సమోసా

‘ఒరే ఒక్కటంటే ఒక్కటి తెచ్చిపెట్టరా ఒకటే తినాలనిపిస్తోంది’ గూని పెంకుటింటి వసారా లోంచీ అడుగుతోందో తొంభై యేళ్ళ బామ్మ.

‘ఆరోగ్యం అలవాట్లూ అంటూ తొంభై యేళ్ళు నిలబడిందానివి. బయటి సమోసాలు తింటావా బామ్మా’

‘కాదురా అందరూ తింటుంటే అదేదో కారపు కజ్జికాయలా ముచ్చటేసి నోరూరుతోంది. ఒక్కసారి తేరా’

‘ తెస్తాలే నువు ముందా దగ్గు తగ్గించుకో’

‘ ఆ నాకే వచ్చింది ఆరోగ్యం. మీరంతా బయటకెళ్ళి తినొస్తే లేదు గానీ నాక్కొనిపెట్టమంటే ఏడుస్తావు. మీ నాన్నే నయం. పోయెక్కడున్నాడో యేమో’

‘తెస్తాలే కాని ఆపరాదూ నీనసా’

‘ వూరంతా తిరిగొస్తావు కానీ ఆమెకి రెండు సమోసాలు తెస్తే యేంపోయింది?’ అడిగింది భార్య

కాదే ఆ షాపులో యీ షాపులో లెక్కలు రాసి సంసారం లాగుతున్నానా. ఇప్పుడీ కంప్యూటర్ల దెబ్బకి ఆ నాలుగు రాళ్ళూ రెండయాయా. వున్న నాలుగూ ఇలా చిరుతిళ్ళకి తగలేస్తే ఎలా బతుకుతాం’

‘ ఇంకాపండి మీ వుపన్యాసం. ఏదన్నా పొరపాటునడిగితే ఇదీ వరస. భోజనంచేయండి బయల్దేరుదురు గాని’.

బయల్దేరుతుండగా మళ్ళీ అడిగింది బామ్మ ‘ ఏరా తెస్తావా?’

‘ తెస్తాలేవే. ప్రాణమేమన్నా కొట్టుకు పోతోందా’ అంటూ తన హెర్క్యులిస్ సైకిలెక్కాడు.

మర్నాడు వూరెళ్ళొచ్చే సరికి ఇంటి ముందంతా జనం. ‘ఏమైందో ఏంటో’ అనుకుంటూ జనాన్ని తోసుకు లోపలికెళ్ళాడు.

భార్య నిరుత్తరంగా వుంది. పిల్లలిద్దరూ కన్నీరు మున్నీరు గా వున్నారు. బామ్మ మంచాన నిర్జీవంగా వుంది. కుడి చేతిలో సమోసా ఒకటి బిగుసుకు పోయుంది.

‘ఎవరే సమోసాలు తెచ్చింది’ అడిగాడు.

‘నేనే నాన్నా. పొద్దున పదిసార్లడిగితేనూ’ చెప్పింది కూతురు.

‘ నేను తేలేకనా. దానికి సమోసాలంటే ప్రాణమని నాకు తెలుసు. వాటిమీద మమకారంతోనైనా ఇంకొన్నాళ్ళుంటుందనే నేనే తేవట్లేదు. నాన్న కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించిపెద్ద చేసింది. తన నాలుగ్గాజులూ అమ్మి తమ్ముణ్ని చదివించింది. నీ పెళ్ళి చూస్తుందనుకున్నాను. అందుకే ఎప్పుడడిగినా దాటేసుకొచ్చాను. ఈలోపే ఇలా అవుతుందనుకోలేదు.’ కన్నీళ్ళతో పక్కనే కూలబడ్డాడు.

బామ్మ చేతిలో బిగుసుకున్న సమోసా మీద ఈగ ఒకటి తిరిగి పోతోంది.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

6 comments

  • ఈ చిన్ని కథ నాకెందుకో భలే నచ్చింది. ఒక మనిషి చాల కాలం జీవించాలని మరొకరు కోరుకోడంలో మొదటి మనిషి గొప్పదనం వుంది. అంతకు మించిన నివాళి ఎవరికీ అక్కర్లేదేమో.

  • కోరిక తీర్చుకోవాలన్నా ఆశ మనిషిని కొంతకాలం మన ముందుంచుతుంది అన్న సున్నిత సత్యాన్ని అద్భుతం గా ఆవిష్కరించారు…హార్దిక అభినందనలు మాస్టారు…

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.