రెక్కలు తెగిన హృదయ ఘోషకు సినీసాక్ష్యం ‘మంటో

“నేను నా దేశంతో పాటే తెగ్గొట్టబడినాక స్వతంత్రుడనయ్యాను…. (అటువంటి స్వాతంత్ర్యానికి అర్థం ఏముందీ?) … రెక్కలు తెగిన పక్షి స్వేచ్చను మీరర్థం చేసుకోగలరా?” సినిమాలో సాదత్ హసన్ మంటో అన్న ఈ ఒక్క మాట ఆ భగ్న హృదయుడి హృదయక్షోభను, గుండె ఘోషను మన మది లోలోపలి పొరల్లోకి చేరుస్తుంది. భారతదే(శ)హపు పంజాబు, బెంగాలు రెక్కలు తెగనరకబడినాక రక్తమోడే మొండెంలా సిద్ధించింది అర్ధరాత్రి స్వాతంత్ర్యం. ‘ఆగస్టు పదిహేను విద్రోహం చెప్పకపోతే నాకు అన్నం సహించదు’ అని చెరబండరాజు అన్నట్టే, రాడ్కిఫ్ఫ్ రేఖకిరువైపులా రక్తపుటేర్లు పారుతుంటే, రాజధానుల్లో ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ కేతనాలు రెపరెప లాడాయి.

విడిపోడానికి సిద్ధంగా లేని ఉమ్మడి సంస్కృతిని వదంతుల ఇంధనాలతో తడిపి, అపనమ్మకాల చితిలో కాల్చేసి, మతతత్వపు వాడిబాకుతో ఛేదించి సాధించిన సామ్రాజ్యవాద వికృత కుట్ర దేశ విభజన. విభజన విద్వేషాన్ని ఏనాడూ ఆమోదించలేదు మంటో. రాద్దామని కూర్చుంటే నా మెదడు సహకరించదు. అయోమయంగా ఉంటుంది. నాకు నేను సర్దిచెప్పుకుని ఎంత ప్రయత్నించినా ఇండియాను పాకిస్తాన్‌తోపాకిస్తాన్‌ను ఇండియాతో విడదీయలేను. అసలు భారత ఉపఖండం విభజింపబడడమన్నది జరిగి ఉండాల్సిందే కాదు’ – అని రాసుకున్నాడు మంటో. కానీ, ఆ విభజన కార్చిచ్చే అతడి బహిరాంతర ప్రపంచాన్ని దహించి అతడిని పొట్టన పెట్టుకుంది.

క్రీడాకారుల కీర్తి చంద్రికల మీదా, మాదకద్రవ్యాలు పుచ్చుకుని, వ్యభిచరించే నటుల గొప్పతనాల మీదా, ఈ మధ్య చాలా బయోపిక్కులే వస్తున్నాయి. బయోపిక్కంటే పుట్టుపూర్వోత్తరాల దగ్గర్నుంచి సంపూర్ణ రామాయణాలు వల్లించడం కాదని నిరూపించింది నందితా దాస్ ‘మంటో’ ద్వారా. మంటో కథ చెప్పాలంటే అప్పటి చరిత్ర చెప్పాలి. ఆ చరిత్రకు మంటో స్పందించిన తీరు చెప్పాలి. ఆ తీరును బట్టి పుట్టిన కథలు, పాత్రల గురించి చెప్పాలి. మంటో రచనలు చరిత్ర నేపథ్యంలోంచి వచ్చి చరితార్థమయ్యాయి. చరిత్రలో సంఘటనలు మాత్రమే వుంటాయి. కానీ, అతని రచనల్లో సంఘటనల్లో పాత్రధారులైన మానవుల హృదయ ఘోష కూడా ఉంటుంది. మంటో జీవితాన్నీ, కథలనూ, పాత్రలనూ వేరుచేసి చూడలేము. అందుకే, ఆ రకంగానే దర్శకురాలు తన కథన శైలిని ఎంచుకుంది. రచయిత జీవితంలోని ప్రధాన ఘట్టాల్ని పట్టుకుని, అతడి కథలోంచి అతడి కథల పాత్రల కల్పనా జగత్తులోకి అతి సునాయాసంగా ప్రవేశిస్తూ, అంతే సహజంగా వాస్తవంలోకి తిరిగివస్తూ ఆమె చిత్రీకరించిన తీరు ప్రశంసనీయం. మంటో ‘పది రూపాయల నోటు’ కథతో ప్రారంభమైన ఈ సినీ గమనం ‘టొబా టేక్ సింగ్’ ఆర్తనాదంతో అంతమవుతుంది. మధ్యలో ‘వంద వాట్ల బల్బు’, ‘తెరువ్’ (ఖోల్ దో), ‘చల్లని మాంసం’ (ఠండీ ఘోస్త్) అనే మరో మూడు కథలు కథాగమనంలో వస్తాయి. ఇవి కాక సాహిత్య సభల్లో మంటో వినిపించే అతి చిన్న కథలు,సియాహాష్యి’ (BLACK MARGINS)లోని మనోగతాలు కొన్ని ఈ సినిమాలో చోటుచేసుకున్నాయి.

