దెబ్బ వేసినా, దెబ్బ తిన్నా శ్రావ్యమే

కొండేపూడి నిర్మల కవిత్వం అందరికీ సుపరిచితం. ఆమె కథలు కూడా పరిచితమే. ఆ రెండు సృజనాత్మక ప్రక్రియలు. అంటే కల్పన వెనక, అలంకారాల వెనక, కథ వెనక,  పాత్రల వెనక, పదచిత్రాల వెనక ఎంతో కొంత దాక్కునే అవకాశం ఉంటుంది. కానీ పత్రికా శీర్షిక్ (కాలమ్ ) సంగతి వేరు. అందులో ఏ రచయితకూ దేని వెనకా దాక్కునే అవకాశం ఉండదు. తమ మనసులోని మాట నేరుగా చేరవేయడమే. అందుకు బాధ్యత వహించడమే. అలా బాధ్యత వహించాల్సివచ్చినపుడు, ముక్కుకు సూటిగా ఉంటూ, పదాలను కత్తుల్లా ఉపయోగించే నిర్మల వంటి వారికి కొంత కష్టమే. అయినా తన మొండితనం తనదే కనక, నిర్మల వెనక్కి తగ్గకుండా ఈ కాలమ్ రాయడమే కాకుండా, దాన్ని పుస్తకంగా తీసుకువచ్చారు. పేరు పెట్టడంలోనే ‘కొట్టడానికీ, కొట్టబడడానికీ’ సంసిద్ధత కనిపిస్తుంది. తను మృదంగమైతే తనే దెబ్బలు తినాలి. అందులో పేర్కొన్న వ్యక్తులో, పాఠకులో మృదంగాలైతే, తన చేతిలో అయిపోవాలి. కానీ మృదంగం కదా. దెబ్బ వేసినా, తగిలినా అది శ్రావ్యమే.

నిర్మలకు పరిశీలన ఎక్కువ; దానికి ఆవేశం, అధ్యయనం, దృక్పథం, భాష తోడైతే మంచి కాలమ్ రాక తప్పదు. మృదంగం అలాంటి మంచి కాలమ్.  శీర్షికా రచన తనకు కొత్తకాదు. ఆంధ్రప్రభలో ‘అనుభవం’ అన్న కాలమ్, తర్వాత మాభూమి పత్రికలో ‘మట్టి మనిషి గుండె చప్పుడు’ అనే కాలమ్ రాసారు. అయితే 2006 నుంచి ఆరేళ్ల పాటు ‘భూమిక’ పత్రికలో రాసిన ‘మృదంగం’ కాలమ్ మాత్రం విశేషమైన ప్రజాదరణ పొందింది. నిర్మలను కాలమ్ రచయితగా నిలబెట్టింది.

కాలమ్ రెండు రకాలని నిర్మలే అన్నారు. ఒకటి పొలిటికల్, ఒకటి పర్సనల్ అని. కానీ నిర్మల విషయంలో అవి రెండూ ఒకటే. తను సాంకేతికంగా ఆ పదాలు వాడారేమో కానీ, నిజానికి నిర్మల కాలమ్స్ అన్నిటిలోనూ వ్యక్తిగత స్ఫురణ ఉంటుంది. రాజకీయ వ్యాఖ్య ఉంటుంది. ప్రక్రియా పరంగా చూసినపుడు కాలమ్ కు చాలా విశేషాలుంటాయి. కాల్పనిక ప్రక్రియలైన నవల, కథల్లో రాసే ‘నేను’ అనివార్యంగా రచయిత కానవసరం లేదు కానీ, కాలమ్ లో రాసుకునే నేను ఎక్కువగా ”నిజం నేనే’ అయివుంటుంది. కనక నిర్మల ఎవరి గురించి చెబుతున్నారో వాళ్లందరూ సజీవమైన వ్యక్తులే అని అనుకోడానికి పాఠకులు సందేహించే పనిలేదు. బహుశా అందుకే ఈ కాలమ్స్ వల్ల ‘కుటుంబ సంబంధాల్లో కొందరి ఆగ్రహానికి గురి కావాల్సివచ్చిందని’ ఆమె చెప్పుకున్నారు. బాంధవ్యాలు, పేర్లతో సహా చెప్పి తనవారిని బాధపెట్టడం సబబా అన్నది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే మన నిజాయితీ, మన నిర్భీతి రచయితలుగా మన స్థాయిని పెంచవచ్చుకానీ, దానికి మరొకరు బలికావడం న్యాయంగా అనిపించదు. మరొకరి ‘వ్యక్తిగతా’న్ని బహిర్గత పరిచే హక్కు మనకుండదు.  రాస్తున్నది మనమైనపుడు పాఠకుడికి మన దృక్కోణం ఒకటే కనిపిస్తుంది తప్ప ఆ రెండో వాళ్ల వర్షన్ తెలీదు. కాలమ్స్ లోనూ, స్వీయచరిత్రల్లోనూ ఈ విషయంలో సంయమనం అవసరం.

