యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్

ఫ్రాన్స్ పర్యటన మాకు మరిచిపోలేని అనుభవాలనే మిగిల్చింది. నెదర్లాడ్స్ లోని రోట్టెన్ డామ్ నుంచి రాత్రి పది గంటలకు పారిస్ బయలు దేరిన మా బస్సు దారిలో బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లోను , బ్రస్సెల్స్ ఎయిర్పోర్ట్ లోను , పారిస్ ఎయిర్పోర్ట్ లోను ఆగి పారిస్ లోని బ్వెర్సీ సీన్ బస్సు స్టేషన్ (దాదాపుగా బయట ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సు లు ఇక్కడ నుంచే బయలుదేరుతాయి )కు వచ్చింది. దిగే ముందు మా బ్యాగేజ్ తీసుకోడానికి వెళ్ళితే బట్టల బాగ్ మాయం. డ్రైవర్ ను అడిగితే ఇది ప్రతి రోజు జరిగే తంతేగా అన్నాడు, అంతకు మించి ఏ విధమైన స్పందన లేదు. బస్సు ఆఫీస్ కు పోయి అడిగితే ఒక ఫారం ఇచ్చి పూర్తి చేసి ఒక మెయిల్ ఐడీ కి పంపమన్నారు, అంతకు మించి ఏమి చేయలేక పోయారు. బస్సు లో చెక్ ఇన్ కు ఇచ్చిన బాగేజ్  పోయినప్పుడు బస్సు సర్వీస్ వారు కనీస బాధ్యత కూడా తీసుకోలేదు. ఇదే కాదు మెట్రో స్టేషన్స్ లో, బస్సు స్టేషన్స్ లో, యాత్ర స్థలాల దగ్గర విపరీతమైన పిక్ ప్యాకెటింగ్. గవర్నమెంట్ కూడా ప్రతి బస్సు లోను “జేబు దొంగలున్నారు జాగ్రత్త ” బోర్డు పెట్టింది.

ప్యారిస్ లో కలిసిన సిరియా శరణార్థి డాక్టర్ అమీన్

పారిస్ లో మేము కలసిన మరో వ్యక్తి  డాక్టర్ అమీన్ . కొన్ని నెలల క్రితం వరకు  డాక్టర్ అహమ్మద్ అమీన్ సిరియాలో ఓ పేరున్న డెంటిస్ట్ . కోట్ల ఆస్తులకు అధిపతి. ఆ దేశంలో అంతర్యుద్ధం వల్ల సర్వం వదులుకొని వేలాది మంది తోటి దేశస్తులలాగే యూరప్ వైపు అడుగులేశాడు. ప్రస్తుతం జర్మనీ ప్రభుత్వం  శరణార్ధులకిస్తున్న సహాయం (aid )తో జీవిస్తున్నాడు. భార్య, కూతురు, కొడుకుతో జర్మనీ లోనే ఓ శరణార్ధుల శిబిరంలో ఉంటున్నాడు. ఆ సిరియా శరణార్థి కథ విన్నప్పుడు అక్కడ జరుగుతున్న నరమేధం ఎంత మంది జీవితాలను అతలాకుతలం చేసిందో తెలుసుకొని బాధ పడటం మినహా ఏమి చేయలేకపోయాం. అతని మాటల్లో చెప్పాలంటే రష్యన్ సైనికులు కిరాతకులైతే అమెరికా ప్రభుత్వం ఆశపోతు, వారికున్న పెట్రో బావులే వారి పాలిట శాపంగా మారాయి. అతనికి తిరిగి సిరియా పోవాలని వుంది కానీ, పోయిన గంట లోపే తాను శవంగా మారతానని చెప్పాడు. శరణార్థులను ఆదరించి మానవతా దృక్పథంతో వ్యవహరించడంలో యూరోప్ ను చాలా సందర్భాలలో అభినందించాలి. ఈడీ అమిన్ పాలనలో గెంటివేతకు గురైన  యుగాండా భారతీయులను అప్పట్లో కెనడా తో పాటు యూరోప్ లో చాలా దేశాలు ఆదరించి పౌరసత్వం ఇచ్చాయి, అందులో ఫ్రాన్స్ కూడా ఒకటి. ఆ తరువాత శ్రీలంక శరణార్థులను యూరోప్ మొత్తం ఆశ్రయమిచ్చి ఆదరించింది, స్విస్ గవర్నమెంట్ ఏకంగా డెబ్భై వేల మంది శ్రీలంక శరణార్థులకు పౌరసత్వం ఇచ్చింది. ప్రస్తుతం జర్మనీ సిరియన్ శరణార్థులను అదే విధంగా ఆదరిస్తోంది.

పారిస్ చూడాలను కొనేవాళ్ళు మొదట తెలుసు కోవాల్సిన విషయం అది ప్రమాదకరమైన నగరం కాదు కానీ పిక్ పాకెటింగ్, మోసం చేయడం నేరాలని భావిస్తే ప్రపంచంలోని పది నగరాలలో యూరోప్ లోని కొన్ని  నగరాలు, పారిస్ కూడా చేరుతాయి. మన చేతి సామానుల గురించి మన దగ్గర వున్న డబ్బు గురించి అనుక్షణం జాగర్తగా ఉండాలి.

