పిలచిన బిగువటరా!

మొయిలు దోనెలలోన పయనాలుచేస్తూ, తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ జతగూడి దోబూచి సరసాలు ఆడుతూ, దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అని భీష్మించుకుని కూర్చున్న కృష్ణశాస్త్రిని సినీరంగంలోకి తీసుకురావడం, భావుకుడు, ఉత్తమాభిరుచి గల నిర్మాత బీఎన్ రెడ్డి కి చెల్లింది.  ఫలితంగా ఒక మనోజ్ఞ సెల్యులాయిడ్ మహాకావ్యం ‘వాహినీ’ వారి మల్లీశ్వరి ఆవిర్భవించింది.

మల్లీశ్వరి పాటలు అనగానే ఆకాశవీధిలో, పరుగులు తీయాలి, మనసున మల్లెల మాలలూగెనో వంటి గొప్ప పాటలు గుర్తుకొస్తాయి ఎంతోమందికి.  ఇవి, ఇంకా ఎన్నో మంచి పాటలు ఉన్న ఈ సినిమాలో అన్నింటి మధ్య ఒక చిన్న మాణీక్యంలా మెరిసిపోయే పాట ‘పిలచిన బిగువటరా’

పిలిచిన బిగువటరా! ఔరౌర!  

చెలువలు తామే వలచి వచ్చిన||
పిలిచిన బిగువటరా!

భళిరా! రాజా!

ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మానగ నినునే||

గాలుల తేలెను గాటపు మమతలు
నీలపు మబ్బుల నీడలు  కదలెను
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడ!  ఇటు తొందర చేయగా ||

మనను కావాలనుకుని ఎవరైనా వస్తే అలుసుగానో, చులకనగానో చూడటం లోకరీతుల్లో ఒకటి.  వయసులో ఉన్న స్రీపురుషులమధ్య ఇది మరింత కోపతాపాలకు దారి తీస్తుంది.

‘వనిత తనంత దా వలచి వచ్చిన జుల్కనగాదె ఏరికిన్’ అంటుంది అల్లసాని వరూధిని.

దీనితో పోలిస్తే కృష్ణశాస్త్రిగారి పల్లవి ప్రత్యేకత తెలుస్తుంది.  

ఇక్కడ మల్లీశ్వరి, నాగరాజు బావామరదళ్ళు.  అతను ఎప్పుడూ ఏవో శిల్పాలు చెక్కుతూ ఆ ధ్యాసలో ఉంటాడు.  అతన్ని ఆమె ఎంతసేపూ ఆటపట్టిస్తూ ఉంటుంది.

ఒకరోజు గాలివానలో చిక్కుకుని వారు ఒక పాడుబడిన గుడిలో తలదాచుకుంటారు.  ఆ సందర్భంగా వచ్చే ఈ పాట ‘పిలచిన బిగువటరా’ అని మొదలవటం ఎంత బాగుందో చూడండి.  

వరూధిని చుల్కన అన్నదాన్లో ఉన్న కోపం, ఉక్రోషం స్థానే, మల్లి ‘బిగువటరా’ అనడంలో ఏదోఒక నెపాన్ని అతని మీద వేసే కొంటెతనం, అల్లరి ఉన్నాయి.  చుట్టూ ఎవరూ లేరన్న ధైర్యం వల్ల వచ్చిన ఒక కవ్వింపు ఉంది.

ఇష్టపడ్డ మగవారిని ఏదో మిషమీద కవ్వించడం మగువలకు ఉన్న వలపు అస్త్రాలలో ఒకటి.  (ఎందుకనో నిను చూడగనే కవ్వించాలని ఉంటుంది – అని పాటకూడా ఉంది) .

ఔరౌర లో ఆశ్చర్యం నటించడం, భళిరా అని మెచ్చుకోలు, ఇవన్నీ ముద్దుగా చేసే కవ్వింపులోని భాగాలే.  

చిన్ననాటినుండి ఉన్న బావామరదళ్ళ సరాగాలు అనురాగంగా మారటం అద్భుతంగా చిత్రించారు కృష్ణ శాస్త్రి.  బావను ఏడిపిస్తూ పాడే ‘కోతీబావకు పెళ్ళంట’ , పకృతిని చూస్తూ వర్ణిస్తూ ఇద్దరూ పాడే ‘పరుగులు తీయాలి’,  వాటి తరవాత వచ్చే ఈ పాటలోని ప్రేమవ్యక్తీకరణ చూస్తే ఈ పరిణామం అర్థంఅవుతుంది. కథ, మాటలు, పాటలు ఒక్కరే వ్రాస్తే పాత్రల స్వభావాలు ఎంత స్పష్టంగా సహజ సిద్ధంగా సాహిత్యంలో ఇమిడిపోతాయో అనడానికి ఈపాట ఒక ఉదాహరణ.  

వారిద్దరూ మాత్రమే ఉన్న ఏకాంతంలో, అంతకుముందు కోతిబావ అన్నవాడినే ఇక్కడ రాజా అనడంలోని వేడుకోలు, చెలువ అని తన సౌందర్యం గురించిన సూచన, అతనికి మాత్రమే తన ఆటపాట చూపిస్తూ  నయగారాలు, వయ్యారాలు, నవయవ్వనాలు అతనికి సరికొత్తగా తెలియజేస్తూ అల్లరిగా మొదలైన పాట వలపుపిలుపుగా మారుతుంది. అందెలసడి తొందరచేయడం, అందగాడా అనడం .. ఇలా ఒక ఆరాటం తో ముగుస్తుంది.   