కాశ్మీర్‌కు చెందిన మంటో కుటుంబం కొంతకాలం అమృత్‌సర్‌లో కొనసాగింది. 1936లో బొంబాయికి ఒక వారపత్రిక సంపాదకుడిగా వచ్చాడు. మధ్యలో ఢిల్లీ వెళ్ళినా, 1941లో బొంబాయి టాకీస్ లో వుద్యోగం కోసం వచ్చేశాడు. బొంబాయి అంటే అతడికి ప్రాణం. సినిమా ప్రథమార్థంలో బొంబాయి సాహితీ మిత్రులు, వారి మధ్య వాదోపవాదాలు, ఆనాటి సినీ పరిశ్రమలోని మిత్రులు, ప్రముఖులు, వారి స్నేహ సంబంధాలు, సినీరంగ పోకడలు కనిపిస్తాయి. ఇస్మత్ చుగ్తాయ్కిషన్ చందర్ఫైజ్ అహ్మద్ ఫైజ్, అశోక్ కుమార్శ్యామ్ చద్దా, కే ఆసిఫ్, నౌషాద్, నర్గిస్, ఆమె తల్లి జద్దన్ భాయి వీరంతా తెర మీద పాత్రలుగా మాట్లాడుతుంటే, ఆ సంగతులు తెలిసిన వారికీ చాలా నోస్టాల్జిక్ గా గిలిగింతలు పెట్టినట్టుంటుంది. సినిమాల్లో అతని రచనలు పేరు సంపాదించక పోయినా, ఏ లోటూ లేకుండా సాగుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన రోజు నిద్రిస్తున్న భార్యాబిడ్డల్ని లేపి మరీ ఆ సందడికి సాక్ష్యం కమ్మంటాడు. కడుపులోని బిడ్డ స్వతంత్ర దేశంలో పుడుతుందని సంబరపడతాడు.

“మతం మనిషి హృదయం నుండి తలకెక్కితే టోపీలు కొనాల్సివస్తుంది
ముస్లింవైనా, హిందువువైనా”

