ఒక అర్ధాలు…

హాయ్ ఫ్రెండ్స్..

ఒకసారి ఏమయిందంటే-

ఒకసారే కాదు, చాలాసార్లు అనిపిస్తుంది కదా?, ఏదైనా తినాలని.

చాక్లెట్స్.. ఇవి చాలా బాగుంటాయ్. కాని తింటే పళ్ళు పాడయిపోతాయ్ అట. ఎలాగూ పాల పళ్ళు వూడిపోయేవే కదా? పోతే ఏం? మళ్ళీ కొత్త పళ్ళు వస్తాయి కదా?

స్వీట్స్.. ఇవి కూడా చాలా బాగుంటాయ్. పోనీ స్వీట్స్ తిందామంటే పొట్టలో పాములు అయిపోతాయ్ అట. పాములకు మన చిన్ని పొట్ట సరిపోతుందా? అయినా పాములు పుట్టల్లో వుంటాయి కాని పొట్టల్లో వుంటాయా?

సరే.. పోని హాటయినా తిందామంటే కడుపు మంటట. ఎవరికి? ఈ పెద్దవాళ్ళకి!

ఐస్ క్రీమ్.. ఇది కూడా చాలా బాగుంటుంది. తిందామంటే వెయిట్ అంటారు. వెయిట్ చెయ్యమన్నారని ఆగితే కరిగిపోదూ? ఆ వెయిట్ కాదు, బరువు వెయిట్ అయిపోతామంటారు!

ఏదీ తిననివ్వరు!

దాచిపెట్టి ఇదిగో ఇలా చేస్తారు. నిలవ చేస్తారు. ఏమయినా అంటే మర్చిపోయానంటుంది అమ్మ. అమ్మమ్మా అంతే. పోనీ కదా అని గుర్తు చేస్తే తిండి మీద ద్యాసంటారు. అసలు ఈ పెద్దోళ్ళతో పడలేం.

చెప్పకుండా తిన్నా తప్పు!

చెప్పి తిన్నా తప్పు!

‘ఎక్సుపయిరీ డేటయి పోయాక ఫ్రిజ్జులో దాచినా వేస్టే’ అన్నారు నాన్న.

అంత టేస్టూ వేస్టయిపోతుంటే ఏదోలా అనిపించింది. అసలే అది హార్లిక్స్. హార్లిక్స్ కలుపుకు తాగడం కంటే, ఒట్టిదే పౌడరు తింటే.. యమా సూపర్రుగా వుంటుంది. చెప్తే టేస్ట్ తెలీదు. తింటేనే.

‘ముందవతల పారేయండి’ అన్నారు నాన్న.

‘బాటిల్ కోసం వుంచాను నాయనా’ చెప్పింది అమ్మమ్మ.

నాన్నా అమ్మా ఆఫీసుకు వెళ్ళాక, అమ్మమ్మ అవతలకు వెళ్ళాక.. నేనెక్కడుంటాను? హార్లిక్స్ బాటిల్ దగ్గరే. నాన్నకు మందు బాటిల్ ఎంత ఇష్టమో.. నాకు హార్లిక్స్ బాటిల్ అంత ఇష్టం.

నా నోరూరిపోతోంది.

హార్లిక్స్ గట్టిగా ఐస్ క్రీములా ముద్దయిపోయింది. స్పూనుతో నోట్లో వేసుకుంటున్నాననగా.. అంటుకొని తొందరగా పడదే? ప్చ్.. ‘ఆ.. ఆ..ఆ..’ అని అరుస్తూ అమ్మమ్మే తొందరగా వచ్చేసింది.

నా చేతిలోది లాక్కుంది. నోట్లో వెతికి మరీ ‘డేటయి పోయింది, తినకూడదు.. పారెయ్యమని మీ నాన్న చెప్పాడా?’ కళ్ళు బిగించింది అమ్మమ్మ.

‘ఒక్క స్పూన్ ప్లీజ్..’ బతిమాలాను.

