తెలంగాణలో ఎన్నికలకలం

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు (కేసీయార్) అసెంబ్లీని రద్దుచేయటంతో, ఎన్నికల పార్టీలలో సందడి మొదలయ్యింది. తెలుగు దేశం పార్టీ (తెదేపా), తెలంగాణ జన సమితి (తెజస), సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ మొదలైన పార్టీలతో కలసి కాంగ్రెస్ పార్టీ “మహా కూటమి” ఏర్పాటు చేసింది. సీపీఎం మాత్రం దాంట్లో చేరలేదు. “బహుజన లెఫ్ట్ ఫ్రంట్” అనే కొత్త ఫ్రంట్ ను తెరచింది. ఇంకొందరు కొత్త కొత్త పార్టీలతో ముందుకొస్తున్నారు. ఈ నాటి ఎన్నికల సమరాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే, మనం ముందుగా 2014 ఎన్నికలను విశ్లేషించు కోవాలి.

2014 ఎన్నికల నాటికి, మన పాలకుల యజమాని అమెరికా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. 2008 నాటి తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేక, వెనుకబడిన దేశాల వనరుల్ని మరింతగా కొల్లగొట్టాలన్న దూకుడులో వుంది. మన దేశంలో “సంస్కరణ”లను వేగవంతంచేసి, వనరులను తొందరగా తొవ్వుకు పోదామంటే వరసగా వచ్చిన ఎన్.డీ.ఎఫ్., యు.పీ.ఎఫ్. కూటముల ప్రభుత్వాల్లోని కొన్ని ప్రాంతీయ పార్టీలు, వాటి స్వంత ప్రయోజనాలకోసం, అడ్డు పడుతూ వస్తున్నాయి.

అందుకని, అమెరికాకు మన దేశంలో “సంస్కరణ”లను నిర్దాక్షిణ్యంగా అమలు చేయగల వ్యక్తి యొక్క అవసరం వచ్చింది. వారికి గుజరాత్ ఊతకోచ “వీరుడు” మోడీని మించిన మొనగాడు ఎవరు దొరుకుతారు? అందుకనే వయసుడిగిన అద్వానీని పక్కనబెట్టి, ఒకప్పుడు తామే వీసా యివ్వని మోడీని తీసుకువచ్చారు. గుజరాత్ ఎన్నో సూచికల్లో తమిళనాడు కన్నా వెనుకబడివున్నా, గుజరాత్ “అభివృద్ధిని” మీడియా బాకాలూదింది. మోడీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టారు.

అదే సమయంలో, ప్రాంతీయ పార్టీలను బలహీనం చేసి భారత దేశంలో రెండు పార్టీల రాజ్యం తేవాలనే తన వ్యూహాన్ని అమెరికా అమలుచేసింది. ఉత్తర ప్రదేశ్ నుండి ఉత్తరఖండ్ (ఆరోజుల్లో ఉత్తరాంచల్) ను విడదీసి నప్పుడు, ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా చేసిన మహా నాయకుడు ఎన్. డి. తివారి చిన్న రాష్ట్రమైన ఉత్తరఖండ్ కు పరిమితమయ్యాడు. అలాంటి ఎత్తుగడే ఆంధ్రప్రదేశ్ పై ప్రయోగించారు. ఆ రోజుల్లో కాంగ్రెస్, తెదేపాలే ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని పార్టీలు. వై ఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ కూలి చనిపోయిన తరువాత, మంత్రులందరూ – ముఖ్యంగా రెడ్లు (అప్పటి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొ’న తెలంగాణ రెడ్డి మంత్రులతో సహా) రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ కు మద్దతుగా నిలిచారు. అలాంటి సమయంలో రాష్ట్రాన్ని విడదీయుట ద్వారా, ఒక్క దెబ్బకు తెదేపా, వైఎస్సార్ సీపీ పార్టీలను తెలంగాణలో లేకుండా చేశారు.