ఈ దేశాన్ని తమదిగా నమ్మి మత ప్రాతిపదికన ఏర్పడ్డ పాకిస్తాన్ కి వెళ్ళని కోట్లాది ముస్లింలలో మంటో ఒకడు. లాహోర్ లో వేయి రూపాయల ఉద్యోగానికి వెల్లిపోవచ్చు కదా అని భార్య సఫీనా అంటే ‘నాకు ఉద్యోగం లేకున్నా, బొంబాయి రోడ్డుపై గడిపేస్తాను. బహుశా బొంబాయి పాకిస్తానుకు నడుస్తూ పొతే దానితో పాటు  వెళ్ళవచ్చేమో.’ అని భార్యకు ఖరాఖండిగా చెప్పేస్తాడు. బొంబాయి సినీ జగత్తులో అశోక్ కుమార్ తోనూ, ఎదుగుతున్న స్టార్ శ్యాంచడ్డాతోనూ మంటోకు గాఢమైన మైత్రి. ఇస్మత్, మంటో లాంటి పలువురితో బొంబాయి టాకీస్ ముస్లింల స్థావరంగా వుందని కమ్యూనల్ వాతావరణంలో ఆ స్టూడియో పై వత్తిడి వస్తున్న రోజులవి. పక్కా సెక్యులర్ అయిన అశోక్ కుమార్ ఈ బెదిరింపులను లెక్క చేయడు. వాస్తవానికీ, పూర్వభావానికీ ఎంత తేడా వుంటుందో చూపే దృశ్యం ఒకటి వుంది. మతకలహాలతో వేడెక్కిన ఓ నాటి రాత్రి మంటోను అతని ఇంటికి సాగనంపడానికి అశోక్ కుమార్ తన కారును ముస్లిం ప్రాంతం గుండా పోనిస్తాడు. దానివల్ల అశోక్కి ప్రమాదం వస్తుందేమోనని భయపడ్డ మంటో అతడికి స్కల్ కేప్ తొడగడానికి ప్రయత్నిస్తాడు. టోపీలు ఎప్పట్నుంచి కొంటున్నావని అశోక్ అడిగితే, “మతం మనిషి హృదయం నుండి తలకెక్కితే టోపీలు కొనాల్సివస్తుంది – ముస్లింవైనా, హిందువువైనా” అని సమాధానమిస్తాడు మంటో. వారనుకున్న దానికి భిన్నంగా జరుగుతుంది. కారును ఆపిన ముస్లింలు అశోక్ కుమార్ ను పోల్చి అతడితో షేక్ హ్యాండ్ కోసం పోటీ పడతారు, వారికీ సేఫ్ రూట్ సూచిస్తారు.

‘నువ్వు పక్కా ముస్లిం వి కూడా కాదు’
‘కానీ చంపబడగల ముస్లిం నేగా?’

శ్యాం చడ్డాతో మంటోకి గల సరదా జల్సా ‘హిప్తుల్లా’ స్నేహం విభజన విభీషిక ఆటుపోట్లకు లోనవుతుంది. స్నేహం మధ్య అపనమ్మకానికి, అభద్రతకు తావిస్తుంది. శ్యాం పినతండ్రి కుమారుడు విభజన అల్లర్లలో రావల్పిండిలో చనిపోతాడు. ఆ పరివారమంతా కాందిశీకులుగా తట్టాబుట్టా పట్టుకుని భారత్ కు వలస వస్తారు. ఆ బాధను తట్టుకోలేక, “మరోసారి మతకలహం జరిగితే నేనూ ఒక ముస్లిం ని చంపేస్తాను” అని అంటాడు. “నేను కూడా ముస్లిం నే కదా?” అని మంటో అంటే – “బహుశా, నిన్ను కూడా చంపేస్తానేమో” అని బదులిస్తాడు శ్యాం. కోపంలోనైనా, మాటవరుసకైనా ఆ ఒక్క మాట చాలు సున్నితమైన మంటో మనసు గాయపడడానికి. నేల ముక్కలైనా చలించని మంటో మనసులు ముక్కలయ్యయని తెలిశాక తట్టుకోలేకపోతాడు. ఆ రోజు రాత్రే లాహోరుకి పయనమవుతాడు. శ్యాం ఆపాలని ప్రయత్నిస్తాడు. టేబుల్ పై వైన్ సీసా చూపి ‘నువ్వు పక్కా ముస్లిం వి కూడా కాదు’ అనంటాడు. ‘కానీ చంపబడగల ముస్లిం నేగా?’ అని అనే సరికి పశ్చాత్తాపం శ్యాం వంతవుతుంది. తల్లి, తండ్రి, కొడుకు సమాధులు గల బొంబాయికి వీడ్కోలు చెబుతాడు.అమితంగా ఇష్టపడే బొంబాయిని వదిలి, మనసంతా ఆ నగరంలో వదిలి, లాహోరులో గడపాల్సి రావడం అతడికి తన ప్రాణం పోయేంత వరకూ జీర్ణించుకోలేని విషయంగానే మిగిలింది. అక్కడ లాహోరులో కూడా విభజన నాటి అల్లర్ల ఛాయలు, పొగబారిన కూలిన గోడలు, శరణార్ధి శిబిరాల్లో అనాధల ఆర్తనాదాలు, హాహాకారాలు చూసి చలించాడు. తన బాధనే తను సర్దిచెప్పుకునే దుస్సాహసం చేస్తున్న ఆ తరుణంలో కల్లెదుటి కఠిన వాస్తవాలను చూసి తన హృదయంలో చెలరేగిన సంఘర్షణలకు అక్షరరూపమిచ్చాడు. ప్రతి మానవకల్పిత మారణహోమంలోనూ స్త్రీ శరీరం హింసా దౌర్జన్యాలకు గురౌతుంది. గతంలోనే సభ్యసమాజం చూట్టానికి ఇష్టపడని చీకటి కోణాలలో నలిగే స్త్రీల దుస్థితికి అద్దం పట్టే ‘వివాదాస్పద’ రచనలు చేశాడు మంటో. లాహోరులో ఉన్నప్పుడు రాసిన కథలు విశ్వవిఖ్యాతి గాంచాయి.

