పేరు పేదోళ్ళది – ఉపాధి ఉన్నోళ్లది

2005 లో నాటి యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు అంతో ఇంతో ఉపయోగపడుతోంది. రెండు దఫాల యూపీఏ ప్రభుత్వ పాలన తర్వాత 2014 లో కేంద్రంలో అధికారంలోకొచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. పథకంలో ప్రధాన లభ్దిదారులను వదిలేసి పథకం ప్రయోజనాలను పక్కదారి పట్టిస్తున్నారని అభియోగం.

గత కాంగ్రెస్ హయాంలో యీ పథకం క్రింద కేంద్రం ఇచ్చే నిధులు ఇతర పథకాలకు మళ్లించడం పెద్దగా జరగలేదు. పథకం అమలులో జాప్యం యూపీఏ జమానాలోనే, చివరి సంవత్సరంలోనే మొదలయ్యింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను యీ పథకం క్రింద లబ్దిదారులకు కేవలం 46 రోజుల ‘పని దినాలే’ దొరికాయి. 2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చాక పథకం నిధులకు బాగా కోత పెట్టారు. ఇచ్చినవైనా సక్రమంగా వుపయోగ పడుతున్నాయా సందేహాస్పదం.

ఉపాధి హామీ పథకం శాసనపరంగా 25 ఆగస్టు 2005 నాటి నుండి అమలులోకి వచ్చింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ కుటుంబాల్లో నైపుణ్యం లేని వయోజనులందరికి 100 రోజుల పని దినాలు కల్పించి వారికి కనీస వేతనాలు అందేలా చూడటం యీ పథకం ముఖ్య ఉద్దేశ్యం. రాష్ట్ర ప్రభుత్వ  సహకారంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ యీ పథకాన్ని పర్యవేక్షిస్తుంది. గ్రామాల్లో దారిద్రరేఖకు దిగువన వుండే పేద ప్రజానీకానికి ప్రభుత్వమే కనీస కూలీ రేట్లతో కూడిన 100 దినాలు పని కల్పించడానికి యీ పథకం ప్రవేశపెట్టారు.

ఈ పథకం కింద నమోదయిన కూలీలకు నిర్ణీత సమయం లోపల పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వవలసివుంటుంది. వేతనాలు రెండు వారాల కొక్కసారి నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్నాలకు ఉపాధి పేరుతో పేదల వలసలను తగ్గించడానికి యీ పథకాన్ని తెచ్చారు. ఉపాధి పథకం అమలు 2014కు ముందు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఒకే రీతి అమలు విధానం ఉండగా 2014 తర్వాత పథకం పనితీరు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటోంది. దేశంలోనే కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న అతిపెద్ద పథకంగా MGNREGS ( mahatma gandhi national rural employment guarantee scheme ) పేరుగాంచింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 613 జిల్లాల్లో 13.19 కోట్ల మంది అధికారికంగా లబ్ధి పొందుతున్నారు. వారిలో 34.14 శాతం మంది వెనకబడిన కులాలవారే. ఈ పథకంలో యంత్రాలను, కాంట్రాక్టర్లను అనుమతించరు.

కాని, నేడు రాష్ట్ర ప్రభుత్వాలు అసలు లక్ష్యాన్ని వదిలి పేదల నిధులకు గండికొడుతున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం నవంబర్ 19 , 2018 నాటికి యీ పథకం కింద లబ్దిదారులు దేశం మొత్తం మీద 11.31 కోట్ల మంది.ఇక నిధుల కేటాయింపు విషయాని కొస్తే  2006-09 మధ్య కాలంలో 15 వేల కోట్లు, 2010-11 లో 40 వేల కోట్లు, 2011-12 లో 40 వేల కోట్లు,2012-13 లో 40 వేల కోట్లు, 2013-14 లో 33 వేల కోట్లు, 2014-15 లో 34 వేల కోట్లు, 2015-17 కాలంలో 40 వేల కోట్లు, 2017-18 లో 48 వేల కోట్లు,2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను 55 వేల కోట్లు మంజూరు చేశారు.

