాయి. అలాగే అభివృద్ధి చెందిన, అగ్ర దేశమైన అమెరికాలో అంకుల్ టాం, వైటీ, యాంకీ వంటి పదాలు అమెరికన్ జాతీయులకు అసహ్యం జుగుప్స కలిగిస్తాయి. నిగ్గర్, నీగ్రో అనే పదాలు వాడడం ఎంత ప్రమాదకరమో, అంత జాతి వివక్షతతో కూడినవి.
ముస్లిం కాదని ఎవరైనా విమర్శించడానికి కొంతమంది తీవ్రవాద భావాలు కలిగిన ముస్లింలు ఉపయోగించే పదం కాఫిర్. అంటే ‘విశ్వాసం లేనివారు’ అని అర్థం. ఈ పదం కూడా చాలా నిందార్ధకమైనదే. ఈ పదం హిందువులకు, ముస్లిమేతరులకు కోపం తెప్పిస్తుంది. కాఫిర్లని ముద్ర వేసి హత్యలకు పూనుకున్న సంఘటనల గురించి మనం ఎన్ని చదివాం!
చాలా సార్లు మనం బిహారీలు అని చాలా తేలికగా మాట్లాడుతుంటాము. ఈ పదం బిహారీల మనోభావాలను దెబ్బతీస్తోందని అనేకమంది ఆ రాష్ట్రానికి చెందిన మిత్రులే నాదగ్గర వాపోతుంటారు. అలానే ‘బీమారు’ రాష్ట్రాలు. ‘ బీమారు ‘ పొడి అక్షరాల్లో బీహార్, మధ్యప్రదేష్, రాజస్థాన్, ఉత్తరప్రదేష్ రాష్త్రాలు. ‘ బీమారు ‘ పదానికి హిందీలో దగ్గరగా ఉన్న పదం ‘బిమార్’. అంటే జబ్బుపడినవాడు అని అర్దం. ఈ పదాన్ని కనిపెట్టిన వాడేవడోగానీ ఈ ఒక్క పదంతో నాలుగైదు రాష్ట్రాలను తిట్టేలా ఈ పదాన్ని వాడుతున్నారు.
తెలుగులో ప్రసారాలు చేసే మీడియా కూడా ఏ పదం పడితే ఆ పదాన్ని వాడేస్తుంది ఎలాటి భయాలు, భేషజాలు లేకుండా. మహా అయితే క్షమాపణలు చెప్పొచ్చులే అని విషయాన్ని తేలికగా తీసుకుంటూ. క్షమాపణకు ఇప్పుడు అర్ధమే మారిపోయింది. ప్రజలు కూడా అలాగే తయారయ్యారు. పోయిన వారం హైదరాబాద్లో మా ఇంటిదగ్గర చాలామంది భక్తులు మా అందరికి దగ్గరా డబ్బులు పోగుచేసి వినాయకచవితి నిమజ్జనానికి ముందు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా అన్నమయ్య కీర్తనలను ఆలపించారు. ఒక కీర్తన ‘ బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే’ ఉదహరిస్తాను. ఈ కీర్తనలో కొన్ని పంక్తులు పూర్తిగా గుర్తులేవుగానీ ‘ఛండాలుడొక్కడే ‘ అనే పదం వినడానికి ఎబ్బెట్టుగా అనిపించింది. నలుగురు హిందూ మిత్రులతో కూర్చుని వింటుంటే ఈ పదం విని అందరం మొహామొహాలు చూసుకున్నాం. సమతను చాటి చెప్పడానికి అసమ పదజాలాన్ని వాడాలా అనిపించింది. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఇంత బహిరంగంగా ఈ పదాలు వాడడం సమంజసమా అనిపించింది. ‘ఛండాలుడు’ ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే పాత పుస్తకాల్లోంచి చదివి గొప్ప నిర్వచనాలు ఇస్తారు. అదిశంకరుడి కథలో కూడా ఛండాలుడి వృత్తాంతం నుంచి చాలా చాలా నేర్చుకున్నట్లు రాస్తారు. ఛండాలుడు అంత గొప్పవాడైతే ఇప్పటి ప్రజలు ఛండాలుడు అనే పదాన్ని తమ పేర్లకు ముందు ఉపసర్గంగా ఎందుకు చేర్చుకోలేదు అన్నది నా ప్రశ్న.