మనిషిలోని అమానవీయతకీ మతానికీ సంబంధం లేదని చెప్పిన కథ ‘తెరువ్’ (ఖోల్ దో). రక్షించి తీసుకు వస్తారనుకున్న వాళ్లే తన కుమార్తెతో అతి దుర్మార్గంగా ప్రవర్తించారని తెలీదా తండ్రికి. కుమార్తె శరణార్ధి శిబిరంలో అపస్మారక స్థితిలో పడివుంది. చికిత్స చేయడానికి వచ్చిన డాక్టర్ ‘గాలి లోపలికి రావడానికి కిటికీ తెరవండి’ అనే అర్థంలో ‘తెరువ్’ (ఖోల్ దో) అని అరుస్తాడు. ఆ స్థితిలోనూ ఆ అమ్మాయి తన సల్వారు ముడివిప్పి సల్వారును క్రిందికి దించుతుంది. ‘నా సకీనా బతికే వుంది’ అని ఆ ముసలి తండ్రి అరుస్తాడు.

జనజీవితంలో స్వేచ్ఛ కుంచించుకుపోతూ, ఆ స్థానాన్ని మతతత్వం ఆక్రమిస్తూ,
భావప్రకటనా స్వేచ్చపై ముసుగు హత్యలు బాహాటంగానే సాగుతున్న ఈ రోజుల్లో
మంటో కథకు ఎంతో ప్రాసంగికత వుంది. 

మతకలహపు దొమ్మీ వేటకు వెళ్ళిన ఒక సర్దార్జీ ఒక ఇంటిలోని వారందర్నీ చంపేసి ఓ ఆడపిల్లని ఎత్తుకొచ్చి ఆమెను చెరచబోతాడు. తీరా చూస్తే, మృతదేహాన్ని తెచ్చాడని తెలుస్తుంది. ఆ సంఘటనతో అతడు తన పుంసత్వాన్ని కోల్పోతాడు. ఈ కథ అశ్లీలం అన్న కోర్టు వాదన సినిమా ద్వితీయార్థంలో ప్రధానంగా వుంటుంది. జనజీవితంలో స్వేచ్ఛ కుంచించుకుపోతూ, ఆ స్థానాన్ని మతతత్వం ఆక్రమిస్తూ, భావప్రకటనా స్వేచ్చపై ముసుగు హత్యలు బాహాటంగానే సాగుతున్న ఈ రోజుల్లో మంటో కథకు ఎంతో ప్రాసంగికత వుంది. కల్మషం లేని అభివ్యక్తి మంటోది. తను ఏ చీకటి కోణం గురించి రాస్తాడో అక్కడి భాషనే వాడతాడు. “నా కథలు భరింపరానివిగా వున్నాయంటే దానర్థం ప్రపంచమే భరించలేనిదిగా ఉందన్నమాట.” అని చెబుతాడు మంటో. ‘ఠండీ ఘోష్’ (చల్లని మాంసం) రాసినందుకు మంటోకు హైకోర్టు 300 రూపాయల జరిమానా విధించింది.