కాలమ్స్ కి దాదాపు అనివార్యంగా రెండు లక్షణాలుంటాయి. ఒకటి – ఏదో ఒక సంఘటనకు తక్షణ స్పందన; రెండు -రచయిత ప్రాపంచిక దృక్పథం. మొదటిది వైకల్పికం –ఉండవచ్చు; ఉండకపోవచ్చు.  ఒక్కోసారి ఒక సంఘటనకు స్పందనగా కాక, తనని ఎంతకాలంగానో వేధిస్తున్న విషయంపై కూడ రాయవచ్చు. నిర్మల వేమన కవిత్వంలోని స్త్రీ వ్యతిరేకతపై స్పందించినట్టు. మరోసారి అప్పుడే జరిగిన సంఘటన పైనో, చదివిన పుస్తకాన్నో ప్రస్తావిస్తూ, దానిపై రాయవచ్చు. అల్లంరాజయ్య కుమారుడి అకాల మరణం సంఘటనా, తల్లికీ, కూతురికీ మధ్య వ్యాపారసంస్కృతి వల్ల వచ్చిన విభేదాల గురించిన సంఘటనా – వీటిపై రచయిత ఆలోచనలు, వ్యాఖ్యానం వ్యక్తిగతం నుంచి ప్రారంభమై, సార్వజనీనమైన ఆలోచనను మనకు అందించిన వైనం కాలమ్ నిర్వహణలో నిర్మల ప్రతిభకు నిదర్శనం. ‘మృదంగం’ ద్వారా తెలిసేది నిర్మల ప్రాపంచిక దృక్పథం ఒక్కటే కాదు. ఆమె పరిచయం చేసిన పుస్తకాలు, సినిమాలు, మనకు తెలీని జీవితాలు ఎన్నో. కేవలం, రచయిత్రి పరిశీలనా శక్తి కోసమో, ప్రవాహశీలమైన శైలి కోసమో మాత్రమే కాక, చక్కని సమాచారం కోసం కూడ ఈ కాలమ్స్ చదవొచ్చు.  