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే మిర్యాలగూడలో మాల కులానికి చెందిన ప్రణయ్ అనే ఒక దళిత యువకుడి హత్య తర్వాత, హత్యకు కుట్ర చేసిన కోమటి (ఆర్య వైశ్య కులానికిచెందిన) మారుతీరావు అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. కేవలం తక్కువ కులం (మాల ) వాడైనందుకే తన కూతురు ప్రేమించిన ప్రణయ్ ను హత్య చేయించినట్లు మారుతీరావు సగర్వంగా చెప్పుకున్నాడు. కులం పేరు ఎత్తి దూషిస్తే శిక్షించడానికి ‘ఎస్సీ ఎస్టీలపై జరిగే అత్యాచారాలను నివారించే 1989 చట్టం’ ఉంది. అయినా సరే, మారుతీరావు ధైర్యంగా కులం పేరు ఎత్తి మాట్లాడుతున్నాడు. ఇతన్ని సమర్ధిస్తూ కొందరు కులపిశాచాలు మిర్యాలగూడలో ధర్నాలు కూడా చేశారు. ఏకంగా ఊరేగింపులు జరిపారు. ఇహ సోషల్ మీడియా సంగతి సరే సరి. అగ్రకులమని చెప్పుకునే మెజారిటీ వాళ్ళు మారుతీరావును సమర్ధిస్తూ పోస్టులు పెట్టారు. అన్యమతం అని క్రైస్తవులను దూషించడానికి మరొక దురహంకార పదం కనిపెట్టారు. క్రైస్తవులను విదేశీయుల్లా చిత్రీకరిస్తూ బహిరంగంగా మాట్లాడుతున్నారు. భారత దేశంలో మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఇంత వివక్షా పూరితంగా ఎలా మారిపోయారో అర్ధం కాదు. మాట్లాడే భాషకు, చేసే చేతలకు వివక్ష రోగం బాగా అంటింది. సోషల్ మీడియాలో ప్రణయ్ క్రైస్తవుడనీ, అన్యమతం వాడనీ బహిరంగంగా పోస్టులు పెడుతున్నారు. ఏం ప్రణయ్ డైరెక్టుగా లండన్ నుంచి ఊడిపడ్డాడా ! క్రీ.శ 52 లోనే క్రైస్తవం ఈ దేశంలోకి ప్రవేశించింది బ్రిటీషువారితో సంబంధం లేకుండా. యేసు ప్రభువు శిష్యుడైన సెయింట్ తామస్ గారు కేరళకు వచ్చి క్రైస్తవానికి బీజాలు వేశారు. ఈ మతం ఈ దేశ సంస్కృతిలో భాగం అయ్యింది. స్థానిక ప్రజలు ఈ మతాన్ని స్వీకరించి విద్యావకాశాలను అందిపుచ్చుకుని పైకి వచ్చారు. ఇంత సేవ చేసిన మతం ఈ ప్రజల మతం ఎలా కాకుండా పోయిందీ ! సాక్షాత్తూ బీజేపీ సీనియర్ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు క్రైస్తవులను అంగ్రేజ్ అని పిలవడమే కాకుండా క్రైస్తవులు భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదని పిచ్చి మాటలు మాట్లాడాడు. ఇహ సామాన్య హిందువులు, మతపిచ్చిగాళ్ళు, బీజేపీ ఇతర మనువాద శక్తులు ఊరుకుంటారా ! ప్రణయ్ విషయంలో జరిగింది అదే. మారుతీరావు ప్రణయ్ ను (అతని దృష్టిలో) తక్కువకులవాడు గనక భౌతికంగా నిర్మూలిస్తే, కుల మత పిచ్చిగాళ్ళు ప్రణయ్ వ్యక్తిత్వాన్ని, మతాన్ని, కులాన్నీ, విద్యార్హతలను కించపరుస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోయారు.