ఒప్పందం ప్రకారం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాసాలు కలసి పోటీ చేస్తే వేరే పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం వస్తుందని, ఆ రెండు పార్టీలు ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. 1994 ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బిఎస్పీ పార్టీకి పరోక్ష మద్దతిచ్చి, గెలిపించి “దళిత విప్లవం” గా వర్ణించిన పథకాన్నే తెలంగాణలో కాంగ్రెస్ ప్రయోగించింది. కాంగ్రెస్ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా, రాష్ట్ర ముఖ్య నాయకులెవరూ రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి దిగకుండా పరోక్ష మద్దతుతో తెరాసను గెలిపించారు.  దక్షిణ తెలంగాణలో పట్టులేకున్నా తెరాస కొద్ది మెజారిటీతో గెలిచి తెలంగాణలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

2014 ఎన్నికల తర్వాత కూడా అమెరికా ప్రాంతీయ పార్టీలను బలహీన పరచే తన ఎత్తుగడలను కొనసాగించింది. భాజపా ఉత్తర ప్రదేశ్ లో ములాయం సింగ్ ను తన కొడుకుకు వ్యతిరేకంగా తిప్పి, ఎస్ పీ పార్టీ ని బలహీన పరచాలని ప్రయత్నించి, విఫలమైంది. తమిళనాడులో ఎఐడీఎంకె పార్టీ ని రెండు సార్లు విభజించింది. ఈ ప్రయత్నాలను ఇతర రాష్ట్రాలలో కొనసాగిస్తూనే వుంది.

ఈలోపు కేసీఆర్ సోనియాను వదిలి భాజపా గూటికి చేరాడు. నోట్ల రద్దుతో ఖంగుతిన్న కేసీఆర్ ముఖం, ఢిల్లీ వెళ్లివచ్చిన తరువాత వెలిగిపోయింది. కర్నాటక లో కుమారస్వామి మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి కేసీఆర్ హాజరు కాలేదు. ఒక రోజు ముందు వెళ్లి కలిసి వచ్చాడు. సోనియాకు ఎదురు పడలేకే కాబోలు!

ఈ నేపథ్యంలోనే మనం ఈనాటి ఎన్నికల సమరాన్ని వీక్షించాలి.

మొదట్లో కేసీఆర్ ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలను ఆకర్షించి, మూడో కూటమిని ఏర్పాటు చేసి, కేంద్రంలో ప్రధానమంత్రి కావాలని ప్రయత్నించాడు కానీ ఎవరూ ఆయనతో కలిసి రాలేదు. ఆరోజుల్లో తన ప్రసంగాలను జై తెలంగాణ, జై భారత్ నినాదాలతో ముగించే వాడు. ఇప్పుడు రెండో నినాదాన్ని వదిలేశాడు. కేంద్రంలో భాజపా కు మద్దతు తెల్పి, ఉప ప్రధాని పదవితో సర్దుకుపోవాలని తలపోస్తున్నట్లుంది.

ఎన్టీఆర్, చంద్రబాబుల్లాగా కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించాడు. నేను కేంద్రానికి మారుతున్నాను, నా అనుయాయుడు ఎప్పుడూ నా పక్కన ఉండి నాకు టైమ్ కు మందులు వేయాలని, అతనికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నానని బహిరంగంగానే ప్రకటించాడు. తన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికే ముందస్తు ఎన్నికలను తెలంగాణ ప్రజలపై రుద్దాడు.  కానీ, ఇప్పుడు తాను కేంద్రానికి మారే విషయాన్ని అసలు గుర్తు చేయడం లేదు. ఇంకో పదిహేనేళ్ళు కేసీఆరే ముఖ్యమంత్రని చెబుతున్నారు. బహుశ తన కొడుకు ముఖ్యమంత్రి అభ్యర్థని ఇప్పుడే ప్రకటిస్తే తమ పార్టీ గెలుపు కష్టమోతుందని తలపోస్తున్నట్లుంది.