‘తింటే చస్తావ్.. విషం.. తినకూడదు’ నా గడ్డం పట్టుకు బతిమాలి కొత్తది కొని తెప్పిస్తానని చెప్పింది. ‘ప్రామిస్’ అంటే ‘ప్రామిస్’ అని చేతిలో చెయ్యి వేసింది అమ్మమ్మ.

నాకు హేపీగా అనిపించి ‘ఈ పాయిజన్ పారేసిరానా?’ అడిగాను.

‘వద్దు.. వున్నీ..’ అంది అమ్మమ్మ.

‘ఎందుకు?’ అంటే, ‘అవతలకు వెళ్ళి చదువుకో’ అంది.

ఏం చేస్తాం, పెద్దవాళ్ళు చెబితే చెయ్యాలి కదా? అక్కడ్నుంచి లేచి వెళ్ళి పుస్తకం తీసాను.

చదువుకుంటూ తలతిప్పి చూసానా.. ఆ హార్లిక్స్ బాటిల్ని పనిమనిషికి ఇచ్చేస్తోంది అమ్మమ్మ. నేను పుస్తకం పడేసి పరిగెత్తుకు వెళ్ళాను.

‘.. నీరసంగా వున్నావ్, ఈ పనులన్నీఎక్కడ చేస్తావ్? ఈ హార్లిక్స్ బాటిల్ తీస్కో.. కొద్దిగే వుంది తీస్కో ..’ అమ్మమ్మ పనిమనిషికి దానం చేసేసింది. ఆ పనిమనిషీ అమ్మమ్మకు కళ్ళుమూసుకొని దండం పెట్టింది.

‘హార్లిక్స్ తాగకూడదు కదా?’ అన్నాను.

‘ఔను.. నీలాంటి పిల్లలు తాగకూడదు. పొట్టలో పురుగులైపోతాయ్’ అమ్మమ్మ కవరు చేస్తోంది.

‘డేటయిపోయింది, పాయిజన్ కదా..’ అడిగాను.

‘నువ్వు నోర్మూసుకు వెళ్ళు’ కోపంగా కళ్ళూ పళ్ళూ బిగించింది అమ్మమ్మ.

పనిమనిషి బాటిల్నీ నన్నూ మార్చి మార్చి చూసింది.

‘తింటే చచ్చిపోతారన్నావ్..’ అమ్మమ్మ అన్నమాటే అన్నాను.

మారు ఒక్క మాట మాట్లాడకుండా ఒక చూపు చూసి బాటిల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది పనిమనిషి.

‘నిన్నూ.. జుత్తుకు రక్తం వచ్చినట్టు తన్నాల్రా..’ అని అమ్మమ్మ తిట్టిందికాక అమ్మకి నామీద చెప్పింది.

‘నిన్ను తినొద్దన్నాం గాని, దానికిస్తే ఏం?’ అమ్మ అలా అడుగుతుంటే ఏం చెప్పేది?

అప్పుడు అమ్మా అమ్మమ్మా కూడబలుక్కున్నట్టు ‘పారేసేదే కదా.. పనిదానికిస్తే పోయేదేంటి?’ అన్నారు.

‘ప్రాణాలు’ అన్నాను.

‘మాటకి మాట జవాబిస్తావా?, పెద్దవాళ్ళకి ఎదురు చెప్తావా? మంచేదో చెడేదో మాకు తెలీదూ?’ అమ్మ నా బుగ్గలమీద రెండు వేసింది.

అమ్మమ్మ వచ్చి అడ్డుకొని ‘చెప్తే వినవు, అయినా నీకివన్నీ ఎప్పుడర్ధమవుతాయో ఏమో?’ అంటూ నిట్టూర్చింది.

నాకిప్పటికీ అర్థం కాలేదు!?

 

-అనిరుధ్,

ఫిఫ్త్ క్లాస్, ‘సి’ సెక్షన్, రోల్ నెం. 63,

ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.