పోలవుతున్న ఓట్లను దృష్టిలో పెట్టుకుంటే భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం. కానీ పరిపక్వత స్థాయికి సంబంధించినంత వరకు, భారతీయులు అత్యంత అపరిపక్వ ప్రజాస్వామ్యవాదులు అని చెప్పక తప్పదు. సరైన సమయానికి ఎన్నికలు జరగడానికి మాత్రమే దేశం ప్రజాస్వామికం. వాస్తవానికి పాక్షికంగా మాత్రమే దేశంలో ప్రజాస్వామ్యం. ప్రజలు ఎప్పుడో నేరస్థులు, జాతివ్యతిరేకులు, మతపిచ్చిగాళ్ళు, కులోన్మాదుల పక్షాన చేరిపోయారు. ఇక్కడ కులమే ముఖ్యం. కడుపుతో ఉన్న భార్యను హాస్పిటల్ కు తీసుకు వెళుతున్న దళిత కులానికి చెందిన ప్రణయ్ ను అంతమొందించడానికి మొత్తం కులసంఘాలు, దాదాపు అన్ని పార్టీల రాజకీయ నాయకులు, గూండాలు, కిరాయిమూకలు, రక్షణ వ్యవస్థ ఏకమయ్యాయంటే కులం ఎంతబలంగా వేళ్ళూనుకుపోయిందో ! యువకుడైనా ప్రణయ్ ఎక్కడా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. మారుతీరావు డబ్బుకు ప్రలోభపెట్టినా లొంగలేదు. భార్యను ప్రేమగా చూసుకుంటూనే ఉన్నాడు, హత్య చెయ్యబడతాడని తెలిసికూడా బెదరలేదు. ఇలాంటి ప్రేమకథలను కులం గాటన కట్టేసి మనం సాధించేదేమిటి! గొప్ప సంస్కృతి, గొప్ప వారసత్వం, గొప్ప నాగరికత కలిగిన దేశమని రోజూ గొప్పలు చెప్పుకుంటాం. అనార్కలి సలీంల ప్రేమ కథకు కరిగిపోతాం. ప్రేమకి చిహ్నమైన తాజ్మహల్ దగ్గర ఫొటోలు తీసుకుని ప్రేమకు జోహార్లు అర్పిస్తాం. ఇంటికొచ్చి కులతత్వంతో కుళ్ళిపోతుంటాం. ఇంతకీ మనల్ని మనం ఏం పేర్లతో పిలుచుకోవాలి !
మంచి వ్యాసం. అన్నీ వాస్తవాలే
సర్, మెజారిటీ ప్రజలు ఈ సంఘటనను ఖండించారు. ప్రజలలో ఇటువంటి చర్యల మీద గతం కంటే వ్యతిరేఖత వ్యక్తమయింది. సమకాలీన యువతరం కులాల గురించిన విషయాలలో ప్రజాస్వామికంగా ఆలోచిస్త్యున్నారు / వ్యవహరిస్తున్నారు. ఉద్యమాల కంటే రాజ్యం దాని యంత్రంగము వేగంగా కదిలాయి. ఐతే ఇదే సంఘటనలో ఒక మినిస్టర్ కూతురైతే ఎలాఉండేదో? ఇది ఫ్యూడల్ భావజాలం పునాదిగా జరిగిన సంఘటన. అధిక శాతం తల్లిదండ్రులు ఈ రకమైన పెళ్లిళ్లలో ప్రజాస్వామికంగానే వ్యవహరిస్తున్నారు. ఆవేశపూరితమైన ఉద్రేకాలను రెచ్చగొట్టే రాతలు నిరుపయోగం. కులము, మతము విషయాలలో మార్పులు మనదేశంలో రావడానికి మరో 100 సంవత్సరాలు పట్టవచ్చు. యూరప్ లో ప్రస్తుతం ఉన్న ఈ రకమైన మార్పులకు దాదాపు 400 సంవత్సరాలు పట్టింది. ఐనా ఇక్కడ రేస్, రిలీజియన్ విషయాలలో అసమానతలు ఉన్నాయి.
ప్రజాస్వామ్యం ఎప్పుడూ ఒక శాతం ధనిక వర్గానికీ మాత్రమే ఉపయోగపడుతుంది. మన రాజ్యాంగము వారికే ఉపయోగపడుతుంది.
బంగారం లాంటి మాటలు చెప్పారు. మాకొక కొత్త భాష కావాలి అన్న కాంక్ష ను పరిచయం చేసిన వారే రాయగల వ్యాసం ఇది అనిపించింది. ఏదో fb చర్చలో అనిపించింది అగ్రవర్ణ స్త్రీలు తమని తాము దళితులు అని ప్రకటించుకుని మళ్లీ తమ కులం వారితో మాత్రమే స్నేహాలు మోహాలు పెళ్లిళ్లు వగైరా చేసేవారికి కూడా ఒక కొత్త పేరు ఉంటే బావుణ్ణు అనుకున్నాం.
వందనాలు మానస.