ఒక ప్రయాణం…

హాయ్ ఫ్రెండ్స్..

ఒకసారి ఏమయిందంటే-

అప్పుడు మేమందరం మా తాతగారి వూరికి రైల్లో వెళ్తున్నాం. నేనూ అమ్మా నాన్నా అక్కయ్యా మావయ్యా అందరమూ అన్నమాట. అవి వేసవి సెలవులన్న మాట. సెలవుల్లో ఏయే ఆటలు ఆడాలో మేం చెప్పుకుంటూ వుంటే – పెద్దవాళ్ళు ఏమేం చదువుకోవాలో.. ఇంగ్లీషు మీడియం అని చెప్పడం కాదు, ఇంగ్లీషు తెలుగంత బాగా రావాలని  చెపుతున్నారు.

ఇంతలో టికెట్ కలెక్టర్ వచ్చాడు. టికెట్లు అన్నీ చెక్ చేసి నా టికెట్ అడిగాడు.

‘ఇంకా మూడే’ అంది అమ్మ.

‘అవును.. మూడే..’ తరగతి చెప్పకుండా నా నోరు మూసేసారు. నా వెనుక ఎవరో గిల్లారు. నాన్న కళ్ళతోనే నన్ను హెచ్చరించారు.

‘మూడో తరగతి బుక్స్ కూడా కొన్నారుగా..’ అడిగాను.

‘దీనికి పేలుడెక్కువ.. వచ్చే యేడు స్కూల్లో వెయ్యాలి..’ అమ్మ నాకేసి ఎర్రగించి చూసి, ఎర్రగించి చూస్తున్న టీటీవంక నవ్వుతూ చూసింది.

ఆ తర్వాత టీటీ నా పక్కన కూర్చొని నన్ను దగ్గరకు తీసుకొని ‘మీ అమ్మానాన్నా జోక్ చేస్తున్నారు గాని.. నీ పేరేంటన్నావ్? ఏ స్కూలు..’ అని అడిగిన వాటికే కాదు, అడగని క్లాసూ సెక్షనూ రోల్ నెంబరూ చెప్పేసాను.

‘మరి అందరికీ టికెట్ వున్నప్పుడు నీక్కూడా వుండాలి కదా?’ టీటీ అంకుల్ అడిగితే తలూపాను.

‘గుడ్.. బాగా చదువుకో..’ అని నన్ను మెచ్చుకొని టీటీ అంకుల్ టికెట్ రాసి ఇచ్చారు. అమ్మా నాన్నా ఏదో చెప్పబోయి ఆగిపోయారు. రసీదు టికెట్ అందుకున్న నాన్న టీటీ అంకులుకు డబ్బులు ఇచ్చారు. ‘గుడ్ గాళ్’ అని టీటీ అంకుల్ నన్ను మెచ్చుకొని మరో పెట్టెలోకి వెళ్తుంటే ‘బాయ్ అంకుల్’ అని చెయ్యి ఊపాను. టీటీ అంకులూ చెయ్యి ఊపి నవ్వితే నేనూ నవ్వాను. తర్వాత ఆ రసీదు టికెట్ వెనుకన వున్న నీలపు అక్షరాల కార్బన్ అచ్చులు చూస్తూ- వాసన కోసం ముక్కు దగ్గర పెట్టుకున్నాను.

దబ దబ దబమని నా వీపు మీద అమ్మ నాలుగు వేసింది. మావయ్య ‘ఆగక్కా’ అని అమ్మని అడ్డుకున్నాడు.

‘అందరికీ అన్నీ చెప్పకూడదు..’ అని నాన్న బుద్ది చెప్పారు. చెప్పి అర్థమయ్యిందా అని అడిగారు. ‘లోకం తెలీదు, మొద్దు బుర్ర’ అని అమ్మ తిడుతోంది. నాన్నని చూసి చుట్టూ ఉన్న వాళ్ళని చూసి గొణుగుతోంది.

అర్థమయ్యిందా? అన్నట్టు నాన్న తలాడిస్తూ చూశారు.

అవుననీ కాదనీ – అడ్డంగా నిలువుగా అన్ని వైపులా ఇంకా ఎటుపడితే అటు తల ఊపాను.

నేను అరవలేదు. కాని నావంతు రైలుబండి పెద్దగా అరిచింది?!

-రామలక్ష్మి,

మూడో తరగతి, సెక్షన్ -బి , రోల్ నెం. 27,

ఎమ్మెన్నార్ స్కూల్.

    

 

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

1 comment

  • నిజం కాదా,
    చిన్నప్పటి నుంచీ అబద్దాలు ఆడే పెద్దలు
    పిల్లల్ని హింసింసడం.

    ఇదే కదా భారతం.
    బమ్మిడి గార్కి వందనాలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.