ఇక మన స్వర్ణాంద్రప్రదేశ్ విషయానికొస్తే ఇక్కడ పరిస్థితి ఘోరంగా వుంది.పథకం అసలు లక్ష్యమైన పేదలకు ఉపాధి కల్పన అనే అంశాన్ని పక్కన పడేశారు. నిధులన్నిటినీ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఉపయోగిస్తున్నారు. పార్లమెంటు చేసిన చట్టాలను ప్రభుత్వాలే అతిక్రమిస్తోంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా కోర్టు మెట్లెక్కినా గానీ ఉండనే ఉంది…ఈ ప్రభుత్వానికో పనికిమాలిన అలవాటు… “ స్టే “ కోరడం. పథకం కేంద్రానిదైనా, రాష్ట్రానిదైనా దాని ఫలితాన్ని ప్రజలకు చేరనీయకుండా బడాబాబులకు అక్షయపాత్రగా మార్చడం ఈ ప్రభుత్వం ప్రత్యేకత. నిధుల మల్లింపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతిపక్షాల అసత్య ఆరోపణగా ప్రచారంచేసుకుంటారు. ఈసారి, ఆయనకు ఆ ఛాన్స్ లేకుండా రాజ్యసభలో కేంద్రమంత్రే ఆ క్లారిటీ ఇచ్చేశారు.

పోనీలే దేనికయితేనేం అంతా అభివృద్దే కదా అనుకుంటె పొరపాటే. ఆ నిధుల మల్లింపులో సాధారణ ప్రజలు లాభపడడం కూసంత కూడా లేదు.2015-16 లో 1958 కోట్లు నీరు-చెట్టుకు, 2016-17 లో కాంక్రీటు రోడ్లకు 2500 కోట్లు, నీరు-చెట్టుకు 100 కోట్లు మళ్లించబడ్డాయి.

నిజంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయాలంటే అమరావతి శంకుస్థాపనల్లో గుమ్మరిస్తున్న డబ్బు లేదా లేక అది సీఎం గారికి కనపడడం లేదా? పేదోడి పళ్ళెంలో అన్నం గుంజుకొని కాకులకు,కుక్కలకు పెట్టి పుణ్యమొచ్చేది జనాలకేగా అని ముఖ్యమంత్రి మాయ మాటలు చెపుతున్నారు. ఆయన చెబుతున్న గ్రామీణ ప్రాంత అభివృద్ధిని కళ్లారా చూస్తేనే గాని అర్థము కాదు మనకు. పల్లెటూళ్లలో వేసే సిమెంటు రోడ్ల ప్రక్రియ ఎలా వుంటుందంటే… వాగులలో నుంచి మట్టిని జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లలో నింపి రోడ్డెయ్యాల్సిన చోట గుమ్మరించి, దాన్ని మళ్ళీ జేసీబీలతోనే చదునుచేసి రోలర్లతో రోలింగ్ చేస్తే అది మట్టి రోడ్డు. దీంట్లో జనాలకు ఉపాధి దొరికిందట ! .యీ మట్టి రోడ్డు మీద మళ్లీ కాంక్రీటు పేవ్మెంట్ అంటూ అదేదో రెడీ మిక్స్ కాంక్రీట్ తెచ్చి గుమ్మరిస్తారు. యీ మొత్తం ప్రక్రియలో 5 శాతం మానవ శ్రమ కూడా వుండదు. ఇదేందయ్యా అంటే యాంత్రీకరణ అంటాడు. అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని అంటాడు. అవి ఉపాధి నిధులు కదా అన్నామనుకోండి నేను నలబయ్యేళ్ళ అనుభవజ్ఞున్ని నాకే లెక్కలు నేర్పుతారా అంటూ వేలు చూపిస్తాడు.

