సింగప్ప అబిప్రాయము

ఇంగ పారప్పా.
ఈ సింగప్ప జేప్పేదిను.
దేశంలో సగంమంది సన్నాసులు సగంమంది సన్యాసులు.
నువ్వే కాటగిరీ రా నాయినా.
ఆపస్తంబులా, అశ్వలాయనులా అంటే, ఆపస్తంబులమూ కాము, అశ్వలాయులముకాము అప్పారావుగారి హర్కా రాలము అన్నాడంట.

యాడ సూసినా రాజకీయాలు,సైన్మాల మీదనే సొల్లు.
నువ్వు గూడా తగుదునమ్మా అని ఆటిల్లో దూరుడేందిరా?

తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి పోయిందంట.
ఫేసుబుక్కుల్లో యూట్యూబుల్లో ఆడా ఈడా  గుడ్డెద్దు చేలో బడ్డట్టు ఆ కామెంట్లేందిరా?

నీకు సకం దెల్సు.సకం దెల్వదు.
తానానాతనాననానా అనేసి నెమ్మిదిగా గడిచిపోతా ఉండేది జీవితాన్ని ఎంతుకురా టెన్సన్ బెట్టుకుంటావు?

యూట్యూబులో మనోళ్ళ వీడియోలుసూసినా?
ఇది చూత్తే  కన్నీరాగదు
ఏం జరిగినాదో  తెలిత్తే షాకు
అసులుకి  నిజం ఇదే అనుకుంటా వామ్మో.

ఆటిలికింద నెత్తి మీద రూపాయి బెడితే పావలాకి పోని   పతోడు అబిప్రాయాలు రాసేడోడే.

ఎవుడికి కావాల్రా నాయినా నీ అణాకానీ అబిప్రాయాలు.
అందులో పస లేదు,గంజిలో వార్చమన్నాడంట.

అగడ్తలో బడ్డా పిల్లికి అదే వైకుంటమనీ,ఆడాడనే బడి మాటకి మాటా రాస్తా ఉండావు,నాలిక మీద పచ్చడి రాసినట్టు.

నీ తీర్పుల కోసరం లోకమంతా ఎదురు చూస్తా ఉన్నాదనుకున్నా?
ఆర్చేవా తీర్చేవా అక్కర వత్తే మూలిగేవా అని.
నీ బతుకేదో నువ్వేడవక, ఏందో పెద్ద లార్డులా బయలు దేరినావే?
మారీచుడిలాగ మారేషాలేసుకొని చెత్త మాటలు రాయడానికి సిగ్గు లేదురా.

డీడీ రోజులే బావుండాయబ్బ. తానానాతనాననానా అనేసి నెమ్మిదిగా గడిచిపోతా ఉండేది జీవితం.

కొత్తొక వింత.పాతొక రోత. కోతికి తేలు కుట్టినట్టు ఎగురుతా ఉన్నావు ఇంటర్నెట్టులో.

నీ ఫొటోలు,నీ మాటలు,నీ ఎచ్చులు. వద్దురా నాయిన.
లైకులు లెక్కబెట్టుంటా కూచో రాతిరి తెల్లార్లు.

వురేయ్, నువ్వు పుట్టిన కాడ్నించీ ఉన్నయ్యా రా, ఈ వాట్సాప్పులు,ఫేసుబుక్కులు?

కోతికి కొబ్బిరికాయి దొరికినట్టు ఆ సెల్లొకటి ఒచ్చింది నీ సేతికి.
గుర్రం చచ్చిందిగాక గుంట తవ్వేదానికొక రూక అని సెల్ ఫోను చార్జీలు.
ఎదురు డబ్బిచ్చి తేలుతో కుట్టించుకున్నట్టు.

తెల్లారి లెగిసి దేవుడ్ని తలుచుకునేది బోయి వాట్సాపు తెరుత్తావు.
అదేవన్నా వరాలిత్తదా రా?
గుడ్ మార్నింగు, దంతాలు తోమినావా? నేనింకా తోమలేదు అని మెస్సెజిత్తావు.
ఏందిరా ఈ పిచ్చి?
చచ్చేటప్పుడు శంబో శంకరా అనమంటే వారింటో చెంబు ఎత్తకరా అన్నాడంట. అట్టుంది నీ యవ్వారం.
   