సిగరెట్టు త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం – అని సినిమాలో చూపిస్తారు. కానీ, మంటో వాటినే తనను దహిస్తున్న బాధకు ఉపశమనంగా ఎంచుకుంటాడు. బొంబాయిని మరిచిపోలేడు, లాహోరును హత్తుకోలేడు. మద్యానికి బానిసవుతాడు. పత్రికాఫీసులో కూర్చుని, అక్కడే పెన్సిల్ తో బరబరా ఒక కథో, కాలమో రాసిచ్చి డబ్బు పుచ్చుకుని వెళిపోతాడు. చవకబారు మద్యానికి కూడా దిగజారుతాడు. కుటుంబం పట్ల బాధ్యతగా వుంటాననుకునీ, ఉండలేక పోతాడు. కుమార్తె మందు సంగతి తాగిన మైకంలో మరిచిపోయి, హఠాత్తుగా గుర్తొచ్చి బాధపడతాడు. ఎద నిండా బొంబాయిని నింపుకున్నా బొంబాయి మిత్రుల ఉత్తరాలు చూడదలుచుకోడు.

అతడి ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది. అతడి పాత్రలు అతడితో సంభాషించడం మొదలుపెడతాయి. బొంబాయి స్టూడియోలోని ధ్వనులు చెవిలో విన్పిస్తుంటాయి. తను సృష్టించిన జగత్తులోకి కుంచించుకు పోతాడు. నిజాయితీగా వందకు వంద శాతం జీవించే వ్యక్తిత్వాల జీవిత విషాదాలు ఇలానే ఉంటాయేమో! (మంటో కథకు సమాంతరంగా కన్పించే మరో వ్యక్తి రిత్విక్ ఘటక్. విషాదాన్ని అల్కాహాలులో కలిపేసుకుని తాగి తాగి తనువు చాలించాడు. మహాశ్వేతాదేవి కుమారుడు నబారుణ్ భట్టాచార్య కథా ఇలానే ముగిసింది.) సినిమా చూస్తున్నప్పుడే కాక ఇది రాస్తున్నప్పుడు కూడా నా కళ్ళలో కన్నీల్లెందుకు సుళ్ళు తిరుగుతున్నాయో నాకే అర్థం కానప్పుడు, మంటో ఎంతటి హృదయ క్షోభ అనుభవించాడో, అతడు అనుభవించిన అశాంతినీ, అల్లకల్లోల్లాన్నీ ప్రేక్షకులకు చేరేలా నవాజుద్దీన్ సిద్దికి ఎంత అనన్యసామాన్యంగా నటించాడో సినిమా చూస్తే గానీ అర్థం కాదు. ఎక్కడా మెలోడ్రామాకు తావేలేదు. తన బాధ ఎవరికీ చెప్పకుండా లోలోపలే బాధపడుతూ, లోకం బాధను కూడా తనలో పలికించుకున్న సమున్నత వ్యక్తిత్వం కథ అది. మంటో భార్యగా రసికా దుగ్గల్ నటన మరపురానిది.