ప్యారిస్ ఆటో, అక్కడి త్రిచక్ర వాహనం

పారిస్ లో మేము ముందుగా రిజర్వు చేసుకొన్న ఒక అపార్ట్మెంట్ లో వున్నాము. మేము దిగిన ప్రాంతం పేరు నాయిసీ లె సెక్. ఇక్కడ ఎక్కువగా ఆఫ్రికా వాళ్ళు, భారతీయులు, మధ్య ప్రాచ్యం వాళ్ళు వుంటారు. ఆ అపార్టుమెంట్  ఓనర్ సెలవులో వేరే చోటికి వెళుతూ మాకు రెండు రాత్రులకు గాను  అద్దెకు ఇచ్చాడు. అపార్టుమెంట్ లోకి వచ్చాక అతను ఫుట్ బాల్ కు వీరాభిమాని అని మాత్రం తెలిసింది. గడచిన ఫిఫా కప్ లో ఫ్రాన్స్ ఆడిన ప్రతి మ్యాచ్ చూసినట్లు గుర్తుగా టికెట్స్ మొత్తం గోడకు పిన్ చేసి పెట్టాడు, దానితో పాటు ఇంటి నిండా పుస్తకాలు, సంగీతానికి సంబంధించి గిటార్ తో సహా ఎంతో మంది గాయకుల కాస్సెట్స్.

పారిస్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు చూశాక మాకు అర్థమైన విషయం ఏమిటంటే ఒకనాడు మనల్ని పాలించి తెచ్చుకొన్న డబ్బుతో కట్టిన మ్యూజియంలు , చర్చిలు చూడటానికి  మనల్ని పర్యాటకులుగా రప్పించి వాటికి టికెట్ పెట్టి మన నుంచి మళ్ళీ డబ్బు తీసుకొంటున్నారని. ఆ కట్టడాలు వారి సొంత డబ్బుతో అయితే వాళ్ళు అప్పుల పాలయ్యే వాళ్ళు. అత్యంత పేద దేశాలుగా మారే వాళ్ళు.

మన దేశం నుంచి చాలా ట్రావెల్ సర్వీసెస్ తక్కువ ఖర్చుతో యూరోప్ పర్యటన అవకాశం మనకు అందిస్తున్నట్లు చెబుతుంటారు నిజానికి మనకు యూరోప్ ప్రయాణానికి అయ్యే ఖర్చు కన్నా అక్కడ వున్న మ్యూజియంలు, పర్యాటక  ప్రాంతాలను చూడటానికే ఎక్కువ ఖర్చవుతుంది. పారిస్ నే ఉదాహరణగా తీసుకొంటే అక్కడ మనం ప్రధానంగా చూసే మొదటి ఐదు స్థలాలలో ఈఫిల్ టవర్, లౌర్ మ్యూజియం,, ఆర్క్ డి ట్రయంఫ్, నోటర్ డేమ్ ప్యారిస్ చర్చి, డిస్నీ ల్యాండ్ పారిస్. ఇందులో అన్నిటిని బయట నుండి ఉచితంగా చూడొచ్చు. లోపలికి  వెళ్లాలంటే మాత్రం వేల రూపాయలు వదిలించుకోవాలి. ఇండియా నుంచి పారిస్ కు పోవడాని కి అయ్యే ఖర్చు కంటే ఎక్కువ అవుతుంది. ఈఫిల్ టవర్ నే తీసుకోండి మొదటి రెండు ఫ్లోర్ లు లిఫ్ట్ లో పోవాలంటే 600 రూపాయాలు, పై వరకు పోవాలంటే 1500 వరకు చెల్లించాల్సి ఉంటుంది, అదే పై ఫ్లోర్ లో కాఫీ తాగాలంటే దాదాపుగా 4000 చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ చెల్లిస్తున్నా, కనీసం మనం ఒక వారం ముందు టికెట్ రిజర్వు చేసుకోవాలి లేక పొతే కుదరదు. డిస్నీ ల్యాండ్ కు అయితే కనీసం పదివేలు. మ్యూజియంల గురించి చెప్పాల్సిన పనే ఉండదు. మనం తెలుసుకోవాల్సిన విషయం మీద, యూరోపియన్ చరిత్ర మీద అవగాహన వున్నప్పుడే మ్యూజియంలను చూస్తే మనం చెల్లించిన మొత్తానికి తగిన విలువ లభిస్తుంది. లౌర్ మ్యూజియం… చాలా మంది ప్రకారం ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఎందుకంటే అక్కడ మోనాలిసా ఒరిజినల్ పెయింటింగ్  ఉందని చెబుతారు. మ్యూజియం మొత్తం చూడాలంటే కనీసం మూడు రోజులు పడుతుంది , చాలామంది నేరుగా మోనాలిసా దగ్గరకు పోయి ఫోటోల కోసం, సెల్ఫీల కోసం ఎగబడటం మినహా దాని గురించి చదివే ఓపిక కూడా ఉండదు. అలాంటప్పుడు వారికి చూసినామన్న గొప్ప తప్ప ఒరిగేదేమి లేదు.