ఎక్కువమంది శీర్షికారచనలో వ్యంగ్యం, గాంభీర్యం, ఆగ్రహం, హాస్యం ఈ నాలుగూ కనిపిస్తాయి.  నిర్మలలో ఎక్కువపాళ్లు ఆగ్రహమే కనిపిస్తుంది. కలకత్తా మానసికవికలాంగుల ఆస్పత్రిలో స్త్రీలను నగ్నంగా కూర్చోబెట్టిన వార్త చదివినపుడు, గుజరాత్ లో గోధ్రా అనంతరం జరిగిన ముస్లింల ఊచకోతకు ముఖ్యమంత్రి బాధ్యుడు కాడని కోర్టుతో సహా అందరూ అన్నప్పుడూ, శబరిమల ప్రవేశానికి స్త్రీలు అనర్హులన్న వాదన విన్నప్పుడూ (ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు నిర్మలకు బాగ నచ్చివుంటుంది, దాని తర్వాతి పరిణామాలు అంతగానూ నచ్చివుండవు)…. ఇంకా అనేక సందర్భాల్లో నిర్మలలో ఆవేశం కట్టలు తెంచుకున్న ధోరణి కనిపిస్తుంది. సహజంగా కవి కావడం వల్ల కవితాత్మక వాక్యాలు కూడ భావతీవ్రతను ద్విగుణీకృతం చేస్తాయి. ఉదాహరణకు పిల్లలకు శత్రుస్పర్శ అంటే ఏమిటో చెప్పాలని రాసిన దానిలో “పిల్లలూ మనలాంటి మనుషులే. పిట్టలుకాదు కదా, చేదు చిగుళ్లు తిని కూడా తియ్యగా పాటలు పాడటానికి. పనికిరాని గుట్టలు కాదు కదా, నరికిన కొద్దీ గరికపచ్చ మొలవడానికి” (పుట 80) ఇక్కడ వాడిన పిట్టలు, గుట్టలు అన్న ఉపమానాలు మనం పిల్లల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నామో చెప్పకనే చెబుతాయి.

నిర్మల చాలావరకు ధర్మాగ్రహంతో, స్త్రీవాద దృక్పథ నేపథ్యంతో, జర్నలిస్టు అవగాహనతో కాలమ్స్ రాసారు. అవి నిర్మల కవిత్వం చదివిన వారెవరికైనా చాలా సహజంగా, న్యాయంగా అనిపిస్తుంది. తను మరోలా రాయలేదు కదా అనుకుంటాం. అంటే మన ఊహలకూ, తన రచనలకూ మధ్య ఏ మాత్రం వ్యత్యాసం ఉండదు. ఎక్కువమంది నిబద్ధత కలిగిన రచయితల్లాగే ఉంటుంది నిర్మల రచన కూడ. కానీ  ఒక్కోసారి ఎవరికీ తోచని, ఎవరూ పెద్దగా పట్టించుకోని విషయాలపై చక్కగా, చమత్కారంగా కూడ రాసి ‘ఇలాంటివి మరికొన్ని రాస్తే బాగుండు’ అనిపించేలా చేస్తుంది. అలాంటివాటిలో ఒకటి ‘గీటురాయికి అటూ ఇటూ”. పనిలేని మంగలి పిల్లితల గొరిగాడట అన్న సామెతను పట్టుకుని అలా అన్నవాళ్లను ఉతికి ఆరేసిన వైనం బహుచక్కగా ఉంది. అసలు అతనికి ఆ అవసరం ఎందుకు వచ్చిందీ, మనుషులు జుట్టు, గడ్డం కత్తరించకపోబట్టే కదా అని దానికి కారణాలు ఊహించడం దగ్గర్నుంచీ, అసలు పిల్లి తల గొరగడానికి ఎంతటి నైపుణ్యం అవసరమో కూడ చర్చిస్తూ , “ఎక్కడా తెగకుండా, రక్తం చిందకుండా, కాచిన జున్నుగడ్డ మీద హత్తుకున్న మిరియాలపొడి పక్కకి జరిపినంత నైపుణ్యంతో, మార్జాల నీలాల్ని తీసేయాలి’ అని ఆ వర్ణన ముగిస్తుంది.  (పుట 94). ఇలాంటి కాలమ్స్ లో పెద్దగా తాత్వికతో, దృక్పథమో, ఆలోచనో లేకపోవచ్చు. కానీ రచయిత్రి పరిశీలనాశక్తి, సామెతల్లో ఉన్న సంకుచితత్వాన్ని కనిపెట్టగల చూపు, చిన్న విషయాన్ని కవితాత్మకంగా చెప్పిన తీరు ఆలోచనతో పాటు ఆహ్లాదాన్ని కూడ కలిగిస్తాయి.