మంటోను పిచ్చాసుపత్రిలో చేర్చుతారు. అక్కడ పుట్టిన కథ ‘టొబా టేక్ సింగ్’. ఇందులో ఇతివృత్తం – దేశ విభజన జరిగిన మూడేళ్లకి ఇరు దేశాలలో ఉన్న పిచ్చివాళ్లని కూడా బదలాయించుకోవాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ పిచ్చివాళ్లలో ఒకడు బిషన్ సింగ్. తన ఊరు టొబా టేక్ సింగ్ ఎక్కడుంది? పాకిస్తానా లేక భారతదేశమా? చివరికి సరిహద్దుల ముల్లకంచెలకు మధ్యలో ‘నో మాన్స్ ల్యాండ్’ లో  ప్రాణాలు వదుల్తాడు. ఈ  పిచ్చివాడి దీనగాధలానే మంటో కథ ముగిసింది. లివర్ సిర్రోసిస్ వ్యాధితో నలభై రెండేళ్ళ వయసులో మంటో కన్ను మూశాడు. ఉపఖండంలో అత్యంత విషాదకర సంఘటనగా జరిగిన దేశవిభజనలో బాధితులు ముగ్గురు భారత్ – పాక్ – మంటో! టైటిల్ డిజైనింగు కూడా బాగా చేశారు. మంటో అనే అక్షరాలను మధ్యకు ఖండించి జరిపేస్తే, ఆ ముక్కలు రక్తం ఓడుతుంటాయి.

ఒక పీరియడ్ ఫిల్మ్ కి ఉండవలసిన కలర్ టోనింగ్, కాస్ట్యూమ్స్, సెట్స్, ప్రతి డిపార్టుమెంటు లోనూ ఆరేళ్ళ రీసెర్చ్ కొట్టొచ్చినట్టు కనిపించింది. సాంకేతిక రంగంలో ప్రతి ఒక్కరూ అభినందనీయులు. మంటోకి నివాళిగా నవాజుద్దీన్ కేవలం ఒక్క రూపాయి ‘తీసుకోకుండా’ నటించాడు. అదే పని మిగతా చాలామంది నటీనటులు చేశారు. ఇటువంటి సినిమాలు ప్రజలకు చేరకూడదని అసదుపాయకరమైన టైమింగులు పెడతారేమో మల్టీప్లెక్స్ వాళ్ళు. మనం కూడా మొండికేసి ఎలానైనా వెళ్ళి చూసెయ్యాలి. లేకపొతే, ఈ సినిమాలు తీసేవారు మున్ముందు ధైర్యం చేస్తారా?

మంటోకి తన కథల మీద తనకి ఎంత నమ్మకమంటే, తన సమాధి శిలాఫలకం మీద రాయాల్సిన రాతను తనే రాసి పెట్టాడు. ఆ ఫలకంపై ఏముందంటే – “ఈ మట్టి గుట్ట దిగువ ఖననమైన నాతోనే కథా రచన రహస్యాలు ఖననమయ్యాయి. గొప్ప కథకుడు ఎవరు? పైనున్న దేవుడా? ఇక్కడ పాతబడిన నేనా? మంటో ‘పాతబడినా’ అతడి కథలు పాతబడవు. అతడి కథల్లానే, మంటో మనతో వుంటాడు.

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

12 comments

  • బాలాజీ గారూ.. చాలా బాగా రాశారు. ప్రజాసాహితిలో కేరాఫ్ కంచరపాలెం రివ్యూ కూడా చాలా బాగా రాసారు సార్..

  • ఎంత గొప్పగా రాశారు…!!! లజ్జ గుర్తుకు వచ్చింది.నిజంగానే చదువుతుంటే కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయ్.. ఒక గాఢత ,తెలియని విషాదం హృదయాన్ని కమ్మేసింది.మీరు బోల్డ్ టైప్ లో రాసిన డైలాగ్స్ poetry లో అత్యున్నత expressions గా తోచాయ్… Amazing…

  • మంచి రివ్యూ. నందితాదాస్ సినిమాల గురించి కొంచం రాయవలసింది.

    • ధన్యవాదాలు. దర్శకురాలిగా ఇది ఆమె రెండో సినిమా మాత్రమే. గతంలో గుజరాత్ అల్లర్లపై ‘ఫిరాక్’ అనే సినిమా తీశారు. ‘మంటో’ తీస్తున్నప్పుడు ‘ఇన్ డిఫెన్స్ ఆఫ్ ఫ్రీడమ్’ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు – మంటో పైనే.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.