తీర్చి దిద్దినట్లున్న ప్యారిస్ వీథులు ఆర్క్ డి ట్రయంఫ్ నుంచి దృశ్యం

పారిస్ ను ఎంత క్రమ పద్దతి లో కట్టారో చూడాలంటే ఈఫల్ టవర్ కంటే ఆర్క్ డి ట్రయంఫ్ మీది నుంచే మంచి గా ఉంటుంది. ఈఫిల్ టవర్ ఎత్తైనదే  కానీ నది పక్కనే ఉండటం వల్ల, చుట్టూ పార్క్ ఉండటం వలన నగరం మొత్తం కన్పిస్తుంది. క్రమ శిక్షణ కలిగిన మిలిటరీ సైనికుల లాగా బారులు తీరిన వీధులను మాత్రం ఆర్క్ డి ట్రయంఫ్ నుంచే చూడగలం. నది వొడ్డున అన్ని వీధుల్లో ఒకే విధమైన రంగుతో, నిర్మాణ ఆకృతితో  కొన్ని వేల భవనాలు ఉండటం ముచ్చట గొలుపుతుంది.

ఉత్తర పారిస్ లో ఒక చిన్న సైజు ఇండియా ను చూడవచ్చు, ఎన్నో దశాబ్దాల క్రితం వచ్చిన గుజరాతీలు, పంజాబీలు, తమిళులతో పాటు కొన్ని దశాబ్దాల క్రితం వచ్చిన శ్రీలంక తమిళ శరణార్థులు నివాసం ఉంటూ ప్రతి భారతీయ పండుగను సాంప్రదాయికంగా జరుపుకొంటారు. టూరిస్ట్స్ ప్రాంతాలలో ఆశ్చర్యంగా సువనీర్స్ అమ్మే వాళ్ళందరూ ఆఫ్రికా వాళ్ళైతే, మంచి నీళ్ల్లు అమ్మే వాళ్ళు అందరు పంజాబీలు. ఒకరి వ్యాపారం లోకి మరొకళ్ళు రారు.

సాయం కాంతులలో ఈఫిల్ టవర్

ఈఫిల్ టవర్ చూడాలంటే మాత్రం సాయంకాలం వెళ్లడం మంచిది. సాయం సంధ్యలో లైటింగ్ లో నిజంగా మేము ఊహించిన దానికంటే కూడా చాలా అద్భుతంగా వుంది. ఈఫిల్ టవర్ ను దగ్గరగా కంటే అక్కడి రెండు కిలో మీటర్ల దూరం లో వున్న  ట్రాకోడేరో నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. ఆర్క్ డి ట్రయంఫ్ ను నెపోలియన్ తన విజయాలకు

నెపోలియన్ విజయ చిహ్నం ఆర్క్ డి ట్రయంఫ్

గుర్తుగా 1806 లో కట్టారు, మన చార్మినార్ సైజు కట్టడం. పైకి పోవాలంటే 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి నుండి నగరం మరింత బాగా కనిపిస్తుంది. మోనాలిసా పెయింటింగ్ చూశామన్న  తృప్తి కోసం ఒకనాటి యూరోప్ వైభవాన్ని చూడటం కోసం లైర్ మ్యూజియం చూడవచ్చు. చేతిలో డబ్బులు, తగిన వయస్సు ఉంటే పారిస్ లోని క్యాబరే డాన్స్ ల కోసం లిడో షో  వెళ్ళ వచ్చు. కానీ అది థాయిలాండ్ దేశం లోని పట్టాయ్ నగరం లోని ఆల్కహాజర్, టిఫ్ఫనీ షోల కంటే మాత్రం గొప్పగా ఉండదు.

(పైన ఫీచర్డ్ ఇమేజ్: లౌర్ మ్యూజియం)

*

 

జియెల్ నర్సింహా రెడ్డి

తన గురించి తానే  జియెల్ నర్సింహా రెడ్డి: ఆరేళ్ల క్రితం మేము ( నేను, నా భార్య లక్ష్మి ) తక్కువలో తక్కువ గా ప్రపంచం మొత్తంగా చూడటానికి ఎంత ఖర్చువుతుందో బేరీజు వేశాం. ఐదు లక్షలయితే అమెరికా ఖండం తో సహా  యాభయ్ దేశాలను చూడవచ్చని భావించాం. మొదట సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ లతో మొదలైంది మా ప్రయాణం. ఖర్చు మేమనుకున్నంత కన్న చాలా తక్కువే అయ్యింది. ఇప్పటికి మేము ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలో ఇరవై పైగా దేశాలు చూశాం. ఇంకా చూస్తాం. ఈ ప్రయాణాల కథ అందరూ వింటానికి బాగుంటుందని ... మా యాత్రానందాన్ని మీతో పంచుకుంటున్నాం.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.