మొత్తంగా ఈ మృదంగాన్ని వాయించి చూస్తే, సాహిత్య సామాజిక వేదికల మీద ఈనాటికీ స్త్రీలకు తగినంత ప్రాతినిధ్యం లేదన్న విషయం దగ్గర్నుంచీ, మన వివాహాది సంప్రదాయాలు, మంత్రాలు ఎలా స్త్రీని దాంపత్యంలో ఎప్పుడూ ‘అనుసరించే’ మనిషిగానే ఉండాలో నూరిపోస్తాయని గుర్తించేంతవరకూ – నిర్మల దాదాపు స్త్రీల జీవితంలోని అన్ని కోణాలనూ స్పృశించారు. అయితే,  ఒక్క స్త్రీల గురించి మాత్రమే రాస్తే ఈ కాలమ్ నిర్మల రాసిన మరో స్త్రీవాద రచన అయ్యుండేది.

కానీ ఇందులో మరెన్నో అంశాలున్నాయి. రోజువారీ ప్రపంచంలో జరుగుతున్న అన్ని రకాల అన్యాయాల మీద – పిల్లలపై కావచ్చు; బడుగు జీవులపై కావచ్చు; దళితులు, గిరిజనులపై కావచ్చు; అల్పసంఖ్యాకులపై కావచ్చు; చిరుద్యోగులపై కావచ్చు, రైతులు కావచ్చు; కార్మికులు కావచ్చు… అన్యాయాలకు, అక్రమాలకు బలైన అందరి మీదా సానుభూతి, వారికి ఆ స్థితి కల్పించిన వారిపై ఆగ్రహం ఈ రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా  సమస్యలపై రాసినవి ఒక ఎత్తయితే, ఒక ముఖ్యమంత్రి గారు చనిపోతే మీడియా చేసిన హడావుడి (రాజుగారి బొటనవేలు) వంటివి మరో ఎత్తు. అలాగే ప్రజల్ని శాశ్వతంగా మూర్ఖత్వంలో కూర్చోబెట్టే నిత్యానందస్వామి వంటి బాబాలకు, చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో చంపేసిన వృద్ధుడికీ ఉన్న తేడా ఏమిటో ప్రశ్నించే ‘సర్వం జిత్తు’ ఒక చక్కని రచన. ఇందులో చివరగా రచయిత్రి అన్న మాటలు బహుశా ఆమె కాలమ్ ఆంతర్యాన్ని బహిర్గతం చేస్తాయి. “మనకళ్లు చూడడానికి కాకుండా మూసుకోవడానికే వాడుకుంటే, మన చెవులు వినడానికి కాకుండా, పూలు పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటే, మన నోరు ప్రశ్నించడానికి కాకుండా భజన చెయ్యడానికే మోగుతూ ఉంటే, బహుశా ప్రపంచం ఏ మార్పూ లేకుండా ఇలాగే ఉంటుంది” (పుట 85). ప్రపంచం ఇలాగే ఉండకూడదన్నదే, ప్రపంచం మారాలన్నదే నిబద్ధత కలిగిన రచయిత కోరిక. అందుకు ఏ కొద్ది ప్రయత్నమైనా సరే చెయ్యాలన్నది రచయిత తాపత్రయం. అందుకే ఇలాంటి కాలమ్.

మృణాళిని చుండూరి

మృణాళిని చుండూరి: సుప్రసిద్ధ విమర్శకులు, కాలమిస్టు. ప్రింట్, విజువల్ మీడియా లో తరచూ కన్పించే/ విన్పించే జర్నలిస్టు. అసలు వృత్తి ఆధ్యాపకత్వం, పరిశోధన. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో, తులనాత్మక అధ్యయనాల కేంద్రంలో ఫ్రొఫెసర్ గా పని చేస్తున్నారు. నివాసం హైదరాబాదు.

2 comments

  • థాంక్స్ మృణాళిని , చాలా చక్కగా రాసావు . నా ఆత్మబాగా పట్టుకున్నావ్ . హెచ్చార్కె గారు మీకు నా కృతజ్ఞతలు

  • పరిచయం బాగుంది. ధన్యవాదాలు మృణాళిని గారూ.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.