రేయ్,ఇంతకు ముందు కుశాలగా ఆరుబయలు నులక మంచం మీద దుప్పటేసుకోని హాయిగా చందమామను చూత్తా అట్టా నిద్దర్లోకి పోయేటోడివి.
ఇప్పుడేంది రా. ఆ నులక మంచం,చందమామ అంతా వచ్చేటట్టు ఫుటో లాగి ఫేసుబొక్కులో పెడతావు. ఎన్నెల్లో నులక మంచం మీద నిద్దర పోతా-అని.

ఇగంతే, నిద్దర లేదు,పాడూ లేదు.

అబ్బా,ఎంతదృష్టవంతులండీ మీరు అని ఒగటి
దుప్పటి రంగు బావుండాదని ఒగటి
యాడ కొన్నారని ఒగటి
పంతొం దొందల నలబైఏడులో మా తాతగారికి ఇదే దుప్పటి ఉండేదని ఒగటి
అసలుకి దుప్పటి అనే పదం కప్పటి అనే పదంనించి పుట్టిందని,కప్పటి అనేది చప్పటి నించి పుట్టిందని – ఒగటి
చందమామ మీద పరిశోదన మీద ఒక లింకు
ఓ నెల రాజా,ఎన్నెల రాజా అని ఓ పాట లింకు
దానికి సంగీతం ఎవురని,రాగం ఏదని ఒక వాదము
నులక మంచం-చందమామ బూర్జువా పోస్టని కోపదారిది ఒగటి
నులక మంచం ఏ కులమింటిదో ఒకటి-
కామింట్లు-
అయ్యన్నీ చదూకుంటా కూసుంటే ఇంతలో నేనీడ్నే ఉన్నా అనుకుంటా వాట్సాపు టింగ్ టింగ్ అంటా రొద పెడతా ఉంటది .

ఓయబ్బ. ఇంక నిద్దరేడ?

ఒరేయ్, ఫష్టు నీ బతుకు నువ్వు బతికేది చూసుకో.
నీ పనులు  చక్కబెట్టుకో.
బతుకులో మెట్టు పైకెక్కేది సూసుకో.
తగుదునమ్మా అని కడుపు నిండిన బేరాలతో పోటీ పడమాక.
లోకం చానా పెద్దది రా.
చుట్టు పక్కలోసారి పరికించు.
నీ తలగడ కిందున్నాదే పాము,ఆ సెల్లు దీసి దూరంగా పెట్టి నిద్రబో ముందు. ఏంది,ఇంటన్నావా?
ఉపాయం లేనోడ్ని ఊరినించి ఎళ్ళగొట్టమన్నారంట.

నంగీ నమలక మింగవే అంటే ఉడికిన చాపలు కరుత్తాయందంట.

నా కంఠశోషేగాని, ఇంతట్లోకే సెల్లు చూస్తన్నావు గదరా తింగరి గాడిదా.

పాలపర్తి ఇంద్రాణి

పాలపర్తి ఇంద్రాణి:  ప్రస్తుత నివాసం: హూస్టన్, టెక్సాస్, అమెరికా. చదువు: బి. టెక్, సిద్ధార్థ ఎంజినీరింగ్ కాలేజ్, విజయవాడ, ఎం ఎస్., వేన్ యూనివర్సిటీ, డెట్రాయిట్,. ఉద్యోగం: ఐటీ సెక్టారు..రచనలు:  ​వానకు తడిసిన పువ్వొకటి (కవితా సంకలనం,2005) అడవి దారిలో గాలిపాట (కవితా సంకలనం,2012) ఇంటికొచ్చిన వర్షం (కవితా సంకలనం,2016) ఱ  (నవలిక,2016) చిట్టి చిట్టి మిరియాలు  (చిన్ని కథలు ,2016)

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.