ముందస్తు ఎన్నికలను ప్రజలపై రుద్దడానికి కేసీఆర్ సరైన కారణం చూపించలేక పోతున్నాడు. ఎన్నికలను ముందుకు జరపకుండా, ఆ లోపు  “నీళ్లు-నిధులు-నియామకాల”ను కొంతైనా ప్రజలకు అందించి, ఎన్నికల్లో గెలవడానికి పునాదులు వేసుకోవాల్సింది. రెండు లక్షల ఉద్యోగాలు నింపాల్సి వుందంటున్నారు. ఇప్పుడు నింపకపోతే, ఎన్నికల్లో గెలిచినా వెంటనే నింపరు. మళ్ళీ ఎన్నికలొచ్చేదాకా ఆగాల్సిందే.  “నీళ్లు-నిధులు-నియామకాల”పట్ల ఆయన శ్రద్ధేమిటో ఇక్కడే తెలిసిపోతుంది. మాటల్లోని డొల్లతనం బయటపడుతుంది.

కేటీఆర్ కు ఇష్టుడైన హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ కు ఉప్పల్ సీటు ఇస్తారని, ఎప్పటి నుంచో ఆ నియోజకవర్గంపై కేంద్రీకరించి పనిచేస్తున్నాడు. క్రిందటి ఎన్నికల్లో అక్కడ భాజపా గెలిచింది. ఇప్పుడు ఆ సీటును మేయర్ కు ఇవ్వకుండా, ఒక బలహీనమైన అభ్యర్థికి ఇస్తున్నారు.  తెరాస, భాజపాల మద్యనున్న రహస్య ఒప్పందాన్ని ఇది ఋజువు చేస్తుంది.

తెరాస ఒక చేత్తో భాజపాను పట్టి, ఇంకో చేత్తో మజ్లీస్ ను పట్టి నాట్యమాడుతుంది. మతతత్వ పార్టీల నిజస్వరూపం ఇక్కడే బయటపడుతుంది. నరేంద్ర, సలావుద్ధీన్ ల రోజుల నుంచి, ఈ రెండు పార్టీలు కలసి ప్రజల్ని మోసంచేస్తున్నాయి. తరతరాలుగా వర్థిల్లుతున్న హిందూ-ముస్లిం ఐక్యతను దొంగ దెబ్బ తీశాయి. భాజపా ఒకప్పుడు హిమయత్ నగర్ సీటును, ఇప్పుడు అంబర్ పేట సీటును గెలిచేందుకు మజ్లీస్ పార్టీ పరోక్షంగా సహకరిస్తుంది. ఒకరి బూచి చూపి, ఇంకొకరు ఓట్లు దండుకోచూస్తారు.

కేసీఆర్ చేతిలో మోసపోయిన మోసపూరిత కాంగ్రెస్ ఏం చేసయినా సరే, వారిని ఓడించాలన్న పట్టుదలతో వుంది. తన 2004 ఎన్నికల ఎత్తుగడయైన ఐక్యసంఘటనలకు పూనుకుంది. తేదేపా ఒక పక్క భాజపా వదిలేసీ, ఇంకో పక్క కేసీఆర్ దగ్గరకు రానివ్వక పోవటంతో కాంగ్రెస్ తో చేతులు కలపక తప్పలేదు. కోదండరాం గారి తెలంగాణ జన సమితి మొదట్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినట్లు గెలుస్తాం, ఎవ్వరితో పొత్తులుండవని చెప్పినా, తన బలాబలాలు బేరీజు వేసుకుని కాబోలు “మహా కూటమి”లో చేరింది. ఇంకో వైపు భాజపాతో రహస్య మంతనాలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. సీపీఐ ఎప్పటిలాగానే ఏదో ఒక బలమైన పార్టీతో చేతులు కలిపి, ఒకటో రెండో సీట్లు సంపాదించుకుందామని తాపత్రయ పడుతుంది. కాంగ్రెస్ సీట్ల లెక్క తేల్చడంలేదని అప్పుడే ఈ అవకాశవాద కూటమిలో లుకలుకలు బయట పడుతున్నాయి.