ఇక, ఇంకో మహత్తర పథకం నీరు-చెట్టు కార్యక్రమం. ప్రభుత్వ పెద్దల మాటల్లో పెద్ద ఉపాధి కల్పించే పథకమిది. నేతి బీరకాయలో నెయ్యి ఎంతో నీరు-చెట్టులో కూడా జనాలకు ఉపాధి కూడా అంతే. మనుషులతో కాల్వలు తీయించి,చెట్లు నాటిస్తే కదా ఉపాధి ప్రజలకు ఉపాధి దొరికేది. ఇక్కడ జరిగేది కూడా జేసీబీలతో కాల్వలు తవ్వించడమే.

ఇంత జరుగుతున్నా ,రాష్ట్ర ప్రజల సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నా యీ మొత్తం వ్యవహారంపై కేంద్రం ఓ వివరణో, సంజాయిషీనో అడగడం లేదు. దీన్నిబట్టి జనాలు కూడా కాంట్రాక్టర్ల క్షేమమే కేంద్ర ప్రభుత్వ ఎజెండా అని అనుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పరిపాలనా విధానాన్ని గమనిస్తే వాళ్ళు కార్పొరేట్లు, కాంట్రాక్టర్లు మాత్రమే మనుషులనుకుంటున్నట్లు అర్థమవుతుంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గించడానికి కొత్త పథకాలు చేపట్టడం మాట అటుంచి గత ప్రభుత్వాలు పెట్టిన పథకాల నిధులను కూడా జనాల నోటి కాడ్నుంచి లాక్కుంటున్నారు. దీన్ని కనుక ప్రతి ఒక్కరూ గుర్తించకపోతే ఉపాధి హామీ పథకానికి 50 వేల కోట్లిచ్చాం, 60 వేల కోట్లిచ్చాం అని డప్పు కొట్టుకుని ఓట్లడుక్కోవడానికి కూడా సిగ్గుపడరు.

గ్రామాల్లో పనులు దొరకక పూట గడవక దుర్భర జీవితాలు గడుపుతున్న పేద ప్రజలు పుట్టి పెరిగిన సొంతూర్లు విడచి పట్నాలకు వలస పోయి బ్రతికే పరిస్థితులు నేడు పెరిగిపోతున్నాయి. పాలక వర్గాలకు ఓట్లు వేయించుకొనే సమయంలో తప్ప మళ్లీ ఐదేళ్ల వరకు ప్రజలు గుర్తుకురారు అనడానికి ఇదే పెద్ద నిదర్శనం. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి నిర్మాణానికి అంచనా వ్యయం స్థాయికి మించి పెంచుకున్నా సరిపోక పేదల ఆన్నం లాక్కుని జేబులు నింపుకుంటున్నారు. ఈ బరితెగింపు కార్యక్రమాన్ని ఎవరైనా అడ్డుకుంటే వారిపై అభివృద్ది వ్యతిరేకులన్న ముద్ర వేస్తున్నారు.

మనుషులంటే పట్నవాసులే, అభివృద్ధి అంతా నగరాలకే అన్న సిద్ధాంతాన్ని పాటించే ముఖ్యమంత్రి తాను ఓ రైతు బిడ్డనే అన్న విషయం మర్చిపోయాడా లేక తనను ఇంతటివాణ్ణి చేసిన పట్నాల రుణం తీర్చుకోవాలనుకొంటున్నాడో. తాను గెలవడానికి గ్రామీణ ప్రజల ఓట్లు కావాలి కానీ వారి బాగోగులు మాత్రం పట్టవు.

 

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

2 comments


Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Telugu OR just Click on the letter)

  • గ్రామ సీమలో మెజారిటీ జనం ముఖ్యమంత్రి మాకు రోడ్లెశాడు,కాల్వలు తవ్వాడు అని అల్పసంతోషపడుతున్నారు.దీనికి కారణం వారికి ఎవరి పొట్టలుకొట్టి తెచ్చిన సొమ్ముతో తమ వీధుల్లో రోడ్లుపడ్డాయి అన్నది తెలియకపోవడం వల్లే.కాకుల్ని కొట్టి గద్దల్ని మేపుతున్నారన్న సంగతి పల్లె జనాలకు తెలియపరచాల్సిన అవసరం ఎంతో ఉంది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.