ఈ తొందరకు, ఆరాటానికి కారణం చరణం మొదటి రెండు పాదాల్లో ఉంది. పాత్రలకు, మసస్తత్వాలకు, సన్నివేశానికి, కథాక్రమానికి ఇంత కుదురుగా వ్రాయబడ్డ ఈ పాటలో, అవన్నీ చాలనట్టు మానసవీధిని రాగరంజితం చేసే కృష్ణశాస్త్రి కవితాశక్తి ..

గాలుల తేలెను గాటపు మమతలు
నీలపు మబ్బుల నీడలు కదలెను’  

వంటి పంక్తుల్లో మైమరపింప చేస్తుంది.  గాటపు వంటి మాటలు వేరే కవులు వాడగా చూడం.  కృష్ణశాస్త్రి ఊహాప్రేయసి ఊర్వశి కన్నులలో ‘నెడనెడ గ్రమ్ము గాటంపు నిదుర చాయ’ జ్ఞప్తికి వస్తుంది.  

గాలివాన వెలసిన తరువాత గాలిలో ఒక తీవ్రత, వాతావరణంలో ఒక తేమ, ఉక్కపోత, ఇవన్నీ గాలిలో తేలే గాఢమైన ప్రేమలు, వాటితో కూడి నీలపు వర్షపు మేఘాల నీడల కదలికలు – వీటన్నిటివల్ల వచ్చిన ఆరాటం, తొందర, తన అందెల సవ్వడి తెలియజేస్తోంది – అని అర్థం చేసుకుంటే, సృజనాత్మకమైన చిక్కటి కవిత్వంలొ కూడా ఎంత ఔచిత్యం ఆయన పాటించాడో అని అచ్చెరువు  కలుగక మానదు.

‘సినిమాలో ప్రవేశించి మళ్ళీ ఇటువంటిది రాకూడదు అన్నట్టు మల్లీశ్వరి వ్రాసాడని’ శ్రీశ్రీ అన్న మాట ఈ సందర్భంగా తలచుకోవచ్చు.  

ఈ ఆట పాట మల్లీశ్వరి, నాగరాజులకు తెలియకుండా మారువేషాల్లో ఉన్న కృష్ణరాయలు, అల్లసాని పెద్దన చూస్తారు.  అప్పుడు మల్లీశ్వరి నాట్యాన్ని చూసి ముగ్ధుడైన పెద్దన చెప్పినట్టుగా కృష్ణశాస్త్రి వ్రాసిన ఒక పద్యం ఒకటి వస్తుంది.  ఈ పద్యంగురించి ఒక సంగతి ఈమాట వెబ్ పత్రిక లోని ఒక వ్యాసంలో చూసాను.  

‘  పెద్దన ఆశువుగా ఓ పద్యం చెబుతాడు. ‘‘భళిరా ఎన్నడు జారె నీభువికి, రంభారాగిణీ రత్నమే….’’ అనేది. అల్లసాని వారు చెప్పిన పద్యం కాబట్టి అల్లసాని వారి శైలిలోనే ఉండాలనేది దర్శకుని పట్టుదల. దానికోసం దేవులపల్లి వారు 108 పద్యాలు తయారుచేశారు. కావలసింది మాత్రం ఒక్క పద్యమే. ఇంత ప్రయత్నం ఎవరినో సంతృప్తి పరచడానికి కాదు. ప్రేక్షకులకు వడ్డించే ముందు తమను తాము సంతృప్తి పరచుకోడానికి. ఆ దర్శక రచయితల పట్టుదలకూ, అంకిత భావానికి ఇదొక తార్కాణం.’  

ఇక్కడ 108 పద్యాలన్న విషయం అతిశయోక్తి అనుకున్నా అల్లసాని అల్లిక జిగిబిగిని అనుసరించడానికి కృష్ణశాస్త్రి, బీఎన్ రెడ్డి పట్టుదలగా ప్రయత్నించి ఉంటారని ఊహించవచ్చు.  అదీగాక కృష్ణశాస్త్రిగారు వ్రాసిన వృత్తాలు సాధారణంగా మనకు కనిపించడం అరుదు – కొసరుగా ఆ పద్యం ఇక్కడ ఇస్తున్నాను.

భళిరా! ఎన్నడు జారె యీ భువికి రంభారాగిణీరత్నమే

ఖలయో, నిర్జరవల్లభప్రియవధూకంఠస్రవద్దామమో,  

మలయాశాగతమారుతోల్లలిత పంపావీచికాడోలికా

చల ఉత్ఫుల్లజలేజమాలికయొ, చంచచ్చంచలాతన్వియో

మద్దుకూరి విజయ్ చంద్రహాస్

మద్దుకూరి విజయ చంద్రహాస్: సాహిత్యం సంగీతం ప్రత్యేకంగా అభిమానిస్తారు. వినడం, చదవడం, ఎప్పుడైనా వ్రాయటం, నచ్చిన వాటి గురించి ఆసక్తి ఉన్నవారికి చెప్పటం, సహధర్ములతో సమయాన్ని గడపటం ఆయనకు ఇష్టమైన విషయాలలో కొన్ని. ప్రస్తుత నివాసమైన డాలస్ లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తోచిన సహాయం చేయటం కూడా ఒక వ్యాపకం.

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.