ఇక సీపీఎం ప్రత్యేక తెలంగాణను అప్పుడు నేరుగా సమర్ధించ లేదు కావున, ఓట్లు సాధించడంలో ఎక్కడ వెనుకపడి పోతామోనన్న భయంతో, తన ప్రజా సంఘాల పేర్లు పత్రికల పేర్లలో తెలంగాణ వచ్చేటట్లు మార్చుకోని, తెలంగాణ తెలంగాణ అంటూ గొంతు చించుకుంటూ అరుస్తుంది. తెలంగాణ, బహుజన సెంటిమెంట్లను వాడుకొని ఓట్లు రాబట్టుకోవాలని అర్రులు చాస్తుంది. ఒకప్పుడు తనకు అస్పృశ్యులైన సీపీఐ(ఎంఎల్) పార్టీల, మావోయిస్టు పార్టీల సానుభూతిపరులతో, దళిత బహుజన నాయకులతో అంటకాగుతూ, వారిని ముందు పెట్టి వారి పరపతితో ఓట్లు సాధించుకోవాలని “బహుజన లెఫ్ట్ ఫ్రంట్” పేరుతో ముందుకొస్తుంది. బిసీ నాయకుడు ఆర్ కృష్ణయ్యను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.

ఆర్ కృష్ణయ్య తనే స్వయంగా ఒక పార్టీని స్థాపించాలనుకుంటూ కూడా, సీపీఎం  తన పాత పార్టీ తెదేపాల సమావేశాల్లో కనిపిస్తున్నాడు. ఇంకా రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్, మరికొందరు తమ కొత్త పార్టీలతో తమతమ అదృష్టాలను పరిక్షింపజూస్తున్నారు. వీరిలో ప్రముఖుడు గద్దర్. తన విప్లవ పాటలతో తెలుగు ప్రజల నుర్రూతలూగించి ఎందరో యువకులను విప్లవ బాట పట్టించిన గద్దర్, విప్లవ బాట నొదిలి, దళిత బాట పట్టి, ఒకప్పుడు తాను వ్యతిరేకించిన బూర్జువా పార్టీలతో చెట్టాపట్టాలేసుకుని, పార్లమెంటు బాటలో పరుగిడటానికి ఉవ్విళ్లూరు తున్నాడు. తాను అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోటీగా గజ్వేల్ లో దిగాలనీ, తన కుమారుడిని కాంగ్రెస్ అభ్యర్థిగా బెల్లంపల్లి నుంచి నిలబెట్టాలనీ ప్రయత్నిస్తున్నాడు. దానికై సోనియా, రాహుల్ గాంధీలను కలసి, వారి మద్దతు కోరాడు. ముందు ముందు రసవత్తరంగా సాగనున్న ఈ ఎన్నికల సంరంభం ఇంకెన్ని విశేషాలను తేనుందో చూద్దాం!

రాప్ర

2 comments

 • Semi-fiction.
  As far as Present election calculations are concerned, this article is worth reading.
  But about 2014 elections, this writer had assumed, As if all Indian politicians are just Pawns under American leadership. Any nation with diplomatic interest would wish for it’s own choice results in other nations.
  Just like Prachanda in Nepal is more favorable for China.
  Hasina in Bangladesh is more favorable for India.
  Putin preferred Trump over Hillary, because Trump will not object Russian interest in Syria etc.
  That doesn’t mean that all voters and leaders in India are Robots under American remote control.
  Election result is resultant of multiple factors, and each factor is controlled by different person/group/organization/country.
  Height of fiction: Rift between Mulayam and his Son is also engineered by US.

 • కేసీఆర్ బీజేపీకి దగ్గరవుతే ఓటు బ్యాంకు ను కోల్పోతాడు. కాంగ్రెసుకు దగ్గరా కాలేడు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.